విశాలాంధ్ర ధర్మవరం : ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 10వ తేదీ, 23వ, 24వ తేదీలలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని బిఎల్ఓ ల ద్వారా పోలింగ్ బూతులలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నూతన ఓటు, చేర్పులు మార్పులు తదితర విషయాలను పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. ఫారం-6 లో 18 సంవత్సరాలు నిండిన వారు ఓటును నమోదు చేసుకొనుట, ఫారం-7 లో తొలగింపులు, మృతి, డబుల్ ఎంట్రీ, ఇల్లు మార్పులు, వివాహమై వెళ్ళిన వారు, అదేవిధంగా ఫారం-8 చేర్పులు మార్పులు లను బి ఎల్ ఓ ల దగ్గరకు వెళ్లి మార్పు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. కావున ప్రజలందరూ ఈ ప్రత్యేక ఓటర్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
గర్భిణీలు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి..
మెడికల్ ఆఫీసర్ డాక్టర్- ఎన్. గౌతమి.
విశాలాంధ్ర ధర్మవరం : గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పుడే చక్కటి ఆరోగ్యం లభిస్తుందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్- ఎన్. గౌతమి, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు చిన్న తంబి చిన్నప్ప, కార్య దర్శి మంజునాథ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని శివానగర్లో గల అర్బన్ హెల్త్ సెంటర్లో గర్భిణీ స్త్రీలకు వైద్యులు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీ చేతులు మీదుగా పండ్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినెల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీల పట్ల గ్రామాలలో పట్టణాలలో పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. గర్భిణీ స్త్రీల పట్ల కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తలు తీసుకొని, ఎప్పటికప్పుడు వైద్య చికిత్సలను అందించి, ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం పొందేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని తెలిపారు. నెలవారి వైద్య చికిత్సలు తప్పనిసరిగా గర్భిణీ స్త్రీలు చేయించుకోవాలని తెలిపారు. సుఖమైన ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకే వెళ్లాలని తెలిపారు. ప్రభుత్వం కూడా అన్ని సౌకర్యాలను కల్పించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వేణుగోపాల్, సహకార దర్శి రామకృష్ణ, కోశాధికారి చంద్రశేఖర్, సభ్యులు రామకృష్ణ, సాయి ప్రసాద్, నాగరాజు, నారాయణరెడ్డి, ఏఎన్ఎం పుష్పలత, నారాయణమ్మ ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
నేటి ప్రపంచానికి చార్టెడ్ అకౌంటెంట్ చాలా ముఖ్యం…
కళాశాల ప్రిన్సిపాల్ హర్షవర్ధన్
విశాలాంధ్ర ధర్మవరం : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సంపాదన కోసం ఎన్నో దారులు ఉన్నాయని,సంపాదన పరిమితి దాటిన తరువాత పన్ను చెల్లించాల్సి ఉంటుంది అని,వాటి గురించిన సమగ్ర విశ్లేషకుడు చార్టెడ్ అకౌంటెంట్ అని వివేకానంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హర్ష వర్ధన్ తెలిపారు. స్థానిక రేగాటిపల్లె రోడ్డు నందు గల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల నందు గుంటూరు మాస్టర్మైండ్స్ కళాశాల వారిచే చార్టెడ్ అకౌంటెంట్ యొక్క విశిష్టతను కళాశాల డైరెక్టర్ బాలం లక్ష్మీనారాయణ రెడ్డి, కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా నిపుణుడైన చార్టెడ్ అకౌంటెంట్ ల కొరత తీవ్రంగా ఉన్నదని,ఇది చాలా విచారించదగ్గ విషయం అని వారు తెలిపారు. మాస్టర్మైండ్స్ కళాశాల ప్రతినిధులు మాట్లాడుతూ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కూడా సిఎ లేదా సిఎంఎ చేయచ్చునని ఆసక్తి గలవారు తమను సంప్రదిస్తే తప్పకుండా అవగాహన కల్పించి నిపుణులుగా తీర్చిదిద్దుతామని వారు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల కామర్స్ విభాగాధిపతి కృష్ణయ్య,అధ్యాపకులు నరేష్,కళాశాల ఏవో రమేష్,విద్యార్థులు పాల్గొన్నారు.
రీఓపెన్ గ్రీవెన్స్ పై ప్రత్యేక దృష్టి సారించి..పరిధిలోని సమస్యను పరిష్కరించండి..
జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్
విశాలాంధ్ర ధర్మవరం;; రీ ఓపెన్ గ్రీవెన్స్ పై ప్రత్యేక దృష్టి ఉంచి చట్ట పరిధిలో సమస్యను పరిష్కరించవలెనని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ధర్మవరం డివిజన్ రెవెన్యూ కార్యాలయంలోని సమావేశం మందిరంలో పలు రెవెన్యూ అంశాలపై, సాగు నీటి సంఘాల ఎన్నికలపై, ఓటర్ల జాబితా సవరణపై, కోర్టు కేసులు, ఈ ఆఫీస్, గ్రామసభలు, పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ నిర్వహించారు, ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ధర్మవరం డివిజన్ అధికారి మహేష్, డివిజన్ పరిధిలోని ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేర్లు, ఎమ్మార్వోలు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాల నందు, స్వీకరించిన దరఖాస్తులు పురోగతి త్వరితగతిన పూర్తిచేయాలని అధికారికంగా ఆదేశించారు, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి, స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన వినతలు సకాలంలో పరిష్కరించవలనని తెలిపారు. నాటినుండి నిర్వహించబోవు ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమనందు తప్పనిసరిగా ప్రజల నుంచి వచ్చిన వినతులను రిజిస్టర్ నందు నమోదు చేయాలని తెలిపారు. దరఖాస్తుదారుడు కోరిన సమస్యకు అనుగుణంగా ఎండార్స్మెంట్ స్పీకింగ్ ఆర్డర్ కచ్చితంగా దరఖాస్తుదారులకు అందజేయాలి అని తెలిపారు. జిల్లాలో 46 వినియోగ సంఘాలకు సంబంధించి ఓటర్లు జాబితా తయారీ, పోలీస్ స్టేషన్ గుర్తింపు, ప్రచురణ సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు.ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణపై ఇప్పుడే అయింది అని, తప్పనిసరిగా బిఎల్ఎల్లో అందుబాటులో ఉంటూ ఓటర్ల నుండి స్వీకరించిన ఫారం 6,7,8 దరఖాస్తులను స్వీకరించి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి ఎన్నికల నమోదు అధికారికి ప్రతిపాదనలు పంపి వచ్చిన క్లైమూను పరిష్కరించాలని తెలిపారు. రికార్డు రూములు నిర్వహణ ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండే విధంగా తగు రక్షణ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. భూ కేటాయింపు ప్రతిపాదనను సకాలంలో పంపుతూ తిరస్కరించిన ముటేషన్లను 15 రోజులకు ఒకసారి ఆడిటింగ్ చేస్తూ నిరూపించాలని తెలిపారు. ఆ ఆడిటింగ్ నివేదికలను కలెక్టర్ కార్యాలయానికి పంపాలని తెలిపారు. రీ వెరిఫికేషన్ ను జిల్లా యంత్రాంగం నిర్దేశించిన సమయంలోనే పూర్తి చేయాలని వారు అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, హత్య నిరోధక చట్టం 1989 మేరకు అందజేసే నష్టపరిహారమును సకాలంలో అందజేసి పరిష్కరించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో డి ఎ వో కతిన్ కుప్రా, లక్ష్మీదేవి, స్థానిక ఎమ్మార్వో నరేష్ లతోపాటు డివిజన్ పరిధిలోని రెవెన్యూ విభాగానికి సంబంధించిన అందరూ అధికారులు పాల్గొన్నారు.
రైతు కూలీ మృతితో అంతటా విషాదం
సంఘటన స్థలానికి చేరుకున్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆర్డీవో మహేష్, ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్య కుమార్ యాదవ్ కార్యాలయ ఇన్చార్జ్ హరీష్ బాబు
మృతి చెందిన రైతు కూలీ కుటుంబానికి సంతాపం తెలిపిన అధికారులు, ఎమ్మెల్యే సునీత
విశాలాంధ్ర-ధర్మవరం : పట్టణంలోని కట్ట కింద పల్లి గ్రామంలో ఓ బావి వద్ద విద్యుత్ మోటార్ ను బయటికి తీసుకునే సమయంలో రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం ముక్తాపురం గ్రామానికి చెందిన దాసరి రామాంజనేయులు(43) అనే రైతు అకస్మాత్తుగా బావిలో పడి మృతి చెందాడు. వివరాలకు వెళితే మోటారు మరమ్మత్తు కోసం బావిలో దిగి ఊపిరాడక నీటిలో మునిగి పోయి మృతి చెందాడు. మృతునితోపాటు పలువురు కూలీలు కూడా కూలి పని నిమిత్తం ధర్మారం మండలం కట్టకిందపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలోకి వెళ్లారు. బావిలో పుష్కలంగా నీళ్లు ఉండటం వల్ల బావి అడుగుభాగాన పాడైపోయిన మోటార్ను పైకి లాగే ప్రయత్నం చేశా రు. బావి అడుగుభాగంలో ఉన్న మోటారుకు తాడు కట్టేందుకు నీళ్లలో మునిగాడు. అయితే బావిలో ముళ్ళపదలు ఎక్కువగా ఉండటంతో వాటిని తగులుకొని బయటకు రాలేక ఊపిరాడిక బావిలోనే మృతి చెందాడు. ఈ విషయాన్ని తోటి కూలీలు గ్రామస్తులకు సమాచారం అందించడంతో రూరల్ ఎస్సై శ్రీనివాసులు ఫైర్స్ సిబ్బందికి సమాచారాన్ని అందించారు. వారి సహకారంతో బావిలో ఉన్న నీటిని తోడి ప్రయత్నం చేసి మృతుని కోసం గాలింపు చర్యలు చేపట్టిన రాత్రి వరకు దొరకలేదు. మృతదేహం కోసం పోలీసులు ఫైర్ ఇంజన్ సిబ్బంది కూడా ఎంత ప్రయత్నం చేసినా ఫలితం శూన్యమైంది. ఈ సమాచారాన్ని అందుకున్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో పాటు ఆర్డిఓ మహేష్, మంత్రి సత్య కుమార్ యాదవ్ ఎన్డీఏ కార్యాలయ ఇంచార్జ్ హరీష్ బాబు, బిజెపి నాయకులు సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన విషయాన్ని ఆరా తీశారు. మృతునికి భార్య తోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ సంఘటన గ్రామాన్ని విషాదంలో ముంచేసింది.పరిటాల సునీత మాట్లాడుతూ మృతి చెందిన కుటుంబాన్ని ప్రభుత్వ మా అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలుపుతూ, ఆ కుటుంబానికి సంతాపం తెలిపారు.
వికాస తరంగిణి ఆధ్వర్యంలో చిత్రలేఖనం పోటీలు
విశాలాంధ్ర. విజయనగరం జిల్లా. రాజాం.
వికాస్ తరంగణి ఆధ్వర్యంలో ,రాజాం నియోజకవర్గం పరిధిలో శ్రీరామాయణం చిత్రలేఖన పోటీలు విద్యార్థులకు నిర్వహించినది. విశ్వామిత్రుడు తలపెట్టిన యాగ సంరక్షణ అనంతరము రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఆజ్ఞ గురించి ఎదురుచూస్తూ నమస్కరి స్తున్న దృశ్యాన్ని విద్యార్థులు చిత్రీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మన రాజాం రూరల్ సీఐ ఉపేంద్ర విద్యార్థుల ఉద్దేశించి రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రుని గురువుగా ఎలా గౌరవించారు అన్న విషయాన్ని, అన్నదమ్ముల అనుబంధాన్ని ,భార్యాభర్తల సంబంధాన్ని విద్యార్థులకు వివరించారు. వారాడ వంశీకృష్ణ మాట్లాడుతూ ఈ దశ నుండి రామాయణం చరిత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించడం గొప్ప విశేషమని ఇది వినియోగించుకున్న విద్యార్థులకు పాఠశాల యాజమాన్యానికి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వికాస్ తరంగణి గౌరవాధ్యక్షులు టి.టి.వి రమణ మూర్తి వాకచర్ల వెంకట పైడిరాజు వికాస్ తరంగణి అధ్యక్షులు, సంస్కార వికాస కోఆర్డినేటర్ డొంక త్రినాధులు, డ్రాయింగ్ టీచర్లు పొదిలాపు కృష్ణ, బెవర సాయి శంకర్ , భారతి, గణపతి మొదలగువారు పాల్గొన్నారు.
ప్రధాన కూడలి, రహదారిపై లైట్లు వెలగకపోయినా పట్టించుకోని సిబ్బంది
విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం ప్రధాన రహదారిలో ఉన్న సెంట్రల్ లైటింగ్ తోపాటు బొబ్బిలి జంక్షన్, అంబేద్కర్ జంక్షన్ లో ఉన్న జంక్షన్ మెయిన్ లైట్లులో ఉన్న ఆరు లైట్లలో కూడా రెండు లైట్లు తప్ప మిగిలిన నాలుగు లైట్లు వెలగకపోవడంతో పాటు ప్రధాని రహదారిలో ఉన్న సెంటర్ లైటింగ్ లో ఉన్న రెండువైపు లైట్లు కూడా కొన్నిచోట్ల వెలగటలేదు. వీటిని పర్యవేక్షించవలసిన సిబ్బంది కానీ అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో స్థానికులు పలు విమర్శలు చేస్తున్నారు. ఈ సమస్యపై రాజాం మున్సిపల్ ఎన్విరాన్మెంట్ ఏఈ భాగ్యలక్ష్మిని వివరణ కోరగా ఈ సమస్యను రెండు రోజుల్లో పరిష్కారం చేస్తామని ఆమె తెలిపారు. మరి ఎన్ని రోజుల్లో సమస్య పరిష్కరిస్తారని వేచి చూడవలసిందే.
ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు… విచారణ వాయిదా వేసిన హైకోర్టు
బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది మోహన్ రావు హైకోర్టులో వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదని హైకోర్టుకు తెలిపారు. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్ విచారణకు అర్హమైనది కాదన్నారు. అనర్హత పిటిషన్లపై సభాపతి సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సిందే అన్నారు. ఈ సందర్భంగా పలు కోర్టుల తీర్పులను మోహన్ రావు ప్రస్తావించారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్‌కు వెళ్లారు.
సామాన్యులకు అందుబాటు ధరల్లో సీ ప్లేన్ సేవలు అందిస్తాం : కేంద్ర మంత్రి రామ్మోహన్
మరో 3-4నెలల్లో ఏపీలో సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. సీ ప్లేన్ కార్యక్రమం షో ఆఫ్ ప్రోగ్రామ్ లా కాకుండా అందరికీ అందుబాటులోకి తెస్తామన్నారు. సామాన్యులకు అందుబాటు ధరల్లో సీ ప్లేన్ ప్రయాణం తీసుకురావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను ఓ సవాల్ గా తీసుకున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల వారూ సీ ప్లేన్ ప్రయాణం వినియోగించేలా ధరలు ఉంటాయని తెలిపారు. ఇందుకనుగుణంగా నిర్వాహకలకు తగు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు.
4 రూట్లలో..
ఏపీలో 4 రూట్లలో సీ ప్లేన్ ప్రయాణం ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. వైబులిటీ గ్యాప్ ని ఫిల్ చేసేందుకు ఉదన్, టూరిజం శాఖలతో సమన్వయ పరుచుకుంటున్నామన్నారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా సీ ప్లేన్ ధరలు ఉంటాయని స్పష్టం చేశారు. పర్యాటక రంగం కూడా గణనీయంగా అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సీ ప్లేన్ పట్ల సానుకూలంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. సీ ప్లెయిన్స్ ఆపరేటింగ్‌కి కేవలం రెండు కిలోమీటర్లు వాటర్ ఉంటే సరిపోతుందన్నారు. ఎయిర్ పోర్ట్స్ లేని ప్రాంతంలో సీ ప్లేన్స్ బాగా ఉపయోగపడతాయని కామెంట్స్ చేశారు.
రెండు రోజుల్లో అల్పపీడనం.. 11, 13 తేదీల్లో కుండపోత
బంగాళాఖాతంలో రెండు రోజుల్లో అల్ప పీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఈ అల్ప పీడనం వాయుగుండంగా మారే అవకాశాలుండటంతో రాష్ట్రంలో పలు చోట్ల చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయన్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 11, 13 తేదీల్లో రాజధాని నగరం చెన్నైలో పలు చోట్ల కుండపోత వర్షం కురిసే అవకాశముందని తెలిపారు. ఇక ఈశాన్య బంగళాఖాతంలో ఏర్పడనున్న అల్ప పీడనం రెండరోజుల్లో పడమటి దిశగా శ్రీలంక తీరం వైపు నెమ్మదిగా కదులుతుందని తెలిపారు.