2027 నాటికి సైనిక బడ్జెట్‌ను 1.5 ట్రిలియన్ డాలర్లకు పెంచడానికి ట్రంప్ ప్రతిపాదన
ప్రస్తుతం ప్రపంచంలో ప్రమాదకరమైన, సమస్యాత్మకమైన పరిస్థితులు నెలకొన్నాయని చెబుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రతిపాదన చేశారు. 2027 సంవత్సరానికి గాను దేశ సైనిక బడ్జెట్‌ను ఏకంగా 1.5 ట్రిలియన్ డాలర్లకు పెంచాలని ఆయన ప్రతిపాదించారు. 2026 నాటి సైనిక బడ్జెట్ 901 బిలియన్ డాలర్లుగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రతిపాదిత పెంపు చాలా అధికం.వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకుని, అమెరికాకు తరలించేందుకు యూఎస్ దళాలు ఆపరేషన్ చేపట్టిన కొన్ని రోజులకే ట్రంప్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం కరేబియన్ సముద్రంలో అమెరికా దళాలు పెద్ద ఎత్తున మోహరించి ఉన్నాయి. ఇదే సమయంలో జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా డెన్మార్క్ అధీనంలోని గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని, కొలంబియాలో సైనిక చర్యలు చేపట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ట్రంప్ ఇటీవల సంకేతాలిచ్చారు. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సైతం తమ చిరకాల ప్రత్యర్థి క్యూబా ఇబ్బందుల్లో ఉంది అని హెచ్చరించారు.


