విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మహిళలు అన్ని రంగాల్లో రానించాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమా రాజేశ్వరమ్మ అన్నారు శుక్రవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు అంతర్జాతీయ మహిళల దినోత్సవ వేడుకలు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమా రాజేశ్వరమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యానీయులను, ఆయాలను ఘనంగా సన్మానించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో మహిళ ప్రాధాన్యతను వివరిస్తూ ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారని, ఎక్కడ పూజింపబడరో అక్కడ కార్యములన్నీ నిష్ఫలితాలని తెలిపారు. అమ్మాయిలు చదువు మధ్యలో బడి మానవేయకుండా ఉన్నత చదువులు చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. కత్తి పట్టి కదనరంగంలో కాలు దువ్విన ఝాన్సీ లక్ష్మీబాయి, కలం పట్టి కదం తొక్కిన కవయిత్రులు, అంతరిక్షం దాకా వెళ్లి వచ్చిన మహిళలు, ప్రతి రంగంలోనూ దూసుకోపోతున్నారని కొనియాడారు. మహిళలు సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదుగుతూ రాష్ట్రపతులు, ప్రధానమంత్రులుగా ఎదిగిన వారి స్పూర్తితో ప్రతి విద్యార్థిని ఆదర్శ మహిళగా నిలవాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీరేష్, శ్రీనివాసులు, విజయ్, సురేష్ కుమార్, మల్లికార్జున, రాఘవేంద్రరావు, హసన్, బసవరాజు, రాజేష్, నిసార్ బాష, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.