Wednesday, February 5, 2025
Home Blog Page 137

వివేకా హత్య కేసులో కీలక పరిణామం… అవినాశ్ రెడ్డికి సుప్రీం నోటీసులు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. సునీత తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. వివేకా హత్యకు సంబంధించి మొదటి నుంచి జరిగిన పరిణామాలను లూథ్రా సీజేఐ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. అవినాశ్ రెడ్డి ఈ కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్నారని, ఈ కేసుకు సంబంధించి అతడు కీలకమైన వ్యక్తి అని వెల్లడించారు. అంతేకాకుండా, ఈ కేసులో అప్రూవర్ గా మారిన వ్యక్తిని (దస్తగిరి)… శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి జైలుకు వెళ్లి బెదిరించారని సిద్ధార్థ లూథ్రా సీజేఐ బెంచ్ కు తెలియజేశారు. ఒక ప్రైవేటు డాక్టర్ గా ఉన్న వ్యక్తి జైలులోకి వెళ్లి సాక్షులను బెదిరించే ప్రయత్నం చేశారని వివరించారు.

చైతన్యరెడ్డి రెగ్యులర్ గా జైలుకు వెళ్లి ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు చేస్తుంటారా? అని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించగా… చైతన్యరెడ్డి రెగ్యులర్ గా జైలుకు వెళ్లే డాక్టర్ కాదని, నిబంధనలకు విరుద్ధంగా జైలులోకి వెళ్లారని లూథ్రా బదులిచ్చారు. ఈ నేపథ్యంలో అవినాశ్ రెడ్డి, చైతన్యరెడ్డిలను ప్రతివాదులుగా చేర్చాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.

వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం అవినాశ్ రెడ్డి, చైతన్యరెడ్డిలను ప్రతివాదులుగా చేర్చేందుకు అంగీకరించింది. ఈ క్రమంలో వారిద్దరికీ నోటీసులు జారీ చేసింది. అనంతరం, ఈ కేసు తదుపరి విచారణను వచ్చే ఏడాది మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది.

అక్రమ వలసలపై తగ్గేదేలేదంటున్న ట్రంప్..

అవసరమైతే నేషనల్ ఎమర్జెన్సీకి సిద్ధమని ట్రంప్ సంకేతాలు

అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని వెనక్కి పంపించేందుకు అవసరమైతే నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించేందుకూ సిద్ధమని డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ట్రంప్.. వచ్చే జనవరి 20న ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే తన క్యాబినెట్ మినిస్టర్లను, సలహాదారులను ట్రంప్ ఎన్నుకుంటున్నారు. కీలక పోస్టుల్లో తనకు నమ్మకస్తులను, సమర్థులను నియమిస్తున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని వెతికిపట్టుకుని వారి వారి దేశాలకు పంపించనున్నట్లు ట్రంప్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇందుకోసం అవసరమైతే బోర్డర్ సెక్యూరిటీ అంశంపై జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించేందుకూ సిద్ధమని వెల్లడించాయి. నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించి, సైనిక బలగాల సాయంతో మాస్ డిపోర్టేషన్ చేపట్టనున్నట్లు పేర్కొన్నాయి. అమెరికాలోకి అక్రమ మార్గాల ద్వారా చేరుకుని, అధికారుల కళ్లుగప్పి దేశంలోనే ఉంటున్న వారిని పట్టుకుని వెనక్కి పంపించాలని ట్రంప్ నిర్ణయించారు. అదేసమయంలో మెక్సికో బోర్డర్ నుంచి అక్రమంగా అమెరికాలోకి అడుగుపెట్టే మార్గాలను మూసివేయనున్నట్లు తెలిపారు. బోర్డర్లలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి అక్రమ వలసలను అడ్డుకుంటామని పేర్కొన్నారు.

దేశంలోని అక్రమ వలసదారులను తిరిగి పంపించేందుకు నేషనల్ ఎమర్జెన్సీ విధించేందుకు సిద్ధమవుతున్నట్లు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ాట్రూత్ సోషల్్ణ లో ఓ పోస్టు కూడా పెట్టారు. దీంతో అమెరికాలోకి అక్రమ పద్ధతుల్లో ప్రవేశించి ఉంటున్న వారిలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

పవన్ కల్యాణ్ కు ఊరట.. క్రిమినల్ కేసును ఎత్తివేసిన కోర్టు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు గుంటూరు స్పెషల్ కోర్టు పెద్ద ఊరటను కలిగించింది. ఆయనపై గతంలో నమోదైన క్రిమినల్ కేసును కోర్టు ఎత్తివేసింది. వాలంటీర్లను ఉద్దేశించి గతంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది జులై 9న ఏలూరులో నిర్వహించిన వారాహి సభలో ఆయన ప్రసంగిస్తూ ఈమేరకు ఆరోపించారు. ఇంట్లో మగవాళ్లు లేని సమయంలో వెళ్తున్నారని, దండుపాళ్యం బ్యాచ్ మాదిరి తయారయ్యారని, వాలంటీర్ వ్యవస్థలో జవాబుదారీతనం లేదని ఆయన అన్నారు. దీంతో కడప, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఆదేశిస్తూ అదే నెల 20న అప్పటి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఆదేశాలిచ్చారు. నేరుగా ప్రభుత్వమే ఆదేశించడంతో గుంటూరు జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుంటూరు కోర్టులో ఫిర్యాదు చేశారు. పవన్ పై 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదయింది.

ఈ కేసుపై పవన్ కల్యాణ్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. మరోవైపు, గుంటూరు కోర్టు తాజా విచారణలో… పవన్ పై తాము ఫిర్యాదు చేయలేదని వాలంటీర్లు తెలిపారు. ఆ సంతకాలు తమవి కాదని చెప్పారు. దీంతో కేసును ఎత్తివేస్తూ గుంటూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శరత్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు.

ఢిల్లీలో 500కు చేరుకున్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్..

బయటకు రావాలంటేనే భయపడుతున్న ప్రజలు
రోజురోజుకు క్షీణిస్తున్న గాలి నాణ్యత


దేశరాజధాని ఢిల్లీలో గాలిలో నాణ్యత రోజురోజుకు క్షీణిస్తోంది. మంగళవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (గాలి నాణ్యత సూచిక) ఏకంగా 494కు పెరిగింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. ఈ నేపథ్యంలో స్ట్రిక్ట్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ)-4 ఆంక్షలు అమలు చేస్తున్నారు. గాలి నాణత్య సూచీ 450కు తగ్గినా సరే తమ అనుమతి లేకుండా ఆంక్షలు ఎత్తివేయవద్దని అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ ఉదయం గాలి నాణ్యత సూచీ ఏకంగా 500 మార్కును చేరుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న స్టేజ్-4 ఆంక్షల ప్రకారం.. నిత్యావసరాలతోపాటు ఎల్ఎన్‌జీ, సీఎన్‌జీ, బీఎస్-6 డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాలు మినహా ఇతర ట్రక్కులు, వాహనాలు నగరంలోకి ప్రవేశించేందుకు అనుమతి లేదు. ఢిల్లీ వెలుపల రిజిస్టర్ అయిన తేలికపాటి వాణిజ్య వాహనాలకు కూడా అనుమతి లేదు. అయితే, అవి ఎలక్ట్రిక్ వాహనాలు అయితే మాత్రం అనుమతిస్తారు. నిర్మాణ పనులు, పబ్లిక్ ప్రాజెక్టులను పూర్తిగా నిలిపివేశారు. పొగమంచు దట్టంగా కురుస్తున్నప్పటికీ రైలు సర్వీసులు కొనసాగుతున్నాయి. అయితే, 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, కాలుష్యం కారణంగా 9 రైళ్లను రీషెడ్యూల్ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి… ఏపీలోని ముంచింగిపుట్టులో 9 డిగ్రీలు

ఏపీ, తెలంగాణలలో చలి తీవ్రత పెరిగింది. సోమవారం ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉన్నట్టుండి చలి పెరిగింది. హైదరాబాద్ తో పాటు సిటీ శివార్లలో టెంపరేచర్ 12 డిగ్రీలకు పడిపోయింది. దీంతో నగర వాసులు వణికిపోతున్నారు. ఉదయం వేళల్లో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. వృద్ధుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. చలికి వారు బయటకు అడుగుపెట్టలేకపోతున్నారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ లోని ముంచింగిపుట్టులో ఈ సీజన్ లోనే తొలిసారిగా సింగిల్ డిజిట్ టెంపరేచర్ నమోదైంది. సోమవారం రాత్రి 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీని చలి వణికిస్తోంది. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. పాడేరులో 12 డిగ్రీలు, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్ లో వంజంగి గుట్టలకు పర్యాటకుల రద్దీ పెరుగుతోంది. సూర్యోదయం సమయంలో అక్కడి పకృతి సోయగాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వెళుతున్నారు.

పోలీసుల విచారణకు డుమ్మా కొట్టిన వర్మ

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. మంగళవారం ఆయన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే, ఉదయం పది గంటల ప్రాంతంలో తాను విచారణకు రాలేనంటూ ఆర్జీవీ పోలీసులకు మెసేజ్ అందించారు. ఈమేరకు వాట్సాప్ లో ఆయన మెసేజ్ చేసినట్లు తెలుస్తోంది. తనపై నమోదైన కేసులో విచారణకు పోలీసులకు సహకరిస్తానని ఆర్జీవీ చెప్పారు. అయితే, తన వ్యక్తిగత పనుల కోసం నాలుగు రోజుల సమయం కావాలని కోరారు. ఆ తర్వాత తప్పకుండా విచారణకు వస్తానని ఆర్జీవీ తన మెసేజ్ లో పేర్కొన్నట్లు అధికార వర్గాల సమాచారం.

సోషల్ మీడియాలో అసభ్య పోస్టులకు సంబంధించి ఆర్జీవీపై ఏపీ పోలీసులు ఇటీవల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణకు రమ్మంటూ నోటీసులు కూడా జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆర్జీవీని విచారించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. అయితే, వ్యక్తిగత పనులు ఉండడంతో విచారణకు హాజరుకాలేక పోతున్నానంటూ ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆర్జీవీ పోలీసులకు సమాచారం అందించారు.

ఐక్యరాజ్యసమితిలో విజయసాయిరెడ్డి

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఐక్యరాజ్యసమితి భద్రతామండలిని సందర్శించారు. ఐక్యరాజ్యసమితి 79వ సెషన్ కు వెళ్లిన భారత ప్రతినిధి బృందంలో విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. ఐక్యరాజ్యసమితికి వెళ్లిన సందర్భంగా జనరల్ అసెంబ్లీ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి విజయసాయి నివాళి అర్పించారు. ఈ నెల 23 వరకు ఈ సెషన్ జరగనుంది. శాంతి, అంతర్యుద్ధాలు తదితర అంశాలపై భారత్, ఇతర దేశాల ప్రతినిధులు జనరల్ అసెంబ్లీలో మాట్లాడనున్నారు.

మా లోపాలను దుర్మార్గులు వాడుకున్నారు

కెనడా ప్రధాని ట్రూడో పశ్చాత్తాపం

అట్టావా: కెనడా వలసల నియంత్రణ విధానంలో సహేతుకతను ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో వెల్లడిరచారు. ఈ మేరకు ఏడు నిమిషాల వీడియో విడుదల చేశారు. కొందరు దుర్మార్గులు వ్యవస్థలోని లోపాలను వాడుకొని ప్రజలను దోచుకుంటున్నారని ట్రూడో ఆవేదన వెలిబుచ్చారు. ముఖ్యంగా అమాయకులైన వలసదారులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, డిప్లొమాలు పూర్తిచేయిస్తామని, పౌరసత్వం తేలిగ్గా లభిస్తుందని ఆశలు చూపి మోసం చేస్తున్నారన్నారు. ఈ సమస్యలు పరిష్కరించడానికే సరికొత్త పాలసీ తీసుకొచ్చామన్నారు. దీనిలో భాగంగా రానున్న మూడేళ్లలో తాత్కాలిక, శాశ్వత నివాసాల కోసం వచ్చే వారి సంఖ్యను గణనీయంగా తగ్గిస్తామని చెప్పారు. కోవిడ్‌ తర్వాత ఉద్యోగుల కొరత తగ్గించేందుకు వలస విధానంలో చేసిన మార్పులను ఫేక్‌ కాలేజీలు, భారీ కార్పొరేషన్లు తమ లాభాల కోసం దానిని దుర్వినియోగం చేశాయన్నారు. ‘తాత్కాలిక ఉద్యోగులు కూడా మా శ్రామికశక్తిలో భాగమయ్యారు. దీంతో మేము ఇమ్మిగ్రేషన్‌ను ప్లాన్‌ చేసేవేళ వారిని చేర్చకపోవడం తప్పవుతుంది. డిమాండ్‌ ఆధారంగానే మా వలస విధానం ఉంటుంది. ప్రస్తుత మౌలిక వసతులను దృష్టిలో పెట్టుకొని దీనిని సమతౌల్యంగా ఉండేట్లు చూసుకోవాలి. చాలా సంస్థలు, పరిశ్రమలు వలస కార్మికులను ఆహ్వానిస్తున్నాయి. కానీ, ఇక్కడి హౌసింగ్‌, ఆరోగ్య సౌకర్యాలు, సోషల్‌ సర్వీస్‌ అంతే వేగంగా విస్తరించడం లేదు. వలస విధానంలో తాజా మార్పులతో ఇక్కడి కమ్యూనిటీలు లక్షల కొద్దీ ఇళ్లు నిర్మించి సిద్ధమయ్యేందుకు సమయం లభిస్తుంది’ అని ట్రూడో వివరించారు. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను నియంత్రించడంతో టొరెంటో, వాంకోవర్‌ వంటి నగరాల్లో అద్దెల ధరలు దిగి వస్తున్నాయని ట్రూడో చెప్పారు.

