నేపాల్‌ను కుదిపేసిన ఆకస్మిక వరదల విషాదం రోజురోజుకూ మరింత భయానకంగా మారుతోంది.గత వారం సంభవించిన ఫ్లాష్ ఫ్లడ్స్‌లో మృతుల సంఖ్య 1,000కి చేరువైనట్లు సమాచారం.మరోవైపు గల్లంతైన వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.ఎడతెరిపిలేని వర్షాలు, భారీగా పేరుకుపోయిన బురద, దెబ్బతిన్న రహదారులు, మూసుకుపోయిన సొరంగాలు సహాయక చర్యలకు తీవ్ర అడ్డంకులుగా మారాయి.ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో మంచు, రాళ్లతో కూడిన భారీ ప్రవాహం ఒక్కసారిగా విరుచుకుపడింది.
దీంతో భోటేకోషి-త్రిశూలీ నదీ వ్యవస్థలో వరదలు ఉద్ధృతంగా ప్రవహించాయి.ఉత్తర, మధ్య నేపాల్‌లోని అనేక పట్టణాలు, గ్రామాలను వరద నీరు ముంచెత్తింది.
ఒకే ఇంట్లో 24 మృతదేహాలు
ఈ ఘటనలో ఇళ్లు,వాహనాలు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.అప్పటి నుంచి నేపాల్‌కు చెందిన సహాయక బృందాలతో పాటు వివిధ దేశాల రెస్క్యూ టీంలు రంగంలోకి దిగి గల్లంతైన వారి కోసం గాలిస్తున్నాయి.తాజాగా నువాకోట్ జిల్లాలోని బెత్రావతిలో ఓ ఇంట్లో 24మృతదేహాలు బయటపడటం తీవ్ర విషాదాన్ని నింపింది.వరదల అనంతరం కనిపించకుండా పోయిన వారి కోసం గాలింపు చేపడుతున్న సమయంలో ఈ మృతదేహాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.మృతులు ఒకే కుటుంబానికి చెందినవారా? వరదల సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆ ఇంట్లో ఆశ్రయం పొందేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోయారా? లేక వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన మృతదేహాలా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
సొరంగాల్లో 900 మందికి పైగా?
ఇదిలా ఉండగా.. నేపాల్ నుంచి వరద ప్రవాహంలో కొట్టుకొచ్చినవిగా భావిస్తున్న 13 మృతదేహాలు ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ సమీపంలో గండక్ నదిలో లభించాయి.వీరిలో ఆరుగురు మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. మృతదేహాలను గుర్తించి నేపాల్ అధికారులకు అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఆకస్మిక వరదల నేపథ్యంలో జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న 933 మంది కార్మికుల ఆచూకీ లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.రసువా, నువాకోట్ జిల్లాల్లోని పలు సొరంగాల్లో కార్మికులు చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.త్రిశూలీ 3ఏ ప్రాజెక్టులో పనిచేస్తున్న 40-42 మంది ఇంజినీర్ల జాడ ఇంకా తెలియరాలేదు.అలాగే త్రిశూలీ 3బీ ప్రాజెక్టులో 118 మంది కార్మికులు గల్లంతైనట్లు సమాచారం. సొరంగాల్లోకి బురద, నీరు భారీగా చేరడంతో అవి పూర్తిగా మూసుకుపోయాయి.
