Wednesday, May 14, 2025
Home Blog Page 13

ఉగ్రవాదుల చొరబాటుయత్నం.. ఏడుగురి కాల్చివేత..

భారత్, పాక్ ఉద్రిక్తతల వేళ సరిహద్దుల్లో భారీ చొరబాటుయత్నాన్ని బీఎస్ఎఫ్ బలగాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. సైనిక వర్గాల సమాచారం ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున సాంబ సెక్టార్ లో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. సర్వేలెన్స్ కెమెరాల ద్వారా ఈ విషయం గుర్తించిన బీఎస్ఎఫ్ బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదులపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం. బీఎస్ఎఫ్ బలగాల కాల్పుల్లో పాక్ సైనిక పోస్ట్ ధ్వంసమైందని తెలుస్తోంది. అయితే, మృతుల సంఖ్యపై బీఎస్ఎఫ్ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన చేయలేదు. కాగా, ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి సర్వేలెన్స్ కెమెరా ఫుటేజీని భద్రతా బలగాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

మ‌ళ్లీ చండీగఢ్ , జ‌మ్మూలో సైర‌న్ల మోత

భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో.. సరిహద్దు జిల్లాలపై పాక్‌ వైపు నుంచి దాడుల ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే పంజాబ్‌లోని చండీగఢ్‌లో నేటి తెల్ల‌వారు జామున మరోసారి సైరన్ల మోత వినిపించడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. దాడులు జరిగే అవకాశం ఉందంటూ.. ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ ఈ హెచ్చరిక జారీ చేసింది.. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరించింది. బాల్కనీల్లోకి కూడా రావొద్దని స్పష్టం చేసిన తరుణంలో చండీగఢ్‌ డిప్యూటీ కమిషనర్‌ కూడా ఓ హెచ్చరిక జారీ చేశారు.. జమ్ములోనూ ఈ ఉదయం సైరన్లు మోగాయి. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, సుర‌క్షిత ప్రాంతాల‌లో త‌ల‌దాచుకోవాల‌ని కోరింది..

సరిహద్దు దేశాలలో శాంతి నెలకొనాలి

భారత్ పాక్ యుద్ధంపై చైనా రియాక్షన్

భారత్- పాక్ మధ్య యుద్ధంపై చైనా తాజాగా స్పందించింది. ఈ పరిణామంతో ఆందోళన చెందుతున్నట్లు పేర్కొంది. సరిహద్దు దేశాలలో శాంతి నెలకొనాలని ఆకాంక్షించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు అంతర్జాతీయ సమాజంతో పనిచేస్తామని పేర్కొంది. ఈమేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఆర్థిక కష్టాల్లో పాకిస్థాన్.. అంతర్జాతీయ సాయం కోసం విజ్ఞప్తి

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. శత్రువు దాడుల వల్ల భారీ నష్టాలు వాటిల్లాయని, స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయని పేర్కొంటూ, మరిన్ని రుణాలు అందించాలని పాకిస్థాన్ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ భాగస్వాములను అభ్యర్థించింది. ఉద్రిక్తతలు తగ్గించడానికి సహాయం చేయాలని కూడా కోరింది. పాకిస్థాన్ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక వ్యవహారాల విభాగం, ఎక్స్ వేదికగా ఈ విజ్ఞప్తిని చేసింది. శత్రువు వల్ల కలిగిన భారీ నష్టాల నేపథ్యంలో మరిన్ని రుణాల కోసం అంతర్జాతీయ భాగస్వాములకు పాకిస్థాన్ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. పెరుగుతున్న యుద్ధ వాతావరణం, స్టాక్ మార్కెట్ పతనం మధ్య, ఉద్రిక్తతలు తగ్గించడానికి అంతర్జాతీయ భాగస్వాములు సహాయం చేయాలని మేము కోరుతున్నాంఁ అని ఆ పోస్ట్‌లో పేర్కొంది.

