50 వేల ఎకరాల్లో చీడపీడల ప్రభావం
2 వేల ఎకరాల్లో ఈటీఎల్ దాటిన పరిస్థితి
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్ పంటలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో పంటలు బలహీనపడుతుండగా… మరోవైపు వివిధ రకాల తెగుళ్లు, చీడపీడలు పంటలను ఆశిస్తున్నాయి. వ్యవసాయ శాఖ తాజా గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాల్లో ఆరు రకాల పంటలు తెగుళ్ల బారిన పడినట్లు అంచనా వేశారు. ఇందులో సుమారు 2 వేల ఎకరాల్లో చీడపీడల తీవ్రత ఆర్థిక పరిమితి స్థాయి (ఈటీఎల్) కు మించినట్లు గుర్తించారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి గణాంకాల కంటే మరింత తీవ్రంగా ఉందని రైతులు చెబుతున్నారు. వరి పంటకు అనేక జిల్లాల్లో వివిధ రకాల తెగుళ్లు, పురుగులు ఆశిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో బాకీట్రియల్ ఆకుమచ్చ తెగులు తీవ్రంగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. ఉభయ గోదావరి, గుంటూరు, తిరుపతి జిల్లాల్లో ఆకు చుట్టు పురుగు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల్లో ఆకు కంకి నల్లి ప్రభావం కనిపిస్తోంది. నెల్లూరు, తిరుపతి, నంద్యాల జిల్లాల్లో పసుపు రంగు కాండం తొలిచే పురుగు, నెల్లూరు జిల్లాలో ముడత తెగులు వరి పంటను దెబ్బతీస్తున్నాయి. మొక్కజొన్న పంటకు కూడా చీడపీడల బెడద తప్పడం లేదు. విజయనగరం, మన్యం, కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల జిల్లాల్లో కత్తెర పురుగు ప్రభావం కనిపిస్తోంది. నంద్యాల జిల్లాలో చుక్కల కాండం తొలిచే పురుగు, అనంతపురం జిల్లాలో గులాబీ రంగు కాండం తొలిచే పురుగు ఆశించినట్లు అధికారులు గుర్తించారు. మినుము పంటలోనూ అనేక రకాల పురుగులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నంద్యాల జిల్లాలో తెల్లదోమ, ఆకు పచ్చని మిడత, ఆకు ముడత ప్రభావం ఉండగా… కడప, నంద్యాల జిల్లాల్లో చుక్కల కాయ తొలిచే పురుగు ఆశించినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. పత్తి పంటకు గులాబీ రంగు కాయ తొలుచు పురుగు, తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, ఆకుమిడత వంటి చీడపీడలు సోకుతున్నాయి. అనంతపురం, నంద్యాల జిల్లాల్లో గులాబీ రంగు కాయ తొలుచు పురుగు, మన్యం, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో తెల్లదోమ ప్రభావం ఉంది. గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, కర్నూలు, మార్కాపురం జిల్లాల్లో పచ్చదోమ, విజయనగరం, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో పేనుబంక, పల్నాడు జిల్లాలో ఆకుమిడత ప్రభావం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వేరుశనగ పంటకూ తెగుళ్ల బెడద కొనసాగుతోంది. కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఆకు తొలిచే పురుగు, బాపట్ల, అనంతపురం జిల్లాల్లో ఆకు ముడత ప్రభావం కనిపిస్తోంది. అనంతపురం జిల్లాలో ఆముదం పంటకు సర్పరూప ఆకు తొలిచే పురుగు, ఆకు మిడత, గొంగలి పురుగు ఆశించినట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. సాధారణంగా వచ్చే చీడపీడలతో పాటు వర్షాభావ పరిస్థితులు కూడా తెగుళ్ల ఉద్ధృతికి కారణమవుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే సాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న తమకు పురుగు మందుల కోసం అదనపు ఖర్చు తప్పడం లేదని వాపోతున్నారు. తెగుళ్ల తీవ్రత పెరిగితే పంట దిగుబడిపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంటలను నిరంతరం పరిశీలిస్తూ… వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన క్రిమిసంహారక మందులను మాత్రమే నిర్ణీత మోతాదులో వినియోగించాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. పంటపై కనిపించే తెగులు లేదా పురుగులను గుర్తించడంలోనూ రైతులకు సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నారు. ఏపీ ఎయిమ్స్, ప్లాంట్ ఐడెంటిఫైడ్, ఆగ్రో ఏఐ ప్లాంట్ డయాగ్నోస్టిక్స్ వంటి యాప్ల ద్వారా పంట ఫొటోలను స్కాన్ చేసి సమస్యను గుర్తించడంతో పాటు నివారణ చర్యలపై సూచనలు పొందవచ్చని క్షేత్రస్థాయి సిబ్బంది రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.


