బీఆర్ఎస్ నేతల అరెస్ట్ లను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ (ట్యాంక్ బండ్) లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. వారి నివాసాల నుంచి బయటకు రాకుండా భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే పద్మారావులను గృహనిర్బంధం చేశారు. కౌశిక్ రెడ్డి, హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డిలను నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి లను పోలీసులు విడుదల చేశారు. కౌశిక్ రెడ్డికి నిన్న అర్ధరాత్రి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అంబేద్కర్ సేవలను స్మరించుకున్న చంద్రబాబు,జగన్
బాబా సాహేబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విశాఖ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.అలాగే బడుగు బలహీన వర్గాల సముద్ధరణకు ఆజన్మాంతం పాటుపడిన డాక్టర్ అంబేద్కర్ ఎంతో మందికి ఆదర్శప్రాయుడని అన్నారు. . భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయన తరతరాలకు గుర్తుండిపోయే సేవలను దేశానికి అందించారని ప్రశంసించారు.. భావితరాలకు స్ఫూర్తి దాతగా నిలిచారన్నారు. దళిత జాతి తలెత్తుకుని గౌరవంగా నిలిచేలా చేసిన డాక్టర్ అంబేద్కర్ ప్రాత:స్మరణీయుడని అన్నారు.. ఆయన చూపిన బాటలో, చేసిన బాసతో నిరంతరంగా ముందుకు సాగాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారుౌ
జగన్ నివాళి
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్దంతి సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, వైఎస్సార్‌సీపీ నాయకులు వరికూటి అశోక్‌బాబు, కాకుమాను రాజశేఖర్, కొమ్మూరి కనకారావు తదితరులు పాల్గొన్నారు.
డీప్ టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణ.. చంద్రబాబు
ప్రస్తుతం డీప్ టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు విశాఖపట్నంలో నేషనల్ డిప్ టెక్ కాంక్లేవ్ ప్రారంభమైంది. ఈ సదస్సును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పారిశ్రామిక రంగాల్లో అత్యాధునిక మార్పుపై ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ ను సీఎం సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్, డోలా వీరాంజనేయులు, కొల్లు రవీంద్ర, హోంమంత్రి అనిత, కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. అంతకుముందు సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ ఎన్టీఆర్ భవన్ ప్రజలను కలిశారు. వినతులను స్వీకరించారు. సమస్యలను పరిస్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం ప్రకటన
ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య విధాన కమిటీ సమీక్ష సమావేశం ఇవాళ (శుక్రవారం) ముగిసింది. వరుసగా 11వ సారి కీలకమైన రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తూ కమిటీ నిర్ణయించింది. 6.5 శాతంగా కొనసాగించేందుకు అనుకూలంగా ఆరుగురు సభ్యుల కమిటీ 4:2 మెజారిటీతో నిర్ణయం తీసుకుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. అధిక ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. ప్రతి రంగంలో ధరల స్థిరత్వం చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. కాగా మే 2022 నుంచి వరుసగా ఆరుసార్లు కలిపి మొత్తం 250 బేసిస్ పాయింట్ల రెపో రేటుని ఆర్బీఐ పెంచింది. ఏప్రిల్ 2023 నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా రెపో రేటుని పెంచలేదు. కాగా రెపో రేటులో ఎలాంటి మార్పు లేకపోవడంతో బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లు కూడా యథాతథంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఈఎంఐలలో కూడా ఎలాంటి మార్పులు ఉండవు.
మందగించిన వృద్ధి
జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు రెండేళ్ల కనిష్ఠ స్థాయి 5.4 శాతానికి పడిపోయిందని ఆర్బీఐ వెల్లడించింది. తయారీ, మైనింగ్ రంగాల వృద్ధి పేలవంగా ఉండడం ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో జీడీపీ 8.1 శాతంగా నమోదైందని పేర్కొంది.
బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం.. కరెన్సీ నోట్లపై ఆ దేశ జాతిపిత బొమ్మ తొలగింపు!
బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ జాతిపిత షేక్ ముజీబుర్ రెహ్మాన్ బొమ్మలను కరెన్సీ నోట్ల నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కొత్త నోట్లను ముద్రిస్తున్న బంగ్లాదేశ్ బ్యాంక్.. షేక్ హసీనా భారత్ పారిపోవడానికి కారణమైన జులై తిరుగుబాటును ప్రతిబింబించేలా ఫొటోలను ముద్రిస్తున్నట్టు ాఢాకా ట్రిబ్యూన్్ణ పేర్కొంది. ఆగస్టు 5న షేక్ హసీనా భారత్‌కు పారిపోయిన తర్వాత దేశ మధ్యంతర ప్రభుత్వంలో చీఫ్ అడ్వైజర్‌గా నోబెల్ బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనుస్ బాధ్యతలు చేపట్టారు. మధ్యంతర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 20, 100, 500, 1000 టాకాల నోట్లను ముద్రిస్తున్నట్టు బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. అయితే, ఈ నోట్లపై బంగ్లాదేశ్ బంగబంధు (జాతిపిత) షేక్ ముజీబుర్ రెహ్మాన్ ఫొటో ఉండదని దినపత్రిక పేర్కొంది. ఈ నోట్లపై మతపరమైన నిర్మాణాలు, బెంగాలీ సంప్రదాయాలు, జులై తిరుగుబాటు సమయంలో గీసిన ాగ్రాఫిటీ్ణని చేర్చినట్టు తెలిసింది. మరో ఆరు నెలల్లో ఈ కొత్త నోట్లకు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని బంగ్లాదేశ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హస్నీరా షేక్ తెలిపారు. ప్రస్తుతానికైనా పైన పేర్కొన్న నాలుగు నోట్ల డిజైన్ మార్చామని, దశల వారీగా మిగతా నోట్లను కూడా రీడిజైన్ చేస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు.