హై అల‌ర్ట్‌లోనే ఢిల్లీ.. ప్ర‌భుత్వ ఉద్యోగుల సెల‌వులు ర‌ద్దు

ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత దాయాది పాకిస్థాన్ వ‌క్ర‌బుద్ధితో భార‌త్‌పై డ్రోన్‌, క్షిప‌ణి దాడుల‌కు పాల్ప‌డుతున్న విష‌యం తెలిసిందే. దీంతో ఇరుదేశాల మ‌ధ్య ఉద్రిత‌క్త‌ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఢిల్లీలో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల సెల‌వులు ర‌ద్దు అయ్యాయి. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని ఎదుర్కొనేలా వైద్య‌, విప‌త్తు నిర్వ‌హ‌ణ విభాగాల సంసిద్ధ‌త‌ను స‌మీక్షిస్తున్నారు. ఁపోలీసులు అప్ర‌మ‌త్తంగా ఉన్నారు. సున్నిత‌మైన ప్రాంతాల‌లో అద‌న‌పు బ‌ల‌గాల‌ను మోహ‌రిస్తున్నాం. రాత్రిపూట నిఘా ముమ్మ‌రం చేశాంఁ అని అధికారులు తెలిపారు. ఇక‌, ఈ ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఇప్ప‌టికే దేశంలో 24 విమాన‌శ్ర‌యాలు తాత్కాలికంగా మూసివేశారు. అలాగే దేశ రాజ‌ధానికి రాక‌పోక‌లు కొన‌సాగించే ప‌లు విమానాలను క్యాన్సిల్ చేశారు. ఇండియా గేట్ వ‌ద్ద ట్రాఫిక్‌ను నియంత్రించ‌డంతో పాటు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాల‌ని స్థానికుల‌ను అధికారులు ఆదేశించారు.