దీంతో సహాయక బృందాలు లోపలికి వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.నేపాల్ ఆర్మీ సిబ్బంది నియంత్రిత పేలుళ్లతో పాటు ఎక్సకవేటర్లు, సెర్చ్లైట్లను ఉపయోగిస్తూ సొరంగ మార్గాలను క్లియర్ చేస్తున్నారు.అయితే సొరంగాల్లోని పరిస్థితిని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కెమెరాల్లో కూడా ఎలాంటి కదలికలు కనిపించకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.దీంతో గల్లంతైన కార్మికులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సామూహిక ఖననాలకు ప్రభుత్వం యోచన
వరదల్లో గల్లంతైన వారి సంఖ్య భారీగా ఉండటంతో మృతదేహాలను గుర్తించడం అధికారులకు మరో పెద్ద సవాల్‌గా మారింది.పోఖారా ఆస్పత్రికి గోర్ఖా, తనహున్, ధాదింగ్, నావల్పరాసీ ఈస్ట్ ప్రాంతాల నుంచి మొత్తం 102 మృతదేహాలను తరలించారు.వీరిలో 16 మందిని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.అయితే అనేక మృతదేహాలు తీవ్రంగా దెబ్బతినడంతో బాధితులను గుర్తించడం కష్టంగా మారింది.ఫొటోలు, దుస్తులు, నగలు, టాటూల వంటి ఆధారాలతో మృతులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.అవసరమైన సందర్భాల్లో డీఎన్ఏ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. బాధితుల గుర్తింపు ప్రక్రియలో భారత్‌కు చెందిన 18 మంది ఫోరెన్సిక్ నిపుణులు కూడా సహకరిస్తున్నారు.
సామూహిక ఖననాలకు ప్రభుత్వం యోచన
మరోవైపు వరద ప్రభావిత ప్రాంతంలో మార్చురీల సంఖ్య, వాటి సామర్థ్యం చాలా పరిమితంగా ఉంది.తాత్కాలికంగా బాడీ మేనేజ్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసినప్పటికీ భారీగా వస్తున్న మృతదేహాలకు అవి సరిపోవడం లేదు.దీంతో సామూహిక ఖననాలు నిర్వహించే అంశాన్ని నేపాల్ ప్రభుత్వం పరిశీలిస్తోంది.
వేలాది మంది గల్లంతు.. విదేశీయులూ
రసువా జిల్లాలోని ఉత్తర్గయా గ్రామానికి చెందిన సుమారు 350 మంది విద్యార్థులు కూడా గల్లంతైనట్లు సమాచారం.ఇప్పటివరకు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 10 వేల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.వారిలో 323 మంది విదేశీయులు ఉన్నారు. అయితే మరో 39 దేశాలకు చెందిన సుమారు 590 మంది విదేశీయుల ఆచూకీ ఇంకా తెలియలేదని నేపాల్ విదేశాంగ శాఖ వెల్లడించింది.
65 వేల మందికి అత్యవసర సాయం
దీంతో వారి కోసం కూడా ప్రత్యేకంగా గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.నేపాల్‌లో వరదల తీవ్రతపై ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది.వరద ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 65 వేల మందికి తాగునీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు సంబంధించిన అత్యవసర సహాయం అవసరమని తెలిపింది.మరోవైపు 22 వేల మందికిపైగా చిన్నారులకు రక్షణ, భద్రతకు సంబంధించిన సేవలు అవసరమవుతున్నాయని పేర్కొంది.వరదల కారణంగా పాఠశాలలు కూడా భారీగా దెబ్బతిన్నాయి. మొత్తం 19 పాఠశాలలు ప్రభావితమయ్యాయి.వీటిలో తొమ్మిది పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో ఎనిమిది పాఠశాలలను ప్రస్తుతం వరద బాధితులకు తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలుగా వినియోగిస్తున్నారు.
సహాయక సామగ్రి తరలింపునకు ఆటంకాలు
వరదల కారణంగా రహదారులు, వంతెనలు దెబ్బతినడంతో బాధిత ప్రాంతాలకు సహాయక సామగ్రిని తరలించడం కూడా కష్టతరంగా మారింది.ఈ పరిస్థితుల్లో ఫ్రీజర్లు, డీఎన్ఏ కిట్లు, డ్రోన్లు, లిడార్ పరికరాలు, వంతెనల నిర్మాణానికి అవసరమైన సామగ్రి వంటి ప్రత్యేక పరికరాలను నేపాల్ కోరింది.భారత్, చైనా, సింగపూర్, దక్షిణ కొరియా సహా పలు దేశాలు నేపాల్‌కు సహాయక చర్యల్లో మద్దతు అందిస్తున్నాయి.ఇదిలా ఉండగా టిబెట్‌లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి.అక్కడ ఇప్పటికే ఏర్పడిన సరస్సులు, హిమనదులు (గ్లేసియర్లు) కూలిపోయే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.


