వైసీపీ అధినేత జగన్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. పులివెందులలో తనపై నమోదైన క్రిమినల్ కేసును రద్దు చేయాలని (క్వాష్) కోరుతూ ఆయన న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ రోజున పులివెందుల మున్సిపల్ కార్యాలయం ఎదుట జగన్ నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ పోలింగ్ ఏజెంట్లను బూత్‌లలోకి అనుమతించకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలతో ఆయన అక్కడ ధర్నా చేపట్టారు. అయితే, ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లో ఉన్న సమయంలో అనుమతి లేకుండా ఆందోళన నిర్వహించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో జగన్‌తో పాటు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, సుమారు 70 మందిపై నిబంధనల ఉల్లంఘన కింద అభియోగాలు మోపారు. రాజకీయ కారణాలతోనే ఈ కేసు నమోదు చేశారని, అందువల్ల దీనిని కొట్టివేయాలని జగన్ తన పిటిషన్లో కోరారు. మరోవైపు, వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కార్యాలయం వద్ద నిరసన తెలిపినందుకు గాను ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, మురుగుడు హనుమంతరావు, రుహుల్లాలపై సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తమపై పెట్టిన కేసును కూడా కొట్టివేయాలని వారు కోర్టును అభ్యర్థించారు. జగన్ దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్సీల పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టనుంది.
కేసు కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో జగన్ పిటిషన్
- Advertisement -
RELATED ARTICLES