హోరెత్తిన ‘ఇంటి’ పోరు

రాష్ట్ర వ్యాప్తంగా భారీ ప్రదర్శనలు, ధర్నాలు

గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలి
నిర్మాణ సామాగ్రి ధరలు దృష్ట్యా రూ.5 లక్షలకు పెంచాలి
సీపీఐ, వ్య.కా.సం అధ్వర్యాన సామూహిక అర్జీలు సమర్పించిన పేదలు
జనంతో పోటెత్తిన గ్రామ… వార్డు సచివాలయాలు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేయాలని కోరుతూ సీపీఐ, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం పిలుపుమేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన అర్జీల సమర్పణ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. రాజకీయపార్టీల కతీతంగా పేదలు, బడుగు బలహీన, మధ్యతరగతి వర్గాలు పెద్దసంఖ్యలో కదలివచ్చారు. గ్రామ/వార్డు సచివాలయాలు వేలాదిమంది అర్జీదారులతో పోటెత్తాయి. ఎన్నికల హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌లు ధర్నాలతో దద్దరిల్లాయి. భారీ ప్రదర్శనలతో రహదారులు కిక్కిరిశాయి. గత ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలం నివాసానికి ఏమాత్రం సరిపోదని, ఆ లబ్ధిదారులందరికీ కూటమి ప్రభుత్వం గతంలో వేసిన లే ఔట్లను మార్పు చేసి పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున ఇవ్వాలని సీపీఐ, వ్యవయసాయ కార్మిక సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్‌, ఇనుము, ఇటుక, కంకర, ఇసుక తదితర ముడిసామాగ్రి ధరలు పెరిగినందున కూటమి ప్రభుత్వం ప్రకటించిన రూ.4 లక్షలకు అదనంగా మరో లక్ష కలిపి రూ.5 లక్షలు మంజూరు చేయాలని కోరారు.
నివాసయోగ్యమైన భూములివ్వాలి: ముప్పాళ్ల
అర్హులైన పేదలందరికీ నివాసయోగ్య మైన ఇంటి స్థలాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళగిరిలోని ద్వారకా నగర పరిసర ప్రాంతాల్లోని పేదలందరూ స్థానిక సచివాలయంలో అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముప్పాళ్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తన హామీ నిలబెట్టుకోవాలని కోరారు. జగన్‌ కొండల్లో, వాగుల్లో, పల్లపు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రయత్నించారని, అక్కడ నీరు, రోడ్డు తదితర సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం పొరపాట్లు చేయవద్దని ముప్పాళ్ల విజ్ఞప్తి చేశారు. సీపీఐ మంగళగిరి మండల కార్యదర్శి జాలాది జాన్‌బాబు, పట్టణ సహాయ కార్యదర్శి నందం బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పేదల నివాసకల్పనకు ఎందాకైనా పోరాడతాం: జల్లి విల్సన్‌
రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ నివాస సౌకర్యం కల్పించేందుకు ఎందాకైనా పోరాడుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు జల్లి విల్సన్‌ స్పష్టం చేశారు. చీరాల నియోజకవర్గంలోని ఓడరేవు, దేవాంగపూరి కాలనీల్లో జల్లి విల్సన్‌ స్థానిక నాయకులతో కలిసి సచివాలయూల వద్ద లబ్ధిదారులతో అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా విల్సన్‌ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమలు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం శుభపరిణామ మన్నారు. అర్హులకు నివాసయోగ్యంగా ఉండే స్థలాలు గుర్తించి గృహనిర్మాణ సామాగ్రి ధరలు పెరిగిన నేపథ్యంలో రూ.5 లక్షలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యులు బత్తుల శామ్యూల్‌, చీరాల నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి చిరమల ప్రకాశ్‌, తదితరులు పాల్గొన్నారు. అద్దంకి నియోజకవర్గంలో సీపీఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగనకొండ అధ్వర్యంలో గ్రామసచివాలయాల్లో అర్జీలు సమర్పించారు.
ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలివ్వాలి: అక్కినేని వనజ
ఇంటి నిర్మాణ సామాగ్రి ధరలు గణనీయంగా పెరిగినందున ప్రభుత్వం ఇస్తానన్న రూ.4 లక్షలను రూ.5 లక్షలకు పెంపు చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి సచివాలయంలో ఇళ్ల స్థలాల అర్జీల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానం చేసిన విధంగా పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు ఇంటి స్థలం కేటాయించాలని వనజ కోరారు. అర్జీల సమర్పణ కార్యక్రమంలో సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య, సహాయ కార్యదర్శి పుల్లూరి సోమశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ సచివాలయాల్లో పేదలు అర్జీలు సమర్పించారు.
కర్నూలు కలెక్టరేట్‌ కిటకిట…
ఎన్నికల సమయంలో పేదలకు నివాసస్థలం ఇస్తానన్న హామీని ప్రభుత్వం నిలుపుకోవాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు పి.రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి బి .గిడ్డయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీపీఐ నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి అధ్యక్షతన కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. తొలుత సీఆర్‌ భవన్‌ నుండి కలెక్టరేట్‌ వరకు వేలాది మంది పేదలు, సీపీఐ ప్రజాసంఘాల నాయకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో కర్నూలు రహదారులు కిలోమీటర్ల పొడవునా అర్జీదారులతో కిటకిటలాడాయి. మహిళలు, చంటిపిల్లలతో పెద్దఎత్తున తరలిరావడంతో కలెక్టరేట్‌ కిక్కిరిసిపోయింది. ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి కె జగన్నాధం, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌.లెనిన్‌బాబు, ఎస్‌.మునెప్ప తదితరులు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా 200కు పైగా సచివాలయాల్లో అర్జీలు అందజేశారు.
పేదలందరికీ ఇళ్లస్థలాలు:
సీహెచ్‌ కోటేశ్వరరావు
అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ కోటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. విజయవాడ రూరల్‌ మండలం కొత్తూరు తాడేపల్లి గ్రామ సచివాలయం వద్ద అర్జీలు అందజేశారు. ఇళ్ల స్థలాల కోసం అర్జీలతో పేదలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు ఉప్పే నరసింహారావు, మండల, జిల్లా నాయకులు ముఖ్య దేశాయ, లావూరు తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.
పేదల సొంతింటి కల సాకారం
చేయాలి: జంగాల
కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు పేదల సొంతింటి కల సాకారం చేయాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గసభ్యులు జంగాల అజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లాలో చేపట్టిన అర్జీలు అందజేసే కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. జిల్లావ్యాప్తంగా సచివాలయాల్లో అర్జీలు అందజేసేందుకు లబ్ధిదారులు కదిలివచ్చారు. గుంటూరు నగరంలోని 8వ డివిజన్‌ సచివాలయం వద్ద జంగాల అజయ్‌కుమార్‌, ఇతర సచివాలయాలలో నగర కార్యదర్శి కోట మాల్యాద్రి పాల్గొన్నారు. పొన్నూరు, తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాలలోని 36 సచివాలయాల్లో మొదటి రోజు అర్జీలు అందజేశారు.
ఎన్నికల హామీ వెంటనే
అమలు చేయాలి: కేవీవీ ప్రసాద్‌
కూటమి ప్రభుత్వం తన ఎన్నికల హామీ వెంటనే అమలుకు చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు కేవీవీ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. గన్నవరం మండలం గొల్లనపల్లి గ్రామ సచివాలయం కార్యదర్శికి ఇళ్లస్థలాల అర్జీలు అందజేశారు. వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి కట్టవరపు విజయరావు, సీపీఐ సహాయ కార్యదర్శి చాగంటిపాటి వెంకటేశ్వరవు, గొంది శోభనా చలపతిరావు, వెంగళ్ల శివయ్య, తాటి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రచార ఆర్భాటంగా
మార్చవద్దు: డేగా ప్రభాకర్‌
పేదలకు ఇస్తానన్న ఇంటిస్థలం హామీ గత ప్రభుత్వం వలే ప్రచార ఆర్భాటంగా మార్చవద్దని, తక్షణమే అమలుకు చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గసభ్యులు డేగా ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. సీపీఐ16వ డివిజన్‌ అరుంధతి పేట సచివాలయం వద్ద ఇళ్ల స్థలాల లబ్ధిదారులతో కలసి డివిజన్‌ కార్యదర్శి కొల్లూరి సుధారాణి అధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సీపీఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్‌, ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ల వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
డోన్‌లో జరిగిన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు కె.రామాంజనేయులు, కోడుమూరులో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్‌, విశాఖలో ఎం.పైడిరాజు, సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో సీపీఐ జిల్లా కార్యదర్శి మీసాల మేమయ్య యాదవ్‌, అనంతపురం జిల్లా సోమలదొడ్డి గ్రామ సచివాలయం వద్ద జిల్లా సీపీఐ కార్యదర్శి సి.జాఫర్‌ తదితరులు పాల్గొన్నారు.

సంతాన పరిమితి ఎత్తివేత

. ఇద్దరికి మించినా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు
. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనలు మారుస్తూ చట్ట సవరణ
. మంత్రి నారాయణ

విశాలాంధ్ర బ్యూరో- అమరావతి: ఇకపై ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లభిస్తోంది. దీనికి సంబంధించి గతంలో ఉన్న చట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ చట్టాల సవరణ బిల్లు 2024ను అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లును నాలుగు రోజుల క్రితమే మంత్రి నారాయణ సభలో ప్రవేశపెట్టారు. తాజాగా ఈ బిల్లుపై ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. కాగా, 1960 దశకంలో జనాభా నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణ పథకాలు ప్రవేశపెట్టాయి. కుటుంబ నియంత్రణలో భాగంగా తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో భాగంగా పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారిని అనర్హులుగా చేస్తూ చట్టంలో సవరణలు చేశారు. 1955 మున్సిపల్‌ కార్పొరేషన్ల చట్టంలోని సెక్షన్‌ 21 బి, 1965 మున్సిపాల్టీల చట్టంలోని సెక్షన్‌ 13బిలను చొప్పిస్తూ ఏపీ మున్సిపల్‌ శాసనాల సవరణ బిల్లు 1994ను తీసుకొచ్చారు. 1994లో జరిగిన ఈ సవరణల ప్రకారం ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం కలిగిఉన్న వారు పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు. అప్పటి నుంచి ఇదే విధానం కొనసాగుతూ వస్తుంది. అయితే మూడు దశాబ్దాలలో జనాభా నియంత్రణ కోసం తీసుకున్న చర్యలతో సంతానోత్పత్తి సామర్ధ్యం రేటు బాగా తగ్గిపో యింది. 2001లో 2.6 నుంచి 1.5కు తగ్గింది. జనన, మరణాల నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ బాగా వెనుకబడిపోయింది. తద్వారా జనాభా వృద్ధిరేటు బాగా తగ్గిపోయింది. ఇదే సమయంలో వృద్ధుల జనాభా రేటు ఎక్కువగా ఉంది. మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జనాభాను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఉద్దేశంతోనే చట్టంలో సవరణలు చేయాల్సి వచ్చింది. దీని ప్రకారం గతంలో ఆయా చట్టాల్లో చేసిన సవరణలకు సంబంధించిన సెక్షన్‌లను తొలగిస్తూ ఏపీ మున్సిపల్‌ శాసనాల చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది.