Friday, January 10, 2025
Home Blog Page 17

అనంత మిత్ర మున్సిపాలిటీ సమస్యల ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన

జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర అనంతపురం : అనంతపురం రేడియో స్టేషన్ లో గురువారం ఉదయం 7:45 గంటల నుంచి 8:15 గంటల వరకు ఆకాశవాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 18 మంది కాలర్లు ఫోన్ ద్వారా తమ సమస్యలను తెలియజేయగా, ఈ విషయమై ప్రజలకు, అధికారులకు, జిల్లా కలెక్టర్ తగు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ విశ్వనాథ్, అనంతపురం మున్సిపల్ కమిషనర్ ఇంచార్జ్ రామలింగేశ్వర్, డైరెక్టర్ ఆకాశవాణి అనంతపురం నాగేశ్వరరావు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

5న కళ్యాణదుర్గం నియోజకవర్గం లో అమరవీరుల స్తూపం ప్రారంభోత్సవం

విశాలాంధ్ర- అనంతపురం : కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం లో కుందుర్పి మండలం, బెస్తరపల్లి గ్రామంలో అమరవీరుల స్తూపాన్ని ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు కామ్రేడ్, కె .రామకృష్ణ, కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్ ల చేతుల మీదుగా ఆవిష్కరిస్తారని గురువారం జిల్లా కార్యదర్శి జాఫర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కళ్యాణదుర్గం కమ్యూనిస్టు పార్టీకి పురిటి గడ్డ బెస్తరపల్లి కేంద్రంగా 1950 దశకంలో దున్నేవాడికి భూమి నినాదంతో శివాయిజమ భూములు, బంజరు భూములు, భూస్వాముల, పెత్తందారుల, కబంధహస్తాల్లో బినామీ పేర్ల మీద ఉన్న భూములు, దేవాలయ భూములు 45 వేల ఎకరాలకు పైబడి పంచిన ఘనమైన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉందన్నారు. చారిత్రక భూ పోరాట ఉద్యమంలో పాల్గొన్న విప్లవ యోధులను స్మరిస్తూ పోరాట స్ఫూర్తికి చిహ్నంగా అమరవీరుల స్తూపంతో పాటు సిపిఐ ఆఫీసు గ్రంథాలయం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శత వార్షికోత్సవాల కార్యక్రమంలో భాగంగా 130 మంది అమరవీరుల పేర్లు లిఖిస్తూ జనవరి 5 న అమరవీరుల స్తూపావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మేధావులు, కవులు, కళాకారులు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు సానుభూతిపరులు, అలనాటి పోరాట యోధుల వారసులు ,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

టిడిపి విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేద్దాం

ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

విశాలాంధ్ర,కదిరి. కదిరి పట్టణం సమీపంలోని మదనపల్లి రోడ్డులో పివిఆర్ ఫంక్షన్ హాల్ నందు జరిగే నియోజకవర్గ టిడిపి విస్తృతస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పిలుపునిచ్చారు.గురువారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేడు (3వ తేది) మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే నియోజకవర్గ విస్తృత సమావేశానికి గ్రామస్థాయి కమిటీ సభ్యులు మండల స్థాయి కమిటీ సభ్యులు,
మండల కన్వీనర్లు, మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల ఇంచార్జులు, బూత్ కమిటీ సభ్యులు హాజరై సమావేశాన్ని జయ ప్రదం చెయ్యాలని తెలిపారు.

మ‌ను బాక‌ర్, గుకేష్, హర్మన్ ప్రీత్ సింగ్, ప్రవీణ్ కుమార్ ల‌కు ఖేల్ ర‌త్న అవార్డులు

ఒలింపిక్ షూట‌ర్ మ‌ను బాక‌ర్ , ప్రపంచ చెస్ ఛాంపియ‌న్ గుకేష్ . హాకీ ప్లేయ‌ర్ హ‌ర్మ‌న్ ప్రీత్ సింగ్ , పారా ఒలింపియ‌న్ ప్ర‌వీణ్ కుమార్ ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఖేల్ ర‌త్న అవార్డులు ప్ర‌క‌టించింది. షూటింగ్ విభాగంలో ఓలింపిక్స్ లో ప‌త‌కాలు సాధించిన దానికి గుర్తింపుగా మ‌ను బాక‌ర్ కు, చెస్ లో ప్ర‌పంచ చాంపియ‌న్ గా నిలిచిన గుకేష్ , భార‌త్ హ‌కీ కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ సింగ్ , పారా ఒలింపిక్స్ విజేత ప్ర‌వీణ్ కుమార్ ల‌కు కు ఈ ఏడాది ఖేల్ ర‌త్న అవార్డుల‌తో స‌త్క‌రిస్తున‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఈ అవార్డుల‌ను ఈ నెల 17 వ తేదిన రాష్ట్ర‌ప‌తి అంద‌జేయ‌నున్నారు. ఇక 32 మందికి అర్జున్ అవార్డుల‌తో పాటు ముగ్గురికి దోణాచార్య అవార్డ‌ల‌ను కూడా కేంద్ర ప్ర‌క‌టించింది. ప‌ద్మ‌శ్రీ అవార్డు పొందిన వారితో ఎపికి చెందిన జ్యోతి ఎర్రాజీ కూడా ఉన్నారు.

బోరుగ‌డ్డ‌కు నో బెయిల్

వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్ కుమార్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టాడంటూ అనిల్ కుమార్‌పై అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ బోరుగడ్డ ఇటీవల హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై నేడు విచారణ చేపట్టిన ధర్మాసనం అతడి పిటిషన్‌ను కొట్టివేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్ బోరుగడ్డ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా ? అంటూ న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాగా, పిటిషనర్‌ అనిల్‌కు పూర్వ నేర చరిత్ర ఉందని, అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో నమోదైన కేసుల్లో ఇప్పటికే రెండు కేసుల్లో ఛార్జ్ షీట్ సైతం దాఖలైందని హైకోర్టుకు ప్రాసిక్యూషన్ తెలిపారు. ఈ కేసుల్లో బీఎన్ఎస్ సెక్షన్ 111 వర్తిస్తుందని ఆయన ధర్మాసనానికి వివరించారు. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. ఇలాంటి కేసుల్లో నిందితులను క్షమించడానికి వీల్లేదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు బోరుగడ్డ వేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేశారు.

న‌టి హేమ‌కు ఊర‌ట..

బెంగుళూరు హైకోర్టులో తెలుగు నటి హేమకు ఊరట ల‌భించింది. గత ఏడాది మేలో బెంగళూరులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్‌ పార్టీలో నటి హేమ డ్రగ్స్‌ సేవించడం, రైడ్‌ సమయంలో తప్పుడు పేర్లు, ఫోన్‌ నంబర్లు ఇవ్వడం, రేవ్‌ పార్టీలో నిషేధిత పదార్థాల గురించి ముందస్తుగా అవగాహన కల్పించడం, వీడియోస్టేట్‌మెంట్లు ఇవ్వడం ద్వారా దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడం వంటి అభియోగాలు పోలీసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంత‌రం ఆమెకు బెయ‌ల్ ల‌భించింది. ఇక ఈ కేసు విచారణపై స్టే కోరుతూ హేమ దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తు పరిశీలించిన జస్టిస్ అనుమతిస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేశారు.

గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ఈ సంవత్సరం మా అడుగులు ఉంటాయి

నూతన సంవత్సర వేళ పరిటాల శ్రీరామ్ కు శుభాకాంక్షల వెల్లువ

విశాలాంధ్ర ధర్మవరం : 2025లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ధర్మవరం నియోజకవర్గంలో మరింత అభివృద్ధి, సంక్షేమం చూస్తారని తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. నూతన సంవత్సరం వేళ ఆయనకు శుభాకాంక్షల వెల్లువ కనిపించింది. రామగిరి మండలం వెంకటాపురం తో పాటు ధర్మవరంలోని టిడిపి కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటల వరకు పరిటాల శ్రీరామ్ వెంకటాపురంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కోసం అందుబాటులో ఉన్నారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ధర్మవరంలోని టిడిపి కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో కార్యాలయ ప్రాంగణంలో కోలాహలం నెలకొంది. కార్యకర్తలు, అభిమానులు శ్రీరామ్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీపడ్డారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2025లో ధర్మవరం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు ఈ ఏడాది పార్టీ పరంగా శుభవార్తలు వింటారన్నారు. ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధికి గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ఈ సంవత్సరం మా అడుగులు ఉంటాయని శ్రీరామ్ స్పష్టం చేశారు.

40 ఏళ్ల తర్వాత భోపాల్ గ్యాస్ వ్యర్థాల తొలగింపు

భోపాల్ లో వేలాది మంది ప్రాణం తీసిన గ్యాస్ లీక్ దుర్ఘటనకు 40 ఏళ్లు.. అప్పట్లో లీకైన విష వాయువుకు సంబంధించిన వ్యర్థాలను యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఆవరణలో జాగ్రత్తగా నిల్వ చేశారు. ప్రస్తుతం ఈ వ్యర్థాలను తొలగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. తొలుత ఫ్యాక్టరీ ఆవరణలో నిల్వ చేసిన సుమారు 377 టన్నుల వ్యర్థాలను పిథంపూర్ ఇండస్ట్రియల్ ఏరియాకు తరలించి, ఇంజనీరింగ్ నిపుణులతో వాటిని మండించనున్నారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి విషపూరిత రసాయన వ్యర్థాలను 12 సీల్డ్ కంటైనర్లలో లోడ్ చేశారు. వంద మంది కార్మికులు షిప్టుల వారీగా (అరగంట చొప్పున) పనిచేశారు. పని పూర్తయ్యాక కార్మికులకు అధికారులు వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం కంటైనర్ ట్రక్కులు అక్కడి నుంచి 250 కిలోమీటర్ల దూరంలోని పిథంపూర్ కు బయలుదేరాయి. ట్రక్కులు జాగ్రత్తగా వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. పిథంపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ వ్యర్థాలను రామ్‌కీ ఎన్విరో ఇంజినీరింగ్ కళాశాల ఇంజనీర్ల ఆధ్వర్యంలో ధ్వంసం చేయనున్నారు. ఇందుకు 153 రోజులు పడుతుందని అధికారుల అంచనా.

కాగా, 1984 డిసెంబరు 2 అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో ప్రమాదకర మీథైల్ ఐసోసైనేట్ (ఎంఐసీ) గ్యాస్ లీక్ అయింది. ఈ విషవాయువు గాలిలో కలిసి ఫ్యాక్టరీ పరిసరాలతో పాటు భోపాల్ సిటీలో వ్యాపించింది. విషవాయువు కారణంగా ఫ్యాక్టరీ కార్మికులతో పాటు భోపాల్ లో మొత్తం 3,800 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ అక్కడి ప్రజలపై ఈ విషవాయువు దుష్ప్రభావాలు కనిపిస్తూనే ఉన్నాయి. చాలామంది వైకల్యంతో బాధపడుతున్నారు.

ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాజధాని అమరావతిలో రెండు ఇంజినీరింగ్ కాలేజీల నిర్మాణంతో పాటు రూ.2,733 కోట్లతో చేపట్టనున్న పనులకు కేబినెట్ ఓకే చెప్పింది. సీఆర్‌డీఏ 44వ సమావేశంలో నిర్ణయించిన రెండు పనులకు కూడా ఆమోదముద్ర వేసింది. మున్సిపల్‌ చట్టసవరణ ఆర్డినెన్స్‌కు అంగీకారం తెలిపింది. దీంతో భవనాలు, లేఅవుట్‌ల అనుమతుల జారీ బాధ్యత మున్సిపాలిటీలకు కట్టబెట్టినట్లైంది. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఇందులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, సీఎస్ విజయానంద్, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి పడకలను 100కు పెంచాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. వీటితో పాటు రామాయపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌ ఏర్పాటు, ఎస్‌ఐపీబీ అమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు, చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్‌ బెటాలియన్‌ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలంపై చర్చ జరుగుతోందని సమాచారం.

కాల్పులతో దద్దరిల్లిన న్యూయార్క్ నైట్ క్లబ్

కొత్త సంవత్సరం వేళ పేలుళ్లు, కాల్పులతో అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. న్యూ ఆర్లీన్స్ లో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఓ దుండగుడు వాహనంతో బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతలోనే లాస్ వెగాస్ లో పేలుడు సంభవించింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కు చెందిన లాస్ వెగాస్ లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ ఎదుట టెస్లా కారులో పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా… ఏడుగురు గాయపడ్డారు. తాజాగా న్యూయార్క్ లోని క్వీన్స్ కౌంటీలో ఉన్న అమజురా నైట్ క్లబ్ లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 11 మంది గాయపడ్డట్టు స్థానిక పోలీసులు తెలిపారు.