Homeపట్టణాలే అభివృద్ధి కేంద్రాలు

పట్టణాలే అభివృద్ధి కేంద్రాలు

- Advertisement -

2047కల్లా పురపాలక సంఘాలన్నీ స్వర్ణ మున్సిపాలిటీలు

  • స్థానిక సంస్థలపై ఆర్థికభారం లేకుండా అభివృద్ధి – సీఎం చంద్రబాబు
  • రూ.11,359 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

విశాలాంధ్ర `చిత్తూరు : పట్టణాలే అభివృద్ధి కేంద్రాలని… దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజా ప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల రూపురేఖలు మార్చేలా రూ.11,359 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంగళవారం కుప్పం నుంచి సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇంత భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టడం రాష్ట్ర మున్సిపల్ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా పేర్కొన్నారు. రెండేళ్లుగా సంక్లిష్ట పరిస్థితులను అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని చెప్పారు. పట్టణ ప్రాం తాలు ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజన్లుగా మారేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. పట్టణాల్లో నివాసయో గ్యమైన వసతులు మెరుగుపర్చటంతో పాటు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా అభివృద్ధి చేయాలన్నారు. పట్టణాల్లో వీకెండ్ ఎకానమీ విపరీతంగా పెరుగుతుందని సీఎం వివరించారు. ప్రజలు తమకు వచ్చే ఆదాయంలో 61 శాతం డబ్బును వారాంతాల్లో ఖర్చు పెడుతున్నారని, అలాగే రవాణా నిమిత్తం 71 శాతం ఖర్చు పెడుతున్నారని వెల్లడించారు. దీనిపై అధికారులు.. ప్రజా ప్రతినిధులు మరింత అధ్యయనం చేయాలని సూచిం చారు. దీనికి అనుగుణంగా వారాంతా ల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గృహవసతి, రవాణా వంటి అవసరాలపై పట్టణ ప్రజలు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్న నేపథ్యంలో టిడ్కో ఇళ్లతో పాటు స్త్రీశక్తి వంటి కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్-అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం… అర్బన్ ప్రాస్పెరెటీ విభాగంగా పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
టిడ్కో గృహాలు… ఇంటింటికి తాగు నీరు
2027 నాటికి రాష్ట్రంలోని టిడ్కో గృహాల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని సీఎం ప్రకటించారు. విశాఖ నగరంలో 28,500 కుటుంబాలకు ఇప్పటికే ఇళ్ల పట్టాలు ఇచ్చామని, అభ్యంతరాలు లేని ప్రాంతాల్లో మరిన్ని పట్టాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పట్టణ ప్రజలకు 24 గంటలూ సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యంతో జల్ జీవన్ మిషన్‌ను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. భవన నిర్మాణ అనుమతులను వేగంగా మంజూరు చేస్తున్నామని, పట్టణాభివృద్ధిలో పలు సంస్కరణలు చేపట్టామని చెప్పారు. స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాల ద్వారా పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 143 లక్షల టన్నుల చెత్తను తొలగించామని, ప్రస్తుతం రెండు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తున్నాయని చెప్పారు. మరో నాలుగు ప్లాంట్ల నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు. ఘన వ్యర్థాలను రీసైక్లింగ్ విధానంలో శాస్త్రీయంగా నిర్వహిస్తూ మున్సిపాలిటీల్లో మురుగునీరు, చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
స్థానిక సంస్థలపై ఆర్థిక భారం లేకుండా హైబ్రీడ్ యాన్యుటీ పద్ధతుల్లో అభివృద్ధి పనులు
ప్రస్తుతం ప్రారంభించిన పనులతో కలిపి పట్టణ ప్రాంతాల్లో రూ.50 వేల కోట్ల విలువైన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ఇవన్నీ పూర్తయితే రాష్ట్ర పట్టణ ప్రాంతాల దశ, దిశ మారుతుందన్నారు. ఇప్పటికే రూ.22,330 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయని, మరో ఆరు నెలల్లో రూ.17 వేల కోట్ల పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌లో తొలిసారిగా పట్టణాభివృద్ధి పనులు చేపడుతున్నామని సీఎం తెలిపారు. పట్టణ స్థానిక సంస్థలపై ఆర్థిక భారం పడకుండా ఈ విధానంలో పనులు చేపడుతున్నట్లు చెప్పారు. 123 మున్సిపాలిటీల పరిధిలో రూ.7,469 కోట్లతో, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.3,890 కోట్లతో పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రూ.4,656 కోట్లతో రహదారులు, రూ.88 కోట్లతో సెంట్రల్ మీడియన్లు, రూ.247 కోట్లతో వీధి దీపాలు, రూ.509 కోట్లతో పార్కుల అభివృద్ధి చేపట్టనున్నారు. మొత్తం సుమారు 2,165 కిలోమీటర్ల రహదారులు, 502 పార్కులు, 210 కిలోమీటర్ల సెంట్రల్ మీడియన్లు, 391 కిలోమీటర్ల స్ట్రీట్ లైటింగ్, 300 కిలోమీటర్ల సీవరేజీ పనులు చేపట్టనున్నారు. 2047 నాటికి ప్రతి మున్సిపాలిటీని స్వర్ణ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్‌లు, అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం నుంచి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొనగా… కుప్పంలో జరిగిన కార్యక్రమంలో పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పట్టణ స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు