అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ప్రత్యేక టికెట్ చెకింగ్ డ్రైవ్ నిర్వహించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ఈ తనిఖీలు కేవలం టికెట్ లేకుండా ప్రయాణించే వారిని గుర్తించేందుకే పరిమితం కావు. వివిధ రిజర్వేషన్ కోటాల ద్వారా ప్రత్యేక రాయితీలు పొందిన ప్రయాణికులు నిబంధనలకు అనుగుణంగా ఆ రాయితీలకు అర్హులేనా? లేదా? అన్నది కూడా అధికారులు పరిశీలించనున్నారు. అక్టోబర్ 1న ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక తనిఖీలు అక్టోబర్ 31 వరకు కొనసాగనున్నాయి.
ఈ నేపథ్యంలో రాయితీలతో ప్రయాణించే వారు తమ అర్హతను నిరూపించేందుకు అవసరమైన గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.
తనిఖీల సమయంలో ఈ పత్రాలు ఉండాలి
ప్రత్యేక రాయితీ కింద రైలులో ప్రయాణించే వారు కింది గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకదాన్ని తమ వద్ద ఉంచుకోవాలి.టికెట్ చెకింగ్ సమయంలో అధికారులు అర్హతను నిర్ధారించేందుకు వీటిని పరిశీలించే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డు పాస్‌పోర్ట్ పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ ఐడీ కార్డు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డు గుర్తింపు పొందిన విద్యాసంస్థ జారీ చేసిన స్టూడెంట్ ఐడీ ఫొటోతో కూడిన జాతీయ బ్యాంకు పాస్‌బుక్
వీటిలో ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు పత్రాన్ని ప్రయాణ సమయంలో వెంట తీసుకెళ్లాలి.జిరాక్స్ లేదా ఫొటోకాపీలను మాత్రమే ఆధారంగా పెట్టుకోకుండా,అసలు డాక్యుమెంట్‌ను తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు.
కుటుంబంలో ఒక్కరి దగ్గర ఉంటే సరిపోతుంది
ఒక కుటుంబంలోని సభ్యులందరికీ కలిపి ఒకే టికెట్ బుక్ చేసిన సందర్భంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా గుర్తింపు పత్రం చూపించాల్సిన అవసరం ఉండదు.కుటుంబంలోని కనీసం ఒక సభ్యుడి వద్ద అవసరమైన పత్రం ఉంటే సరిపోతుంది. అదేవిధంగా,ఎక్కువ మంది ప్రయాణికులు కలిసి ఒకే టికెట్‌పై ప్రయాణిస్తున్న సందర్భంలో కూడా వారిలో ఒకరి వద్ద సంబంధిత గుర్తింపు పత్రం ఉంటే సరిపోతుంది. అయితే బృందంలోని ఒక్కరి వద్ద కూడా అవసరమైన డాక్యుమెంట్ లేకపోతే,ఆ ప్రయాణికులందరినీ టికెట్ లేని ప్రయాణికులుగా పరిగణించే అవకాశం ఉంటుంది. అందుకే అక్టోబర్ నెలలో రైలు ప్రయాణం చేసే వారు, ముఖ్యంగా ప్రత్యేక రాయితీలతో టికెట్లు బుక్ చేసుకున్న వారు, అవసరమైన ఒరిజినల్ గుర్తింపు పత్రాన్ని తప్పనిసరిగా వెంట ఉంచుకోవడం మంచిది.


