వైసీపీ ఎమ్మెల్సీలకు అనిత మాస్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. అయితే శాసన మండలిలో మహిళల అత్యాచారాలపై వాడివేడి చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ విషయంపై హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ఏపీలో జగన్ ప్రభుత్వం కంటే ఈ ఐదు నెలల్ కూటమి ప్రభుత్వంలో క్రైమ్ రేటు చాలా తగ్గిందని మంత్రి అనిత స్పష్టం చేశారు.
మహిళల అత్యాచారాలపై అసెంబ్లీలో వాడివేడి చర్చ..
ఏపీకి మరో తుపాను ముప్పు.. 23న బంగాళాఖాతంలో అల్పపీడనం
ఏపీకి మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఈ నెల 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆపై పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో తుపాను దిశ మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నెల 26, లేదంటే 27 నాటికి శ్రీలంకకు ఉత్తర దిశగా రానుందని పేర్కొన్నారు. దీని ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై పడే అవకాశం ఉందని హెచ్చరించారు. మరోవైపు, బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమలో పలుచోట్ల, దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
ఏపీలో భవన నిర్మాణ అనుమతులకు కొత్త విధానం: మంత్రి నారాయణ
నెల్లూరు నగర పాలక సంస్థలో వివిధ శాఖల అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష
త్వరలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని వెల్లడి
ఏపీలో భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి కొత్త విధానాన్ని త్వరలో తీసుకురానున్నట్లు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో మంత్రి నారాయణ వివిధ విభాగాల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. డిసెంబర్ 15 నాటికి భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి కొత్త విధానం అమలులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలోనే అసెంబ్లీలో బిల్లు పెడతామని పేర్కొన్నారు. 20 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తర్వాత కొత్త విధానాలను రూపొందించామని వెల్లడించారు. అభివృద్ధికి ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేసిన మంత్రి నారాయణ .. నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల అభివృద్ధి కోసం ప్రజలు తాము చెల్లించాల్సిన పన్నులను సత్వరమే కట్టాలని కోరారు. పన్నుల వసూళ్లకు గానూ రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌ను సైతం నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో వాణిజ్య సంస్థల బకాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.
ఢిల్లీలో ప్రమాదకరస్థాయికి వాయు కాలుష్యం… స్టేజ్-4 ఆంక్షలు
దేశ రాజధాని ఢిలీలో క్షీణిస్తున్న గాలి నాణ్యత
నేటి నుండి మరి కొన్ని ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయం
తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ పాఠశాలల తరగతులు ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని సీఎం ఆదేశం
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ ప్రమాదకర స్థాయికి చేరుకోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు ఆంక్షలు విధించిన ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (సీఏక్యూఎం) తాజాగా మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో గ్రేటెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) 4 కింద మరిన్ని నిబంధనలను ఈ రోజు (సోమవారం,18వ తేదీ) నుండి అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ రాత్రి 7 గంటల సమయానికి 457కి పెరుగుతోంది. దీంతో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఢిల్లీలోని పాఠశాలల్లో కేవలం ఆన్‌లైన్ తరగతులే నిర్వహించనున్నట్లు సీఎం అతిశీ ప్రకటించారు.
నేటి నుండి అమలు అవుతున్న నిబందనలు ఇవి
లిఢిల్లీలోకి ట్రక్కుల (నిత్యావసర వస్తువులు, సర్వీసులు అందించే ట్రక్కులు మినహా) కు ప్రవేశాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎల్ఎన్‌జీ, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్, బీఎస్ 4 డీజిల్ ట్రక్కులు మాత్రమే అనుమతి. ఢిల్లీ వెలుపల రిజిస్ట్రేషన్‌తో ఉన్న తేలికపాటి కమర్షియల్ వాహనాలపై నిషేధం. అయితే ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ బీఎస్ ఉ 4 అంతకన్నా పాత డీజిల్ రవాణా వాహనాల ప్రవేశంపై నిషేధం.
అన్ని నిర్మాణ సంబంధిత కార్యకలాపాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆదేశాలు. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్ వంతెనలు, పవర్ లైన్‌లు, పైపులైన్‌లు.. ఇలా నిర్మాణ సంబంధిత ప్రాజెక్టులను నిలిపివేస్తూ ఆదేశాలు.
ఎన్ఆర్‌సీ ప్రాంతంలో కార్యాలయాలు అన్నీ 50 శాతం సామర్థ్యంతో పని చేసేలా చూడాలని, మిగతా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సిఫార్సు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వొచ్చని సూచన.
రాష్ట్ర ప్రభుత్వ కళాశాలలను మూసివేయడంతో పాటు సరి బేసి వాహన నిబంధనలు అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ సూచించింది.
ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు చుక్కెదురు..
అరెస్ట్ నుంచి రక్షించలేమన్న హైకోర్టు!
ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ వర్మ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. కేసు వివరాల్లోకి వెళ్తే… గత ఎన్నికలకు ముందు ఃవ్యూహంః చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను కించపరిచేలా వర్మ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెట్టారు. సినిమాలో సైతం వీరిని కించపరిచే పలు సన్నివేశాలు ఉన్నాయి. ఈ క్రమంలో వర్మపై ఉమ్మడి ప్రకాశం జిల్లా మద్దిపాడుకు చెందిన టీడీపీ నేత రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ విచారణకు హాజరుకావాలంటూ హైదరాబాద్ లో ఉన్న వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసుల ప్రకారం రేపు పోలీసు విచారణకు వర్మ హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలని, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. అరెస్ట్ నుంచి తాము రక్షించలేమని వర్మ న్యాయవాదికి కోర్టు స్పష్టం చేసింది. ఏదైనా ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. రేపటి పోలీసు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
ఆధార్ లో పుట్టిన తేదీ మార్పుపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం
ఆధార్ కార్డ్.. సిమ్ కార్డు కొనుగోలు చేయడం మొదలు ప్రభుత్వ సంక్షేమ పథకం వరకు ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ఇంతటి కీలకమైన కార్డులో మార్పులు చేర్పులు చేయాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా నిరక్షరాస్యులైన వృద్ధులు పుట్టిన తేదీ నమోదులో, మార్పులు చేర్పులు చేయడానికి అవస్థ పడే పరిస్థితి నెలకొంది. వయసు నిర్ధారణ విషయంలో ప్రూఫ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా ఆధార్ లో వయస్సు ధ్రువీకరణకు పదో తరగతి మెమో లేదా స్టడీ సర్టిఫికెట్ తప్పనిసరి. చదువుకోని వారికి ఈ సర్టిఫికెట్లు లేక డేటాఫ్ బర్త్ లో మార్పులు చేసుకోవడం కష్టమవుతోంది.
ఈ విషయం గుర్తించిన ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిరక్షరాస్యులైన వృద్ధుల ఆధార్ కార్డులో పుట్టిన తేదీలో మార్పులు చేర్పులకు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఇచ్చే వయస్సు ధ్రువీకరణ పత్రాలను అనుమతించాలని నిర్ణయించింది. పంచాయితీ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్లు అందించే సర్టిఫికెట్ల మాదిరిగానే ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఇచ్చే పత్రాలను ప్రూఫ్ గా అంగీకరించేలా మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సర్టిఫికెట్ దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోనుంది. ప్రతీ సర్టిఫికెట్ పై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ నిర్ణయం అమలులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లోని నిరక్షరాస్యులైన వృద్ధులకు మేలు కలగనుంది.
గ్రంథాలయ ఉద్యమకారుల సేవలు మరువలేనివి…
గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి
విశాలాంధ్ర ధర్మవరం : గ్రంథాలయ ఉద్యమకారుల సేవలు మరువలేనివని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన గ్రంథాలయ శాఖలో ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు గ్రంధాలయ వారోత్సవాల కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మూడవరోజు గ్రంథాలయ వారోత్సవాల ఉద్యమకారుల చిత్రపటానికి శంకర్ రెడ్డి, అంజలి సౌభాగ్యవతి, సిబ్బంది, పాఠకులు పూలువేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రంథాలయ అభివృద్ధి కోసం అయ్యంకి వెంకట రమణయ్య, డాక్టర్ ఎస్సార్ రంగనాథ్, పాతూరి నాగభూషణం మొదలగువారు అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. గ్రంథాలయ అభివృద్ధి వల్లనే స్వాతంత్ర ఉద్యమం సమగ్రంగా ముందుకు తీసుకుపోవడం జరిగిందని తెలిపారు. అనంతరం విద్యార్థులకు గ్రంధాలయాలు వాటి ప్రాముఖ్యత అన్న అంశంపై వ్యాసరచన పోటీలను గ్రంథాలయంలో వివిధ పాఠశాలల నుంచి 50 మందికి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్ శ్రీనివాసులు గ్రంథాలయ సిబ్బంది శివమ్మ, రమణ నాయక్, గంగాధర్,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠకులు పాల్గొన్నారు.
బాలలు మన జాతీయ సంపద.. కాపాడవలసిన బాధ్యత అందరిది…
విశాలాంధ్ర – శెట్టూరు (అనంతపురం జిల్లా) : బాలలు మన జాతీయ సంపద కాపాడవలసిన బాధ్యత అందరి పైన ఉందని ఆర్డిటి రీజియన్ డైరెక్టర్ సుబ్బారావు,సిడిపిఓ వనజక్కమ్మ, ఎంఈఓ శ్రీధర్, డాక్టర్ తరుణ్ సాయి పేర్కొన్నారు శనివారం మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్డిటి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల హక్కుల పరిరక్షణ చైతన్య వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యక్తులు మాట్లాడుతూ బాలలు మన జాతీయ సంపద వారిని కాపాడవలసిన భాద్యత ప్రతి ఒక్కరిది అలాగే బాలలు కుడా తమ హక్కులను మరియు భాధ్యతలను తెలుసుకొని నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా భవిషత్తు లో ప్రతి ఒక్కరు అత్యన్నత స్థాయికి ఎదగాలని వారు సూచించారు.ఆర్ డి టి సంస్థ ప్రభుత్వ శాఖల సమన్యాయంతో బాలల హక్కుల వారోత్సవాలు ప్రభుత్వం బాలలకు కల్పించిన ప్రధానమైన హక్కులు 1.జీవించే హక్కు 2.అభివృద్ధి చెందే హక్కు 3.రక్షణ పొందే హక్కు 4.భాగస్వామ్యపు హక్కులు గురించి తెలియ జేస్తూ ప్రతి ఒక్కరు సమిష్టిగా బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్ డి టి మహిళ విభాగం టీం లీడర్ ఆదినారాయణ, ఎస్సై రాంభూపాల్, లలితమ్మ, ఫిరోజ్ ఖాన్, సుశీలమ్మ, సూపర్వైజర్ రాధమ్మ విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు
వాస్తవాలను వెలికిదీస్తే దుర్భాషలా!
తెలుగు యువత అధ్యక్షుడు కావాడి ప్రవీణ్ కుమార్
విశాలాంధ్ర -తనకల్లు : వాస్తవాలను వెలికి తీస్తే దుర్భాషలాడడం హేయమైన చర్యని తెలుగు యువత అధ్యక్షుడు కావడి ప్రవీణ్ కుమార్ అధికారి తీరును ఖండించారు. నల్లచెరువు మండలంలో శుక్రవారం బీసీ హాస్టల్లో నాణ్యత గల భోజనం చేస్తున్నారా లేదా, హాస్టల్ లో ఉంటున్న పిల్లలకు భోజనం సరిగ్గా పెడుతున్నారా లేదా, విద్యార్థులందరికీ సరైన వసతులు ఉన్నాయా లేదా అని విచారణ చేయడానికి వచ్చిన విలేకరులను బిసి హాస్టల్ వార్డెన్ లక్ష్మీనారాయణ దురుసుగా మాట్లాడటం సమంజసం కాదని, హాస్టల్ వార్డెన్ లక్ష్మీనారాయణ తీరు మార్చుకోవాలన్నారు.విలేకరులకు క్షమాపణ చెప్పి వారితో సఖ్యతగా మెలగే విధంగా నడుచుకోవాలని తనకల్లు మండల తెలుగు యువత అధ్యక్షులు కావాడి ప్రవీణ్ కుమార్ కోరారు. ,సమాజ అభివృద్ధిలో విలేకరుల పాత్ర ప్రముఖమైనదని ప్రజా సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేస్తున్నాయని, వాస్తవాలను తెలియజేస్తూ నిష్పక్షపాతంగా పనిచేస్తున్నాయని, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ సమాజాభివృద్ధిలో కీలకంగా ఉన్నాయని, అలాంటి విలేకరులను అధికారులు గానీ రాజకీయ నాయకులు గాని ఎవరైనా కూడా దురుసుగా మాట్లాడకూడదని విలేకరులతో సఖ్యతగా ఉంటూ వారి పనితీరుకు సహకరించే విధంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని అన్నారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని పాత్రికేయులందరికీ శుభాకాంక్షలతో పాటు తమ వృత్తిలో ఉన్నత స్థానాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.
వ్యవసాయమా…. మేము పిల్లనివ్వం…?
యువ వ్యవసాయదారులకు పెళ్లిళ్లు కష్టమేనా…?
రాబోయే కాలంలోనైనా రైతన్నను గుర్తించేరా….?
