విశాలాంధ్ర-ధర్మవరం : పురపాలక సంఘ కార్యాలయమునకు ఆదాయానికి సచివాలయ ఉద్యోగులు కృషి ఎంతో అవసరమని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయంలో సచివాలయ కార్యదర్శులకు అవినీతి కార్యదర్శలతో మున్సిపాలిటీ అభివృద్ధిపై సమావేశాన్ని నిర్వహించి, వివిధ విషయాలపై వారు చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఆస్తి పన్ను రూ.13.77 కోట్లు, నీటి పన్ను 8.88 కోట్ల రూపాయలు, ఖాళీ స్థలాల పన్ను 90 లక్షల రూపాయలు ఇంకను బకాయి కలదని తెలిపారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో ముందుకు వెళ్లి ఈ బకాయిలను వసూలు చేయాలని వారు ఆదేశించడం జరిగిందని తెలిపారు. పన్నుల వసూలను వేగవంతం చేయాలని, ఒక ప్రణాళిక పద్ధతిలో వెళ్ళినప్పుడు విజయం చేకూరుతుందని తెలిపారు. అన్ని వార్డుల కార్యదర్శులు పన్నులపై ప్రత్యేక దృష్టి సారించి తమ సహాయ సహకారాలను మున్సిపాలిటీ అందించాలని తెలిపారు.
ల్యాబ్ టెక్నీషియన్స్ కు అసోసియేషన్ ఆర్థిక సహాయం
విశాలాంధ్ర -ధర్మవరం:: రెండు రోజుల క్రిందట ధర్మారం పట్టణానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్స్ ప్రదీప్, ఇతీష్ ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడటం జరిగింది. ఈ సమాచారంతో ధర్మవరం మెడికల్ ల్యాబ్స్ టెక్నీషియన్ అసోసియేషన్ వారు వారి ఇంటికి స్వయంగా వెళ్లి 22 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. కుటుంబానికి ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు ప్రకాష్, కరుణాకర్ ,అంజన్ రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.
లాన్ టెన్నిస్ పోటీలకు పిఈటి శివకృష్ణ ఎంపిక
విశాలాంధ్ర-ధర్మవరం : ధర్మవరం పట్టణానికి చెందిన పిఈటి శివకృష్ణ ఆలిండియా సివిల్ సర్వీసెస్ ఎంప్లాయిస్ లాంగ్ టెన్నిస్ పోటీలకు ఎంపిక కావడం జరిగింది. వీరు కొత్తచెరువు మండలం కేసాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిఈటిగా విధులు నిర్వహిస్తున్నారు.విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 6వ తేదీ లా అండ్ టెన్నిస్ పోటీలు జరిగాయి. ఇందులో భాగంగానే శ్రీ సత్యసాయి జిల్లా నుంచి పోటీల్లో పాల్గొన్న శివకృష్ణ మూడు మ్యాచుల్లో నెగ్గి రెండో స్థానంలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపిక కావడం కూడా జరిగింది. ఈ ఎంపిక పట్ల మండల విద్యాశాఖ అధికారులతో పాటు తోటి ఉపాధ్యాయ బృందము పిఈటి బృందము బంధుమిత్రులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
లాన్ టెన్నిస్ పోటీలకు పిఈటి శివకృష్ణ ఎంపిక
విశాలాంధ్ర- ధర్మవరం : ధర్మవరం పట్టణానికి చెందిన పిఈటి శివకృష్ణ ఆలిండియా సివిల్ సర్వీసెస్ ఎంప్లాయిస్ లాంగ్ టెన్నిస్ పోటీలకు ఎంపిక కావడం జరిగింది. వీరు కొత్తచెరువు మండలం కేసాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిఈటిగా విధులు నిర్వహిస్తున్నారు.విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 6వ తేదీ లా అండ్ టెన్నిస్ పోటీలు జరిగాయి. ఇందులో భాగంగానే శ్రీ సత్యసాయి జిల్లా నుంచి పోటీల్లో పాల్గొన్న శివకృష్ణ మూడు మ్యాచుల్లో నెగ్గి రెండో స్థానంలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపిక కావడం కూడా జరిగింది. ఈ ఎంపిక పట్ల మండల విద్యాశాఖ అధికారులతో పాటు తోటి ఉపాధ్యాయ బృందము పిఈటి బృందము బంధుమిత్రులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలి
ఉల్లాస్ పై వాలంటీర్లకు శిక్షణ
విశాలాంధ్ర- ఆస్పరి (కర్నూలు జిల్లా) : వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చి అందరికీ విద్యను అందించడం మనందరి బాధ్యత అని వయోజన విద్యా ప్రాజెక్టు జిల్లా సూపర్వైజర్ నేమిలయ్య, వెలుగు ఏపిఎం జగదీష్ అన్నారు. శుక్రవారం స్థానిక స్త్రీ శక్తి భవనంలో వివోఏలు, పొదుపు సంఘాల మహిళా సభ్యులకు ఃఉల్లాస్ఃపై మండల స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి, వయోజనులకు విద్యపై వాలంటీర్లకు పూర్తి అవగాహన కలిగించారు. ఇందులో వారికి ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత, వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేయాలి, అక్షర వెలుగు వంటివి వాటి గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరక్ష్య రాస్యులైన వయోజనులందరినీ అక్ష్యరాస్యులుగా తీర్చి దిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ పథకంను రూపొందించినట్లు వారు పేర్కొన్నారు. గ్రామాల్లో నిరక్షరాస్యులైన వయోజనులకు చదువు నేర్పించి అక్షరాస్యులుగా దిద్దాల్సిన బాధ్యత వాలంటీర్లపై ఉందన్నారు. మండల పరిధి 33 గ్రామాల నుంచి 3500 మంది వయోజనులను గుర్తించామన్నారు. వారిలో ప్రతి 10 మందికి ఒక వాలంటీర్ చొప్పున 350 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో వెలుగు సీసీలు, వివోఏలు, వాలంటరీలు తదితరులు పాల్గొన్నారు.
ఏ.ఆర్ సాయుధ బలగాల పరేడ్ ను తనిఖీ
విశాలాంధ్ర -అనంతపురం : జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో శుక్రవారం జిల్లా ఎస్పీ పి.జగదీష్ అనంతపురం రూరల్ సబ్ డివిజనన్ల సిబ్బంది, ఏ.ఆర్ సాయుధ బలగాల పరేడ్ ను తనిఖీ చేశారు. ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు. ప్రతీ ఒక్కరూ ఫిజికల్ ఫిట్నెస్ కల్గి ఉండాలన్నారు. చక్కగా యూనిఫాం ధరించి ప్రజలతో మంచి సంబంధాలు కల్గి ఉండాలి అని పేర్కొన్నారు. అందరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేశారు. ఆరోగ్యం మెరుగదల మరియు ఫిజికల్ ఫిట్నెస్ కోసం ప్రతీరోజూ గ్రౌండు, ప్రాక్టీస్ వదలకూడదన్నారు. మీ ఆరోగ్యం బాగుంటునే మీ కుటుంబం కూడా బాగుంటుందని గుర్తుంచుకోవాలన్నారు . ఆరోగ్యంతో పాటు మానసికంగా దృఢంగా ఉంటేనే విధుల్లో సమర్థవంతంగా పని చేయడానికి అవకాశం ఉందన్నారు. సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడి వారి విధుల్లో మరియు ఆరోగ్య, విద్య, తదితర అంశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారం చేసే దిశగా చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. సిబ్బంది నుండీ గ్రీవెన్స్ స్వీకరించారు. ఈకార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా, డీఎస్పీలు వి.శ్రీనివాసరావు, టి.వెంకటేశ్వర్లు, ఎస్ మహబూబ్ బాషా, పలువురు సి.ఐ లు, ఆర్ ఐ , ఎస్సైలు, ఆర్ ఎస్ ఐ లు, దితరులు పాల్గొన్నారు
