Home Blog Page 1490

భారీ మెజార్టీతో ప్రియాంకా గాంధీ ఘన విజయం

రాహుల్ రికార్డ్ బ్రేక్
మూడు ల‌క్ష‌ల పైచిలుకు మెజార్టీతో ప్రియాంక విజ‌యం
రెండో స్థానంలో సిపిఐ అభ్యర్ధి
మూడో ప్లేస్ లో నిలిచిన బిజెపి న‌వ్య హ‌రిదాస్

వ‌య‌నాడ్‌: కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ పార్ల‌మెంట్ ఉప ఎన్నిక‌ల్లో స‌రికొత్త రికార్డు న‌మోదు అయ్యింది. కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ అత్య‌ధిక మెజారిటీతో విజ‌యాన్ని న‌మోదు చేయ‌నున్నారు. ఈ ఏడాది ఆ స్థానం నుంచి ఆమె సోద‌రుడు రాహుల్ గాంధీ సుమారు 3.65 ల‌క్షల ఓట్ల తేడాతో నెగ్గారు. అయితే రాహుల్ గాంధీ రాజీనామాతో ఆ స్థానం నుంచి ప్రియాంకా గాంధీ పోటీ చేశారు. ఉప ఎన్నిక‌లో ప్రియాంకా గాంధీ హుల్ మెజారిటీని దాటేశారు. తాజా స‌మాచారం ప్ర‌కారం .. ప్రియాంకా గాంధీ 3,82,517 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.. మొత్తం ప్రియాంకాకు 5.78 ల‌క్ష‌ల ఓట్లు పోల‌య్యాయి. రెండ‌వ స్థానంలో క‌మ్యూనిస్టు అభ్య‌ర్థి స‌త్య‌న్ మోక‌రి్కి 1.95 ల‌క్ష‌ల ఓట్లు రాగా, బీజేపీ అభ్య‌ర్థి న‌వ్య హ‌రిదాస్ ల‌క్ష ఓట్ల‌తో మూడ‌వ స్థానంలో నిలిచారు. రాహుల్ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానం నుంచి తన సభ్యత్వాన్ని నిలుపుకుంటూ వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. అందుకే రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ ఇక్కడ జరుగుతున్న ఉపఎన్నికలో మొదటిసారి పోటీ చేశారు. మొద‌టిసారి పోటీ చేసినా ఆమె ఘన విజయం సాధించారు.

కర్నూలుకు హైకోర్టు బెంచ్ రావడం హర్షనీయం

0

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఆమోదం తెలుపడం హర్షనీయమని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు కోడిగుడ్ల ఏసేపు తెలిపారు. శనివారం మండల కేంద్రమైన పెద్దకడబూరులో ఆయన మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగంలో అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి జరగాలని ఉత్తరాంధ్రలో విశాఖ, రాయలసీమలో కర్నూలు అభివృద్ధి కావాలన్నారు. గతంలో రాజధాని పేరుతో వైసీపీ మూడు ముక్కలాట ఆడారని ఆరోపించారు. చంద్రబాబు సాధ్యమైనంత త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ పూర్తి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాళ్ల సీమలా ఉండే రాయలసీమకు నీళ్లు అందించారని, లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కర్నూలులోనే ఉంటున్నాయని గుర్తు చేశారు.

పారిశుద్ధ్య కార్మికులకు పరకలు కూడా ఇవ్వలేని దుస్థితిలో నగర పాలక సంస్థ సిగ్గుచేటు

ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్

విశాలాంధ్ర- అనంతపురం : అనంతపురము నగర పాలక సంస్థ పారశుద్ధ్య కార్మికులకు పనిముట్లు వెంటనే ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ ) ఆధ్వర్యంలో శనివారం పాతవూరు గాంధీ బజార్ నందు చెట్ల కొమ్మలతో రోడ్లు ఊడ్చి నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ ) జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్ మాట్లాడుతూ… నగర పాలక సంస్థలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతూ చేయని పనులకు కూడా లక్షల రుపాయలు బిల్లులు చేసుకుంటున్నారన్నారు. ప్రజలు రోగ్యాలు పాలవకుండా నగరాన్ని శుభ్రంగా ఉంచుతున్న కార్మికులకు సంబంధించిన పనిముట్లు తెప్పించడానికి మాత్రం అధికారులు,పాలక వర్గం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోని కార్మికుల సమస్యలు పట్టించుకోకపోయినా కార్మికులు నిరంతరం ప్రజా సేవలో ఉన్నారన్నారు. కానీ పనిమూట్లు కూడా ఇవ్వకుంటే కార్మికులు ఏ విధంగా పనిచేయాలన్నారు. నగర జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య లేకపోయినా పనిభారం ఎక్కువ ఉన్నప్పటికి కార్మికులు నిత్యం పనిలో ఉన్నారన్నారు. నెలల తరబడి కనీసం పరకలు కూడా ఇవ్వని నగర పాలక సంస్థ ఇప్పటికైనా మొద్దునిద్ర నుండి మేల్కొని కార్మికులకు పనిముట్లు వెంటనే ఇవ్వాలన్నారు. లేని పక్షంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గా ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చిరంజీవి,సమితి సభ్యులు నాగేంద్ర బాబు,తిరుమలయ్య,దేవమ్మ,ఎర్రప్ప,నాయకులు మాధవయ్య,రామాంజి,కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

2 లక్షలకు పైగా మెజార్టీలో ప్రియాంకాగాంధీ

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. కేరళలోని వయనాడ్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఆమె పోటీ చేశారు. ఎన్నికల ఫలితాల్లో ఆమె జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె 2 లక్షలకు పైగా మెజార్టీతో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికలో ప్రియాంకపై బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్, సీపీఐ అభ్యర్థి సత్య మొకేరి పోటీలో ఉన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో వయనాడ్ స్థానం నుంచి రాహుల్ గాంధీ 4.3 లక్షల మెజార్టీతో గెలుపొందారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్ 3.6 లక్షల మెజార్టీతో విజయం సాధించారు. అయితే యూపీలోని రాయ్ బరేలీ స్థానం నుంచి కూడా గెలుపొందిన రాహుల్… వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉపఎన్నిక జరిగింది. ఈ స్థానంలో ప్రియాంక బరిలోకి దిగారు. నవంబర్ 13న ఈ స్థానంలో పోలింగ్ జరిగింది.

ఫిర్యాదులపై కఠినంగా వ్యవహరించాలి: పవన్ కల్యాణ్

డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ తనకు వస్తున్న వివిధ ఫిర్యాదులపై ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, దేవాదాయ శాఖ పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలతో పాటు ప్రైవేటు భూముల ఆక్రమణలపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులపై అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు కాకినాడ పోలీసులు తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదులపై కఠినంగా వ్యవహరించాలని పవన్ సూచించారు. ఫిర్యాదులపై ప్రాధాన్యతను ఇస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని చెప్పారు. ఈ సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించడానికి తమ ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేయడం, రాష్ట్ర వనరులను రక్షించడంలో, నేరస్థులను బాధ్యులను చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కల్యాణ్ రాసుకొచ్చారు.

అదానీకి సెబీ షాక్.. విచారణ ప్రారంభం!

బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతం అదానీకి ఇది షాకింగ్ న్యూసే. సోలార్ పవర్ కాంట్రాక్ట్‌ల కోసం ఆంధ్రప్రదేశ్, ఒడిశా సహా ఇతర రాష్ట్రాల అత్యున్నత స్థాయి వ్యక్తులకు దాదాపు రూ. 2,200 కోట్ల లంచం ఇచ్చినట్టు అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ సహా ఇతరులపై అమెరికాలో అభియోగాలు నమోదైన వేళ సెక్యూరిటీస్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రంగంలోకి దిగింది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ నుంచి గ్రాండ్ జ్యూరీ ఆదేశాలను అదానీ గ్రూప్ ఉల్లంఘించిందో, లేదో తెలుసుకునేందుకు సెబీ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. అలాగే, షేర్ల ధరలను ప్రభావితం చేయగలిగే సమాచారాన్ని తప్పనిసరిగా వెల్లడించాలన్న నిబంధనలను అదానీ గ్రూప్ ఉల్లంఘించిందా? అన్న కోణంలో విచారిస్తున్నట్టు తెలిసింది. లంచం ఆరోపణలపై అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ దర్యాప్తు సమాచారాన్ని సమగ్రంగా వెల్లడించడంలో అదానీ గ్రీన్ ఎనర్జీ విఫలమైందా? అన్న విషయాన్ని తెలుసుకోవాలని స్టాక్ ఎక్స్‌చేంజ్ అధికారాలను సెబీ కోరినట్టు సమాచారం.

అసెంబ్లీలో ఆర్ధిక కమిటీల ఎన్నిక ..

