విశాలాంధ్ర–ఉరవకొండ: దేశంలో మార్పు రావాలి.. మార్పు కావాలనే నినాదంతో సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ ఆగస్టు 1 నుంచి 14 వరకు జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సీపీఐ పోరుబాటలో భాగంగా శనివారం జీపు జాత ఉరవకొండకు చేరుకుంది. తొలుత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి సీపీఐ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం స్థానిక టవర్ క్లాక్ సమీపంలో ఉరవకొండ పార్టీ నియోజకవర్గ సహాయ కార్యదర్శి సుల్తాన్ అధ్యక్షతన బహిరంగ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, జిల్లా సహాయ కార్యదర్శులు మల్లికార్జున, రాజారెడ్డి పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేశవరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించి నిరంకుశ పాలన సాగిస్తున్నాయని విమర్శించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజల మధ్య కుల, మత విభేదాలను పెంచే విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టడం లేదన్నారు. అనంతపురం జిల్లాలో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. హంద్రీనీవా కాలువను విస్తరించి 6 వేల క్యూసెక్కుల నీటిని తీసుకువచ్చేలా చర్యలు చేపడితే జిల్లాలో సుమారు 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని తెలిపారు.హంద్రీనీవా పిల్ల కాలువల పనులను వేగవంతం చేయడంతో పాటు ఉరవకొండ నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే సామూహిక బిందు సేద్యం పథకాన్ని పూర్తి చేయాలని కోరారు. హంద్రీనీవా నుంచి రాగలపాడు సమీపంలో ఉపకాలువ ఏర్పాటు చేసి పరిసర ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లకు నీటిని అందించాలని డిమాండ్ చేశారు. హెచ్‌ఎల్‌సీ కాలువ ఆధునికీకరణ చేపట్టి చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రజా, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం సీపీఐ ఆధ్వర్యంలో ఆగస్టు 17న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నాలో అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని నారాయణస్వామి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు జె.మల్లికార్జున, ఉరవకొండ పార్టీ సహాయ కార్యదర్శి నాగేంద్ర, సుల్తాన్, జిల్లా నాయకులు సూరి, వజ్రకరూరు మండల కార్యదర్శి హసేన్ బాషా, సీనియర్ నాయకులు రామాంజనేయులు, గన్నే మల్లేష్, రైతు సంఘం నాయకులు బసవరాజు, తోపుడు బండ్ల యూనియన్ కార్మికులు, రైతు సంఘాల నాయకులు, ప్రజానాట్యమండలి కళాకారులు తదితరులు పాల్గొన్నారు.