ధర్మవరం నందు రూ.35 కోట్ల విలువైన మెగా హ్యాండ్‌లూమ్ క్లస్టర్ ఏర్పాటు
ఎంపీడీవో సాయి మనోహర్
విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరంలో 35 కోట్ల విలువైన మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం ప్రధాన కేంద్రంగా జాతీయ చేనేత అభివృద్ధి పథకం కింద రూ.35 కోట్ల విలువైన మెగా హ్యాండ్‌లూమ్ క్లస్టర్ మంజూరు చేయబడింది అని అన్నారు.ఇది ధర్మవరం చేనేత రంగానికి గొప్ప ఆశీర్వాదం అని,ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఇలాంటి ప్రాజెక్ట్ ధర్మవరంలో ప్రారంభం,ఇది మన అందరికి గర్వకారణం అని తెలిపారు.ఈ క్లస్టర్, 5 నుంచి 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటూ చేస్తారని ఇది నోడల్ సెంటర్‌గా పని చేస్తుంది అని తెలిపారు. తదుపరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీలు, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు బేస్‌లైన్ సర్వేపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.. ఈ సర్వే ఆధారంగా వివరమైన ప్రాజెక్ట్ నివేదిక ఈ క్లస్టర్ కు రూపొందించబడుతుంది అని తెలిపారు. ఈ సమావేశానికి కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖకు చెందిన విశ్వజిత్ , జి. నాగేశ్వరరావు , టెక్నికల్ సూపర్‌వైజర్‌లు , హ్యాండ్‌లూమ్ అసిస్టెంట్ డైరెక్టర్ హాజరై బేస్‌లైన్ సర్వేపై శిక్షణ ఇవ్వడం జరిగింది అన్నారు. తదుపరి ఎంపీడీవో ఈ ప్రాజెక్ట్ మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇది ధర్మవరం చేనేత రంగానికి ప్రాచీన గౌరవాన్ని పునరుద్ధరిస్తుందని, పట్టు పరిశ్రమకు మరింత కీర్తి ని తీసుకొస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.రాబోయే అభివృద్ధి కి ఇది మొదటి ఘట్టం గా తెలిపారు.
మంత్రిని కలిసిన బిజెపి నాయకుడు డోలా రాజారెడ్డి
విశాలాంధ్ర- ధర్మవరం;; పట్టణములోని బిజెపి నాయకుడు డోలా రాజారెడ్డి విజయవాడలోని ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు డోలా రాజారెడ్డి తెలిపారు. అనంతరం నియోజకవర్గ మండల ప్రజల సమస్యలను వారి దృష్టికి తీసుకొని పోవడం జరిగిందని వారు తెలిపారు. డోల రాజారెడ్డి ఇప్పటికే పట్టణంలో పలు సేవా కార్యక్రమాల్లో మంచి గుర్తింపు ప్రజల వద్ద పొందడం జరిగింది. అంతేకాకుండా గత 18 రోజులుగా పట్టణంలో మాల ధారణ వేసిన భక్తాదులకు ప్రతిరోజు 900 పైగా మాలాధారణ భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టిన డోల రాజారెడ్డిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీనియర్ లాయర్ శ్రీనివాసులు
విశాలాంధ్ర- వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలం రోళ్ళ పాడు గ్రామంలో గురువారం ఉదయం తానికొండ మాలకొండయ్య (గాంధీ) కొండమ్మ దంపతుల కుమారుడు తానికొండ కనకాద్రి వివాహం నకు సీనియర్ లాయర్ ప్రగడ శ్రీనివాసులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పెగడ మోహన్ కుమార్ అయ్యవారిపల్లి తెదేపా నాయకులు కూడలి భాస్కరరావు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఉరివేసుకొని గృహిణి ఆత్మహత్య
విశాలాంధ్ర ధర్మవరం : మండల పరిధిలోని దర్శనమల గ్రామానికి చెందిన అంకె కుమారి (వయసు 37) మంగళవారం రాత్రి ఇంటిలోని ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రూరల్ ఎస్సై శ్రీనివాసులు మాట్లాడుతూ మృతురాలు భర్త రెండు సంవత్సరాల క్రితం లివర్ చెడిపోయి అనారోగ్యంతో మృతి చెందాడని తెలిపారు. తన భర్త మృతి చెందినప్పటి నుండి కుటుంబాన్ని పోషించడం భారంగా మారిందని తన ఊరిలో పెట్టుకున్న చిల్లర అంగడి కూడా సరిగా వ్యాపారం జరగకపోవడంతో తన తల్లిదండ్రులతో బాధను చెప్పుకొని బాధపడుతూ ఉండేదని తెలిపారు. ఈ ఆర్థిక ఇబ్బందులు భరించలేక చనిపోతాను అని చాలాసార్లు తన తల్లిదండ్రుల వద్ద తెలిపింది అని తెలిపారు. అయినా సరే తల్లిదండ్రులు తన కూతురికి ధైర్యం చెబుతూ కాలం గడిపారు. తదుపరి తండ్రి తలారి నాగరాజు ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.