విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ పట్టణంలోని 1, 2వ సచివాలయాల పరిధిలో సోమవారం సీజనల్ వ్యాధులపై అవగాహన సమావేశాలు, ర్యాలీలు నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యదర్శి సయ్యద్ సమీర్, మలేరియా ఉపవిభాగ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా జ్వర సర్వే చేపట్టారు. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, మెదడువాపు వ్యాధుల లక్షణాలు, నివారణ చర్యలను ప్రజలకు వివరించారు. దోమల లార్వా నిర్మూలన చర్యలు చేపట్టి, మురుగు కాలువల్లో అభేట్ ద్రావణం చల్లారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమతెరలు వినియోగించాలని అధికారులు సూచించారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో గంబూషియా చేప పిల్లలను వదలనున్నట్లు తెలిపారు.సాయంత్రం వేళల్లో వేపాకు పొగ వేయడంతో పాటు ఆరుబయట నిద్రించే సమయంలో పొడవాటి దుస్తులు ధరించాలని సూచించారు.కార్యక్రమంలో ఆరోగ్య సహాయకుడు రాఘవేంద్ర, వైద్య సిబ్బంది శమంతకమణి, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.


