– యుటిఎఫ్ డిమాండ్
విశాలాంధ్ర- ధర్మవరం ; రాయచోటి ఉపాధ్యాయుని మృతికి కారకులైన వారిని వెలువెంటనే కఠినంగా శిక్షించాలని యూత్ జిల్లా అధ్యక్షులు సెట్టిపి జయ చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇజాజ్ అహమ్మద్ కుటుంబాన్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి అని తెలిపారు. రాయచోటి పట్టణం లోని కొత్తపల్లి ఉర్దూ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఇజాజ్ అహమ్మద్ మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించడంతో పాటు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోందని తెలిపారు. తొలుత పట్టణంలోని స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో ఆయన మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.42 సంవత్సరాలు ఉన్న ఇజాజ్ అహ్మద్ ఇంకా 20 సంవత్సరాలు సర్వీస్ ఉండగానే ఇలా దురదృష్టంగా మరణించడం వారి కుటుంబానికి తీవ్ర నష్టమని, ప్రభుత్వం వెంటనే స్పందించి వారి కుటుంబానికి నష్ట పరిహారం అందించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే పాఠశాలలో నైతిక విలువలు పెంపొందించే చర్యలు అధికారికంగా చేపట్టే విధంగా మేధావులు, ఉపాధ్యాయ సంఘాలతోను, ప్రజా సంఘాలతో చర్చించి, తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా పాఠశాలలో జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ చేసి బాద్యులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం జోన్ యుటిఎఫ్ నాయకులు హనుమంతరావు, రామకృష్ణ నాయక్, లక్ష్మయ్య, అమర్ నారాయణరెడ్డి, సకల చంద్రశేఖర్ ,పెద్దకోట్ల సురేష్, సాయి గణేష్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
రాయచోటి ఉపాధ్యాయుని మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి
చెన్నమనేని రమేశ్ కు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు
బీఆర్ఎస్ నేత, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఆయన జర్మనీ పౌరుడేనని తేల్చింది. జర్మన్ పౌరుడిగా కొనసాగుతూనే తప్పుడు పత్రాలతో ఎమ్మెల్యేగా గెలిచారని పేర్కొంది. తప్పుడు పత్రాలతో పదిహేనేళ్లుగా కోర్టును తప్పుదోవ పట్టించారంటూ చెన్నమనేనిపై మండిపడింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. కోర్టును, ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు 30 లక్షలు జరిమానా విధించింది. అందులో రూ.25 లక్షలు కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కు, మిగతా 5 లక్షలు లీగల్ సర్వీసెస్ అథారిటీకి నెల రోజుల్లోపు చెల్లించాలని ఆదేశించింది.చెన్నమనేని రమేశ్ బాబు జర్మన్ పౌరుడని, ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కోర్టును ఆశ్రయించారు. 2014లో బీఆర్ఎస్ పార్టీ తరఫున వేములవాడ నియోజకవర్గం నుంచి రమేశ్ బాబు అసెంబ్లీకి పోటీ చేయగా.. కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆది శ్రీనివాస్ పై 5 వేల ఓట్ల మెజారిటీతో రమేశ్ బాబు గెలుపొందారు. దీనిపై ఆది శ్రీనివాస్ కోర్టుకెక్కారు. రమేశ్ బాబు దాఖలు చేసిన అఫిడవిట్ తప్పుల తడక అని, రమేశ్ బాబుకు జర్మనీ పౌరసత్వం ఉందని ఆరోపించారు. ఈ కారణంగా రమేశ్ బాబు ఎన్నిక చెల్లదని వాదించారు. ఈ కేసు విచారణలో ఉండగానే 2018 లో మరోసారి అసెంబ్లీ ఎన్నికలు జరగగా రమేశ్ బాబు వేములవాడ నుంచి మళ్లీ గెలుపొందారు. తాజాగా ఈ కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది.
నటి జెత్వానీ కేసు.. కుక్కల విద్యాసాగర్ కు బెయిల్
ముంబై సినీ నటి జెత్వానీ కేసులో నిందితుడు కుక్కల విద్యాసాగర్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. జెత్వానీ, పోలీసుల తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్, విద్యాసాగర్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదలను వినిపించారు.వాదనల సందర్భంగా నర్రా శ్రీనివాస్ తన వాదనలను వినిపిస్తూ… విద్యాసాగర్ కు బెయిల్ మంజూరు చేస్తే కేసును ప్రభావితం చేస్తాడని చెప్పారు.ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా తాతా, విశాల్ గున్నీ, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ, ఏసీపీ హనుమంతరావులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ లతో పాటు అధికారులందరిపైనా సస్పెన్షన్ వేటు పడింది.
చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ తల్లి నిలిచిపోవాలి: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి, కోట్లాది ప్రజల ఆంకాంక్షలను సోనియాగాంధీ నెరవేర్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మన దశాబ్దాల కలను నెరవేర్చిన గొప్ప నాయకురాలు సోనియా అని కితాబునిచ్చారు. సోనియా 78వ జన్మదినం సందర్భంగా ఆమెకు తెలంగాణ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 9 తెలంగాణకు పర్వదినమని… 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ప్రకటన వచ్చిందని ఆయన చెప్పారు. నా తెలంగాణ… కోటి రతనాల వీణ అన్న దాశరథి మాటలు సత్యమని అన్నారు. ఏ జాతికైనా ఆ జాతి అస్తిత్వమే గుర్తింపు అని చెప్పారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పోరాటంలో సకల జనులను ఏకం చేసింది తెలంగాణ తల్లి అని రేవంత్ అన్నారు. ప్రజలను నిరంతరం చైతన్యపరిచి, లక్ష్యసాధన వైపు నడిపిన తల్లి తెలంగాణ తల్లి అని చెప్పారు. తెలంగాణ తల్లికి గుర్తింపు లేదని… ప్రజాపోరాటాలకు ఊపిరి పోసిన మాతృమూర్తిని గౌరవించుకునేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.తెలంగాణ తల్లి అంటే కేవలం భావన మాత్రమే కాదని… 4 కోట్ల ప్రజల భావోద్వేగం అని రేవంత్ అన్నారు. తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతి, చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని విగ్రహానికి రూపకల్పన చేశామని తెలిపారు. చాకలి ఐలమ్మ, సమ్మక్క, సారలమ్మల స్ఫూర్తితో విగ్రహాన్ని రూపొందించామని చెప్పారు. ప్రశాంత వదనంతో, సంప్రదాయ కట్టుబొట్టుతో విగ్రహాన్ని తీర్చిదిద్దామని తెలిపారు. గుండుపూసలు, ముక్కుపుడక, ఆకుపచ్చ చీర, కడియాలు, మెట్టెలతో విగ్రహాన్ని తయారు చేశామని చెప్పారు. వరి, జొన్న, సజ్జలు, మొక్కజొన్నలు తల్లి చేతిలో కనిపించేలా చేశామని చెప్పారు. పీఠంలోని నీలి రంగు… గోదావరి, కృష్ణమ్మల గుర్తులని అన్నారు. చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ తల్లి నిలిచిపోవాలని ఆకాంక్షించారు.
కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీలపై బీజేపీ ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీలపై కేంద్రంలోని అధికార బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. అమెరికాకు చెందిన జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ఆర్థిక సాయం అందిస్తున్న గ్రూపుతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణాస్త్రాలు సంధించింది. భారత్ నుంచి కశ్మీర్‌ను వేరు చేయాలనే ఆలోచనలకు ఆ సంస్ధ మద్దతిస్తోందని, సోరోస్ ఫౌండేషన్‌తో కాంగ్రెస్ సంబంధాలు పెట్టుకోవడం భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ సంస్థల ప్రభావాన్ని చూపుతోందని బీజేపీ అభివర్ణించింది. దేశాన్ని అస్థిర పరచాలనుకునే సంస్థలకు కాంగ్రెస్ మద్దతిస్తోందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా బీజేపీ ఆదివారం వరుసగా పోస్టులు పెట్టింది. ఎఫ్‌డీఎల్-ఏపీ ఫౌండేషన్‌కు (ఫోరమ్ ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఆసియా పసిఫిక్) కో-ప్రెసిడెంట్‌గా ఉన్న సోనియా గాంధీ.. జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం పొందే సంస్థతో సంబంధాలు పెట్టుకున్నారని బీజేపీ ఆరోపించింది. కశ్మీర్‌ను ప్రత్యేకంగా పరిగణిస్తున్నట్టు ఎఫ్‌డీఎల్-ఏపీ ఫౌండేషన్ ఇదివరకే స్పష్టమైన అభిప్రాయాన్ని తెలిపిందని పేర్కొంది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు సోనియా గాంధీ అధ్యక్షురాలిగా కొనసాగుతుండడంతో జార్జ్ సోరోస్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యానికి దారితీసిందని బీజేపీ పేర్కొంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు దేశంలో విపక్ష పార్టీతో సోరోస్ ఫౌండేషన్, మీడియా పోర్టల్ ఓసీసీఆర్‌ఫ్ జతకట్టాయని ఎంపీ నిషికాంత్ దూబే అన్నారు. ఈ అంశంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని తాను 10 ప్రశ్నలు అడుగుతానని నిషికాంత్ దూబే చెప్పారు. జార్జ్ సోరోస్ తనకు పాత స్నేహితుడని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ బహిరంగంగా అంగీకరించారని, ఇది గమనించాల్సిన విషయమని వ్యాఖ్యానించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు 5 కీలక బిల్లులు, 2 నివేదికలను సభలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం, డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. ఆ తర్వాత సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. అనంతరం సభ వాయిదా పడే అవకాశం ఉంది. ఆ తర్వాత జరిగే బీఏసీ సమావేశంలో సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. రైతు భరోసా విధివిధానాలపై కూడా ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది.
ఐసిస్ శిబిరాలపై అమెరికా దాడులు
సిరియాలో అనూహ్యమైన పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. తిరుగుబాటు దళాలు రాజధాని డమాస్కస్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడంతో ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ కుటుంబాన్ని తీసుకొని రష్యాకు పారిపోయినట్టుగా కథనాలు వెలువడుతున్నాయి. దీంతో దశాబ్దాలుగా కొనసాగుతున్న అస్సాద్ పాలనకు ముగింపు పడింది. కాగా సిరియాలో అంతర్యుద్ధం పరిస్థితులను అదునుగా భావించిన అగ్రరాజ్యం అమెరికా ఉగ్రవాద సంస్థ ఐసిస్ స్థావరాలపై దాడులు మొదలు పెట్టింది. అస్సాద్ రష్యాకు పారిపోయిన కొన్ని గంటల వ్యవధిలోనే ఐసిస్ లక్ష్యాలపై ఆదివారం డజన్ల కొద్దీ దాడులు చేసింది. దేశంలో నెలకొన్న అంతర్యుద్ధ పరిస్థితులను అవకాశంగా మలచుకొని తిరిగి బలపడాలని ఐసిస్ చూస్తోందని, తాము అలా జరగనివ్వబోమని, ాస్పష్టమైన ఆలోచన్ణతో ఐసిస్ లక్ష్యాలపై దాడులు జరిపామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు అధ్యక్ష భవనం నుంచి ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా ఐసిస్ స్థావరాలపై ఆదివారం దాడులు జరిపామని, తమ యుద్ధ విమానాలు డజన్ల కొద్దీ శిబిరాలను తాకాయని యూఎస్ మిలిటరీ నిర్ధారించింది. బీ-52, ఎఫ్-15, ఏ-10తో పాటు యూఎస్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన విమానాలను ఉపయోగించి సెంట్రల్ సిరియాలోని 75కు పైగా లక్ష్యాలపై దాడులు చేశామని అధికారిక ప్రకటనలో పేర్కొంది. కాగా సిరియాలో అధ్యక్షుడు అస్సాద్ పాలన పతనమవ్వడం న్యాయమేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. దీర్ఘకాలంగా బాధపడుతున్న సిరియా ప్రజలకు ఇది చారిత్రాత్మక అవకాశమని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు బషర్ అల్ అస్సాద్, అతడి కుటుంబం రష్యా పారిపోయి అక్కడ ఆశ్రయం పొందినట్లు కథనాలు వెలువడుతున్నాయి. కాగా గత ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న అస్సాద్ కుటుంబ పాలనపై ఇస్లామిస్ట్ హయత్ తహ్రీర్ అల్ షామ్ (హెచ్‌టీఎస్) అనే గ్రూపు మెరుపు దాడికి తెగబడింది. అమెరికా మద్దతున్న ఈ గ్రూపు దళాలు 11 రోజుల్లోనే సిరియాను తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి.
నంద్యాల జిల్లాలో దారుణ ఘటన.. బాలికకు నిప్పంటించిన బాలుడు !
నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఘటన
ప్రేమించలేదనే కారణంతో బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన బాలుడు
బాలిక మృతి.. బాలుడికి తీవ్ర గాయాలు
ఏపీలోని నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించలేదనే కారణంతో బాలికపై బాలుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక మృతిచెందింది. బాలుడికి కూడా మంటలు అంటుకోవడంతో గాయాలయ్యాయి.పూర్తి వివరాల్లోకి వెళితే.. వెల్దుర్తి మండలం సామర్లకోటకు చెందిన బాలిక, కలుగొట్లకు చెందిన బాలుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. అయితే, బాలుడు కొంతకాలంగా బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయం బాలిక తన పేరెంట్స్‌కు చెప్పింది. దాంతో వారు బాలికను ఆమె అమ్మమ్మ ఉండే నందికొట్కూరుకు పంపించారు.అయినా బాలుడి వేధింపులు ఆగలేదు. ఆరు నెలల క్రితం అతడు నందికొట్కూరుకు వెళ్లాడు. ఈ విషయాన్ని కూడా బాలిక తల్లిదండ్రులకు తెలియజేసింది. దాంతో వారు బాలిక స్నేహితులు ఎవరు వచ్చినా ఇంటికి రానివ్వొద్దని సూచించారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక ఆ బాలుడు ఆమె ఉంటున్న ఇంటికి మళ్లీ వెళ్లాడు. బాలిక నిద్రిస్తున్న గదికి వెళ్లి తలుపు కొట్టాడు. దాంతో బాలిక డోర్ తెరిచింది. వెంటనే లోపలికి వెళ్లిన బాలుడు గడియ పెట్టేశాడు. ఆ తర్వాత కాసేపటికే బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.దాంతో బాలిక గట్టిగా కేకలు పెడుతూ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. బాలుడికి కూడా నిప్పు అంటుకోవడంతో గడియ తీసి బయటకు పరుగులు పెట్టాడు. అతడు పారిపోతుండగా కుటుంబ సభ్యులు, స్థానికులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాలిన గాయాలతో ఉన్న అతడిని 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు.
ఏ డి పి ప్రాంగణ నియామక శిబిరంలో ఏపీ సి యూ విద్యార్థుల అద్భుత విజయం
విశాలాంధ్ర-అనంతపురం : జంతలూరులోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లో క్లౌడ్ ఆధారిత హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ మరియు బిజినెస్ ఔట్‌సోర్సింగ్ సర్వీసెస్‌లో గ్లోబల్ లీడర్ అయిన ఏ డి పి కంపెనీ కోసం రెండురోజుల ప్రాంగణ నియామక శిబిరం విజయవంతంగా నిర్వహించినట్లుఉపకులపతి ఆచార్య ఎస్. ఎ. కోరి పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం నుండి 34 మంది, అనంతపురం మరియు చుట్టుపక్కల ఇతర సంస్థల నుండి 112 మంది, మొత్తంగా 146 మంది విద్యార్థులు శిబిరంలో పాల్గొన్నారు. వీరిలో 52 మంది విద్యార్థులు ఆన్‌లైన్ మూల్యాంకనంలో ప్రతిభ కనబరచగా, 32 మంది వాయిస్ మరియు యాక్సెంట్ పరీక్ష ద్వారా ఉత్తీర్ణులయ్యారు. అంతిమంగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి అభిషేక్ మణి త్రిపాఠి, అల్మాస్ ఫాత్మా, క్రిష్ సూద్, చదువుల సృజన, రిమి కుమారిలు, సంభవ్ ఫౌండేషన్ నుండి పి. తస్లీమ్ ఏ డి పి కి ఎంపికయ్యారన్నారు.
ఎంపిక విధానం రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ అసెస్‌మెంట్, వాయిస్ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూలతోపాటు చివరిగా హెచ్ ఆర్ ఇంటర్వ్యూ వంటి వివిధ దశలలో జరిగిందన్నారు. వారి కృషి పట్ల ఉపకులపతి ఆచార్య ఎస్. ఎ. కోరి, అకడమిక్ డీన్ ఆచార్య సి. షీలారెడ్డి, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ఆచార్య జి. రామ్ రెడ్డి, ప్లేస్‌మెంట్ సెల్ సభ్యులు, ఏ డి పి ప్యానెల్ సభ్యులు అభినందించారు.
ఉపాధ్యాయుడి మృతికి నల్ల బ్యాడ్జీలతో నిరసన
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : విద్యార్థుల దాడిలో ఉపాధ్యాయుడి మృతికి నిరసనగా పీటీఎల్యూ పిలుపు మేరకు శనివారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని రేయిన్ బో ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ప్రసాద్, పుల్లయ్య, రామకృష్ణ, శామ్యూల్, అశోక్ లు మాట్లాడుతూ ఇటీవల రాయచోటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థుల దాడిలో ఉపాధ్యాయుడు మృతి చెందడం దారుణమన్నారు. దాడిని ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు తీవ్రంగా ఖండించారు. విద్యా బుద్దులు, క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పే ఉపాధ్యాయుడిపై విచక్షణరహితంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.