ఏపీయూడబ్ల్యూజే డిమాండ్
విశాలాంధ్ర- అనంతపురం టౌన్: కరువుకు నిలయమైన జిల్లాలో చాలా మంది సీనియర్ జర్నలిస్టులు, ఔత్సాహిక జర్నలిస్టులు సొంత పత్రికలు ఏర్పాటు చేసుకుని వాటి నిర్వహణతో సామాజిక సేవ చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నారని, ఈ నేపథ్యంలో అక్రిడిటేషన్ జీవో నిబంధనలను సడలించి మీకున్న విశేష అధికారాలతో జిల్లా అక్రిడేషన్ కమిటీ ఆమోదంతో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( ఏపీయూడబ్ల్యూజే) డిమాండ్ చేసింది. ఈ మేరకు యూనియన్ జిల్లా అధ్యక్షులు పయ్యావుల ప్రవీణ్ , కార్యదర్శి షేక్ మహమ్మద్ అయూఫ్ ల నేతృత్వంలో జర్నలిస్టులు మంగళవారం ఇంచార్జ్ కలెక్టర్ విష్ణు చరణ్ ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. జిల్లావ్యాప్తంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులతో పాటు అనేకమంది జర్నలిస్టులు చిన్న, మధ్యతరహా పత్రికలు నడుపుకుంటూ స్మాల్ అండ్ మీడియం విభాగంలో పనిచేస్తున్నారని ఇన్చార్జి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఏపీయూడబ్ల్యూజే విన్నపం పట్ల ఇంచార్జ్ కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీకి సంబంధించి సభ్యుల నియామక ప్రక్రియ ముగియడంతో త్వరలోనే కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. దీనిపై ఐఅండ్ పీఆర్ ఏడితో జర్నలిస్టుల అక్రిడిటేషన్ల మంజూరుకు సంబంధించిన వివరాలన్నీ చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జాతీయ కౌన్సిల్ సభ్యులు రామకృష్ణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కేపీ కుమార్, పూలశెట్టి చలపతి, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగేంద్ర నాథ్ రెడ్డి, జిల్లా కమిటీ అధ్యక్షుడు రసూల్, చిన్న పత్రికల సంఘం ప్రతినిధులు చౌడప్ప, డేవిడ్, బాబ్జన్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యుడు బివి రెడ్డి, ప్రజాభూమి స్టాఫ్ రిపోర్టర్ రాజా హొన్నూర్, జయరామిరెడ్డి, పలువురు ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు.
అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలి
- Advertisement -


