Monday, May 12, 2025
Home Blog Page 352

సీప్లేన్‌ ట్రయల్‌ విజయవంతం

నేడు శ్రీశైలం వెళ్లనున్న సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: విజయవాడ-శ్రీశైలం ‘సీ ప్లేన్‌’ ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిని శనివారం ప్రారంభించనున్న నేపథ్యంలో శుక్రవారం అధికారులు ట్రయల్‌రన్‌ నిర్వహించారు. మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ నుంచి ‘సీ ప్లేన్‌’ శ్రీశైలానికి వెళ్లింది. అక్కడి జలాశయం నీటిలో సురక్షితంగా ల్యాండ్‌ అయింది. అనంతరం శ్రీశైలం టూరిజం బోటింగ్‌ జట్టీ వద్దకు సీ ప్లేన్‌ చేరుకుంది. ఎస్డీఆర్‌ఎఫ్‌, పోలీసు, టూరిజం, వైమానిక దళ అధికారుల సమక్షంలో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఈ నెల 9న విజయవాడ పున్నమిఘాట్‌ నుంచి శ్రీశైలానికి ‘సీ ప్లేన్‌’ ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నారు. డీ హవిల్లాండ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీ ప్ల్లేన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు. అనంతరం ఆయన నేరుగా సీప్లేన్‌లో శ్రీశైలం వెళ్లి తిరిగి విజయవాడ చేరుకుంటారు. ఆయనతోపాటు కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు సీ ప్లేన్‌లో ప్రయాణం చేయనున్నారు. విజయవాడశ్రీశైలం మధ్య ఈ సీప్లేన్‌ప్లే నడిపేందుకు అనుకూలతలపై నిర్వహించే ఈ ప్రయోగం విజయవంతమైతే రెగ్యులర్‌ సర్వీసుగా ప్రారంభించాలని డీహవిల్లాండ్‌ ఎయిర్‌క్రాప్ట్‌ సంస్థ ఏర్పాట్లు చేస్తుంది. దీనిపై విజయవాడ సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని పున్మమిఘాట్‌లో 1000 మంది ప్రజలు వీక్షించేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. చంద్రబాబు రాకకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అన్ని శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు ఇక్కడకు రానున్నట్లు తెలిపారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సీపీ రాజశేఖర బాబు వెల్లడిరచారు..

ఆచి తూచి ఎంపిక

. ‘నామినేటెడ్‌’ మలి జాబితాపై సీఎం ముమ్మర కసరత్తు
. వందల్లో పోస్టులు..వేల సంఖ్యలో ఆశావహులు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : నామినేటెడ్‌ పదవుల ఎంపికపై కూటమి ప్రభుత్వం వడపోత ముమ్మరం చేసింది. తొలిదశలో 20 మందితో నామినేటెడ్‌ పోస్టుల జాబితా విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం, రెండో జాబితాలో కనీసం వంద మందికి తగ్గకుండా ఇచ్చేలా కసరత్తు నిర్వహిస్తోంది. రెండో విడత జాబితా ఎంపికపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పార్టీ ముఖ్యులతో మూడు రోజులుగా సమావేశమవుతున్నారు. ఇప్పటికే పవన్‌ నుంచి రెండో జాబితా లో జనసేన నుంచి అవకాశం ఇచ్చే వారి పేర్లను సేకరించారు. అలాగే బీజేపీ వారి పేర్లు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. వివిధ నామినేటెడ్‌ పోస్టుల కోసం ఒక్క తెలుగుదేశం పార్టీ నుంచే దాదాపు 30వేల పైచిలుకు నేతలు దరఖాస్తులు చేసుకున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బహిరంగంగా ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టడంతో నేతలు పెద్దసంఖ్యలో బారులు తీరి దరఖాస్తు పెట్టుకున్నారు. దీనివల్ల పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి మరింత పెరిగింది. శాసనసభ ఎన్నికల్లో జనసేన, బీజేపీ పార్టీల ఎన్నికల పొత్తు కారణంగా టీడీపీ దాదాపు 31 స్థానాలను త్యాగం చేయాల్సి వచ్చింది. అలాగే ఎంపీ అభ్యర్థులు కూడా కొందరు తమ స్థానాలను పొత్తులో భాగంగా వదులుకున్నారు. వీరందరికీ న్యాయం చేస్తానని అప్పట్లో చంద్రబాబు వాగ్దానం చేశారు. వీరుగాక పార్టీ కోసం వైసీపీ ప్రభుత్వంలో అనేక కేసులు పెట్టించుకుని వీరోచిత పోరాటాలు చేసిన నేతలు కొందరున్నారు. వీరికి ప్రథమ ప్రాధాన్యతగా పోస్టులు కేటాయించనున్నారు. అయితే సామాజిక సమీకరణలు, కూటమి భాగస్వామ్యపక్షాలను పరిగణనలోకి తీసుకుని పదవుల కేటాయింపు చేపట్టనుండడంతో వడపోత కార్యక్రమం సీఎంకు సవాల్‌గా మారింది. తొలి జాబితాలో పేర్ల ప్రకటన తరువాత కొందరు నేతలు తమకు అవకాశం ఇవ్వకపోవటం పైన కినుక వహించారు. ఈ నేపధ్యంలో రెండో జాబితాలో జనసేన, బీజేపీ కోసం త్యాగం చేసిన నేతలతోపాటు, వైసీపీ ప్రభుత్వ వేధింపులు ఎదుర్కొని, జైలుకు వెళ్లిన వారికి ప్రాధాన్యత ఉంటుందని నేతలు చెబుతున్నారు. వివిధ కుల, వృత్తి సంఘాలకు కార్పొరేషన్‌ చైర్మన్లు కీలక నేతలకు, ద్వితీయశ్రేణి ముఖ్యనేతలను డైరెక్టర్లుగా నియమించనున్నారు. ఎక్కువ మంది నేతలు రాష్ట్ర స్థాయి పదవులు కోరుకుంటున్నారు. తొలి జాబితాలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా డైరెక్టర్ల పదవులు కేటాయించడంతో… వారిలో కొందరు తమకు ఆ పదవులు అవసరం లేదని, పార్టీలో పని చేస్తామని ప్రకటించారు. దీంతో ఈ సారి జాబితాను అన్ని కోణాల్లోనూ ఆచి తూచి ఎంపిక చేస్తున్నారు. అయితే కచ్చితంగా సీట్లు దక్కని సీనియర్లకు ఈసారి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.ఈ నెల 11వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండడంతో ఈ లోగానే నామినేటెడ్‌ పదవుల జాబితా విడుదల చేసినా ఆశ్చర్యం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