అమరావతికి చట్టబద్ధత

0

. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్ట సవరణకు తీర్మానం
. ఆపరేషన్‌ సిందూర్‌కు సంఫీుభావం
. రాజధాని పనులపై సీఆర్‌డీఏ నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతి రాజధాని పనులను అర్ధాంతరంగా నిలిపివేసి విధ్వంసానికి పాల్పడడంతో... భవిష్యత్‌లో మరోసారి ఇలా జరగకుండా రాజధానికి చట్టబద్ధత తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనిలో భాగంగా రాష్ట్ర పునర్విభజన చట్టానికి సవరణ తీసుకురావడమే పరిష్కారంగా భావించింది. ఆ మేరకు సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అమరావతి పేరును పునర్విభజన చట్టంలో చేర్చేలా చట్ట సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసింది. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపింది. ఆపరేషన్‌ సిందూర్‌ నిర్వహించిన త్రివిధ దళాలకు అభినందనలు తెలిపింది. దేశ ప్రజల భావోద్వేగాలను ప్రతిబింబించేలా ఆపరేషన్‌ సిందూర్‌ పేరు ఉందని మంత్రివర్గం అభిప్రాయపడిరది. తీరప్రాంత భద్రత, రక్షణరంగ పరిశ్రమల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణానికి సంబంధించి సుదీర్ఘంగా చర్చించారు. విశాఖ, మచిలీపట్నం, నాగాయలంక వంటి ప్రదేశాల్లో భద్రత, కార్యాచరణపై, తీర ప్రాంతాల్లో భద్రతకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలని మంత్రులకు సీఎం సూచించారు. ఇక వివిధ అంశాలపై మంత్రివర్గం తీసుకున్న మరికొన్ని నిర్ణయాలను సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. అ అమృత్‌- 2.0 కింద రాష్ట్ర జల కార్యాచరణ ప్రణాళిక మొదటి, రెండవ విడతలో గతంలో చేసిన సవరణలకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని పురపాలక సంస్థల్లో 281 పనులను ఎస్‌ఎన్‌ఏస్పార్స్‌ ప్లాట్‌ఫాం ద్వారా కన్సెషనరీ హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ కింద చేపట్టడానికి చేసిన ప్రతిపాదనకు ఆమోదం. ఈ విధానం వల్ల రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల్లో మౌలిక వసతులు పెద్ద ఎత్తున కల్పించనున్నారు.
అ ఒక ఏజెన్సీ/వ్యక్తిని కాంట్రాక్టర్‌గా నమోదు చేసేందుకు బ్లాక్‌ పీరియడ్‌ ఐదు సంవత్సరాల నుండి పదేళ్లకు పెంపు.
అ చిన్న, మధ్య తరహా నీటిపారుదల వనరులకు సంబంధించి రూ.345.39 కోట్లతో 7174 ఆపరేషన్‌, నిర్వహణ పనులకు ఆమోదం.
అ వాణిజ్యేతర ప్రయోజనాల కోసం రైతులు తమ సొంత ఖర్చులతో చిన్న నీటిపారుదల చెరువుల నుండి మట్టి తవ్వకం, రవాణాకు అనుమతి.
అ రాష్ట్రపతి ఆమోదం కోసం వేచి ఉన్న ‘పారిశ్రామిక వివాదాల (ఆంధ్రప్రదేశ్‌ సవరణ) బిల్లు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వద్ద పెండిరగ్‌లో ఉన్న ‘కార్మిక చట్టాలు (ఆంధ్రప్రదేశ్‌ నేరాల సమ్మేళనం కోసం సవరణ) బిల్లు, ‘ఫ్యాక్టరీల (ఆంధ్రప్రదేశ్‌ సవరణ) బిల్లు, 2019’ ఉపసంహరణ ప్రతిపాదనకు ఆమోదం.
అ ఏప్రిల్‌ 15 నుండి జూన్‌ 14 వరకు నిషేధ కాలంలో సముద్ర చేపల వేట నిషేధ ఉపశమనంగా ప్రతి కుటుంబానికి అందజేస్తున్న రూ.10,000లను రూ.20,000లకు పెంచే పథకం పేరును ‘మెరైన్‌ ఫిషింగ్‌ బ్యాన్‌ రిలీఫ్‌’గా నామకరణం.
అ వైఎస్సార్‌ జిల్లా కొండాపూర్‌ మండలం కె.బొమ్మేపల్లిలో మొత్తం 191.64 ఎకరాల భూమిని అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ ద్వారా 1000 మెగావాట్ల పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ స్థాపించడానికి కౌలు ప్రాతిపదికన కేటాయించడానికి ఆమోదం. ఎకరానికి సంవత్సరానికి రూ.31 వేల కౌలు రేటుతో, ప్రతి రెండేళ్లకు 5 శాతం పెరుగుదలతో మొత్తం 46 సంవత్సరాలకు అనుమతి.
