Friday, February 21, 2025
Homeఆంధ్రప్రదేశ్భూమి వైపు దూసుకు వస్తున్న గ్రహశకలం.. రోజురోజుకూ ముప్పుపెరుగుతోందంటున్న నాసా

భూమి వైపు దూసుకు వస్తున్న గ్రహశకలం.. రోజురోజుకూ ముప్పుపెరుగుతోందంటున్న నాసా

2032 డిసెంబర్ 22 న భూమిని తాకొచ్చని నాసా అంచనా
గాలిలో పేలిపోయినా పెను ప్రభావమే ఉంటుందని వివరణ

అంతరిక్షంలో ఓ భారీ గ్రహశకలం భూమివైపు దూసుకొస్తోందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. 2023 డిసెంబర్ లోనే ఈ గ్రహ శకలాన్ని గుర్తించామని, దీనిని 2024 వైఆర్4 గా వ్యవహరిస్తున్నామని చెప్పారు. ఈ గ్రహశకలం భూమిని తాకే అవకాశం కేవలం 1 శాతమే ఉందని తొలుత అంచనా వేసిన శాస్త్రవేత్తలు.. తాజాగా ఈ ముప్పు రోజురోజుకూ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 40 మీటర్ల నుంచి 90 మీటర్ల పరిమాణంలో ఉన్న ఈ ఆస్టరాయిడ్ 2032 డిసెంబర్ 22 న భూమిని తాకొచ్చని చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి 29న మరోసారి 2024 వైఆర్ 4 కదలికలను పరిశీలించగా భూమిని తాకే ప్రమాదం కేవలం 1 శాతం ఉందని తేలిందన్నారు. అయితే, ఈ నెలలో జరిపిన పరిశోధనలో ఈ ముప్పు 3.2 శాతానికి పెరిగిందని తెలిపారు.

భారీ పరిమాణంలో ఉన్న ఈ గ్రహశకలం దాదాపు గంటకు 40 వేల మైళ్ల వేగంతో భూమి వైపు దూసుకు వస్తోందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఒకవేళ ఈ గ్రహశకలం భూమిని ఢీ కొట్టకపోయినా, వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత పేలిపోయినా కూడా ప్రభావం భారీగానే ఉంటుందని చెప్పారు. హిరోషిమాపై వేసిన అణుబాంబుతో పోలిస్తే 500 రెట్లు అధిక ప్రభావం ఉంటుందని అంచనా వేశారు. గ్రహ శకలం మార్గాన్ని పరిశీలించగా.. ఇది నేరుగా పసిఫిక్ సముద్రంలో లేదా నార్తరన్ సౌత్ అమెరికా, అట్లాంటిక్ సముద్రం, ఆఫ్రికా, అరేబియన్ సముద్రం, దక్షిణాసియాలలో ఏదో ఒకచోట పడుతుందని గుర్తించినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఈ 2024 వైఆర్ 4 గ్రహశకలం భూమిని తాకే ముప్పు ప్రస్తుతానికి 2.8 శాతం ఉందని యురోపియన్ స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది.

ఈ గ్రహశకలం భూమిని తాకుతుందా లేక గాలిలోనే పేలిపోతుందా అనే విషయంపై స్పష్టత లేదని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అవసరమైతే గ్రహశకలాన్ని అడ్డుకుని మధ్యలోనే పేల్చివేసేందుకు తగిన సమయం ఉందని చెప్పారు. 2022 లో నాసా అభివృద్ధి చేసిన డిమాన్ స్ట్రేటెడ్ ఆస్టరాయిడ్ డిఫ్లెక్షన్ టెక్నాలజీ (డార్ట్) తో ఈ గ్రహశకలాన్ని దారి మళ్లించవచ్చని కూడా పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు