భారత్ మండపం వద్ద ట్రాన్స్పోర్ట్ కష్టాలు.. సోషల్ మీడియాలో విమర్శలు
దిల్లీలో జరుగుతున్న మూడో రోజు భారత్ మండపం వద్ద భారీ రద్దీ, రవాణా గందరగోళం కారణంగా పాల్గొన్నవారికి తీవ్ర అసౌకర్యం కలిగింది.భారత్ మండపం బయట రహదారులపై వాహనాలకు అనుమతి ఇవ్వకపోవడంతో క్యాబ్‌లు అందుబాటులో లేక పలువురు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చిందని వారు తెలిపారు. కార్యక్రమం ముగిసే సమయానికి సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న వారు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిర్వహణలో లోపాలున్నాయని ఆరోపించారు. ఎనిమిదేళ్లుగా భారత్‌లో నివసిస్తున్నకెనడాకు చెందిన కాలెబ్ ఫ్రీసెన్ సమ్మిట్ అనుభవం బాగానే ఉన్నప్పటికీ సాయంత్రం 7:40 గంటల సమయంలో బయటకు రాగానే క్యాబ్‌లు, షటిల్ సర్వీసులు ఎక్కడా కనిపించలేదని ఎక్స్‌లో పోస్టు చేశారు.
రోడ్లు బ్లాక్.. మెట్రో స్టేషన్ క్లోజ్.. క్యాబ్‌లకు నో ఎంట్రీపై ఆగ్రహం!
ఇదే విషయంపై కార్యకర్త దీపికా నారాయణ్ భరద్వాజ్ కూడా స్పందిస్తూ, రోడ్లు బ్లాక్ చేయడంతో పాటు సమీప మెట్రో స్టేషన్‌ను కూడా తాత్కాలికంగా మూసివేశారని తెలిపారు. అమెరికా నుంచి వచ్చిన తన బంధువు రాత్రి 8 గంటల నుంచి క్యాబ్ బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నా దొరకలేదని ఆమె పేర్కొన్నారు.
మరోవైపు, ముందుగా సమ్మిట్ అధికారిక పేజీలో రద్దీని నివారించేందుకు క్యాబ్‌లలో రావాలని సూచించినప్పటికీ, ప్రాంగణం సమీపంలో క్యాబ్‌లకు అనుమతి నిరాకరించడంపై పాల్గొన్నవారు ఆగ్రహం వ్యక్తం చేశారు.


