–సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం వ్యాఖ్య
దిల్లీ: జాతి, మతం, కులం, ప్రాంతం ఆధారంగా వ్యక్తులను గుర్తించి వివక్ష చూపడం, హింసాత్మక దాడులకు పాల్పడడం తిరోగామి చర్యలేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటిన తర్వాత కూడా ఇలాంటి వివక్ష కొనసాగడం శోచనీయమని తెలిపింది. ఈ నేరాల పట్ల కఠినంగా వ్యవహరించి వాటిని నిరోధించాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పంచోలీ ధర్మాసనం పేర్కొంది. ఈశాన్య ప్రాంత ప్రజలపై దేశంలోని వివిధ చోట్ల జరుగుతున్న వివక్షాపూరితమైన హింసను నిరోధించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని తోసిపుచ్చుతూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే, పిటిషన్‌లోని అంశాలను పరిశీలించి సంబంధిత ప్రభుత్వ విభాగానికి పంపించి చర్యలు తీసుకునేలా చూడాలని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణిని ఆదేశించింది. త్రిపురకు చెందిన 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థి దేహ్రాదూన్‌లో దారుణ హత్యకు గురైన నేపథ్యంలో గత ఏడాది డిసెంబరు 28న ఈ వ్యాజ్యం దాఖలైంది.


