ఏపీ ప్రభుత్వం తరఫున నంది ఫిల్మ్, టీవీ అవార్డుల ప్రదానోత్సవాన్ని డిసెంబరులో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ) ఛైర్మన్ పి.భరత్ భూషణ్, ఎండీ కె.విశ్వనాథన్ తెలిపారు.విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో అవార్డులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.అక్టోబరులో అవార్డుల కోసం కమిటీలను ఏర్పాటు చేసి, నవంబరులో ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు.నంది ఫిల్మ్, నేషనల్ అవార్డుల ప్రదానోత్సవాన్ని అమరావతిలో, నంది టీవీ అవార్డుల కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
పెండింగ్‌లో ఉన్న అవార్డులన్నీ..
2025 సంవత్సరానికి సంబంధించి అన్ని కేటగిరీల్లో ఫిల్మ్, టీవీ అవార్డులను ప్రదానం చేస్తామని అధికారులు తెలిపారు.2011 తర్వాత నంది ఫిల్మ్, టీవీ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.2017 నుంచి 2024 వరకు ప్రతి ఏడాదికి ఫిల్మ్, టీవీ విభాగాల్లో నాలుగు చొప్పున అవార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు.ఫిల్మ్ విభాగంలో ప్రతి సంవత్సరానికి ఉత్తమ తొలి చిత్రం, ఉత్తమ రెండో చిత్రం, రెండు ప్రత్యేక జ్యూరీ అవార్డులు అందిస్తారు.టీవీ విభాగంలో ఉత్తమ తొలి, రెండో టీవీ మెగా సీరియళ్లతో పాటు రెండు ప్రత్యేక జ్యూరీ అవార్డులు ఇవ్వనున్నారు.
ఫిల్మ్ విభాగంలో 46 అవార్డులు..
2012 నుంచి 2016 వరకు ఫిల్మ్ విభాగంలో 288 ప్రధాన అవార్డులు, 51 జ్యూరీ అవార్డులు, టీవీ విభాగంలో 330 ప్రధాన అవార్డులు, 54 జ్యూరీ అవార్డులను అప్పట్లోనే ప్రకటించారు.అయితే వీటికి సంబంధించిన ప్రదానోత్సవ కార్యక్రమం జరగలేదు. పెండింగ్‌లో ఉన్న ఈ అవార్డులన్నింటినీ ఇప్పుడు ప్రదానం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.చలనచిత్రాలు, జాతీయ సమైక్యతపై రూపొందించిన చిత్రాలు, బాలల చిత్రాలు, డాక్యుమెంటరీలు, విద్యా విషయక చిత్రాలు, తెలుగు సినిమాపై రాసిన ఉత్తమ రచనలు తదితర విభాగాల్లో ఫిల్మ్ అవార్డులను అందించనున్నారు.మొత్తం 46 అవార్డుల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ ప్రదర్శనలతో పాటు ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి తదితర కేటగిరీలు ఉన్నాయి.
జాతీయ అవార్డులకు నగదు పురస్కారాలు..
నంది ఫిల్మ్ అవార్డు గ్రహీతలకు బంగారు, వెండి, కాంస్య, తామ్ర నందులతో పాటు ప్రశంసాపత్రం, నగదు పారితోషికాన్ని అందిస్తారు.వివిధ విభాగాల్లో మొత్తం ఎనిమిది బంగారు పతకాలను కూడా ప్రదానం చేయనున్నారు. టీవీ రంగానికి సంబంధించి వివిధ కేటగిరీల్లో 48 అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు.జాతీయ చలనచిత్ర అవార్డులకు సంబంధించి ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుకు రూ.5 లక్షల నగదు పురస్కారం అందించనున్నారు.బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి, రఘుపతి వెంకయ్య పేర్లతో ఉన్న జాతీయ అవార్డులకు రూ.2 లక్షల చొప్పున నగదు పురస్కారం ఇవ్వనున్నట్లు ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ ఛైర్మన్, ఎండీ వెల్లడించారు.


