Homeఆంధ్రప్రదేశ్భూమికి విముక్తి

భూమికి విముక్తి

- Advertisement -

22ఏ నుంచి వేలాది ఎకరాలకు పునరుజ్జీవం
రైతు కుటుంబాలకు సర్వహక్కులు
శాశ్వత పరిష్కారం చూపిన ‘కూటమి’

విశాలాంధ్ర – సచివాలయం: భూముల రికార్డుల్లో దొర్లిన సాంకేతిక పొరపాట్లు, అధికారుల అలసత్వం, విధానపరమైన చిక్కుముడులు, దీర్ఘకాలికంగా సాగే న్యాయ చిక్కుల వల్ల ఒకసారి నిషేధిత జాబితా (22-ఏ)లోకి వెళ్లిన భూమి తిరిగి వెనక్కి రావడం గగనంగా మారేది. తరతరాలుగా తమ సొంత ఇళ్లు, వ్యవసాయ భూములపైనే హక్కులు లేక ఆందోళన చెందేవారు. అవసరానికి బ్యాంకుల నుంచి రుణాలు పొందలేక, రిజిస్ట్రేషన్‌లు కాక, విక్రయించుకోలేక ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ నలిగిపోయేవారు. అయితే దశాబ్దాలుగా వేధిస్తున్న అతి సంక్లిష్టమైన భూసమస్యలకు శాశ్వత ముగింపు పలుకుతోంది కూటమి ప్రభుత్వం. చట్టబద్ధమైన హక్కులను కల్పిస్తూ వేలాది ఎకరాలను నిషేధిత జాబితా నుంచి విముక్తి చేస్తోంది. ఈ క్రమంలోనే తిరుపతి సమీపంలోని శెట్టిపల్లిలో 1979 నుంచి అపరిష్కృతంగా ఉన్న ఎస్టేట్ గ్రామం వివాదానికి శాశ్వత మోక్షం కల్పిస్తూ 380 ఎకరాల విస్తీర్ణంలోని 1,744 ఇంటి స్థలాలు, 304 వ్యవసాయ స్థలాలకు సంబంధించిన 2,048 కుటుంబాలకు హక్కు పట్టాలు అందజేసి కొత్త వెలుగులు నింపారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో రికార్డుల్లో దొర్లిన చిన్న సాంకేతిక పొరపాటు వల్ల ఏకంగా 112 ఎకరాల గ్రామకంఠం భూమిని చెరువు పోరంబోకుగా నమోదు చేయడంతో 120 ఏళ్లుగా వివాదం నడిచింది. అక్కడ ఎంపీడీఓ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి, లైబ్రరీ సహా 515 గృహాలు ఉన్న 25.37 ఎకరాల నివాస ప్రాంతాన్ని తాజాగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, ఆ నివాస ప్రాంతాన్ని 22ఏ నిషేధిత జాబితా నుంచి పూర్తిగా తొలగిస్తూ చారిత్రక సవరణ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కంగుంది గ్రామంలో 1961లో ‘రిజర్వ్ ఫారెస్ట్’గా ప్రకటించి, అనంతరం జమీందార్ల వారసుల కోర్టు కేసులతో 61 ఏళ్ల పాటు వివాదాస్పదంగా మారిన 529 ఎకరాల భూములకు పరిష్కారం చూపిస్తూ, 322 మంది రైతులకు 460.19 ఎకరాలపై పూర్తిస్థాయి డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం పుంగనూరు నియోజకవర్గం ఆవులపల్లి (సోమల మండలం) పరిధిలో ‘సీతమ్మ చెరువు’ కట్టను తెంచి, మూడు పంటలు పండే 55 మంది రైతులకు చెందిన 911 ఎకరాల సారవంతమైన వ్యక్తిగత భూములను బలవంతంగా నిషేధిత జాబితాలో చేర్చగా, కూటమి ప్రభుత్వం దానికి స్వస్తి పలికి ఆ భూములన్నింటినీ 22ఏ నుంచి విడుదల చేసింది. గుంటూరు జిల్లా పుల్లడిగుంటలో వందేళ్లుగా తోపు పోరంబోకుగా వర్గీకరించి నిషేధిత జాబితాలో పెట్టిన 201 కుటుంబాల నివాస స్థలాలకు (8.51 ఎకరాలు) విముక్తి కల్పిస్తూ, పాఠశాలలు, మసీదు, దేవాలయ స్థలాలను ప్రభుత్వ ఆస్తిగా మారుస్తూ రాష్ట్ర కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయానికి ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం గూటుపల్లిలో 2,669 ఎకరాల పట్టా భూములను గత వైసీపీ ప్రభుత్వంలో వక్ఫ్ ఆస్తులుగా 22ఏ (1)(సీ) కింద నిషేధిత జాబితాలోకి నెట్టివేశారు. డోన్ మండల పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతులు వినతిపత్రం సమర్పించగా, సమగ్ర విచారణ జరిపి 2,074 ఎకరాల స్వచ్ఛమైన పట్టా భూములను వక్ఫ్ జాబితా నుంచి తొలగించి 897 మంది రైతులకు కొండంత ఊరట కల్పించారు. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గ పరిధిలోని 23 మంది రైతులకు చెందిన 101 ఎకరాల చుక్కల భూముల క్రమబద్ధీకరణ, కొవ్వూరు మండలం వేములూరులో దేవదాయ శాఖకు చెందినది కేవలం 0.10 ఎకరాలు మాత్రమే ఉన్నప్పటికీ సాంకేతిక లోపంతో 22ఏలో ఇరుక్కుపోయిన 16.31 ఎకరాల గ్రామకంఠం భూములను సవరించి ఆన్‌లైన్ రికార్డుల్లో మార్గం సుగమం చేశారు. 1948-49లో ‘ల్యాండ్ కాలనైజేషన్ సొసైటీ ఫర్ ఎక్స్-సర్వీస్మెన్’ ద్వారా మాజీ సైనికులకు కేటాయించిన కలిదిండి, ముదినేపల్లి, మండవల్లి గ్రామాల పరిధిలోని 2,879 ఎకరాల భూసమస్యను పునఃపరిశీలించి జీఓ 508, జీఓ 509 ద్వారా 2,044.18 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి 1,090 మందికి పైగా రైతు కుటుంబాలకు సర్వహక్కులు కల్పించారు. బాధితులకు ఎలాంటి సమస్యలు పునరావృతం రాకుండా శాశ్వత పరిష్కారాన్ని అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని క్షేత్రస్థాయిలో అందుతున్న ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు