విశాలాంధ్ర ఉరవకొండ ( అనంతపురం జిల్లా) : భారత ప్రథమ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు గురువారం ఉరవకొండ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రానంతరం సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా పనిచేసే పంచవర్ష ప్రణాళికలను తీసుకువచ్చి దేశ అభివృద్ధి లో కీలకపాత్ర నెహ్రూ వహించారని తెలిపారు. శాంతియుత పాలన అందించడంలో నెహ్రూ ముందున్నారని, నేటి యువతకు ఆయన ఆదర్శం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సోనియా శీనా, అబ్బాస్, బ్యాళ్ల ప్రసాద్ సోయాబ్,చంద్ర, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెహ్రూ జయంతి వేడుకలు
57వ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం
విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : 57వ గ్రంథాలయ వారోత్సవాలను మండల కేంద్రంలోని గ్రంథాలయంలో గురువారం ఘనంగా ప్రారంభించారు. ముందుగా బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రూ, వారోత్సవాల్లో భాగంగా దాడిచర్ల హరిసర్వోత్తమరావు చిత్రపటానికి జిల్లా కేడీసీసీ మాజీ డైరెక్టర్ మూలింటి రాఘవేంద్ర, ఆలూరు మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ సంజన్న లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రంథాలయాధికారి విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయం లోని పుస్తకాలను చదివి జ్ఞానాన్ని పెంచుకోవాలని, ప్రతిరోజు గ్రంథాలయానికి వచ్చి పుస్తకం పఠనం, వార్తాపత్రికలు చదవడం వలన విజ్ఞానవంతుల వుతారని తెలిపారు. నెహ్రు ప్రధానమంత్రిగా దేశానికి చేసినసేవలు, గ్రంథాలయాల ప్రాధాన్యం గురించి వివరించారు. ఈ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా వివిధ పాఠశాలలో 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు వ్యాసరచన పోటీలు మరియు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు వారోత్సవాలు ముగింపు సందర్భంగా 20వ తేదీ ప్రముఖులచే బహుమతి అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ నరేష్ ఆచారి, నోబుల్ స్కూలు ఉపాధ్యాయులు జంషూర్ వలి, టిడిపి యూత్ నాయకులు సతీష్ కుమార్, మారేష్, పాఠకులు హనుమంత రెడ్డి, నరసింహులు, ఆంజనేయులు, నరసప్ప, విద్యార్థులు పాల్గొన్నారు.
గ్రంథాలయాలు విజ్ఞానానికి భాండాగారాలు
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : గ్రంథాలయాలు విజ్ఞానానికి భాండాగారాలు అని సర్పంచ్ రామాంజనేయులు అన్నారు. గురువారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గ్రంథాలయ అధికారిణి ఆశాజ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ రామాంజనేయులు హాజరయ్యారు. ముందుగా బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానానికి నిలయాలని అన్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు చదువుకోవాలన్నారు. గ్రంథాలయంలో దినపత్రికలతో పాటు విద్యార్థులకు అవసరమయ్యే పుస్తకాలు లభిస్తాయని ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శివన్న, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి
ఎంపీడీవో గీతావాణి
పంచాయతీల అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ
విశాలాంధ్ర -ఆస్పరి (కర్నూలు జిల్లా) : మండలంలోని గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి వెంటనే అందించాలని ఎంపీడీవో గీతావాణి అన్నారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అభివృద్ధి ప్రణాళికలు 2025-2026 సంబంధించి సర్పంచులు, ఎంపీటీసీలు, వివోఏలు, డిజిటల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులతో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో గీతావాణి పాల్గొని మాట్లాడుతూ గ్రామ పంచాయితీల్లో ప్రణాళికాబద్ధమైన కార్యాచరణతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని సూచించారు. ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేసి గ్రామ పంచాయతీలకు వస్తున్న నిధులు, గ్రామ పంచాయతీల ఆదాయ వనరులను కలుపుకొని చేపట్టాల్సిన పనులను రూపొందించుకోవాలని తెలిపారు. గ్రామ పంచాయతీ డెవలప్ మెంట్ ప్లాన్ ప్రాముఖ్యత, ఆవశ్యకతను ఎంపీడీవో వివరించారు. ట్రైనర్ కృష్ణ, సురేష్ లు హాజరైన సర్పంచులకు, పంచాయితీ కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెంట్లకు జిపిడిపి పై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డిఎల్ పిఓ వీరభద్రప్ప, ఈఓఆర్డి విజయభాను, అన్ని గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, వివోఏలు, డిజిటల్ అసిస్టెంట్స్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉప సభాపతిగా రఘురామ ఎన్నిక
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉప సభాపతిగా ఉండి ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు. రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గురువారం సభలో ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామకు ఆయన అభినందనలు తెలిపారు.
అంతకుముందు ఎన్డీయే కూటమి తరఫున డిప్యూటీ స్పీకర్ పదవికి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పేరును కూటమి నేతలు ప్రకటించారు. దీంతో కూటమి నేతలు సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్‌తో పాటు మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు టీటీడీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులతో కలిసి రఘురామ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.
డిప్యూటీ స్పీకర్ పదవికి ఇతరులు ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో గురువారం మధ్యాహ్నం స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ గా రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించారు. కాగా, అసెంబ్లీలో చీఫ్ విప్‌గా జీవీ ఆంజనేయులు, మండలిలో చీఫ్ విప్‌గా పంచుమర్తి అనురాధను నియమించిన విషయం తెలిసిందే.