అది మైనారిటీ విద్యాసంస్థ

అలీగఢ్‌ ముస్లిం వర్సిటీపై 4`3 మెజారిటీతో
సుప్రీంకోర్టు అభిప్రాయం

న్యూదిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) మైనారిటీ హోదాపై కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏఎంయూకు మైనార్టీ హోదా వర్తిస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని న్యాయమూర్తులు సూర్యకాంత్‌, దీపాంకర్‌ దత్తా, ఎస్‌సీ శర్మ, సంజీవ్‌ ఖన్నా, జేబీ పార్దివాలా, మనోజ్‌ మిశ్రాతో కూడిన ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం 4-3 మెజారిటీతో ఉత్తర్వులు జారీచేసింది. రాజ్యాంగంలోని అధికరణ 30 కింద మతపరమైన, భాషాపరమైన మైనారిటీల సాధికారత కోసం విద్యాసంస్థల ఏర్పాటుకు అనుమతి ఉన్నట్లు కోర్టు తెలిపింది. దీని ప్రకారమే ఏఎంయూకు మైనారిటీ హోదా వర్తిస్తుందని తేల్చింది. ఇదే వ్యవహారంలో 1967 నాటి తీర్పును కొట్టివేసింది. ఎనిమిది రోజుల పాటు సాగిన వాదనల అనంతరం ఈ కేసులో తీర్పును ఫిబ్రవరి 1న సుప్రీంకోర్టు రిజర్వు చేసింది. సీజేఐ డీవై చంద్రచూడ్‌ చివరి పనిదినాన దీనిపై తీర్పు ఇచ్చింది. ‘1875లో మహమ్మదన్‌ ఆంగ్లో-ఓరియంటల్‌ కాలేజీగా ఏర్పాటైన విద్యాసంస్థ… 1920లో బ్రిటిష్‌ పాలనలో అలీగఢ్‌ యూనివర్సిటీ అయింది. దానిని మైనారిటీలు ఏర్పాటు చేయలేదని చెప్పలేమని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఏఎంయూ సవరణ చట్టం1981 మైనారిటీ హోదాను కల్పించిందని పేర్కొంది. మైనారిటీ విద్యాసంస్థల్లో లౌకిక విద్యకు అవకాశమున్నట్లు తెలిపింది. ఇలాంటి వ్యవస్థల లక్షణాలను ఉల్లంఘించనంత వరకు మైనారిటీ విద్యావ్యవస్థలను ప్రభుత్వం నియంత్రించవచ్చని కోర్టు అభిప్రాయపడిరది. తాజా తీర్పు 43 మెజారిటీతో వెలువడగా విభేదించిన న్యాయమూర్తుల్లో జస్టిస్‌ దత్తా ఉన్నారు. ఏఎంయూ మైనారిటీ విద్యావ్యవస్థ కాదన్నారు. కాగా, మైనారిటీలకు సేవ చేసే సంస్థల నియంత్రణ మైనారిటీ వర్గమే చూసుకోవాలని జస్టిస్‌ శర్మ అన్నారు. లౌకిక విద్యకూ విద్యార్థులకు అవకాశం ఉండాలని చెప్పారు.
పూర్వాపరాలు
మతపరమైన, భాషాపరమైన మైనారిటీ సాధికారత కోసం విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకునేందుకు మైనారిటీలకు అధికారాన్ని రాజ్యాంగంలోని అధికరణ 30 ఇస్తుంది. దీని ఆధారంగానే ఏఎంయూకు మైనారిటీ హోదా వర్తిస్తుంది. 1875లో అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీని ఆంగ్లో-ఓరియంటల్‌ కాలేజీగా స్థాపించారు. ఇంపీరియల్‌ (సామ్రాజ్యవాద) చట్టం ద్వారా 1920లో విశ్వవిద్యాలయం చేశారు. అయితే ఈ చట్టాన్ని 1951లో సవరించారు. తద్వారా ముస్లిం విద్యార్థులకు తప్పనిసరి చేసిన మతపరమైన సూచనలు రద్దు అయ్యాయి. 1981లో రెండవ సవరణను ప్రతిపాదించారు. 1951కు ముందున్న స్థితిని పునరుద్ధరించాలని ఆ సవరణ ప్రతిపాదించగా, ఆ పని మనస్ఫూర్తిగా జరగలేదని సీజేఐ అన్నారు. ఈ సవరణ సగం పని మాత్రమే చేసిందని చెప్పారు. కాగా, కేంద్ర వర్సిటీగా ఉన్న ఏఎంయూ… మైనారిటీ విద్యావ్యస్థ కాదని 1967లో ఎస్‌ అజీజ్‌ పాషా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ఇదిలావుంటే ఫిబ్రవరిలో వాదనలు జరిగినప్పుడు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తదితరులు ఏఎంయూకు వచ్చే నిధుల గురించి ప్రస్తావించారు.
2019`2023 మధ్య కాలంలో రూ.5వేల కోట్లకుపైగా నిధులను కేంద్రప్రభుత్వం నుంచి పొందినందునే మైనారిటీ స్వభావాన్ని ఏఎంయూ విడనాడిరదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏఎంయూ మైనారిటీ విద్యాసంస్థ కాదంటూ 1981లో జరిగిన సవరణను 2006లో అహ్మదాబాద్‌ హైకోర్టు తోసిపుచ్చింది. ఆ తర్వాత ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం 2006లో ఇచ్చిన హైకోర్టు తీర్పును సవాల్‌ చేసింది. ఇదే తీర్పుపై వేరుగా యూనివర్సిటీ పిటిషన్‌ వేసింది. నాటి సీజేఐ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వ త్రిసభ్య ధర్మాసనం దీనిని విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేసింది. తాజా విచారణ క్రమంలో ఏఎంయూకు మైనారిటీ హోదా వర్తిస్తుందంటూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

