విశాలాంధ్ర – నార్పల :- మండలంలో వరుసగా జరుగుతున్న కేబుల్ వైరు చోరీలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వ్యవసాయ బోర్లకు అనుసంధానించిన కేబుల్ వైరులనే లక్ష్యంగా చేసుకుని దుండగులు చోరీలకు పాల్పడుతుండటంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు.ఆదివారం సాయంత్రం కర్ణపొడి గ్రామ సమీపంలోని తోటల వద్ద గుర్తు తెలియని దుండగులు వ్యవసాయ బోర్లకు సంబంధించిన కేబుల్ వైరులను అపహరించారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన సుమారు ఐదుగురు రైతుల వద్ద నుంచి దాదాపు 70 మీటర్ల కేబుల్ వైరు చోరీకి గురైనట్లు బాధిత రైతులు తెలిపారు. ఇదే ప్రాంతంలో కేబుల్ వైరు చోరీ జరగడం ఇది మూడోసారి కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా కొద్దిరోజుల క్రితం కూరగానిపల్లి గ్రామానికి చెందిన జయరామిరెడ్డి తోటలో 20 మీటర్ల కేబుల్ వైరు, పులసనూతల రైతు తోటలో 6 మీటర్ల కేబుల్ వైరు చోరీకి గురయ్యాయి. అలాగే బాలనాగి నరేష్ తోటలో సోమవారం ఉదయం మరో 20 మీటర్ల కేబుల్ వైరును దుండగులు అపహరించారు. ఇలా వరుసగా ఒకే తరహా చోరీలు జరుగుతుండటంతో రైతులు భయాందోళనలకు గురవుతున్నారు.
ఇటీవల నార్పల, కర్ణపొడి, కూరగానిపల్లి గ్రామాల పరిసర ప్రాంతాల్లో చోరీల ఘటనలు పెరుగుతుండటంతో గ్రామస్తులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో దుండగులు వ్యవసాయ తోటలను లక్ష్యంగా చేసుకుని సంచరిస్తున్నారని, రైతులు తమ పంటల సంరక్షణ కంటే తోటల భద్రతపైనే ఎక్కువ దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.పదేపదే కేబుల్ వైర్లు చోరీకి గురికావడంతో సాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడటమే కాకుండా, కొత్త కేబుల్ వైరులను కొనుగోలు చేసి అమర్చేందుకు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుస చోరీల వెనుక ఉన్న ముఠాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ప్రత్యేక పోలీసు గస్తీ ఏర్పాటు చేసి రైతులకు రక్షణ కల్పించాలని బాధిత రైతులు, గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.
వరుస కేబుల్ వైరు చోరీలతో రైతుల్లో భయాందోళనలు
- Advertisement -