పేద ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర -అనంతపురం : పేద ప్రజలకు వైద్య సేవలు అందించేలా వైద్యులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి పిలుపునిచ్చారు. శుక్రవారం అనంతపురం నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్దనున్న ఐఎంఈ హాల్ లో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ పెడికాన్ 2024 వర్క్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతపురం ఐఎంఏ ఆఫీస్ బేరర్స్ యొక్క అంకితభావం మరియు పట్టుదల తనకెంతో నచ్చిందన్నారు. ఇటీవల ప్రైవేట్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. గత 12 సంవత్సరాలుగా ఇది కార్యరూపం దాల్చకపోవడం తనను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఈ చట్టం కింద డాక్టర్లను తీసుకోవడం జరిగిందని, వారు నిర్ణయాత్మకమైన అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేయవచ్చన్నారు. మీ అందరితో కలిసి పని చేసే అవకాశం తనకు కలగడం మరియు స్వతహాగా తాను డాక్టర్ ని అని, బెంగళూరు మెడికల్ కాలేజీలో వైద్యపట్టాను పొందానన్నారు. వైద్య వృత్తి నా మొదటి ఇల్లుగా భావిస్తానని, అందులోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానన్నారు. నేను ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వైద్య సేవలు అందించడమే నా తొలి ప్రాధాన్యతగా భావిస్తానన్నారు. సివిల్ సర్వీస్ పరీక్షల్లో నా తొలి ప్రయత్నంలోనే అత్యధిక స్కోరు సాధించడానికి మెడికల్ సైన్స్ ఎంతో దోహదపడిందన్నారు. వైద్యులంతా ఈ వృత్తిని ఒక బాధ్యతగా తీసుకొని సేవలందించాల్సి ఉంటుందన్నారు. ఇలాంటి సెమినార్లు వైద్యులకు ఎంత ఉపయోగపడుతుందన్నారు. ఇలాంటి సాంకేతిక సమావేశాలు రాష్ట్రవ్యాప్తంగా జరగడం ఎంతో శుభసూచకమన్నారు. జిల్లాలోని ఏ మారుమూల ప్రాంతంలోనైనా ప్రజలకు వైద్య సేవలు అందించేలా డాక్టర్లు కృషి చేయాలన్నారు.
ఈ వర్క్ షాప్ లో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.కేఎస్ఎస్.వెంకటేశ్వరరావు, ఐఎంఈ రాష్ట్ర అధ్యక్షులు డా. అనిల్ కుమార్, స్టేట్ సెక్రటరీ డా.ఏఎస్.కిరీటి, జిజిహెచ్ పీడియాట్రిక్ హెచ్వోడి డా.ఎం.రవి కుమార్, ఆర్గనైజింగ్ చైర్పర్సన్ పి.శ్రీకాంత్ రెడ్డి, బెంగళూరు మదర్ హుడ్ హాస్పిటల్ న్యూయోనెటల్ డాక్టర్ ప్రతాప్ చంద్ర, ఆర్గనైజింగ్ సెక్రెటరీ డా.డి.పవన్ కుమార్, డిసిహెచ్ఎస్ డా.పాల్ రవికుమార్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. మాణిక్యరావు, అడిషనల్ డీఎంహెచ్వో సుజాత, డాక్టర్లు, సీనియర్ నర్సులు, తదితరులు పాల్గొన్నారు.
జగన్ పిటిషన్ పై ఎన్సీఎల్టీలో విచారణ వాయిదా
వైసీపీ అధినేత జగన్ తమ కుటుంబ ఆస్తుల వ్యవహారంలో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) లో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. ఈ పిటిషన్ లో ఆయన తన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను ప్రతివాదులుగా పేర్కొనడం సంచలనం సృష్టించింది. తనకు సమాచారం అందించకుండా తల్లి, సోదరి షేర్లు బదిలీ చేసుకున్నారని జగన్ తన పిటిషన్ లో ఆరోపించారు. షేర్ల బదిలీ ఫారాలు సమర్పించకుండానే తమ పేరిట మార్చుకున్నారని వివరించారు. జగన్, వైఎస్ భారతి, క్లాసిక్ రియాలిటీ పేరిట షేర్లు కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్ లో కోరారు. 51.01 శాతం షేర్లు యథావిధిగా కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తాజాగా, ఎన్సీఎల్టీ ఈ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టింది. వాదనల సందర్భంగా… కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని విజయమ్మ, షర్మిల తరఫు న్యాయవాది ఎన్సీఎల్టీని కోరారు. అనంతరం, ఎన్సీఎల్టీ విచారణను డిసెంబరు 13కు వాయిదా వేసింది.