అ డా. బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కాట్రేనికోన (మం) చిర్రయనంలో సర్వే నెం.1లో గల ఐదెకరాల ప్రభుత్వ భూమిలో పీతల హ్యాచరీ స్థాపించడానికి మార్కెట్‌ విలువ చెల్లింపుపై ఏడాదికి ఎకరానికి రూ.2.50 లక్షల లీజు ప్రాతిపదికన 15 ఏళ్ల కాలపరిమితితో కేటాయింపు.
అ విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం అన్నవరం గ్రామంలోని సర్వే నెం.101/1లో గల 18.70 ఎకరాల ప్రభుత్వ భూములను బీచ్‌ రిసార్ట్‌, కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్‌ టూరిజం అథారిటీకి బదిలీ.
అ చిత్తూరు జిల్లా కుప్పం (మం) పాలర్లపల్లెలోని సర్వే నెం.221లో గల 18.70 ఎకరాల ప్రభుత్వ భూమి పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు కేటాయింపు.
అ టీటీడీలో అర్బన్‌ డిజైన్‌ అండ్‌ ప్లానింగ్‌ సెల్‌ ఏర్పాటు చేయడానికి నూతనంగా 8 పోస్టుల కల్పనకు మంత్రిమండలి ఆమోదం.
అ పర్యాటక విధానం 2024-29కి అనుబంధంగా తీసుకువచ్చిన ఉపాధి కల్పన ప్రోత్సాహక విధానానికి గ్రీన్‌సిగ్నల్‌. ఈ విధానం ద్వారా రాబోయే ఐదేళ్లలో పర్యాటక రంగంలో ఉద్యోగాలు కల్పించే సంస్థలకు రూ.24.70 కోట్లు ప్రోత్సాహకాలుగా అందజేస్తారు.
అ 2025-26 ఆర్థిక సంవత్సరానికి కార్యక్రమాలు, ఈవెంట్‌ల నిర్వహణ కోసం పర్యాటక అథారిటీకి రూ.78 కోట్ల బడ్జెట్‌ కేటాయింపు.
అ ఏపీపీడీసీఎల్‌ సంస్థల ఆస్తులను నిరర్థక ఆస్తిగా ప్రకటించకుండా ఉండేందుకు, ఏపీ జెన్‌కో సంస్థ రూ.650 కోట్ల మధ్యకాలిక రుణం ఏపీపీడీసీఎల్‌కు అందించేందుకు గతంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం
అ గత సీఆర్‌డీఏ సమావేశంలో రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూ… సీఆర్డీఏ ప్రాంతంలో వివిధ సంస్థలకు కేటాయించిన భూముల పునః సమీక్ష విషయంలో మంత్రుల బృందం 17వ సమావేశంలో చేసిన సిఫార్సులను, అమరావతి భూ కేటాయింపు నిబంధనలపై కమిషనర్‌కు అనుమతినివ్వాలన్న ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ సమీక్ష ద్వారా భూ కేటాయింపుల్లో సమగ్రత, పారదర్శకత, సమర్థవంతమైన వినియోగాన్ని నిర్ధారించడం ప్రధాన లక్ష్యం.
అ నెల్లూరుజిల్లా గుడ్లూరు మండలం రావూరుగ్రామంలో ఏపీ మారిటైమ్‌ బోర్డు ద్వారా పారిశ్రామిక హబ్‌ నిర్మాణం కోసం జరుపుతున్న భూ సేకరణకు పరిహారాన్ని ఎకరాకు రూ.4 లక్షలకు పెంపు.
అ ఏపీ మారిటైమ్‌ బోర్డు పారిశ్రామిక ప్రయోజనాల కోసం ఓడరేవుకు సమీపంలో ఉన్న భూములను, ఏపీ ఎంబీ సేకరించిన, సేకరణ ప్రక్రియలో ఉన్న భూములను, భవిష్యత్తులో సేకరించబోయే భూములను, ప్రభుత్వ ఉప్పు భూములను పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు బదిలీ చేయడానికి ఆమోదం.
అ నెల్లూరు జిల్లా నెల్లూరు బిట్‌-2 గ్రామంలోని సర్వే నెం.2062-3లో గల 36 ఎకరాల భూమి వర్గీకరణను ‘పెన్నానది పొరంబోకు’ నుండి అసెస్డ్‌ వేస్ట్‌ డ్రైగా మార్చడానికి, కొత్త సర్వే నెం.2224 సృష్టించి భగత్‌ సింగ్‌ కాలనీ నివాసితులకు పట్టాలు మంజూరు చేసే సులభతర ప్రక్రియకు నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు అనుమతిస్తూ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారధి వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా పాల్గొన్నారు.

గంగోత్రి యాత్రలో విషాదం

0

హెలికాప్టర్‌ కూలి పైలట్‌ సహా ఆరుగురి దుర్మరణం
ఏపీ నుంచి వెళ్లిన ఇద్దరు: ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌, గంగోత్రికి బయల్దేరిన భక్తుల హెలికాప్టర్‌ కూలిపోయింది. పైలట్‌ సహా ఆరుగురు చనిపోయారు. తీవ్ర గాయాలతో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ దుర్ఘటన ఉత్తరకాశి జిల్లాలో గురువారం జరిగింది. ఎయిరో ట్రాన్స్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (వీటీఓఎక్స్‌ఎఫ్‌) సంస్థ నడిపే హెలికాప్టర్‌... డెహ్రాడూన్‌లోని సహస్త్రధార హెలిప్యాడ్‌ నుంచి ఖర్సాలీ హెలిపాడ్‌కు బయల్దేరింది. గంగోత్రికి వెళ్లే మార్గంలో ప్రమాదానికి గురైంది. రిషికేశ్‌గంగోత్రి జాతీయ రహదారి వద్ద ఉదయం 8.45 గంటలప్పుడు కూలిన హెలికాప్టర్‌ 200`250 మీటర్ల లోతైన లోయలోకి పడిపోయింది. ఈ మేరకు సహాయక చర్యలు చేపట్టిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ తెలిపింది. ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించినట్లు జిల్లా మెజిస్ట్రేట్‌ మెహర్బాన్‌ సింగ్‌ బిస్త్‌ తెలిపారు. భక్తుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎం.భాస్కర్‌ (51) తీవ్రంగా గాయపడగా, ఆయనను ఎయిర్‌ లిఫ్ట్‌ చేసి రిషికేశ్‌ ఎయిమ్స్‌లో చేర్చారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లిన మరొకరు మృతిచెందారు. మృతులను ముంబైకు చెందిన కళా చంద్రకాంత్‌ సోని (61), విజయ రెడ్డి (57), రుచి అగర్వాల్‌ (56), యూపీకి చెందిన రాధా అగర్వాల్‌ (79) ఏపీకి చెందిన వేదవతి కుమారి (48), గుజరాత్‌కు చెందిన కెప్టెన్‌ రాబిన్‌ సింగ్‌ (60)గా గుర్తించారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దర్యాప్తునకు ఆదేశించారు. గాయపడిన వారికి అవసరమైన సహాయం అందించాలన్నారు. అధికారుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్నారు. ఈ ప్రమాదంపై విమాన దుర్ఘటనల దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) విచారణ చేపడుతుందని అధికారులు వెల్లడిరచారు.

భీకర దాడులు

0

పాక్‌ దుస్సాహసం

. డ్రోన్లు, క్షిపణులు, యుద్ధవిమానాలతో దాడి
. తిప్పికొట్టిన భారత బలగాలు
. మూడు యుద్ధ విమానాలు, 12 డ్రోన్లు కూల్చివేత
. గడప దాటొద్దని ప్రజలకు హెచ్చరికలు
. జమ్మూ, కుప్వారా, పూంచ్‌లో సైరన్ల మోత
. 8 పాకిస్థానీ క్షిపణులను ఎస్‌`400 వ్యవస్థతో ధ్వంసం

న్యూదిల్లీ: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ నేపథ్యంలో జమ్మూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారత్‌ మెరుపు దాడులతో బిక్కచచ్చిన పాకిస్థాన్‌… తన ఉనికి చాటుకొనేందుకు ప్రయత్నిస్తోంది. జమ్మూ లక్ష్యంగా దాడులకు తెగబడిరది. జమ్మూ విమానాశ్రయం సమీపంలో పాకిస్థాన్‌ ఆత్మాహుతి డ్రోన్‌ దాడులకు పాల్పడిరది. సర్వసన్నద్ధంగా ఉన్న భారత సైన్యం పాక్‌ దాడుల్ని తిప్పికొట్టింది. జమ్మూ, పంజాబ్‌ మొత్తం బ్లాకౌట్‌ కాగా రాజస్థాన్‌లోని కొన్ని చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అఖ్నూర్‌, కిష్ట్వార్‌, సాంబా సెక్టార్‌లో అధికారులు పూర్తిగా విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. ఆపరేషన్‌ సిందూర్‌కు ప్రతీకారంగా పాక్‌ దుస్సాహసానికి పాల్పడిరది. డ్రోన్లు, రాకెట్లు, యుద్ధవిమానాలతో దాడులకు దిగింది. పాక్‌ ప్రయోగించిన దాదాపు 12 డ్రోన్లు, ఎనిమిది క్షిపణులను ఎస్‌400 వ్యవస్థ ద్వారా భారత సాయుధ దళాలు ధ్వంసం చేశాయి. పాక్‌ ఉపయోగించిన రెండు జేఎఫ్‌17, ఒక ఎఫ్‌`16 యుద్ధ విమానాలను, ప్రొఖ్రాన్‌ వద్ద క్షిపణిని పేల్చివేశాయి. అయితే ఆకస్మికంగా జరిగిన దాడితో జమ్మూకశ్మీర్‌ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రోడ్లపై ఉన్న వారంతా ఆందోళనతో పరుగులు తీశారు. జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌, రాజస్థాన్‌లో హై అలర్డ్‌ ప్రకటించారు. ఆయా ప్రాంతాల గగనతలంలో పాక్‌ డ్రోన్లు, క్షిపణులతో దాడి చేయడగా భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. కాగా, పాక్‌ దాడులతో పఠాన్‌కోట్‌ ఎయిర్‌ బేస్‌ సహా ఏడుచోట్ల భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. దాడుల వేళ జమ్మూకశ్మీర్‌ పూర్తిగా అంధకారమైంది. జమ్మూ, కుప్వారా, పూంచ్‌లో సైరన్లు మోగాయి. జమ్మూ విమానాశ్రయంపై రాకెట్‌ దాడిని భారత సైన్యం తిప్పికొట్టింది. శ్రీనగర్‌ విమానాశ్రయంలో హై అలర్ట్‌ ప్రకటించారు. సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ వైమానిక దళం ప్రధాన కార్యాలయాన్ని పాకిస్థాన్‌ లక్ష్యంగా చేసుకుంది. జైసల్మేర్‌ వద్ద డ్రోన్లను భారత సైన్యం గాల్లో పేల్చివేసింది. జమ్మూ వర్సిటీ వద్ద రెండు డ్రోన్లను కూల్చివేసింది. జమ్మూ, కుప్వారా, పఠాన్‌కోట్‌ సహా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో పూర్తిస్థాయిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాలైన జమ్మూ డివిజన్‌లోని సాంబాతో పాటు అఖ్నూర్‌, రైసీ, రాజౌరీ, కిష్ట్వార్‌లో భారీగా కాల్పులు, ఫిరంగి దాడులు జరిగాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం ఆదేశించింది. సెల్‌ఫోన్‌ సేవలు నిలిపివేసింది. యూఏవీ (మానవరహిత ఏరియల్‌ వెహికల్స్‌)లతో పాక్‌ దాడి చేస్తుండగా… భద్రతా దళాలు ప్రతిఘటిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడిరచాయి. అత్యాధునిక సాంకేతికతతో డ్రోన్లను గాల్లో ధ్వంసం చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు అందలేదు. ‘జమ్మూ పూర్తిగా అంధకారమైంది. అంతటా భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. బాంబులు, ఫిరంగులు, క్షిపణులతో పాకిస్థాన్‌ దాడులు చేస్తోంది. భారత సైన్యం వీటిని సమర్థంగా తిప్పికొట్టగలదు’ అని జమ్మూకశ్మీర్‌ డీజీపీ శేష్‌పాల్‌ వైద్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ‘జమ్మూలోని మా ఇళ్ల మీదకు క్షిపణులు దూసుకొస్తున్నాయి. పౌరుల జీవితాలకు ముప్పు ఏర్పడిరది. మాకు రక్షణ లేదు. ఇదంతా నిజంగా జరుగుతోంది. జమ్మూ మొత్తం బ్లాకౌట్‌ అయింది’ అంటూ ఓ స్థానికుడు ఎక్స్‌ మాధ్యమంగా ఫొటోలు, వీడియోలు పంచుకుంటూ భయాందోళనకు గురయ్యాడు.

1,620 పోస్టులు…10 నోటిఫికేషన్లు

0

జిల్లాకోర్టుల ఉద్యోగాల భర్తీకి చర్యలు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా కోర్టుల్లో ఖాళీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం వేర్వేరుగా పది నోటిఫికేషన్‌లు గురువారం విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ల ద్వారా మొత్తం 1620 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 13వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ నెల 13 నుండి జూన్‌ 2 వరకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులను జిల్లాలవారీగా భర్తీ చేయనున్నారు. ఏపీ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా అప్లికేషన్లు దాఖలు చేయవచ్చు. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.800, ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.400 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సబార్డినేట్‌ పోస్టులకు 7వ తరగతి విద్యార్హత కాగా… జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు డిగ్రీ విద్యార్హతగా పేర్కొన్నారు. కాపీయిస్ట్‌, టైపిస్ట్‌, స్టెనోగ్రాఫర్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఇంటర్‌, డిగ్రీ విద్యార్హతతో పాటు సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత ఉండాలి. టైపింగ్‌ తప్పనిసరి. కంప్యూటర్‌ అనుభవం ఉండాలి. వయసు 42 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్‌ కేటగిరీ అభ్యర్థులకు వయసు మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. జనరల్‌ ఇంగ్లీషు, జనరల్‌ నాలెడ్జిపై పరీక్ష ఉంటుంది. మొత్తం ఖాళీలు: 1620, వీటిలో జూనియర్‌ అసిస్టెంట్‌- 230, ఆఫీస్‌ సబార్డినేట్‌- 651, ప్రాసెస్‌ సర్వర్‌- 164, రికార్డ్‌ అసిస్టెంట్‌- 24, కాపీయిస్ట్‌- 193, ఎగ్జామినర్‌- 32, ఫీల్డ్‌ అసిస్టెంట్‌- 56, టైపిస్ట్‌- 162, స్టెనోగ్రాఫర్‌- 80, డ్రైవర్‌- 28 పోస్టులు ఉన్నాయి.

మద్యం కేసులోకి ఈడీ ఎంట్రీ

0

వివరాలు ఇవ్వాలని సిట్‌ చీఫ్‌కు లేఖ
ధనుంజయ, కృష్ణమోహన్‌, గోవిందప్పకు సుప్రీంలో ఎదురుదెబ్బ
కీలక వ్యక్తుల అరెస్టులపై సిట్‌ బృందం ఆరా

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగంలోకి దిగింది. రూ.వేలకోట్లు అక్రమ మార్గంలో తరలించారన్న ఆరోపణలు రావడంతో మనీలాండరింగ్‌ నిరోధకం చట్టం2002 కింద కేసు నమోదు చేస్తామని లేఖలో స్పష్టం చేసింది. పీఎమ్‌ఎల్‌ఏ సెక్షన్‌ కింద కేసు నమోదుకు తమకు డాక్యుమెంట్లు కావాలని సిట్‌ అధిపతి, విజయవాడ సీపీకి ఈడీ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌, ఇప్పటి వరకు సీజ్‌ చేసిన బ్యాంక్‌ ఖాతాల వివరాలు పంపాలని, మద్యం కుంభకోణంపై సీఐడీ అధికారులు నమోదు చేసిన 21/2024 ఎఫ్‌ఐఆర్‌కి సంబంధించిన సర్టిఫైడ్‌ కాపీ కావాలని కోరింది. ఇప్పటికే ఈ కేసులో అనేక మంది అరెస్టయ్యారు. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులకు మెమోలు జారీజేయాలని సిట్‌ భావించింది. ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని, ఆయన పీఏ పైలా దిలీప్‌ను అరెస్ట్‌ చేసింది. వీరిని కస్టడీలోకి తీసుకుని మద్యం కుంభకోణానికి సంబంధించి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలిసింది. ఈ కేసులో మరికొన్ని అరెస్ట్‌లు జరిగాయి. పలువురికి నోటీసులు ఇచ్చిన సిట్‌ అధికారులు వారిని విచారించారు. మద్యం కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయరెడ్డి, ఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతీ సిమెంట్స్‌ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్ప తమకు మధ్యంతర రక్షణ కల్పించాలని హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించినప్పటికీ చుక్కెదురైంది. రాష్ట్ర హైకోర్టులో ఈ కేసు పెండిరగ్‌లో ఉన్నందున అక్కడ తేల్చుకుని రావాలని సుప్రీం సూచించింది. ఈ ముగ్గురు నిందితులకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. వారు సుప్రీంలో పిటిషన్‌ వేసి… మధ్యంతర రక్షణ కల్పించాలని కోరగా… గతంలో వేసిన పిటిషన్‌ను సవరణ చేయాలని లేదా కొత్త పిటిషన్‌ను వేయాలని సుప్రీం తెలియజేస్తూ విచారణను ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది. వీరికి ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించడంతో ఈ ముగ్గురి కోసం సిట్‌ బృందం ఆరా తీస్తోంది. విజయవాడ, హైదరాబాద్‌లలో తీవ్రంగా గాలిస్తున్నాయి. వారు తమ సెల్‌ఫోన్లను స్విఛాఫ్‌ చేసినట్లు సిట్‌ గుర్తించింది. వారి అరెస్టు అనివార్యమనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఏ సమయంలోనైనా అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ఈ కేసు మరింత తీవ్ర రూపం దాల్చనుంది.