Wednesday, February 5, 2025
Home Blog Page 133

కొత్తగూడెం అభివృద్ధే లక్ష్యం

0

. త్వరలోనే రాబోతున్న విమానాశ్రయం: కూనంనేని
. అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు

విశాలాంధ్ర బ్యూరో-కొత్తగూడెం: కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు కాబోతోందని, తమ కల త్వరలోనే సాకారమవుతుందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం మంజూరు చేసే నిధుల విషయంలో రాజీ ప్రసక్తే లేదని, కావల్సిన నిధులను రాబడుతున్నట్లు తెలిపారు. స్థానిక సమస్యల శాశ్వత పరిష్కారానికి కట్టుబడి ఉన్నానని కూనంనేని చెప్పారు. ఆయన మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని డీఏంఎఫ్‌ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రెండవ వార్డులో రూ.70 లక్షలతో నిర్మించనున్న సాధికారత కేంద్రానికి, 24వ వార్డులో రూ.50లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రైన్‌ నిర్మాణానికి, 25వ వార్డులో రూ.30 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం కూనంనేని మాట్లాడుతూ తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. విమానాశ్రయం ఏర్పాటుతో మహా నగరాలకు దీటుగా కొత్తగూడెం నిలుస్తుందని అన్నారు. నియోజకవర్గం సమగ్రాభివృద్ధి జరుగుతుందన్నారు. కొత్తగూడెం అభివృద్ధి విషయంలో మంత్రులతో పాటు ప్రభుత్వ సహకారం తనకు ఉందని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతం, రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్‌, తాగునీరు వంటి కనీస మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. కొత్తగూడెం మున్సిపల్‌ వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌ పాషా, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతామహాలక్ష్మీ, కమిషనర్‌ శేషాంజన్‌ స్వామి, ఇన్‌చార్జి తహసీల్దార్‌, డీఈ రవికుమార్‌, కౌన్సిలర్లు వేల్పుల దామోదర్‌, సత్యభామ, సాహెరా బేగం, బోయిన విజయ్‌ కుమార్‌, పి సత్యనారాయణాచారి, నాయకులు యూసుఫ్‌, మాచర్ల శ్రీనివాస్‌, అబ్దుల్‌ అజీజ్‌, అబ్దుల్‌ రహమాన్‌, రోహినినాథ్‌, బండారి రాములు, నేరెళ్ల రమేశ్‌, ఆనంద్‌ పాల్గొన్నారు.

జీవో 16 చెల్లదు

0

హైకోర్టు సంచలన తీర్పు

విశాలాంధ్ర-హైదరాబాద్‌: ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి బీఆర్‌ఎస్‌ హయాంలో తెచ్చిన జీవో 16 చెల్లదని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ జీవో 16ను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ జీవో ప్రకారం విద్యా, వైద్య శాఖల్లో పనిచేసే ఉద్యోగుల క్రమబద్ధీకరణ జరిగింది. హైకోర్టు తాజా తీర్పుతో ఉద్యోగుల్లో అందోళన మొదలైంది. క్రమబద్ధీకరించిన వారిని తిరిగి ఒప్పంద ఉద్యోగులుగా కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొన్నట్లు పిటిషనర్లు తెలిపారు. అయితే తీర్పు ప్రతి అందితే దీనిపై స్పష్టత వస్తుందని అధికారులు అన్నారు. ఇదిలావుంటే జీవో 16 నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని, ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించడం ద్వారా తమకు అన్యాయం జరిగిందని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన ఉన్నత న్యాయస్థానం జీవో 16 రాజ్యాంగ విరుద్ధమంటూ తీర్పు వెలువరించింది.

ఆకలి, పేదరికంపై పోరుకుఅంతర్జాతీయ కూటమి

‘జీ20’ ప్రారంభ సభలో బ్రెజిల్‌ ప్రకటన
రియో డి జనేరియో : ఆకలి, పేదరికంపై పోరాటానికి అంతర్జాతీయ కూటమి ఏర్పాటైంది. జీ20 సదస్సు ప్రారంభోత్సవంలో ఈ కూటమిని బ్రెజిల్‌ అధó్యక్షుడు లులా డా సిల్వా ప్రకటించారు. బ్రెజిల్‌ నిర్దేశించిన లక్ష్యసాధనకు 26 అంతర్జాతీయ సంస్థలు, 81 దేశాలు, తొమ్మిది ఆర్థిక సంస్థలు, 31 స్వచ్చంధ సంస్థల మద్దతు ప్రకటించాయి. ‘73.3 కోట్ల మందికి పౌష్టికాహారం లభించని పరిస్థితుల్లో నేడు మనం బతుకున్నామని, ఈ సంఖ్య బ్రెజిల్‌, మెక్సికో, జర్మనీ, బ్రిటన్‌, దక్షిణ అమెరికా, కెనడా దేశాల జనాభాకు సమానమని లులా అన్నారు. 73 కోట్ల మందికిపైగా ఆకలితో అలమటిస్తున్నారంటే పరిస్థితి ఎంత జఠిలంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఏటా ఆరు బిలియన్ల టన్నుల ఆహారోత్పత్తి ఉన్నాగానీ ఇంతటి పరిస్థితులు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఆకలిపై, పేదరికంపై పోరాటానికిగాను జీ20కి బ్రెజిల్‌ అధ్యక్షత వహిస్తున్న సందర్భంగా అంతర్జాతీయ కూటమి (గ్లోబల్‌ అలయెన్స్‌) ఏర్పాటు అయిందని లులా డా సిల్వా తెలిపారు.
ఈ కూటమి వల్ల న్యాయం జరగడమే కాకుండా తమకు గొప్ప వారసత్వం… ప్రపంచ శాంతి, సుసంపన్న సమాజాల నిర్మాణానికి చేయూత లభిస్తుందని ఆకాంక్షించారు. తమ ఉద్దేశానికి మద్దతిచ్చిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బ్రెజిల్‌ రాజధాని రియో డి జనేరియోలో ఈనెల 18,19 తేదీల్లో జీ20 సమావేశాలు జరిగాయి. కాగా, 2023, డిసెంబరు ఒకటో తేదీ నుంచి జీ 20 అధ్యక్ష పగ్గాలను బ్రెజిల్‌ చేపట్టిన విషయం విదితమే.

ఏథెన్స్‌లో పాలిటెక్నిక్‌ విప్లవ వేడుకలు

గ్రీస్‌వ్యాప్తంగా కార్యక్రమాలు: వేలాది మంది హాజరు

ఏథెన్స్‌: అమెరికా మద్దతిచ్చిన జుంటాపై 1973లో జరిగిన పాలిటెక్నిక్‌ విప్లవం 51వ వార్షికోత్సవాన్ని గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడున్న అమెరికా దౌత్యకార్యాలయం వరకు కదం తొక్కారు. గ్రీస్‌ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఏథెన్స్‌లో గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ (కేకేఈ) అధ్వర్యంలో నిర్వహించిన వేడుకలో వేలాది మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలస్తీనా ప్రజలకు సంఫీుభావం ప్రకటించారు. గాజాలో మారణహోమాన్ని ఆపాలని… ఆ ప్రణాళికల్లో గ్రీస్‌ జోక్యం చేసుకోరాదని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కేకేఈ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దిమిత్రిస్‌ కౌట్సోంబస్‌ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘51ఏళ్ల తర్వాత కూడా మనం పోరాడుతున్నాం… భవిష్యత్‌లోనూ పోరాడతాం’ అని అందులో పేర్కొన్నారు. ‘పాలిటెక్నిక్‌ విప్లవమప్పుడు రొట్టె, విద్య, స్వేచ్ఛ కోసం నినాదాలిస్తే… గ్రీస్‌ నుంచి అమెరికా, నాటో వెళ్లిపోవాలని ఇప్పుడు నినదిస్తున్నాం. గ్రీస్‌ వర్కర్లు, యువత రోజువారీ సమస్యలు, వేతనాల పెంపు కోసం ప్రస్తుతం గళం వినిపిస్తున్నాం. అధిక ధరలు, సమ్మిళిత కార్మిక ఒప్పందాలను వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వ హింస, అణచివేత ధోరణి, దుష్ప్రరిపాలనను ఎండగడుతున్నాం. ప్రభుత్వ విద్య వ్యతిరేక విధానంపై పోరాడుతున్నాం. ప్రజలు, కార్మికులకు వ్యతిరేకమైన చట్టాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అమెరికాయరోపియన్‌ యూనియన్‌నాటో కూటమికి వ్యతిరేకంగా, పలస్తీనా స్వేచ్ఛ కోసం పోరాటాలు సాగిస్తున్నాం. 50ఏళ్లకుపైగా పోరాడుతున్నాం… భవిష్యత్‌లోనూ పోరాటాలు కొనసాగిస్తాం’ అని ప్రకటన పేర్కొంది.

వ్యవసాయ సవాళ్లకు ప్రాధాన్యత

ఐరాస వాతావరణ సదస్సుకు రైతుల వినతి
బకు: వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లకు వాతావరణ చర్చల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి (ఐరాస)కు అన్నదాతలు విజ్ఞప్తి చేశారు. తమ కష్టాలను చూసి చూడనట్లు వదిలేయొద్దని బతిమిలాడుకున్నారు. ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సులో వ్యవసాయంపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాలని కోరారు. సముచిత వాతావరణ నిధులు కేటాయిస్తుందని ప్రపంచానికి అన్నం పెట్టే చిరు రైతులకు ఆసరాగా నిలవాలని విన్నవించారు. మీరు సన్నకారు రైతులకు మద్దతు ఇవ్వకపోతే మీకు ఆహారం ఎక్కడ నుంచి వస్తుంది? ఆదుకోకపోతే మీ కోసం పంటలను ఎవరు సాగు చేస్తారు? మీ కోసం చేపలు పట్టేది ఎవరు? తెనే, కూరగాయాలు ఎలా వస్తాయి? అని ఆసియా రైతుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఈస్తర్‌ పెనునియా ప్రశ్నించారు. అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం రైతాంగంపై తీవ్రంగా ఉంటోందని… ఆదాయం లేక ధాన్యం, కొబ్బంది, కూరగయాలు పండిరచే చిన్న రైతులు ఇబ్బంది పడుతున్నారని వెల్లడిరచారు. సేద్యానికి తగు వాతావరణ సాయం ఇవ్వాలని, నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతానికి వాతావరణ సాయంలో ఒక శాతం కంటే తక్కువ చిన్న రైతులకు అందుతున్నట్లు క్ల్రైమేట్‌ పాలసీ ఇనిషియేటివ్‌ నివేదిక పేర్కొంది. భూమి వేడెక్కుతుండటంతో ఎదురవుతున్న సవాళ్లు అధిగమించేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో వారికి చేయూత అవసరమన్నారు. గతసారి జరిగిన ఐరాస వాతావరణ చర్చల్లో రైతుల సమస్యలకు తగు ప్రాధాన్యత దక్కలేదు కాబట్టి కనీసం ఈసారి సముచిత ప్రాధాన్యత ఇచ్చి పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికైనా తమ గోడును వింటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

జిశాట్‌-20 ప్రయోగం విజయవంతం

0

విశాలాంధ్ర` సూళ్లూరుపేట: దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్‌ సేవలు మరింత విస్తరించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అతిపెద్ద ఉపగ్రహాన్ని రూపొందించింది. 4700 కిలోల బరువు ఉన్న జీశాట్‌- 20 ఉపగ్రహం మన అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట నుంచి కాకుండా ఫ్లోరిడాలోని స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. స్పేస్‌ ఎక్స్‌తో ఇస్రోకి వాణిజ్యప్రయోగం ఇది. మన బాహుబలి రాకెట్‌కు 4000 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే సామర్థ్యం ఉంది. అయితే తాజాగా రూపొందించిన కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ జిశాట్‌ -20… 4700 కిలోల బరువు ఉండడంతో ప్రైవేట్‌ రాకెట్‌ ద్వారా ప్రయోగించాల్సి వచ్చింది. ఎలాన్‌ మస్క్‌ ప్రైవేట్‌ రాకెట్‌ ఇటీవల ప్రపంచంలో ఎన్నో సరికొత్త అంతరిక్ష ప్రయోగాలకు కేంద్రంగా నిలిచింది. ఇప్పుడు ఆ సంస్థకు చెందిన ఫాల్కన్‌ నైన్‌ రాకెట్‌ ద్వారా మన ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఇస్రో ఇప్పటిదాకా భారీ సైజు ఉండే ఉపగ్రహాలను ఇతర రాకెట్‌ ప్రయోగ కేంద్రాల నుంచి ప్రయోగించినప్పటికీ స్పేస్‌ ఎక్స్‌ రాకెట్‌ను ఉపయోగించుకోవడం ఇదే తొలిసారి. మంగళవారం అర్ధరాత్రి 12.01 గంటలకు ఈ ఉపగ్రహం ప్రయోగించడంతో ఘన విజయం సాధించింది. అండమాన్‌ నికోబార్‌, లక్ష్యదీపంలోనూ వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఇస్రో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ ఉపగ్రహంలో శక్తివంతమైన ఉపకరణాలు విమానాలలో ఇంటర్నెట్‌ సేవలకు కూడా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వర్చువల్‌గా కేసుల విచారణ: సీజేఐ

0

న్యూదిల్లీ: దేశ రాజధానిలో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం నేపథ్యంలో సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా కీలక సూచనలు చేశారు. దిల్లీలో వాయు కాలుష్యం పెరుగు తున్నందున వీలైతే వర్చువల్‌గా వాదనలు వినిపించాలని న్యాయమూర్తులు సూచించారని ఆయన తెలిపారు. కాలుష్య అంశం చేయి దాటిపోయిందని సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ సుప్రీంకోర్టులో ఆందోళన వ్యక్తం చేశారు. జీఆర్‌పీఏ-4 పరిమి తులను పరిగణనలోకి తీసుకొని దిల్లీలోని కోర్టులు పూర్తిగా వర్చువల్‌ విధానాన్ని అనుసరించాలని సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, గోపాల్‌ శంకరనారాయణన్‌, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అభ్యర్థించారు. దీంతో ఏ కేసులైనా సరే న్యాయవాదులు వర్చువల్‌ మోడ్‌లో పాల్గొని తమ వాదనలు వినిపించొచ్చని సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పేర్కొన్నారు. దిల్లీలో వాయుకాలుష్యం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు తీవ్రమైన కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నారు. వాయు కాలుష్యంపై తాజాగా విచారణ జరిపిన సుప్రీం దిల్లీ ప్రభుత్వంపై మండిపడిరది. రోజురోజుకు వాయు నాణ్యత క్షీణిస్తున్నా అధికారులు అలసత్వం ప్రదర్శించడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తంచేసింది. కాలుష్యం నేపథ్యంలో ఇప్పటికే ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు.