దళిత ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమావేశం …
కూటమి పార్టీ దళిత ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యేలతో చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ అమలుపై కీలక నిర్ణయాన్ని తెలియజేశారు. ఎస్సీ జనాభా దామాషా ప్రకారం జిల్లా యూనిట్ గా వర్గీకరణ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అధ్యయనానికి త్వరలో కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలలో జాప్యం లేకుండా నెల రోజుల్లోనే నివేదిక అందేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. వర్గీకరణ అమలు ద్వారా దళితుల్లోని ఉప కులాలందరికీ సమాన అవకాశాలు కల్పించి వారికి ఊతం ఇచ్చేలా పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పలు సూచనలు చేయగా, వాటిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు తీర్పుతో పాటు ఎన్నికల్లో హామీ కూడా ఇచ్చామని, టీడీపీయే మొదటి నుంచి దళితులకు అండగా ఉందని సీఎం అన్నారు. దళితుల అభివృద్ధికి అన్ని రకాలుగా తోడ్పాటు అందిద్దామని పేర్కొన్నారు. ఇటీవల ఎన్నికల్లో 29 ఎస్సీ శాసనసభ నియోజకవర్గాల సీట్లకు గానూ 27 స్థానాల్లో కూటమి అభ్యర్ధులను ప్రజలు గెలిపించారని, వారి నమ్మకాన్ని నిజం చేస్తామని తెలిపారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా ఉంటారా.. మరింత కాలం ఎమ్మెల్యేగా ఉంటారా? అనే విషయం మీ చేతుల్లో కూడా ఉందంటూ సీఎం చలోక్తి విసిరారు. దళితుల అభివృద్ధి, సంక్షేమం అమలుపై ఎప్పటికప్పుడు చర్చించేందుకు తరచు దళిత ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని ఈ సందర్భంగా సీఎం నిర్ణయించారు.
కెనడా ఎన్నికలపై ఎలాన్ మస్క్ జోస్యం..
అయినదానికీ, కానిదానికీ భారత్ తో కయ్యానికి కాలుదువ్వుతున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరో ఏడాది పాటే పదవిలో ఉంటాడని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ జోస్యం చెప్పారు. వచ్చే ఏడాది కెనడాలో జరగనున్న ఎన్నికల్లో ట్రూడో ఓడిపోతారని చెప్పారు. ఎక్స్ (ట్విట్టర్) లో ఓ అభిమాని చేసిన కామెంట్ కు ఆయన ఈ విధంగా జవాబిచ్చారు. ఇటీవలి అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తరఫున ప్రచారం చేసి మస్క్ ఆయనను గెలిపించిన సంగతి తెలిసిందే. దీనిని గుర్తుచేస్తూ.. ాట్రూడోను వదిలించుకోవడానికి మాకు మీ సాయం కావాలి్ణ అంటూ కెనడా పౌరుడు ఒకరు మస్క్ ను కోరారు. దీనికి స్పందించిన మస్క్.. వచ్చే ఎన్నికల్లో ట్రూడో ఓడిపోతాడని చెప్పారు. ప్రస్తుతం కెనడాలో ట్రూడో ప్రభుత్వం మైనారిటీలో ఉంది. వచ్చే ఏడాది అక్టోబర్ 20 లోగా అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. భారత వ్యతిరేక వైఖరితో పాటు ట్రూడో సర్కారు తీసుకున్న పలు నిర్ణయాలపై ఆ దేశంలో వ్యతిరేకత ఎదురవుతోంది. ట్రూడోపై కెనడా పౌరులు ఆగ్రహంగా ఉన్నారు. అదే సమయంలో ఆయన రాజకీయ ప్రత్యర్థులు బలం పుంజుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ట్రూడో ప్రాథమికంగా మూడు పార్టీలతో బలమైన పోటీ ఎదుర్కొంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరో రెండు చిన్న పార్టీలు కూడా కెనడా ఎన్నికల బరిలో గట్టి పోటీనిస్తాయని చెప్పారు.