విశాలాంధ్ర -చిలమత్తూర్ రూరల్….(శ్రీ సత్య సాయి జిల్లా) : పూర్వకాలంలో వ్యవసాయం చేసేవారు చెడిపోరన్నది ఒకప్పటి మాట, ప్రస్తుత కాలం పంటలు పండించేవారు చెడిపోతున్నారన్నది నేటి మాట, గత పూర్వకాలం వ్యవసాయమే రైతులకు ఆధారం, నేడు ఎవరినైనా వ్యవసాయం చేస్తారా అని ప్రశ్నిస్తే చేయమని ముఖం మీదే చెప్పేస్తారు, గతంలో పంట పొలాలు గడ్డివాములు పశువుల గోదాములు, ఎరువు దిబ్బలు పరిశీలించి పిల్లను ఇచ్చేందుకు ఆసక్తిగా ముందుకు వచ్చేవారు, ప్రస్తుతం అది పూర్తిగా మారిపోయింది వ్యవసాయ యువ రైతులు పెళ్లి సంబంధాలు చూడడానికి వెళితే నీవు ఏం చేస్తావు అంటూ ప్రశ్నిస్తారు తాను మంచి వ్యవసాయ దారుడు అంటే పిల్లను ఇచ్చేందుకు ముఖం చాటేస్తూ అయితే మళ్లీ ఫోన్ చేస్తాము అంటూ సమాధానం వస్తుంది దీంతో యువ రైతులు పెళ్లి కాక వ్యవసాయాన్ని చేయలేక పొట్ట చేత పట్టుకొని చిన్నచిన్న ఉద్యోగాల కోసం వలస వెళ్లే దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సమాజంలో దాదాపు రైతులు వ్యవసాయం చేయడానికి ఇష్టపడడం లేదని తెలుస్తుంది పట్టణాలలో ఏదైనా పరిశ్రమలో చిన్న ఉద్యోగం ఉంటే చాలు కాళ్లు కడిగి పిల్లను ఇచ్చి పెళ్లి చేస్తారు ఎంత పెద్ద వ్యవసాయదారుడైన సరే పిల్లను ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో వందలాదిమంది యువ రైతులు ఇప్పటికీ చిరంజీవులుగా మారిపోతూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యవసాయం ఎటు పోతుంది పట్టడు అన్నం పెట్టే రైతన్న ఏమి కావాలి వ్యవసాయ ఉత్పత్తు లు ఎలా ప్రజలకు అందాలి అన్న ప్రశ్నలు మేధావుల్లో తలెత్తుతున్నాయి. వ్యవసాయం ఉద్యోగముగా మారాలంటే ప్రభుత్వాలు రైతన్నకు చేయూతనిచ్చి రైతును రాజుగా మార్చే వైపు అడుగులు వేయాల్సి ఉంది. రైతే రాజు దేశానికి వెన్నెముక లాంటివాడు రైతు అంటూ ప్రభుత్వాలు అంటున్నాయే కానీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ప్రభుత్వాల మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి అని తెలుస్తుంది. రైతు చెమటోడ్చి పండించిన పంటకు సరైన ధర దేవుడెరుగు కనీసం మద్దతు ధర కూడా లేదు. దీనికి తోడు తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాలు తో రైతులు అప్పుల్లో చిక్కుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో దాదాపు వేరుశెనగ పంట తగ్గిపోయింది, ఎటు చూసినా బీడులుగా దర్శనమిస్తున్నాయి అతివృష్టి అనావృష్టి వల్ల పెట్టిన పెట్టుబడి చేతికందక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు బంగారు నగలు తాకట్టు పెట్టి కాడెద్దులు తెగ నమ్ముకొని దళారుల వద్ద అప్పులు చేసి అవస్థలు పడుతున్నారు. ఒకప్పుడు బాగా బ్రతికిన కుటుంబాలు స్థానికంగా కూలి పనులు చేయలేక మనసు రాక పట్టణాలకు వలస వెళ్లి కూలి పనులు చేసు కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీలలో ఆర్బికేలు ద్వారా విత్తనాలు ఎరువులు పెట్టుబడి సాయం అందించేవారు. కూటమి ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం క్రింద రూ 20 వేలు ఇస్తామని చెప్పిన మాటలను నిలబెట్టుకోవాలని ఇప్పటికే సిపిఐ పార్టీ తరఫున రైతు సంఘం నాయకులు నియోజక వర్గ వ్యాప్తంగా అధికారులకు వినతి పత్రాలు అందించడం జరిగినది. ఖరీఫ్ సీజన్ పూర్తి అవుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి సహాయం అందకపోవడంతో పల్లెలు కాళీ అయిపోతాయేమో అనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ఏ విధంగా రైతన్నలు బతికీడుస్తారో వేచి చూడాల్సిందే. రాబోయే కాలానికైనా రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక లాంటివాడు అవుతాడేమో వేచి చూద్దాం.