Homeతెలంగాణనకిలీ వెబ్‌సైట్లతో వినియోగదారులకు వల… సజ్జనార్ నుంచి మరో అలర్ట్

నకిలీ వెబ్‌సైట్లతో వినియోగదారులకు వల… సజ్జనార్ నుంచి మరో అలర్ట్

- Advertisement -

యూఆర్‌ఎల్ సరిచూసుకోవాలని, స్పాన్సర్డ్ లింకులపై అప్రమత్తంగా ఉండాలని సూచన
వివరాలు నమోదు చేస్తే ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిక


సాంకేతికత పెరిగాక ఏ చిన్న సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్లను ఆశ్రయించడం సాధారణమైంది. అయితే, మనకున్న ఈ అలవాటే ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు ఆయుధంగా మారింది. సెర్చ్ ఫలితాల్లో అగ్రస్థానంలో కనిపించినంత మాత్రాన అది అసలైన, సురక్షితమైన వెబ్‌సైట్ అని గుడ్డిగా నమ్మితే నిలువునా మోసపోయే ప్రమాదం ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని ఆయన సూచించారు. సైబర్ మోసగాళ్లు ఇప్పుడు ‘సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్’ (ఎస్ఈవో) అనే అధునాతన టెక్నిక్‌ను, పెయిడ్ ప్రకటనలను వాడుకుంటున్నారు. బ్యాంకులు, ప్రభుత్వ పోర్టల్స్, ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల పేర్లతో అచ్చుగుద్దినట్టు ఉండే నకిలీ ‘ఫిషింగ్’ వెబ్‌సైట్లను సృష్టిస్తున్నారు. వినియోగదారులు కస్టమర్ కేర్ నంబర్లు, ప్రభుత్వ పథకాలు లేదా ఇతర సేవల కోసం వెతికినప్పుడు, ఈ నకిలీ సైట్లు సెర్చ్ ఫలితాల్లో టాప్‌లో కనిపించేలా చేస్తున్నారు. వీటిపై ‘Sponsored’ లేదా ‘Ad’ అని చిన్న అక్షరాలతో ఉంటుంది. వాటిని గమనించకుండా నిజమైన వెబ్‌సైట్ అని భ్రమపడి క్లిక్ చేయగానే మోసం మొదలవుతుంది.

వెబ్‌సైట్ ఓపెన్ అయిన వెంటనే వ్యక్తిగత వివరాలు, లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లు, క్రెడిట్/డెబిట్ కార్డు నంబర్లు, సీవీవీ, ఓటీపీ వంటి అత్యంత సున్నితమైన సమాచారాన్ని నమోదు చేయమని కోరతారు. ఆ వివరాలు వారికి చిక్కగానే క్షణాల్లో మీ బ్యాంకు ఖాతాను ఖాళీ చేస్తారు. కేవలం ఆర్థికంగా నష్టపరచడమే కాకుండా, మీ గుర్తింపు పత్రాలను దొంగిలించి ‘ఐడెంటిటీ థెఫ్ట్’కు పాల్పడే ప్రమాదం కూడా ఉంది. అంటే మీ పేరు మీద రుణాలు తీసుకోవడం లేదా ఇతర నేరాలకు పాల్పడటం వంటివి చేయవచ్చు.

ఈ తరహా మోసాల బారిన పడకుండా ఉండేందుకు పోలీసులు కొన్ని కీలక సూచనలు జారీ చేశారు.
ఏదైనా వెబ్‌సైట్‌ను సందర్శించే ముందు దాని చిరునామా (URL)ను క్షుణ్ణంగా పరిశీలించాలి. అసలు వెబ్‌సైట్ స్పెల్లింగ్‌కు, నకిలీ వెబ్‌సైట్ స్పెల్లింగ్‌కు చిన్న తేడాలుంటాయి. వీలైనంత వరకు సెర్చ్ ఇంజిన్లలో వెతకడం కన్నా, మీకు తెలిసిన అధికారిక వెబ్‌సైట్ చిరునామాను నేరుగా బ్రౌజర్ అడ్రస్ బార్‌లో టైప్ చేసి ఓపెన్ చేయడమే సురక్షితం. సెర్చ్ ఫలితాల్లో ‘Sponsored’ లేదా ‘Ad’ అని కనిపించే లింకులపై క్లిక్ చేసేటప్పుడు రెట్టింపు జాగ్రత్త అవసరం. ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైనట్లు అనుమానం వస్తే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేయాలి లేదా cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి. ఆన్‌లైన్ ప్రపంచంలో మన అప్రమత్తతే మనకు రక్షణ కవచమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు