పంజాబీ వ్యక్తి ఆవేదన
వీసా ఇప్పిస్తానని హామీ ఇచ్చి చివరి నిమిషంలో ఏజెంట్ మోసం
45 కిలోమీటర్లు నడిచి డాంకీ రూట్ లో అగ్రరాజ్యంలోకి పంపించారని వెల్లడి
తాజాగా ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకుని డిపోర్ట్ చేశారని వివరణ
అగ్రరాజ్యం అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను గుర్తించి వెనక్కి పంపిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా తాజాగా 104 మంది భారతీయులను సైనిక విమానంలో అమెరికా తిప్పి పంపింది. పంజాబ్ లోని అమృత్ సర్ ఎయిర్ పోర్ట్ లో బుధవారం అమెరికా విమానం ల్యాండయింది. ఈ విమానంలో వచ్చిన 104 మందిలో హోషియార్ పూర్ జిల్లా తాహిల్ గ్రామానికి చెందిన హర్విందర్ సింగ్ ఒకరు. ఆయన అమెరికా ఎలా వెళ్లారు.. ఎందుకు డిపోర్ట్ అయ్యారనే వివరాలను మీడియా ముందు వెల్లడించారు.
అమెరికాలో సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో ఏజెంట్ మాటలు నమ్మి మోసపోయానని హర్విందర్ సింగ్ పేర్కొన్నాడు. వర్క్ వీసా ఇప్పిస్తానని నమ్మకంగా చెప్పడంతో విడతల వారీగా రూ.42 లక్షలు చెల్లించానని చెప్పాడు. అయితే, చివరి నిమిషంలో వీసా రాలేదని చెప్పి వేరే మార్గంలో అమెరికా పంపిస్తామని విమానంలో బ్రెజిల్ కు పంపించాడని తెలిపాడు. అక్కడి నుంచి తనతో పాటు మరికొందరిని టాక్సీలలో కొలంబియాకు, అక్కడి నుంచి పనామాకు చేర్చారన్నాడు. ఆపై అటవీ మార్గంలో 45 కిలోమీటర్లు నడిపించి మెక్సికో- అమెరికా సరిహద్దు దాటించారని వివరించాడు. దారిలో చాలా మృతదేహాలను చూశానని చెప్పాడు.
అమెరికాలో తెలిసిన వాళ్ల దగ్గర ఉంటూ వివిధ పనులు చేసుకుంటూ బతికానని హర్విందర్ వివరించాడు. ఇటీవల ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకుని చేతులకు బేడీలు వేసి పంపించారని హర్విందర్ వాపోయాడు. అమెరికాలోకి అక్రమంగా అడుగుపెట్టిన వాళ్లందరిదీ దాదాపు ఇలాంటి పరిస్థితేనని, ప్రాణాలకు తెగించి వెళితే పట్టుకుని వాపస్ పంపిస్తున్నారని తెలిపాడు. అమెరికా పంపిస్తామని, అక్కడే సెటిల్ కావొచ్చని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని హర్విందర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.