త్వరలో భారత్‌కు పుతిన్‌

0

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించనున్నారు. పరస్పర వార్షిక పర్యటనల్లో భాగంగా పుతిన్‌ భారత్‌కు రానున్నారని దౌత్య వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జులైలో మాస్కోలో జరిగిన సదస్సు సందర్భంగా భారత్‌కు రావాలంటూ పుతిన్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారు. భారత్‌కు చెందిన సీనియర్‌ ఎడిటర్లతో మంగళవారం ఉదయం వీడియో సంభాషణ జరిపిన క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ ఈ విషయాన్ని తెలిపారు. పుతిన్‌ భారత్‌కు రానున్నట్లు చెప్పారు. అయితే ఆయన పర్యటన తేదీ ఇంకా ఖరారు కాలేదని పెస్కోవ్‌ అన్నారు.
అమెరికాకు రష్యా హెచ్చరిక: అణ్వస్త్రాలకు సంబంధించి వ్లాదిమిర్‌ పుతిన్‌ మరోమారు అమెరికాను హెచ్చరించారు. ఏదేని అణుశక్తి దేశంతో కలిసి మాపై క్షిపణులతో దాడి చేస్తే అణ్వస్త్రాలు బయటకు తీస్తామని తేల్చిచెప్పారు. నాటో సాయుధ సంపత్తి లక్ష్యంగా దాడులు చేస్తామని, ఇందుకోసం వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయని పుతిన్‌ అన్నారు. అమెరికా దూకుడుకు కళ్లెం వేసేందుకు కొత్త అణు విధానాన్ని పుతిన్‌ మంగళవారం ఆమోదించారు. రష్యాలోకి దీర్ఘశ్రేణి క్షిపణలతో దాడి చేసేందుకు వీలుగా ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతివ్వడానికి… అధికారిక అణు విధానాన్ని సవరించడం ద్వారా రష్యా బదులిచ్చింది. అణ్వస్త్రాల వినియోగాన్ని సులభతరం చేసేలా కొత్త విధానాన్ని పుతిన్‌ ఆమోదించారు. ఇప్పటికే తన అణు విధానానికి సవరణలు చేసిన రష్యా… తాజాగా దానిని మరింత సరళతరం చేసుకుంది.

సర్వం సిద్ధం

0

నేడు మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీకి పోలింగ్‌

ముంబై/రాంచీ: మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మహారాష్ట్రలోని మొత్తం 288 స్థానాలకు ఒకటే దశలో…జార్ఖండ్‌లోని 38 స్థానాలకు రెండవ దశలో పోలింగ్‌ బుధవారం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ వంటి కొన్ని రాష్ట్రాల శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ జరుగుతుందని ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. అవాంఛనీయ ఘటనలను నివారించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. పోలీసులు, పారామిలటరీ దళాలను మోహరించినట్లు వెల్లడిరచారు.