అప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చినా జగన్ అసెంబ్లీకి రారు.. హోంమంత్రి అనిత
రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అయితే జగన్ అసెంబ్లీ వైపే చూడరన్న హోంమంత్రి అనిత
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఏపీ హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని అంటున్నారని, కానీ, రఘురామకృష్ణరాజు ఉప సభాపతి అయితే ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయన అసెంబ్లీకి రారని పేర్కొన్నారు. ప్రజలు దీనిపై పందేలు కూడా కాస్తున్నారని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నిన్న మాట్లాడిన హోంమంత్రి.. జగన్ తీరుపై విరుచుకుపడ్డారు.
జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలను దూషిస్తూ అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వర్రా రవీందర్‌రెడ్డిని తాము అరెస్ట్ చేస్తే, జగన్ మాత్రం ఎన్‌హెచ్ఆర్సీకి వెళ్లి అతడిని రక్షించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుచేసిన వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లకుండా ఫంక్షన్ హాల్‌కు తీసుకెళ్లి శాలువాలు కప్పాలా? అని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని ఎన్‌హెచ్ఆర్సీ ముందు గగ్గోలు పెడుతున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి వంటి వాళ్లకు మహిళలను కించపరుస్తూ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పెడుతున్న పోస్టులు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఆడబిడ్డల రక్షణకు బలమైన చట్టం తీసుకొచ్చే యోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్టు ఆమె తెలిపారు. మహిళలపై నేరాలకు సంబంధించి ఈ ఏడాది జూన్ నుంచి అక్టోబర్ వరకు నమోదైన 7,393 కేసుల్లో 12,115 మంది నిందితుల్లో కొందరిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
నన్ను ఏదో కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు: కేటీఆర్ సంచలన ట్వీట్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా నిప్పులు చెరిగారు. లగచర్ల ఘటనలో కుట్ర జరిగిందని చెబుతుండటంపై ఆయన ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఃఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? నీ అల్లుని కోసమో, అన్న కోసమో… రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా? నీ ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చెయ్యడం ఎవరి కుట్ర? పేద లంబాడా రైతులను బూతులు తిట్టి, బెదిరించింది ఎవరి కుట్ర? ఎవని కోసం కుట్ర? మర్లపడ (తిరగబడ్డ) రైతులు… ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర? 50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలకు, రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది? అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. నన్ను ఏదో కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసునని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు. రైతుల గొంతు అయినందుకే తనను అరెస్ట్ చేస్తే అందుకు గర్వపడతానన్నారు. నీ కుట్రలకు భయపడేవాళ్లు ఇక్కడ ఎవరూ లేరని హెచ్చరించారు. అరెస్ట్ చేసుకో రేవంత్ రెడ్డి… చూద్దువుగానీ నిజానికి ఉన్న దమ్మేంటో అని రాసుకొచ్చారు.
నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
పేదల ఇంటికి నిర్మాణానికి ఐదు లక్షల ఇవ్వాలి
పేదలకి అండగా ఎర్ర జెండా ఉంటుంది
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విశాలాంధ్ర బ్యూరో( శ్రీ సత్యసాయి జిల్లా) : నిరుపేదల అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని అలాగే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ధర్మవరం నియోజకవర్గంలోని శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ బత్తలపల్లి మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోరాట కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సత్యసాయి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చి ,ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో పేదలకు ఒక సెంటు స్థలము కూడా ఇవ్వకుండా మోసం చేశారని దుయ్యబట్టారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు లేకుండా మోసం చేశారని మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పట్టణాల్లోని పేదలకు రెండు సెంట్లు గ్రామాల్లోని పేదలకు మూడు సెంట్లు, ఇంటికి స్థలం కేటాయించి ఇల్లు తామే స్వయంగా నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని,ఇప్పుడు తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కనుక ఇచ్చిన హామీని తప్పకుండా నెరవేర్చాలని ఆయన అన్నారు . సిపిఐ పార్టీ చూపించిన ఖాళీ స్థలాల్లో ఇంటి పట్టాలు ఇచ్చి, ఇల్లు నిర్మించాలని ఈ విషయంపై గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి దృష్టికి, జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని ప్రసాద్, ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లి పేదలందరికీ ఇంటి స్థలాలు వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. అంతవరకు తమ పోరాటం ఆగదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అనంతరం శ్రీ సత్యసాయి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అధికార పార్టీ నాయకులు ఈ మఠం భూమిని ఆక్రమించాలని, అనేకమంది అనేక ప్రయత్నాలు చేశారని, కానీ వారి ఆటలు సిపిఐ పార్టీ సాగనివ్వలేదని అన్నారు. సత్యసాయి జిల్లాలో పేదల కోసం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నామని, హిందూపురం,సోమందేపల్లి బత్తలపల్లి,అనేక మండలాల్లో ఇంటి స్థలాల కోసం పోరాటం చేసామన్నారు. అందరికీ ఇంటి స్థలాలు కేటాయించి, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు కేటాయించే వరకు తమ పోరాటం ఆగదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కుల్లాయప్ప, ధర్మవరం నియోజకవర్గ కార్యదర్శి మధు, చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ, సిపిఐ పట్టణ కార్యదర్శి పి రవికుమార్, పట్టణ సహాయ కార్యదర్శి వై. రమణ, సిపిఐ మండల కార్యదర్శి బండల వెంకటేశులు, మండల వ్యవసాయ కార్మిక సంఘం బత్తుల నాగభూషణం, సన్న, పెద్దన్న రామకృష్ణ, ఆదినారాయణ, నారాయణస్వామి, రవి, నారాయణ, జయమ్మ, గంగాధర్, సత్యమయ్య, ఓబులేసు, రామాంజనేయులు, తదితర సిపిఐ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.