జగన్‌ పిటిషన్‌పైడిసెంబరు 13న విచారణ

కౌంటర్‌ దాఖలు చేయాలని విజయమ్మ, షర్మిలకు ఎన్‌సీఎల్‌టీ ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: షేర్ల బదిలీ అంశంపై తల్లి, చెల్లిపై ఎన్‌సీఎల్‌సీ కోర్టును ఆశ్రయించిన మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పిటిషన్‌పై విచారణ డిసెంబరు 13వ తేదీకి వాయిదా పడిరది. హైదరాబాద్‌లోని నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో సరస్వతీ పవర్‌ కేసుకు సంబంధించి జగన్‌ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. తనకు తెలియకుండా తల్లి, సోదరి అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్నారని అందులో పేర్కొన్నారు. విజయమ్మ, షర్మిల, జనార్దన్‌రెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. షేర్ల బదిలీ ఫారాలు, ఇతర డాక్యుమెంట్లు ఏమీ సమర్పించకుండానే తమ పేర్ల మీదకు మార్చుకున్నారని జగన్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. జగన్‌, భారతి, క్లాసిక్‌ రియాల్టీ పేరిట షేర్లు కొనసాగేలా ఆదేశించాలని జగన్‌ కోరారు. 51.01 శాతం షేర్లను యథావిధిగా కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు ప్రతివాదులను ఆదేశించగా… విజయమ్మ, షర్మిల తరపు న్యాయవాది తమకు కొంత సమయం కావాలని కోరారు. దీంతో విచారణను ఎన్‌సీఎల్‌టీ డిసెంబర్‌ 13వ తేదీకి వాయిదా వేసింది. ఇక ప్రతివాదులుగా ఉన్న వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ షర్మిల వాదనలను కూడా కోర్టు వినాల్సి ఉంటుంది. ఎంవోయూ రాసుకున్న తర్వాత ఎలాంటి సమాచారం లేకుండా షేర్లు ఎలా వెనక్కి తీసుకుంటారంటూ విజయమ్మ, షర్మిల ప్రశ్నిస్తున్నారు. ‘తన సోదరిపై ఉన్న ప్రేమతో 2019లో ఎంవోయూ రాసుకున్నాం. అయితే ఇటీవల కాలంలో మా మధ్య రాజకీయ విభేదాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా నన్ను, నా భార్యను టార్గెట్‌ చేస్తూ షర్మిల వ్యాఖ్యలు చేశారు. అందుకే ప్రస్తుతం 51 శాతంగా ఉన్న ఆమె షేర్లను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను. అందుకు నాకు అనుమతి ఇవ్వాలి’ అని జగన్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

విద్యుత్‌ చార్జీలపై 19న భారీ నిరసన

పవన్‌ భుజంపై ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండా: రామకృష్ణ విమర్శ
20 నుంచి సభలు, సమావేశాలు: శ్రీనివాసరావు

విశాలాంధ్ర – విజయవాడ : సర్దుబాటు పేరుతో ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారం మోపటం దుర్మార్గమని, పెంచిన చార్జీలు రద్దు చేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని వామపక్షాల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చ రించారు. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానంటూ ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ అజెండాను భుజానవేసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. స్థానిక హనుమాన్‌పేట దాసరి భవన్‌లో వామపక్ష పార్టీల నేతలు శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే సర్దుబాటు చార్జీల భారం రూ.6,072 కోట్లు మోపగా… తాజాగా మరో రూ.11 వేల కోట్ల భారం మోపాలనుకోవడం దుర్మార్గమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏనాడూ ఇంత పెద్ద ఎత్తున భారం పడలేదన్నారు. పెంచిన చార్జీలను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. చార్జీల పెంపుపై అభ్యంతరాలు తెలిపేందుకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)ఈ నెల 19వ తేదీ వరకు అవకాశం కల్పించిందని, ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యంతరాలను ఏపీఈఆర్‌సీకి స్పష్టంగా చెప్పాలని కోరారు. ఈ అభ్యంతరాలపై తమ వాదనలు వినిపించేందుకు అవకాశం కల్పించాలని ఏపీఈఆర్‌సీకి విజ్ఞప్తి చేశారు. విద్యుత్‌ చార్జీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేసిన పాపం తమకు శాపంగా మారిందని, కృష్ణపట్నం, వీటీపీఎస్‌లలో విద్యుత్‌ ఉత్పత్తి చేయకుండా బయట నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయటం వల్ల చార్జీల భారం మోపకతప్పటం లేదని చెప్పటం, రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్‌ చార్జీలు పెంచటాన్ని సమర్థిస్తూ కథనాలు రాయటం సరికాదన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచబోమని చంద్రబాబు చెప్పిన విషయాన్ని రామకృష్ణ గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విద్యుత్‌ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఈనెల 19వ తేదీన విజయవాడలో వామపక్షాలు నిరసన తెలియజేయనున్నట్లు వెల్లడిరచారు. 20 నుండి 30వ తేదీ వరకు 26 జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ పనితీరును ఎండగడతామని హెచ్చరించారు. సనాతనవాదంపై పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండా అయిన సనాతనవాదాన్ని పవన్‌ భుజానకెత్తుకుని మైనార్టీలకు వ్యతిరేకంగా ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. పవన్‌ సినిమాలను అందరూ చూడబట్టే ఆయన గొప్పగా ఎదిగారని పేర్కొన్నారు. అన్ని కులాలు, మతాలు, వర్గాల వారు జనసేనలో ఉన్నారని, జనసేనకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేని సందర్భంలో ఆ పార్టీని బీజేపీలో విలీనం చేయమని అమిత్‌ షా కోరినప్పుడు పవన్‌ అంగీకరించకపోవటంతో జనసేన పార్టీని లౌకికపార్టీగా ప్రజలు గుర్తించారని చెప్పారు. దీనిపై పవన్‌ కల్యాణ్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ తరపున ఉన్న సత్యకుమార్‌, ఇతర మంత్రులు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడటం లేదన్నారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి పవన్‌ కల్యాణ్‌ని హద్దుల్లో పెట్టాలని కోరారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు విద్యుత్‌ చార్జీలు పెంచబోమని చెప్పి టీడీపీ అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. విద్యుత్‌ చార్జీల భారం జగన్‌ ప్రభుత్వ నిర్ణయమని చంద్రబాబు చెప్పడం దుర్మార్గమన్నారు. విద్యుత్‌ భారాలు వేసిన వైసీపీని ప్రజలు తిరస్కరించారన్నారు. విద్యుత్‌ చార్జీల పెంపుతో వినియోగదారులపై ఒక్కో యూనిట్‌కు రూ.1.80 నుండి రూ.2.40 అదనపు భారం పడుతుందన్నారు. గతంలో స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు వద్దన్న టీడీపీ…ఇప్పుడు కొనసాగిస్తున్నదని ఆరోపించారు. విద్యుత్‌ మీటర్ల కాంట్రాక్టును టీడీపీ సర్కారు కూడా షిర్డీసాయి కంపెనీకే కట్టబెడుతున్నదని తెలిపారు. మద్యం, ఇసుక, పెరిగిన ధరలపై ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే అసంతృప్తి ఉందన్నారు. ప్రజావాణి వినిపించేందుకు 19న నిరసన తెలుపుతున్నట్లు స్పష్టంచేశారు. ఈ నెల 20 నుండి వామపక్ష నాయకులు మూడు దళాలుగా రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు, సభలు, రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించి నిరసన తెలుపుతామని చెప్పారు. వామపక్షాలు చేపట్టిన ఆందోళనకు ప్రజలు మద్దతు పలికి జయప్రదం చేయాలని కోరారు. పవన్‌ కల్యాణ్‌ సనాతన ధర్మం వ్యాఖ్యలు సరికాదన్నారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని పెంపొందించాలన్నారు. జనసేన కార్యకర్తలు ఆలోచించి మత రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్‌ బాబూరావు, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు పి.ప్రసాద్‌, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌కే ఖాదర్‌బాషా మాట్లాడుతూ విద్యుత్‌ చార్జీలు రద్దు చేయకపోతే బషీర్‌బాగ్‌ తరహా విద్యుత్‌ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టవద్దని వపన్‌కల్యాణ్‌కి హితవు పలికారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కె.పొలారి పాల్గొన్నారు.