ఎన్నికైన సభ్యుల పేర్లను శాసనసభలో ప్రకటించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఫైనాన్షియల్ కమిటీల్లో భాగంగా శాసనసభ ప్రజాపద్ధుల కమిటీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ), శాసనసభ అంచనాల కమిటీ (ఎస్టిమేట్స్ కమిటీ) మరియు ప్రభుత్వ సంస్థల కమిటీ (పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ) లకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను శాసన సభ నుండి సభ్యులను ఎన్నుకున్నారు. రాష్ట్ర శాసనసభ కమిటీ హాల్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ సహా కూటమి ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైసీపీ ఓటింగ్‌ను బహిష్కరించింది. అసెంబ్లీ సంప్రదాయకంగా ప్రతిపక్ష పార్టీకి పీఏసీ చైర్మన్ పదవి అప్పగిస్తారన్న భావనతో వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తొలుత నామినేషన్ దాఖలు చేశారు. అయితే శాసనసభలో వైసీపీ ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సభ్యుల గెలుపుకు అవసరమైన బలం లేకపోవడంతో కూటమి ఎమ్మెల్యేలు పోటీకి బరిలో దిగారు. కమిటీల్లో సభ్యుడుగా ఎన్నిక అవ్వాలంటే 20 ఓట్లు రావాలి. కానీ వైసీపీకి శాసనసభలో 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో నామినేషన్ దాఖలు చేసినప్పటికీ ఓటింగ్‌కు వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. కాగా, ఓట్ల లెక్కింపు కార్యక్రమం పూర్తయిన తర్వాత కమిటీల వారీగా ఎన్నికైన సభ్యుల పేర్లను శాసనసభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.

ప్రజా పద్దుల కమిటీ సభ్యులుగా ఆనంద బాబు నక్కా, ఆరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి ముతుముల, బూర్ల రామాంజనేయులు, బి. జయనాగేశ్వర్ రెడ్డి, కొల్లా లలిత కుమారి, శ్రీ రాజగోపాల్ శ్రీరామ్, శ్రీ రామాంజనేయులు పులపర్తి, విష్ణుకుమార్ రాజు పెన్మెత్స ఎంపికైనట్లు ప్రకటించారు.

అంచనాల కమిటీ సభ్యులుగా అఖిల్ ప్రియ భూమా, బండారు సత్యానంద రావు, జయకృష్ణ నిమ్మక, జోగేశ్వరరావు వేగుళ్ల, కందుల నారాయణరెడ్డి, మద్దిపాటి వెంకటరాజు, పార్థసారథి వాల్మీకి, పసిం సునీల్ కుమార్, ఏలూరి సాంబశివరావు ఎంపికైనట్లు ప్రకటించారు.

ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ సభ్యులుగా అయితా బత్తుల ఆనందరావు, ఈశ్వర్ రావు నడికుడిటి, గిడ్డి సత్యనారాయణ, గౌతు శిరీష, కూన రవికుమార్, కుమార్ రాజా వర్ల, ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన), తెనాలి శ్రావణ్ కుమార్, వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఎంపికైనట్లు ప్రకటించారు.

ఝార్ఖండ్ లో ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య హోరాహోరీ

ఆధిక్యంలో మెజారిటీ మార్కు దాటేసిన ఇండియా కూటమి
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వెనుకంజ

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. క్షణానికోసారి ట్రెండ్స్ మారుతుండడంతో ఎన్డీయే, ఇండియా కూటమి నేతల్లో టెన్షన్ నెలకొంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైన కౌంటింగ్.. పది గంటల వరకు ఇరు కూటముల మధ్య ఆధిక్యం మారుతూ వచ్చింది. కాసేపు ఎన్డీయే కూటమి లీడ్ లో ఉండగా, మరికాసేపు ఇండియా కూటమి లీడ్ లోకి దూసుకొచ్చింది. పదిన్నరకు ప్రస్తుత ముఖ్యమంత్రి, జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి ఆధిక్యంలో మెజారిటీ మార్క్ దాటేసింది. మొత్తం 81 స్థానాలున్న ఝార్ఖండ్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 41 సీట్ల (మ్యాజిక్ ఫిగర్) లో గెలవాల్సి ఉండగా.. ఇండియా కూటమికి చెందిన అభ్యర్థులు ప్రస్తుతం 51 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఓ దశలో 39 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగిన ఎన్డీయే కూటమి తాజాగా 28 స్థానాలకు పడిపోయింది. అయితే, ఇంకా కౌంటింగ్ చాలా వుంది కాబట్టి, ట్రెండ్ మారే అవకాశం ఉందని, తమ కూటమే గెలుస్తుందని ఎన్డీయే నేతలు ఆశాభావంతో ఉన్నారు.

26 న కలెక్టరేట్ ముందు జరుగు ధర్నాను జయప్రదం చేయండి

విద్యత్ ఉద్యోగుల కళాభారతిలో జరుగుతున్న అవినీతి పై విజిలెన్స్ విచారణ చేపట్టాలి
విశాలాంధ్ర- అనంతపురం : విద్యుత్ కళాభారతిలో 12 సంవత్సరాలుగా అవినీతికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి డిమాండ్ చేశారు.
ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ అధ్యక్షతన జిల్లా ఆఫీస్ బేరర్స్ మరియు ముఖ్య నాయకుల సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ… విద్యుత్ ఉద్యోగుల కళాభారతి లో జరిగే అవినీతిపై విజిలెన్స్ అధికారులు విచారణ జరపాలన్నారు,దాదాపుగా 12 సంవత్సరాలు నుండి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారన్నారు. ఓపెన్ టెండర్లు ద్వారా దాదాపుగా సుమారుగా 70 లక్షల నుండి 80 లక్షల వరకు డిపాజిట్ అవుతున్నాయి,ఆ డబ్బులు ఎక్కడ అనే అయోమయంలో ఉద్యోగులున్నారన్నారు. విద్యుత్ కళాభారతిలో అవినీత ఆక్రమాల పైన అధికారుల నిర్లక్ష్యం పైన నిరసిస్తూ భవిష్యత్తులో విద్యుత్ ఉద్యోగుల కళాభారతిని కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఏఐటీయూసీ గా హెచ్చరించారు.
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక,రైతు,ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక,రైతు సంఘాల పిలుపులో భాగంగా నవంబర్ 26 న అనంతపురము కలెక్టరేట్ ముందు జరుగు ధర్నాను జయప్రదం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ చట్టాలను తుంగలోతొక్కి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు. కార్పొరేట్లకు అనుకూలంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి 44 కార్మిక చట్టాలను కొనసాగించాలన్నారు. కనీస వేతనాలు 26 వేలుకు పెంచుతున్నామని కేంద్రం ప్రకటించినా అమలుకుమాత్రం నోచుకోవడం లేదన్నారు. అసంఘటిత రంగ కార్మికులు అయిన ఆటో,హమాలీ,వీధి వ్యాపారస్తులకు సంక్షేమ బోర్డు ఏర్పాటుచేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయకుండా నిలుపుదల చేసే భాధ్యత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. రైతుల నల్ల చట్టాలను రద్దు చేయాలని 13 నెలలు పాటు దేశ రాజధాని డిల్లీలో ఉద్యమం నిర్వహించి 750 మంది రైతులు ప్రాణత్యాగం చేసిన ఓక్క రైతుకు కూడా పారితోషికంగా ఓక్క రుపాయ కూడా ఇవ్వలేదన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం వలన ప్రతి ఏడాది రైతులు 3 లక్షల కోట్లు నష్టపోతున్నారన్నారు. రైతులకు పంట రుణాలు రద్దు చేయని కేంద్ర ప్రభుత్వం గడిచిన 10 సం,,ల్లో కార్పొరేట్ కంపెనీలకు 19 లక్షల కోట్లు రద్దు చేయడం దుర్మార్గమన్నారు, నవంబర్ 26 న కలెక్టరేట్ల ముందు జరుగు ధర్నాను జయప్రదం చేయాలని పిలిపునిచ్చారు,
ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణుడు,జిల్లా ఉపాధ్యక్షులు నాగవేణి,శ్రీనివాసులు,జిల్లా కార్యదర్శులు చిరంజీవి,రాజు,ఇబ్రహీం,ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున,మధ్యాహ్న భోజన పథకం యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ సి ఎం భాషా తదితరులు పాల్గొన్నారు.

గర్భిణీలు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా శ్రద్ధ తీసుకోవాలి.. డాక్టర్ ప్రియాంక, చిన్నప్ప


విశాలాంధ్ర ధర్మవరం : గర్భిణీలు తమ ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా శ్రద్ధ తీసుకోవాలని డాక్టర్ ప్రియాంక, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు చిన్నప్ప, కార్యదర్శి మంజునాథ్, ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని కొత్తపేటలో గల పట్టణ ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీని వైద్యులు, సిస్టర్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రియాంక అధ్యక్షులు చిన్నప్ప కార్యదర్శి మంజునాథ్ మాట్లాడుతూ ప్రతి మహిళ గర్భిణీగా ఉన్నప్పుడు నెలవారీగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు, టీకాలు పొందాలన్నారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు అందరూ కూడా గర్భిణీ స్త్రీలకు అన్ని సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. పౌష్టిక ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. తదుపరి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం పొందాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా వర్తిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి విరాళం అందించిన వరప్రసాద్ కు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు రామకృష్ణ, గట్టు వెంకటేష్, జింక చిన్నప్ప, ఆసుపత్రి సిబ్బంది, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు.