విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని రేయిన్ బో ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాలలో కరస్పాండెంట్ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సెమి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఆర్ సి ఎం చర్చి ఫాదర్ సంజీవరావు హాజరై క్రిస్మస్ సందేశమిచ్చారు. లోక కళ్యాణం నిమిత్తం యేసుక్రీస్తు మనుష్యు కుమారునిగా కన్యక మరియ గర్భం నందు ఈ లోకంలో జన్మించారని తెలిపారు. ప్రతి విద్యార్థి మంచి నడవడిక, నైతిక విలువలు పెంపొందించుకోవాలన్నారు. అలాగే ఉన్నత చదువులు చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం చిన్నారులు క్రిస్మస్ పుట్టుకకు సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం రంగారెడ్డి, ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, ఉపాధ్యాయులు పుల్లయ్య, రామకృష్ణ, శామ్యూల్, నాగరత్నమ్మ, జయశ్రీ, అనిత, రేఖ, కలావతి, ప్రత్యూష పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
జాతీయ పురస్కారాన్ని అందుకున్న మండ్లి కిషోర్ కుమార్
విశాలాంధ్ర -అనంతపురం : నగరంలోని సి.వి.ఆర్ పాఠశాల నందు ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేయుచున్న డాక్టర్ మండ్లి కిషోర్ కుమార్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. డాక్టర్ చివుకుల హనుమంతరావు చారిటబుల్ ట్రస్ట్ గుంటూరు వారు డాక్టర్ ఏ.పీ.జే. అబ్దుల్ కలాం జాతీయ పురస్కారాన్ని మండ్లి కిషోర్ కుమార్ అందుకున్నారు. ఈ పురస్కారాన్ని వారు ఇస్రో శాస్త్రవేత్త కే.రామ్మోహన రావు, గుంటూరు జిల్లా సైన్స్ ఆఫీసర్ రాజశేఖర్ చేతులమీదుగా అందుకోవడం జరిగినది. ఈ పురస్కారాన్ని అందుకున్నందుకు పాఠశాల సిబ్బంది హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రస్థాయి జూడో పోటీలకు రేయిన్ బో విద్యార్థులు ఎంపిక
విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : రాష్ట్రస్థాయి జూడో పోటీలకు మండల కేంద్రమైన పెద్దకడబూరులోని రేయిన్ బో ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాల విధ్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ గోవిందరెడ్డి సోమవారం తెలిపారు. ఆలూరు జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న షోహత్ అలి (52ఖస్త్ర),అమరేష్ (36 ఖస్త్ర), 7వ తరగతి చదువుతున్న శివ (45ఖస్త్ర) ల జూడో పోటీల్లో ప్రతిభ చాటి విజేతలుగా నిలిచారు. విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయులు అంజి ఆధ్వర్యంలో కరస్పాండెంట్ గోవిందరెడ్డి, ఉపాధ్యాయులు ప్రసాద్, పుల్లయ్య, రామకృష్ణ, శామ్యూల్ అభినందించారు.
అమరావతి నిర్మాణం… మరో రూ. 2,723 కోట్ల పనులకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ సహకారం, ప్రపంచ బ్యాంకు అండతో అమరావతి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరుగులు పెట్టించే పనిలో ఉన్నారు. తాజాగా అమరావతిలో మరో రూ. 2,723 కోట్ల పనులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. సీఆర్డీయే 44వ సమావేశంలో ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 12 నాటికి 1.18 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తి చేసి ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఎల్పీఎస్ జోన్ 7, జోన్ 10లో మౌలిక వసతుల కల్పనకు నిర్ణయం తీసుకున్నారు. రాజధాని రింగ్ రోడ్డు, విజయవాడ బైపాస్ రోడ్డు ప్రాజెక్టుపై కూడా అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. మరోవైపు, ఇప్పటి వరకు రూ. 47,288 కోట్ల విలువైన పనులకు సీఆర్డీయే ఆమోదం తెలిపింది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయ కుట్రలో అల్లు అర్జున్ పావుగా మారారు: డీకే అరుణ
సినీ హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడిని బీజేపీ ఖండిస్తోందని ఆ పార్టీ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఇలాంటి దాడులను ఎవరూ సమర్థించరని చెప్పారు. పోలీసు అధికారులు ఇలాంటి ఘటనల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అల్లు అర్జున్ నివాసంపై దాడి వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందనిపిస్తోందని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కుట్రలో అల్లు అర్జున్ పావుగా మారారని డీకే అరుణ అన్నారు. సంధ్య థియేటర్ ఘటనను రాజకీయాలకు వాడుకోవడం సరికాదని చెప్పారు. సీఎం పేరు మర్చిపోయానని అల్లు అర్జున్ అనడాన్ని కేటీఆర్ ట్రోల్ చేశారని… అందుకే అల్లు అర్జున్ ని రేవంత్ టార్గెట్ చేశారని విమర్శించారు. అల్లు అర్జున్ ని బలిపశువు చేశారని డీకే అరుణ అన్నారు. మీకు, కేటీఆర్ కు మధ్య ఉన్న వైరాన్ని సినిమా వాళ్లపై చూపవద్దని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. సినీ ఇండస్ట్రీని రేవంత్ టార్గెట్ చేయడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పాయని విమర్శించారు.
అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనలో నిందితులకు రిమాండ్.. బెయిల్!
నటుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్పడిన ఆరుగురు నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. ఆదివారం నాడు బన్నీ ఇంటిపై ఓయూ జేఏసీ నేతలు శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేశ్, ప్రేమ్ కుమార్, ప్రకాశ్ దాడి చేసిన విషయం తెలిసిందే. దాంతో ఈ ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిపై బీఎన్ఎస్ 331(5), 190, 191(2), 324(2), 292, 126(2), 131 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, ఈరోజు వారిని మెజిస్ట్రేజ్ ఎదుట హాజరపరచగా వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం నిందితులు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా మెజిస్ట్రేజ్ వారికి బెయిల్ మంజూరు చేశారు. ఇక నిన్న అక్రమంగా బన్నీ ఇంటి గేటులోకి ప్రవేశించి ఓయూ జేఏసీ నేతలు టమాటాలు, కోడిగుడ్లు విసిరారు. పూల కుండీలను పగలగొట్టి విధ్వంసం సృష్టించారు. రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమంటూ నినాదాలు చేసుకుంటూ ఇంటి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో అల్లు అర్జున్ కుటుంబం ఇచ్చిన సమాచారం మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న ఆరుగురిని ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చారు.
పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర అల్పపీడనం
పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ-నైరుతి దిశగా కదులుతోంది. రేపటికి (మంగళవారం) ఉత్తర తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఏపీలోని పోర్టులకు అధికారులు మూడో నెంబర్ హెచ్చరిక జారీ చేశారు. గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా సముద్రంలో తీవ్ర అల్పపీడనం ప్రయాణం గందరగోళంగా సాగుతోంది. దీంతో దాని కదలికలను అంచనా వేయడం కష్టమవుతోంది. ఆదివారం తీవ్ర అల్పపీడనం సముద్రంలోనే పూర్తిగా బలహీన పడుతుందని మొదట వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే అల్పపీడనం అవశేషాలు ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు వెళుతున్నట్లు వాతావరణ శాఖ నిపుణులు అంటున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు లేవని, అందుకే ఇలాంటి పరిస్థితి నెలకొందని, ఇలాంటివి అరుదుగా జరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 26 (గురువారం) వరకు దీని ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. అయితే అల్పపీడనం తీరానికి చేరువగా వెళ్తుందా.. లేదా తీరం దాటుతుందా అనే అంశంపై స్పష్టత లేదు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 16న అల్పపీడనం ఏర్పడి, తర్వాత అది వాయుగుండంగా బలపడి తమిళనాడు తీరానికి దగ్గరగా వెళ్లొచ్చని వాతావరణ శాఖ నిపుణులు భావించారు. అయితే అది రెండ్రోజులకు తీవ్ర అల్పపీడనంగా మారి ఏపీ తీరం వైపు వచ్చింది.
మూడో రోజూ భూప్రకంపనలే
ఏపీలోని ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. జిల్లాలోని ముండ్లమూరు మండలంలో భూమి సెకను పాటు కంపించింది. ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్ల ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. శనివారం కూడా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లోని పలు గ్రామాల్లో స్వల్పంగా భామి కంపించింది. భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
సహనం కోల్పోయా.. క్షమించండి: సీవీ ఆనంద్
సంధ్య థియేటర్ ఘటనపై నిర్వహించిన ప్రెస్ మీట్ లో జాతీయ మీడియాను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ విచారం వ్యక్తం చేశారు. రెచ్చగొట్టే ప్రశ్నలు వేయడంతో తాను సహనం కోల్పోయానని చెప్పారు. ఈ ఘటనపై జాతీయ మీడియాకు క్షమాపణ చెబుతున్నానని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. సంధ్య థియేటర్ ఘటనకు జాతీయ మీడియా మద్దతిస్తోందంటూ తాను చేసిన వ్యాఖ్యలను వాపస్ తీసుకుంటున్నట్లు చెప్పారు. రేవతి మరణం, థియేటర్ వద్ద తొక్కిసలాటకు సంబంధించి నిజానిజాలు వెల్లడించేందుకు ఆదివారం పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహించిన విషయం తెలిసిందే. థియేటర్‌లో ఆరోజు ఏం జరిగిందో తెలుపుతూ సీవీ ఆనంద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ.. నేషనల్ మీడియా ఈ ఘటనకు మద్దతు ఇస్తోందని అన్నారు. దీనిపై అక్కడ ఉన్న జర్నలిస్టులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేయడంతో సీవీ ఆనంద్ తాజాగా ట్విట్టర్ లో స్పందించారు. ారెచ్చగొట్టే ప్రశ్నలు వేయడంతో సహనం కోల్పోయి ఆ వ్యాఖ్యలు చేశాను. నేను కాస్త సంయమనం పాటించాల్సింది. నేను చేసిన పొరపాటు గుర్తించి నేషనల్ మీడియాకు సారీ చెబుతున్నా్ణ అంటూ ట్వీట్ చేశారు.