ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మద్దతు ధర విషయమై ఆరా తీసేందుకు గాను జిల్లాలోని గంగూరు, ఈడుపుగల్లులోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఈడుపుగల్లు రెవెన్యూ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. ఈడుపుగల్లులో చంద్రబాబు నేరుగా రైతులతో మాట్లాడారు. అలాగే పక్కనే ఉన్న వెంకటాద్రి ధాన్యం మిల్లును సందర్శించారు. గంగూరు రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి సిబ్బంది, రైతులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాగా, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల వ్యవధిలోనే ప్రభుత్వం వారి ఖాతాలలో నగదు జమ చేస్తోంది.
పశ్చిమ గోదావరిలో షాకింగ్ ఘటన .. పార్సిల్‌లో డెడ్ బాడి
పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళకు పార్సిల్‌లో డెడ్ బాడి (మృతదేహం) రావడం తీవ్ర కలకలాన్ని రేపింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగంటి గ్రామంలోని ఒక మహిళకు పార్శిల్‌లో మృతదేహం వచ్చింది. దానిలో ఓ బెదిరింపు లేఖ ఉంది. ఈ ఘటన ఆమెతో పాటు స్థానికులను భయాందోళనలకు గురి చేసింది. జిల్లా ఎస్పీ నయూం అస్మి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.విషయంలోకి వెళితే.. గ్రామానికి చెందిన సాగి తులసి అనే మహిళకు జగనన్న కాలనీలో స్థలం మంజూరు కాగా ఇల్లు నిర్మిస్తోంది. ప్రస్తుతం ఆ ఇల్లు ప్లాస్టింగ్ స్టేజ్‌లో ఉంది. ఈ క్రమంలో ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సాయం కోసం క్షత్రియ సేవా సమితిని ఆశ్రయించింది. ఆమెకు సదరు సేవా సమితి మొదటి విడతలో టైల్స్ పంపించింది. మరోసారి ఆర్ధిక సాయం కోసం మహిళ దరఖాస్తు చేసుకోగా, పార్శిల్‌లో విద్యుత్ సామగ్రి వస్తుందని భావించింది. అయితే, తాజాగా వచ్చిన పార్శిల్‌లో విద్యుత్ సామాగ్రికి బదులు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వచ్చింది. పార్శిల్‌లో ఒక ఉత్తరం కూడా ఉన్నట్లు గుర్తించారు. అందులో రూ.1.30 కోట్లు చెల్లించాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొని ఉంది. దీంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గ్రామానికి చేరుకుని పరిశీలించారు. పార్శిల్ పెట్టెలో సుమారు 45 సంవత్సరాల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం సగ భాగం ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆ చట్టాలు మీ రక్షణ కోసం, సంక్షేమం కోసం..మీ భర్తలపై ఆయుధాలుగా వాడేందుకు కాదు..
మహిళలకు సుప్రీంకోర్టు హితవు
విడాకుల సమయంలో భరణం రీజనబుల్ గా ఉండాలని సూచన
అత్తింటి వారి వేధింపుల నుంచి రక్షణ కోసం, మీ సంక్షేమం కోసం చేసిన కఠిన చట్టాలను ఆయుధాలుగా మార్చుకోవద్దని సుప్రీంకోర్టు మహిళలకు హితవు పలికింది. ఆ చట్టాలు మీ రక్షణ కోసమే కానీ భర్తలపై ఆయుధాలుగా ప్రయోగించేందుకు కాదని చెప్పింది. వివాహం అనేది కమర్షియల్ వెంచర్ కాదని వ్యాఖ్యానించింది. విడాకుల సమయంలో కోరే భరణం రీజనబుల్ గా ఉండాలే తప్ప విడిపోయిన భర్తను రోడ్డు మీదికి ఈడ్చేలా కాదని పేర్కొంది. ఈమేరకు గురువారం ఓ విడాకుల కేసులో తీర్పు వెలువరిస్తూ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ నాగరత్న ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాహం తర్వాత భర్తపై ఆధారపడిన భార్య.. విడాకుల తర్వాత ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే భరణం అని సుప్రీంకోర్టు పేర్కొంది. మాజీ భాగస్వామి ఆర్థిక స్థాయికి సరిసమానంగా ఉండేలా భరణం నిర్ణయించలేమని స్పష్టం చేసింది. సామజిక పరిస్థితులు, జీవనశైలి ఆధారంగా భరణాన్ని రీజనబుల్ గా నిర్ణయించాల్సి ఉంటుందని తెలిపింది. ఇటీవల బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.భార్య వేధింపులు, భరణంగా భారీ మొత్తం డిమాండ్ చేయడం, తప్పుడు కేసులతో కోర్టుల చుట్టూ తిప్పడంతో తీవ్ర ఆవేదనకు గురైన అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన రాసిన ఆత్మహత్య లేఖ, సెల్ఫీ వీడియో దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. మహిళల కోసం చేసిన చట్టాలతో మగవాళ్లను వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
రేవంత్ అందర్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.. కెటిఆర్
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసుపై తాను భయపడటం లేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఇందులో పైసా అవినీతి కూడా జరగలేదని తెలిపారు. లీగల్ గా తాము ముందుకెళతామని అన్నారు. ఈ-కార్ రేసింగ్ పై మంత్రిగా తాను విధానపరమైన నిర్ణయాన్ని మాత్రమే తీసుకున్నానని చెప్పారు. కేసు నమోదు చేసే హక్కు ఏసీబీకి లేదని అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ, ఈ-కార్ రేసింగ్ లో అవినీతి జరగలేదని, ప్రొసిజర్ సరిగా లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా నిన్న చెప్పారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిని ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా? లేదా ముఖ్యమంత్రే అందరినీ పక్కదోవ పట్టిస్తున్నారా? అని ప్రశ్నించారు. సీఎంకు సమాచార లోపం ఉందని చెప్పారు. ఓఆర్ఆర్ టెండర్ల పై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిట్ తో విచారణ జరిపిస్తే అందులో ఉండే అధికారులు ప్రభుత్వం మాట వింటారని చెప్పారు. రేవంత్ కింద పని చేసే అధికారులతో న్యాయం జరగదని అన్నారు.
పార్లమెంట్ వద్ద ఇండియా కూటమి నేతల నిరసన..లోక్‌సభ .. నిరవధికంగా వాయిదా
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అవమాన పరిచారంటూ ఇండియా కూటమి నేతలు పార్లమెంట్ శీతాకాల సమావేశాల చివరి రోజైన శుక్రవారం పార్లమెంట్ వద్ద నిరసన చేపట్టారు. విపక్ష నేతల నిరసనకు పోటా పోటీగా ఎన్డీయే కూటమి నేతలు సైతం ప్లకార్డ్‌లతో ఆందోళనకు దిగారు. దీంతో సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 25న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశం మొదటి వారంలో పలు మార్లు వాయిదా పడింది. రాజ్యాంగం, ఫెడరలిజం, ప్రజాస్వామ్యంపై డిబేట్,బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై విపక్షాల అవిశ్వాస తీర్మానం, ప్రియాంక గాంధీ లోక్‌సభ అరంగేట్రం వంటి అనేక అంశాలు పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రధాన చర్చకు దారి తీశాయి.
పార్లమెంట్ సమావేశాల ప్రారంభం తొలి వారంలో గౌతమ్ అదానీపై అమెరికా వేసిన అభియోగంపై చర్చ జరగాలని డిమాండ్ చేయడంతో పాటు పలు అంశాలపై ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి. చర్చకు అధికార పక్షం అంగీకరించకపోవడంతో నిరసనలకు దారి తీసింది.ఈ సెషన్‌లోనే ఒక దేశం, ఒకే ఎన్నికల బిల్లుపై చర్చ జరిగింది. జమిలి ఎన్నికలపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో జమిలి ఎన్నికల కోసం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 31 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటుచేసింది. ఈ మేరకు తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ సమావేశాల చివరి రోజు ఇవాళ జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి లోక్ సభ పంపింది.
రాజ్యసభ లో ..
- రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ధన్‌ఖడ్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అయితే, 14 రోజుల నోటీసు లేకపోవడం,డ్రాఫ్టింగ్‌లో లోపాలతో సహా విధానపరమైన కారణాలతో అవిశ్వాస తీర్మానాన్ని పక్కన పెట్టారు.
రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ఆమోదం
ఏపీకి ప్రపంచ బ్యాంక్ గుడ్ న్యూస్ అందించింది. రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ప్రపంచ బ్యాంక్ బోర్డు సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో అమరావతి నిర్మాణానికి 800 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఏపీ రాజధానికి ఇప్పటికే ఏడీబీ 788 మిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసింది. అమరావతి నిర్మాణానికి నిధులు ఇస్తామని గతంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటన చేసింది. ప్రపంచ బ్యాంక్, ఏడీబీల ద్వారా నిధులు సమకూరుస్తామని వెల్లడించింది. ఈ రెండు సంస్థల ద్వారా 1588 మిలియన్ డాలర్ల నిధులు సమకూరుస్తామని వెల్లడించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సిఫార్సుతో రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపినట్లు సమాచారం.
అజ్ఞాతంలో మోహన్ బాబు.. పోలీసుల గాలింపు
మీడియా ప్రతినిధిపై దాడి నేపథ్యంలో మోహన్ బాబుపై కేసు
మీడియా ప్రతినిధిపై దాడి నేపథ్యంలో సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ దాడి కేసులో ఆయనను విచారించేందుకు పహాడీ షరీఫ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కానీ, ఆయన మాత్రం అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మోహన్ బాబు కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన దుబాయి వెళ్లినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే, ఆయన తరఫు న్యాయవాదులు మాత్రం ఆ ప్రచారాలను ఖండించారు. మోహన్ బాబు దుబాయి వెళ్లలేదని, భారత్‌లోనే ఉన్నారని చెబుతున్నారు. కాగా, మోహన్ బాబు కుటుంబ గొడవల నేపథ్యంలో జల్‌పల్లిలోని తన నివాసంలో వార్త కవరేజ్ కోసం వెళ్లిన ఓ మీడియా ప్రతినిధిపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. జర్నలిస్టు నుంచి మైకు లాక్కొని అతడిని ముఖంపై కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన నేపథ్యంలో మోహన్ బాబు మీడియాకు లిఖితపూర్వకంగా క్షమాపణలు కూడా చెప్పారు.
ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టును మోహన్ బాబు, మంచు విష్ణు పరామర్శించారు. ఆసుపత్రిలో అతనితో పాటు కుటుంబ సభ్యులకు కూడా సారీ చెప్పారు. అయితే, జర్నలిస్టుపై దాడి నేపథ్యంలో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది.
కస్తూర్బా గాంధీ గర్ల్స్ హైస్కూల్ ను సందర్శించిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్
విశాలాంధ్ర ధర్మవరం;;ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ధర్మవరం టీం సభ్యులు సత్య సాయి జిల్లా, జగరాజు పల్లి వద్దనున్న కస్తూరి గాంధీ బాలిక విద్యాలయంను వీక్షించి అక్కడ చదువుతున్న విద్యార్థినిలు కలసి వారికి చదువు, భోజన వసతి, హాస్టల్ గదులను సందర్శించారు. అలాగే విద్యార్థులు అడిగి వారికి ఉన్న ఇబ్బందులను తెలుసుకోన్నారు ఈ కార్యక్రమంలో ఐ హెచ్ ఆర్ పి సి- నేషనల్ లీగల్ అడ్వైజర్ డాక్టర్. సుమలత , ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చట్టారవివర్ధన్, ధర్మవరం టౌన్ ప్రెసిడెంట్ డాక్టర్. అప్సర్,ఆంధ్రప్రదేశ్ మీడియా సెల్ ప్రెసిడెంట్ నరేష్, ఏ సిబిఐ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ చందు టౌన్ ప్రెసిడెంట్ ఫర్హానా బేగం, టౌన్ సెక్రెటరీ. శ్రీ లక్ష్మి, సత్యసాయి డిస్టిక్ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ పర్వీన్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పద్మశాలీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం..
ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర ధర్మవరం; పద్మశాలీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో నూతనంగా ఎంపికైన పద్మశాలీ కమిటీ అధ్యక్ష,ఉపాధ్యక్షులైన పుత్తరుద్రయ్య,జింక నాగభూషణం తోపాటు పలువురు పద్మశాలి కులస్తులు పరిటాల శ్రీరామ్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ గడిచిన ఎన్నికల్లో పద్మశాలీలు కూటమికి అండగా నిలిచారని… ధర్మవరంలో కూటమి అభ్యర్థి సత్య కుమార్ గెలుపు కోసం పనిచేశారని అన్నారు. పద్మశాలీలలో ఎక్కువగా చేనేతరంగంపై ఆధారపడి ఉన్నారని వారి సమస్యలను ఇప్పటికే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. చేనేత వృత్తికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యంగా కార్మికులకు మెరుగైన జీవితం ఉండే విధంగా…. ధర్మవరంలో చిన్న తరహా పరిశ్రమల గురించి చర్చిస్తున్నట్లు వివరించారు పద్మశాలీలు ఐక్యంగా అన్ని రంగాల్లో ముందుండాలని ఈ సందర్భంగా శ్రీరామ్ ఆకాంక్షించారు.
