ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం
ఏపీకి మరోమారు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేడు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ 12 నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో 11, 12 తేదీల్లో తమిళనాడులో, 12న దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అంతేకాదు, అల్పపీడనం వాయుగుండంగానూ మారే అవకాశం ఉందన్నారు.