అంతర్జాతీయ సంస్థలకు మంత్రి లోకేశ్ ఆహ్వానం
విశాలాంధ్రబ్యూరో- అమరావతి: ఎలక్ట్రానిక్స్, ఐటీ, వైద్య పరికరాలు, ఫిన్‌టెక్, డిజిటల్ గవర్నెన్స్, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ప్రముఖ అంతర్జాతీయ సంస్థలను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ ఆహ్వానించారు. దిల్లీ పర్యటనలో భాగంగా గురువారం వివో, సిస్కో, అబాట్, మాస్టర్‌కార్డ్, శాప్, గోద్రెజ్, యారా సంస్థల ప్రతినిధులతో సమావేశమైన లోకేశ్ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధాన సహకారాన్ని వివరించారు. తిరుపతిలో వివో మొబైల్స్ కాంపోనెంట్స్ తయారీ కేంద్రం, వివో సరఫరాదారుల కోసం ప్రత్యేకంగా కాంపోనెంట్స్ తయారీ పార్క్ ఏర్పాటు చేయాలని లోకేశ్ ప్రతిపాదించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చిస్తామని వివో ఇండియా అధ్యక్షుడు అర్జిత్ సేన్ చెప్పారు. రాష్ట్రంలో యూపీఎస్ సర్వర్లు, స్విచ్‌లు, రౌటర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సిస్కో సంస్థను లోకేశ్ కోరారు. విశాఖలో ఇంజినీరింగ్ సెంటర్ లేదా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనికి సంస్థ ఇండియా ఎండీ హరీశ్ కృష్ణన్ సానుకూలత తెలిపారు. రాష్ట్రంలోని ఏఎంటీజెడ్/ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో వైద్య పరికరాలు, డయాగ్నోస్టిక్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని అబాట్ సంస్థను మంత్రి ఆహ్వానించారు. నక్కపల్లిలో రాబోయే బల్క్‌డ్రగ్ పార్క్‌లో జెనరిక్ మందుల తయారీ కేంద్రం, విశాఖలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని సంస్థ ఎండీ ఇస్తేయాక్ అంజాద్‌ను కోరారు. విశాఖలో జీసీసీ లేదా టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలని మాస్టర్కార్డ్సంస్థను లోకేశ్ ఆహ్వానించారు. స్టార్ట్అప్లకు మార్గదర్శకత్వం అందించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో ఫిన్‌టెక్ భాగస్వామ్యం కావాలని కోరారు. దిండి, తిరుపతి, సూర్యలంక, అరకు, విశాఖ వంటి పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలన్నారు. డిజిటల్ గవర్నెన్స్, ఎస్ఎంఈల డిజిటలైజేషన్, నైపుణ్యాభివృద్ధి కోసం శాప్ అధ్వర్యంలో డిజిటల్ గవర్నెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేయాలని లోకేశ్ కోరగా… శాప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లవ్నీష్ చనానా ఆయా ప్రతిపాదనలు పరిశీలిస్తామని తెలిపారు. గోద్రెజ్ గ్రూప్‌ను ఏపీలో ఆగ్రో కెమికల్ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. ద్వారకా తిరుమల మండలంలో రూ.210 కోట్ల పెట్టుబడితో మిఠాయి, కోకో బటర్ ప్రత్యామ్నాయ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు గోద్రెజ్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి తెలిపారు. గత నవంబరులో ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్, సమాధాన్ కేంద్రాల కోసం రూ.70 కోట్ల ఎంఓయూపై సంతకం చేసినట్లు చెప్పారు. కాకినాడలో గ్రీన్ అమ్మోనియా తయారీ, ఎగుమతి కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని యారా ఇంటర్నేషనల్‌ను లోకేశ్ ఆహ్వానించారు. ఏపీ ప్రతిపాదనలను సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చిస్తామని యారా ప్రతినిధి వైశాలి చోప్రా తెలిపారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు, తయారీ యూనిట్లు, జీసీసీలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం ఉందని లోకేశ్ సంస్థల ప్రతినిధులకు వివరించారు.


