జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం రక్షణ తీసుకురావాలి
ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర కార్యదర్శి సిహెచ్.బి.ఎల్. స్వామి
నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా) : జర్నలిస్టులపై భౌతిక దాడుల నివారణకు జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర కార్యదర్శి సిహెచ్.బి.ఎల్. స్వామి డిమాండ్ చేశారు. జర్నలిజాన్ని , జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల దేనని అన్నారు. మంగళవారం నర్సీపట్నంలో జరిగిన ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ (ఏపీ ఈఎంజేఏ) సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 60 సంవత్సరాలు దాటిన జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పెన్షన్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం ఉందన్నారు .ఆంధ్రప్రదేశ్ లో కూడా జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వాలు ఎన్నో సంవత్సరాలుగా హామీలు ఇస్తున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం అమలులో జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీటిని తొలగించడానికి సంబంధిత అధికార యంత్రాంగం చొరవ చూపాలని కోరారు. వర్కింగ్ జర్నలిస్టులకు అవసరమైన సందర్భాల్లో ఆర్థిక సహాయాన్ని అందించేందుకు వంద కోట్ల రూపాయలతో వర్కింగ్ జర్నలిస్టు వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఉన్న ఈ పథకాన్ని నిధులు పెంచి అమలు చేయాలని కోరారు. వ్యతిరేక వార్తలు రాసే జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేద వ్యక్తం చేశారు.ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి చంద్రరావు మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా జర్నలిస్టుల డిమాండ్స్ డే జరుపుతున్నామని, ప్రతి జర్నలిస్టు ఈ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లాలో వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ను ప్రతి జర్నలిస్టు వినియోగించుకోవాలని కోరారు. ఏపీయూడబ్ల్యూజే వ్యక్తుల కోసం పనిచేయదని వ్యవస్థీకృతంగా, నిర్మాణాత్మకంగా పనిచేస్తుందని చెప్పారు. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల కిషోర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఏపీ ఈఎంజేఏ జిల్లా అధ్యక్షుడు చిట్టిబాబు, కార్యదర్శి హనుమంతరావు, నర్సీపట్నం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నానాజీ, కార్యదర్శి బాబ్జి, జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ గిరిబాబు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఏడి బాబు, తదితరులు పాల్గొన్నారు.


