డాక్టర్లు నిర్లక్ష్యం వల్లే మృతి చెందినట్లు బంధువులు ఆందోళన
బాలుడు మృతి పై విచారణ జరిపిన జిల్లా వైద్య శాఖ అధికారులు
విశాలాంధ్ర, ఉరవకొండ… ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ వజ్రకరూరు మండలం చాబాల గ్రామానికి చెందిన ఐదు సంవత్సరాల చిన్నారి ఆహరన్ ను కుటుంబ సభ్యులు గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని నర్సులు డాక్టర్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ ఇస్మాయిల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండకుండా బాలుడు యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించకుండా ఫోన్ ద్వారా నర్సులకు వైద్యం చేయాలని సూచించగా విధుల్లో ఉన్ననర్సులు బాలునకు మందులు మరియు సెలైన్ బాటిల్ పెట్టడంతో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో బాలుడు మృతి చెందారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో ఆందోళనకు దిగారు. మృతి చెందిన బాలుడు యొక్క తల్లి సవిత, తండ్రి రాజేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు యొక్క నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందారని ఆరోపించారు. సరైన వైద్యం అందక డాక్టర్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ దారుణం జరిగిందని వారు విల పించారు. బాలుడు యొక్క తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆందోళనకు దిగడంతో హుటాహుటిన ఉరవకొండ సిఐ మహానంది అక్కడికి చేరుకొని బాధితులతో మాట్లాడి నచ్చ చెప్పారు. డ్యూటీలో ఉన్న డాక్టరు మరియు నర్సులు తమ కుమారుడికి సరైన వైద్యం అందించలేదని అందువల్లే తమ కుమారుడు మృతి చెందినట్లు లిఖితపూర్వకంగా ఉరవకొండ సిఐ కి ఫిర్యాదు చేశారు.
విచారణ చేసిన జిల్లా వైద్య శాఖ అధికారి
ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందుక మృతి చెందిన బాలుడు యొక్క సంఘటనపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కోఆర్డినేటర్ డేవిడ్ సెల్వ రాజు శుక్రవారం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి విచారణ చేపట్టారు. ఆసుపత్రి యొక్క సూపరిండెంట్ డాక్టర్ చౌదరి, విధులు లో ఉన్న డాక్టర్ ఇస్మాయిల్ మరియు నర్సులను ఆయన విడివిడిగా విచారణ చేపట్టారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మృతి చెందిన బాలుడు యొక్క సంఘటనపై విచారణ చేశామన్నారు. ఈ సంఘటన నివేదిక ను ఉన్నత స్థాయి అధికారులు దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.