అయ్యప్ప స్వామి భజన మందిరంలో పరిటాల శ్రీరామ్ అన్నదానం;;;
ధర్మవరం పట్టణంలోని చెరువు కట్ట వద్ద ఉన్న అయ్యప్ప స్వామి భజన మందిరంలో తెలుగుదేశం పార్టీ ధర్మవరం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తన మేనకోడలు వడ్లమూడి మీరా పేరు మీదుగా మాలదారులకు అన్నదానం చేశారు. ముందుగా అయ్యప్ప స్వామికి నిర్వహించిన పూజా కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. గురుస్వాములు పరిటాల శ్రీరామ్ ను ప్రత్యేకంగా ఆశీర్వదించారు. అనంతరం మాలదారులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీరామ్ స్వయంగా మాలదారులకు భోజనం వడ్డించారు. తన సోదరి కుమార్తె పేరు మీదుగా అయ్యప్ప మాలదారులకు అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందని వారు అన్నారు. ఇది తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
రైతు సేవా సిబ్బంది సామర్థ్యం పెంపు పై శిక్షణ కార్యక్రమం.. అధికారులు
విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం వ్యవసాయ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల రైతు సేవా కేంద్ర సిబ్బందికి సామర్థ్యం పెంపుపై శిక్షణ కార్యక్రమం నిర్వహణలో భాగంగా వివిధ పంటలలో సమగ్ర ఎరువుల యాజమాన్యం ,ప్రకృతి వ్యవసాయం, వివిధ పంటలలో చీడపీడల నివారణ చర్యలు, ఎన్.పి.ఎస్.ఎస్ మరియు సి. యల్ . యస్ యాప్ల గురించి శిక్షణను పలువురు అధికారులు నిర్వహించారు. తదుపరి సూక్ష్మనీటిపారుదల (ఏపీఎంఐపి) పిడి సుదర్శన్ మాట్లాడుతూ స్ప్రింక్లర్ల పరికరాలు 30 వేల హెక్టార్లు సత్యసాయి జిల్లాకు మంజూరువడం జరిగిందని, వీటిని అవసరమైన రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సిబ్బందికి తెలియడం జరిగింది అని తెలిపారు. జిల్లా ఉద్యాన అధికారి చంద్రశేఖర్ మాట్లాడుతూ మామిడిలో పూతకు యాజమాన్య పద్ధతులను వివిధ పథకాలు వివరించడం జరిగిందన్నారు.జిల్లా వ్యవసాయ అధికారి వైవి సుబ్బారావు మాట్లాడుతూ ప్రతి ఆర్ ఎస్ కే సిబ్బంది తప్పనిసరిగా ఈ పంట నమోదు చేయాలని ఆర్ యస్ కే సిబ్బందికి సూచించడం జరిగింది అని తెలిపారు. రైతులకి అందుబాటులో ఉండి తగిన సలహాలు సూచనలు చేసి రాగి పంట విస్తీర్ణాన్ని పెంచి అధిక దిగుబడి సాధించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సిబ్బంది సూచించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీఎంఐపిడి శ్రీ సుదర్శన్ డిహెచ్ఓ చంద్రశేఖర్ , ఏ డి ఏ రెగ్యులర్ ధర్మవరం శ్రీకృష్ణయ్య ,సిరికల్చర్ అధికారి దామోదర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ వనరుల కేంద్రం ఏ డి ఏ సనావుల్లా, డివిజన్ వ్యవసాయ అధికారులు ముస్తఫా, ఓబిరెడ్డి, రమాదేవి, కృష్ణకుమారి ఆత్మ బిటియం ప్రతిభ, రైతు సేవ సిబ్బంది పాల్గొన్నారు.