మహారాష్ట్రలో 288 స్థానాల నుంచి 4,136 మంది పోటీ చేస్తున్నారు. బీజేపీ, శివసేన, ఎన్‌సీపీల (మహాయుతి), కాంగ్రెస్‌, శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ (ఎస్‌పీ) (మహా వికాస్‌ అగాడీ)కి మధ్య పోటీ ఉంది. రెండు వర్గాలు గెలుపుపై దీమాగా ఉన్నాయి. బీజేపీ 149, శివసేన 81, ఎన్‌సీపీ (అజిత్‌) 59 స్థానాల్లో పోటీ చేస్తుండగా ఎంవీఏ తరపున 101 స్థానాల్లో కాంగ్రెస్‌, 95 చోట్ల శివసేన (ఉద్ధవ్‌), 86 సీట్లలో ఎన్‌సీపీ (ఎస్‌పీ) పోటీ చేస్తున్నాయి. బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ), ఏఐఎంఐఎం కూడా బరిలో నిలిచాయి. బీఎస్‌పీ 237 మంది అభ్యర్థులను నిలబెట్టింది. ఏఐఎంఐఎం తరపున 17 మంది పోటీ చేస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈసారి అభ్యర్థుల సంఖ్య 28శాతం మేర పెరిగింది. 4,136 మంది అభ్యర్థులలో 2,086 మంది స్వతంత్రులు ఉన్నారు. 150 స్థానాల్లో రెబల్స్‌ నిలబడ్డారు. రాష్ట్రంలో 9,70,25,119 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 5,00,22,739 మంది పురుషులు, 4,59,96,279 మంది మహిళలు, 6,101 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. దివ్యాంగ ఓటర్లు 6,41,425 మంది కాగా రాష్ట్రంలో 1,16,170 సర్వీస్‌ ఓట్లు ఉన్నాయి.
జార్ఖండ్‌లో మొత్తం 24 జిల్లాలోని 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వీటిలో 44 జనరల్‌, 28 ఎస్‌టీలకు, 9 ఎస్‌సీలకు రిజర్వుడ్‌ స్థానాలు ఉన్నాయి. రెండో దశలో 38 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఇందులో 27 జనరల్‌ స్థానాలు కాగా ఎస్‌సీ, ఎస్‌టీలకు రిజర్వుడ్‌ స్థానాలు మూడు, ఎనిమిది చొప్పున ఉన్నాయి. ఇండియా ఐక్య సంఘటనలో భాగంగా 20 స్థానాల్లో జేఎంఎం, కాంగ్రెస్‌ 13, సీపీఎం 4, ఆర్‌జేడీ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నాయి. ధన్వర్‌లో జేఎంఎం, సీపీఐ(ఎంఎల్‌) మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుంది. ఛత్తర్పూర్‌, బిష్రంపూర్‌లో కాంగ్రెస్‌, ఆర్‌జేడీకి మధ్య స్నేహపూర్వకంగా తలబడుతున్నాయి. బీజేపీ 32 స్థానాల్లో పోటీ చేస్తుండగా దాని మిత్రపక్షం ఏజేఎస్‌యూ ఆరు చోట్ల పోటీచేస్తోంది. తుది దశ ఓటింగ్‌ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని, 31 స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగుస్తుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.రవి కుమార్‌ తెలిపారు. మొత్తం 528 మంది అభ్యర్థుల్లో 472 మంది పురుషులు, 55 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్‌ అన్నారు. 585 కంపెనీల పారామిలటరీ దళాలు, 60 కంపెనీల జేఏపీని మోహరించినట్లు అధికారి తెలిపారు. 1.23 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారని, వీరిలో 62.8లక్షల మంది పురుషులు, 61లక్షల మంది మహిళలు, 145 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నరని సీఈఓ తెలిపారు. మొదటిసారి ఓటు వేసే వారు 55వేల మంది, 85ఏళ్లుపైబడిన వారు 50 మేల మంది ఉన్నట్లు చెప్పారు.

ప్రభుత్వ విధానాలే ప్రజలకు శాపం

0

. జగన్‌, చంద్రబాబు మోదీకి లొంగిపోయారు
. అదానీతో కుమ్మక్కై ప్రజలపై భారాలు
. విద్యుత్‌ చార్జీలు తగ్గించే వరకు వామపక్షాల పోరాటం
. నేటి నుంచి ప్రజాచైతన్య సభలు, సమావేశాలు
. రామకృష్ణ, శ్రీనివాసరావు

విశాలాంధ్ర – విజయవాడ: సర్దుబాటు చార్జీల పేరుతో పెంచిన విద్యుత్‌ చార్జీలు తగ్గించేవరకు తమ పోరాటం ఆపేది లేదని వామపక్ష పార్టీలు స్పష్టం చేశాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ పది వామపక్ష పార్టీల అధ్వర్యంలో మంగళవారం విజయవాడలో భారీ ధర్నా చేపట్టారు. ధర్నాచౌక్‌ వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రబాబు ప్రధాని మోదీకి లొంగిపోయారని… అదానీతో లాలూచీ పడి ప్రజలపై భారం వేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే రూ.6,072 కోట్లు వసూలు చేసేందుకు చార్జీలు పెంచారని, డిసెంబరు నెల నుంచి పెంచిన చార్జీలతో విద్యుత్‌ బిల్లులు రానున్నట్లు తెలిపారు. మరో రూ.11,820 కోట్లు వసూలు చేసేందుకు విద్యుత్‌ నియంత్రణ మండలి ప్రతిపాదన తీసుకొచ్చిందని, దీనిపై వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, వర్తక, వాణిజ్య సంఘాలు అభ్యంతరాలు తెలియజేసినట్లు చెప్పారు. పంపుసెట్లకు స్మార్ట్‌మీటర్లు పెట్టబోమని మంత్రి అసెంబ్లీలో ప్రకటించటంతో తమ పరిస్థితి ఏమిటని గృహ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి చేసిన పాపం తమకు శాపంగా మారిందని టీడీపీ నాయకులు పేర్కొనడం సరికాదని, రెండు ప్రభుత్వాల విధానాలే ప్రజలకు శాపంగా మారాయని విమర్శించారు. విద్యుత్‌ చార్జీలు పెంచం, వీలైతే తగ్గిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు… ప్రజలను మోసం చేశారని, రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగదారులు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. జగన్‌, చంద్రబాబు ఇద్దరూ అదానీతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. విద్యుత్‌ చార్జీలు తగ్గించే వరకు వామపక్షాల పోరాటం ఆగదన్నారు. ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ప్రజల్ని చైతన్యం చేస్తూ సభలు, సమావేశాలు, సదస్సులు నిర్వహించి డిసెంబర్‌లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ స్మార్ట్‌ మీటర్లు ఎవరు అడిగారని ఏర్పాటు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వ నిర్ణయమని చెప్పే ప్రభుత్వ పెద్దలు… వైసీపీ ప్రభుత్వ అన్ని నిర్ణయాలను ఇలాగే చేస్తున్నారా అని నిలదీశారు. సర్వే రాళ్లు, పాస్‌ పుస్తకాలు కొనసాగించనట్లే విద్యుత్‌ చార్జీల పెంపు నిర్ణయాన్ని నిలిపివేయాలన్నారు. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లతో వైసీపీ ప్రభుత్వం వేతనాలు పెంచుతామని ఒప్పందం చేసుకుందని, ఆ విధంగా పెంచుతారా అని ప్రశ్నించారు. డిమాండ్‌, సరఫరాకు అనుగుణంగా చార్జీలు నిర్ణయించటం వాస్తవంగా సాధ్యం కాదన్నారు. మోదీని నమ్మిన వారు బాగుపడలేదన్నారు. గతంలో షిర్డీసాయి కంపెనీ జగన్‌ బినామీ కంపెనీ అని చెప్పి నేడు అదే కంపెనీకి స్మార్ట్‌మీటర్ల కాంట్రాక్టు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ఇప్పటికే అప్పులపాలై ఉన్నారని, చార్జీలు పెంచితే మరింత రుణభారం పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటారని హెచ్చరించారు. ప్రశాంతంగా ఉండే ఆంధ్రప్రదేశ్‌లో మత కల్లోలాలు సృష్టించాలని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. మోదీ మానవతావాది అంటూ ఉప ముఖ్యమంత్రి వపన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించటాన్ని తప్పుబట్టారు. ఏపీని మరో మణిపూర్‌ చేయాలని కుట్ర చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల కోసం చేసే పోరాటాలలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు పి.ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రజల కోసం కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా లాంటి విషయాలను అడగకుండా కూటమి ప్రభుత్వం ప్రజలపై భారాలు వేయటం దుర్మార్గం అన్నారు. ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి కాటం నాగభూషణం మాట్లాడుతూ గతంలో చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు పెంచినప్పుడు వామపక్షాలు ఉద్యమించాయని, ఆ సందర్భంగా బషీర్‌బాగ్‌లో జరిగిన తుపాకీ కాల్పుల్లో ఉద్యమకారులు మరణించగా ఇప్పటికీ వారి స్మారకసభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకుని చరిత్ర పునరావృతం కాకుండా విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర నాయకులు సుధీర్‌ మాట్లాడుతూ గతంలో చంద్రబాబు విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు సంస్థను డిస్కమ్‌లు పేరుతో మూడు ముక్కలు చేశారని… ఇప్పుడు స్మార్ట్‌మీటర్ల పేరుతో మోదీ తీసుకువచ్చిన విద్యుత్‌ సవరణల బిల్లు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నాకు సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సీపీఎం జిల్లా నాయకులు దోనేపూడి కాశీనాథ్‌ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు, రాష్ట్ర నాయకులు ఎస్‌.వెంకట సుబ్బయ్య, సీపీఎం రాష్ట్ర నాయకులు తులసీరావు, డి.రమాదేవి, సీహెచ్‌.బాబూరావు తదితరులు పాల్గొన్నారు. సీపీఐ నగర సహాయ కార్యదర్శి లంక దుర్గారావు వందన సమర్పణ చేశారు.