విశాలాంధ్రకు స్పందన

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రధాన తపాలా కార్యాలయం వెనుక బాగాన ఉన్న ట్రాన్స్ఫార్మర్ దీన్ని బీటలు ఉండడంతో పూర్తిగా ఒరిగిపోయింది.. ఈ విషయంపై రెండు రోజుల కిందట విశాలాంధ్ర దినపత్రికలో కథాంశం ప్రచురింపబడింది. దీంతో స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు నూతన ట్రాన్స్ఫార్మర్లకు పడిపోకుండా తిరిగి ఒక ఎత్తైన అరుగు ఏర్పాటు చేసి, ప్రమాదాలు జరగకుండా నివారించారు. దీంతో అవార్డు ప్రజలు విశాలాంధ్ర దినపత్రికకు కృతజ్ఞతలు తెలియజేశారు.

రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి అనంతపురం జిల్లా జట్లకు ధర్మవరం బాలుడు ఎంపిక ..

ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సెట్టిపీ జయ చంద్రారెడ్డి
విశాలంద్ర ధర్మవరం : రాష్ట్ర స్థాయిలో ఈ నెల నవంబర్ 09 తేదీ నుండి 11 తేదీ వరకు శ్రీకాకుళంలో జరిగే 68 వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్( ఎస్ జి ఎఫ్)రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో లో పాల్గొనే అండర్ 19 విభాగంలో పాల్గొనే ఉమ్మడి అనంతపురం బాస్కెట్బాల్ జట్టులో బాలుర విభాగంలో విజయ్ తరుణ్ ఎంపికయ్యారని ధర్మాంభ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శెట్టిపి జయ చంద్రా రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అక్టోబర్ 21వ తేదీన తేదీన అనంతపురం నగరంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన సెలక్షన్స్ నందు వీరు ప్రతిభా చూపి ఉమ్మడి అనంతపురం జిల్లా జట్లకు ఎంపికయ్యారు అని తెలిపారు. వీరి ఎంపిక పట్ల అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామి రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ శెట్టిపి జయచంద్రారెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయ తుల్లా, కోచ్ సంజయ్, హర్షం వ్యక్తం చేశారు .రాష్ట్రస్థాయిలో స్థాయిలో వీరు రానించి ధర్మవరం పట్టణమునకు పేరు ప్రతిష్టలు తేవాలని వారు ఆకాంక్షించారు..ఎంపికైన క్రీడాకారుడు గురువారం రోజున బయలుదేరి శ్రీకాకుళం కి వెళ్లారు.

యుటిఎఫ్ శ్రీ సత్యసాయి జిల్లా స్వర్ణోత్సవ మహాసభలను విజయవంతం చేయండి

యుటిఎఫ్ జిల్లా ఆడిట్ కన్వీనర్ ఆర్. రామకృష్ణ
విశాలాంధ్ర ధర్మవరం : యుటిఎఫ్ శ్రీ సత్యసాయి జిల్లా స్వర్ణోత్సవ మహాసభలను విజయవంతం చేయాలని యుటిఎఫ్ జిల్లా ఆడిట్ కన్వీనర్ ఆర్. రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పట్టణంలోని బిఎస్సార్ మున్సిపల్ ఉన్నత పాఠశాల యందు యుటిఎఫ్ జిల్లా మున్సిపల్ కన్వీనర్ బిల్లే రామాంజనేయులు, స్థానిక నాయకులు రాంప్రసాద్ ,హరిశంకర్ ,ప్రదీప్ కుమార్ తదితరులతో కలిసి యుటిఎఫ్ జిల్లా స్వర్ణోత్సవ మహాసభల పోస్టర్లను వారు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నవంబర్ 10వ తేదీ ఆదివారం రోజున 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కదిరి పట్టణములో జిల్లా స్వర్ణోత్సవ మహాసభలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు ఎంతో ఆశతో తెచ్చుకున్న నూతన ప్రభుత్వం ఉద్యోగుల కోరికలను మన్నించి పి ఆర్ సి ని వెంటనే అమలు చేయాలని, బకాయి పడ్డ డి ఎ, అండ్ పి ఎఫ్, ఏపీ జి ఎల్ ఐ సి మొత్తాలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.విద్యార్థుల అపార్ నంబర్ జెనరేట్ లో ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మున్సిపల్ ఆదాయానికి సచివాలయ ఉద్యోగులు కృషి చేయాలి.. కమిషనర్ ప్రమోద్ కుమార్

విశాలాంధ్ర-ధర్మవరం : పురపాలక సంఘ కార్యాలయమునకు ఆదాయానికి సచివాలయ ఉద్యోగులు కృషి ఎంతో అవసరమని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయంలో సచివాలయ కార్యదర్శులకు అవినీతి కార్యదర్శలతో మున్సిపాలిటీ అభివృద్ధిపై సమావేశాన్ని నిర్వహించి, వివిధ విషయాలపై వారు చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఆస్తి పన్ను రూ.13.77 కోట్లు, నీటి పన్ను 8.88 కోట్ల రూపాయలు, ఖాళీ స్థలాల పన్ను 90 లక్షల రూపాయలు ఇంకను బకాయి కలదని తెలిపారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో ముందుకు వెళ్లి ఈ బకాయిలను వసూలు చేయాలని వారు ఆదేశించడం జరిగిందని తెలిపారు. పన్నుల వసూలను వేగవంతం చేయాలని, ఒక ప్రణాళిక పద్ధతిలో వెళ్ళినప్పుడు విజయం చేకూరుతుందని తెలిపారు. అన్ని వార్డుల కార్యదర్శులు పన్నులపై ప్రత్యేక దృష్టి సారించి తమ సహాయ సహకారాలను మున్సిపాలిటీ అందించాలని తెలిపారు.

ల్యాబ్ టెక్నీషియన్స్ కు అసోసియేషన్ ఆర్థిక సహాయం

విశాలాంధ్ర -ధర్మవరం:: రెండు రోజుల క్రిందట ధర్మారం పట్టణానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్స్ ప్రదీప్, ఇతీష్ ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడటం జరిగింది. ఈ సమాచారంతో ధర్మవరం మెడికల్ ల్యాబ్స్ టెక్నీషియన్ అసోసియేషన్ వారు వారి ఇంటికి స్వయంగా వెళ్లి 22 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. కుటుంబానికి ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు ప్రకాష్, కరుణాకర్ ,అంజన్ రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.