సేవా స్పూర్తి – సమాజ భద్రతకు ప్రతీకగా పోలీసుల త్యాగం
– మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహ కిషోర్
విశాలాంధ్ర బ్యూరో – తూర్పుగోదావరి : అమరులైన పోలీసు సిబ్బందికి ఘన నివాళి అర్పిస్తూ రాజమహేంద్రవరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన “పోలీస్ కమేమరేషన్ డే” కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా పోలీసు అధికారి డి. నరసింహ కిషోర్ తదితరులు పాల్గొని అమరుల త్యాగాలకు పుష్పాంజలి ఘటించారు.
మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, “సమాజంలో శాంతి భద్రతలను కాపాడే కీలక బాధ్యత పోలీసులు నిర్వర్తిస్తున్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన 191 మంది అమరుల వీరోచిత సేవలను స్మరించుకోవడం గర్వకారణం. కుటుంబం కంటే ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే మీ సేవలు అమూల్యం. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల పట్ల నిబద్ధతతో ఉంది,” అని అన్నారు.
జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, “1959 అక్టోబర్ 21న లడక్ ప్రాంతంలో చైనా దాడుల సందర్భంగా సిఆర్పిఎఫ్ జవానులు ప్రాణత్యాగం చేశారు. ఆ సేవా స్పూర్తిని , వారి ప్రాణ త్యాగం ను స్మరించుకుంటూ నివాళులు అర్పించడం జరుగుతోందన్నారు. ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది ఆత్మ నిబద్ధతతో పనిచేయాలని, వారి కుటుంబ సభ్యుల సహకారం విలువైనదని గుర్తించాలి,” అని తెలిపారు.
సభాధ్యక్షులు ఎస్పీ డి. నరసింహ కిషోర్ మాట్లాడుతూ, “దేశ భద్రత కోసం త్యాగం చేసిన అమరుల జ్ఞాపకార్థం నిర్వహించే ఈ కార్యక్రమం ప్రతి పోలీసు సిబ్బందికి స్పూర్తిదాయకం అన్నారు. మాదక ద్రవ్యాలు, సింథటిక్ డ్రగ్స్ వంటి సామాజిక సమస్యలను ఎదుర్కోవడంలో పోలీసు వ్యవస్థ మరింత కృషి చేయాలి,” అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, అడిషనల్ ఎస్పీలు (అడ్మిన్) ఎన్.బి.ఎం. మురళి కృష్ణ, (లా అండ్ ఆర్డర్) ఏ.వి. సుబ్బరాజు, (ఏ ఆర్) ఎల్. చెంచి రెడ్డి, డీఎస్పీలు (ఎస్.బి) బి. రామకృష్ణ, (నార్త్ జోన్) వై. శ్రీకాంత్, (ఈస్ట్ జోన్) బి. విద్య, (సౌత్ జోన్) కిషోర్, (కొవ్వూరు) దేవకుమార్, (ఏ ఆర్) రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


