Homeబదలావ్ జరూరీ హై ఉద్యమం మరింత ఉధృతం

బదలావ్ జరూరీ హై ఉద్యమం మరింత ఉధృతం

- Advertisement -
  • డిసెంబరు 1, 2, 3 తేదీల్లో జైల్భరో
  • మోదీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రజలు ఇక భరించలేరు
  • కమ్యూనిస్టులంటే మోదీకి భయం
  • రామ్లీలా మైదానం బహిరంగ సభలో డి.రాజా

‘దేశాన్ని సంక్షోభంలో నెట్టేసిన నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు బదలావ్ జరూరీ హై నినాదం ఇచ్చాం. ఈ నినాదం కేవలం కమ్యూనిస్టు పార్టీ నినాదం కాదు. ఇది దేశ ప్రజలందరి నినాదం. రెండు నెలలుగా దేశవ్యాప్తంగా ప్రచారోద్యమం చేశాం. బదలావ్ జరూరీ హై ఉద్యమాన్ని ఇకపై మరింత ఉధృతం చేస్తాం. డిసెంబర్ 1,2,3 తేదీలలో దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమం నిర్వహిస్తాం’ అని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రకటించారు. భారతదేశం ఇక ఎంత మాత్రం మోదీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ పాలనను భరించే పరిస్థితుల్లో లేదని అన్నారు. కులరహిత, వర్గ రహిత, సమసమాజ నవభారత నిర్మాణం కోసం ఎర్రజెండాలు పోరాటం చేయాలన్నారు. దేశ రాజధాని దిల్లీలోని రామ్ లీలా మైదానంలో సీపీఐ మంగళవారం నిర్వహించిన ‘బదలావ్ జరూరీ హై’ భారీ బహిరంగ సభలో డి.రాజా ప్రసంగించారు. దేశ నలుమూలల నుంచి సీపీఐ శ్రేణులు, కార్యకర్తలతో మైదానం కిటకిటలాడింది. మూడు డేరాలు వేసినా సరిపోకపోవడంతో ఎండను సైతం లెక్క చేయకుండా వేలాదిమంది బయటే నిలబడి నాయకుల ప్రసంగాలను శ్రద్ధాసక్తులతో విన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు పి సంతోశ్కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో రాజాతోపాటు సీపీఐ జాతీయ కార్యదర్శులు అమర్జిత్కౌర్, రామకృష్ణ పాండా, గిరీష్ కుమార్ శర్మ, పల్లా వెంక{రెడ్డి, కె.రామకృష్ణ, అనీ రాజా, ప్రకాశ్ బాబు, బాలచంద్ర కాంగో, ఏఐ‌ఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు విరాజ్ దేవాంగ్, ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు సుఖ్జిందర్ సింగ్ ప్రసంగించారు. వేదికపై జాతీయ కార్యవర్గ సభ్యులు, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, పశ్య పద్మ, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, అన్ని రాష్ట్రాల కార్యదర్శులు ఆశీనులయ్యారు.
కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిస్టు సిద్ధాంతం అంటే ప్రధాని నరేంద్రమోదీకి భయమని, అందుకే వారిని ఉద్దేశించి ఎర్రకోట నుండి మోదీ దిమాగీ నకస్ల్స్‌ అని అన్నారని రాజా గుర్తు చేశారు. మరో సందర్భంలో కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రమాదకరమైన సిద్ధాంతమని అక్కసు వెళ్లగక్కారన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా ఎర్రజెండాలు పోరాడతాయని, రాజకీయ సైద్ధాంతిక ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికలలో మార్పు అవసరమని అన్నారు. లౌకిక, ప్రజాతంత్ర, వామపక్షాల ఐక్యత విషయంలో సీపీఐ కీలక పాత్ర పోషిస్తుందని రాజా తెలిపారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించే పోరాటానికి రామ్ లీలా మైదానంలో జరిగిన చారిత్రక ర్యాలీ స్ఫూర్తి ఇస్తుందన్నారు.
బహిరంగ చర్చకు సవాలు
మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతదేశాన్ని సంక్షోభంలోకి నెట్టివేసిందని, ఈ సంక్షోభం చాలా తీవ్రమైనదని, బహుముఖమైనదని డి.రాజా విమర్శించారు. అందుకే నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఓడించాలని, దేశాన్ని రక్షించాలని, (మోదీ సర్కార్ కో హర్యానా చాహియే… దేశ్ కో బచానా చాహియే.. ), బదలావ్ జరూరీ హై అని పిలుపునిచ్చారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మన ఆర్థిక వ్యవస్థను ఘోరంగా దెబ్బతీశాయని అన్నారు. భారత్ను ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థగా నిలబెడతాన్న మోదీ… దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం, పతనమవుతున్న రూపాయి విలువ గురించి ప్రజలకు వివరించేందుకు బహిరంగ చర్చకు వస్తారా అని రాజా సవాలు విసిరారు. పతనమవుతున్న రూపాయి విలువ దేశ గౌరవానికి ప్రతిబింబమని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్నారని, అలాంటిది ఇప్పుడేమంటారని నిలదీశారు. రష్యా నుండి చమురు కొనుగోలు చేయవద్దని భారత ప్రభుత్వానికి ట్రంప్ చెప్పారని, అలా చెప్పేందుకు ఆయన ఎవరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. రష్యా చమురు కొనుగోలుపై నిర్ణయం తీసుకోవడానికి ఆయన అమెరికా అధ్యక్షడా లేదా భారత అధ్యక్షడా అని, ఈ అంశంపై మోదీ బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. మోదీ ప్రధానమంత్రి అయినప్పుడు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారని, ఆచరణలో ఆయన అదానీ, అంబానీ కోసమే ఉన్నారని రాజా విమర్శించారు. మోదీ పేదల కోసం లేరని, ఆయనకు నిజాయతీ ఉంటే దీనిపై చర్చకు రావాలని సవాల్ చేశారు. ఇటీవల మైనింగ్ చట్టాన్ని సవరించారని, ఇది సమాఖ్య వ్యవస్థపై దాడి చేయడమేనని అన్నారు. ఈ చట్ట సవరణ ఆదివాసీలపై దాడి చేసే చర్య అని చెప్పారు.
ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే పాల్గొన్న కార్యక్రమం వేదికను శుద్ధి చేశారని, ఇది దేశానికి, దేశ నాగరికతకు తలవొంపులు కాదా అని రాజా అన్నారు. ఖడ్గే పరిస్థితి ఇలా ఉంటే దేశంలో దళితులు, ఆదివాసుల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. ఈ ఘటనను మోదీ, అమిత్‌షా ఖండించారా? శుద్ధి చేసిన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారా అని ఆయన ప్రశ్నించారు. పదేపదే నారీశక్తి గురించి మాట్లాడుతున్న మోదీ సర్కారు చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడం లేదన్నారు. ఇటీవల జంతర్ మంతర్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో వామపక్ష విద్యార్థి సంఘాలు ఏఐ‌ఎస్‌ఎఫ్, ఏఐఎస్‌ఏ, ఎస్‌ఎఫ్‌ఐ భాగస్వామ్యమయ్యాయని రాజా గుర్తు చేశారు. ఆందోళనకారులపై పోలీసులతో దారుణంగా లాఠీ చార్జి చేయించిందని, పెల్లెట్ గన్లు ప్రయోగించిందన్నారు. దేశ యువతరం మౌనంగా ఉండేందుకు సిద్ధం లేదని, వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడుతున్నారని రాజా అభినందించారు.
ఆర్‌ఎస్‌ఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకం
భారతదేశంలో ముస్లింలు జీవించొద్దని ఎవరైనా అంటే… వారు హిందువులే కాదని న్యూయార్క్లో ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ అన్నారని, ఇవే మాటలు ఆయన దిల్లీలో ఆర్‌ఎస్‌ఎస్, సంఘ్ పరివార్‌తో చెప్పగలరా అని రాజా సవాల్ విసిరారు. ఇటీవల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని వర్గాలు ఆందోళన చేస్తున్నాయని, ఆర్‌ఎస్‌ఎస్ విధానమే రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పారు. రిజర్వేషన్లు కేవలం పేదరిక నిర్మూలన చర్యలు కాదని, అది సామాజిక, ఆర్థిక అభ్యున్నతి కార్యక్రమమని తెలిపారు. భారతదేశం ప్రస్తుతం నిర్ణయాత్మక దశలో ఉన్నదని, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణతో పాటు సామాజిక న్యాయ విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని రాజా నొక్కి చెప్పారు. బదలావ్ జరూరీ హై ప్రచారోద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు, నవంబర్ 7న సోషలిస్టు విప్లవం జరిగిన రోజున మరిన్ని కార్యక్రమాలు తీసుకుంటామన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు