- Advertisement -
- బ్రోచర్ ఆవిష్కరించిన కలెక్టర్
విశాలాంధ్ర – శ్రీకాకుళం: జిల్లా ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, వజ్రోత్సవాల కోసం ప్రచార కార్యక్రమం నిర్వహించాలని ఏపీయూడబ్ల్యూజే, జిల్లా కమిటీ ఒక ప్రణాళిక రూపొందించింది. దీనికి సంబంధించిన బ్రోచర్ ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం జడ్పీ హాల్లో ఆవిష్కరించారు. జర్నలిస్టులు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆయన అభినందిస్తూ, అధికార యంత్రాంగం తరపున తగిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఉత్సవాల కమిటీ కన్వీనర్,
ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు విలేకరులతో మాట్లాడుతూ, ప్రచార ప్రణాళిక ఉద్దేశాన్ని వివరించారు. 1950 ఆగస్టు 15న శ్రీకాకుళం జిల్లా ఏర్పడిందని, డాక్టర్ జవహర్ రెడ్డి కలెక్టర్ గా ఉన్నప్పుడు, 2000 సంవత్సరంలో స్వర్ణోత్సవాలు జరిగాయని గుర్తు చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉత్సవాలను ప్రారంభించారని, మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాలలో జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు తెచ్చిన ప్రముఖులను ఆహ్వానించి, ఘనంగా సత్కరించినట్టు తెలిపారు. వజ్రోత్సవాలను కూడా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని ఆయన కోరారు. కలెక్టర్ కు కూడా ఇదే విషయం సూచించామని చెప్పారు. తెలుగు భాష, సంస్కృతులకు, క్రీడా, కళా రంగాలకు ఎంతో సేవ చేసిన ప్రముఖులను ధర్మారావు గుర్తు చేశారు. ఒక కళారూపం ద్వారా జిల్లా చరిత్ర, సంస్కృతి, జిల్లాలో జన్మించిన ప్రముఖుల సమాచారంతో ప్రచారం చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి చెన్నకేశవరావు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు సిహెచ్ జగదీష్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పైడి బాలకృష్ణ, ఎం వాసు, యూనియన్ రాష్ట్ర కౌన్సిలర్ కుంచి చిన్నారావు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కనకల రామారావు, యూనియన్ కోశాధికారి బారు కుల శ్రీనివాసరావు , స్సామ్నా జిల్లా అధ్యక్షుడు సున్నం చిన్నారావు,గరిమెళ్ళ ప్రెస్ క్లబ్ కార్యదర్శి ఎస్ నవచైతన్య, కోశాధికారి చౌదరి సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్టులు పి. యోగేశ్వరరావు,జీవీ నాగభూషణ్, ఏ. చంద్రమోహన్,బి.మాధురి తదితరులు పాల్గొన్నారు.


