Tuesday, May 13, 2025
Home Blog Page 6

మెగా డి.యస్.సి. పరీక్షలకు ఆన్-లైన్ ద్వారా ఉచిత శిక్షణ

డీ ఎస్సీ అభ్యర్థులకు సువర్ణ అవకాశం

విశాలాంధ్ర-కదిరి : డీఎస్సీ పరీక్షల కొరకు ఆన్లైన్ ద్వారా త్వరలో ఉచిత శిక్షణ,టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్షలు అర్హత సాధించి తాలూకా పరిధిలో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని వార్డెన్లు జయరామి రెడ్డి, షబాన,లీలావతి తెలిపారు. బిసి,ఈబిసి కేటగిరీలకు చెందిన అభ్యర్థులు డి.యస్.సి. ఆన్-లైన్ ఉచిత శిక్షణ కొరకు దరఖాస్తు చేయు వారు టెట్ పరీక్షలో అర్హత సాధించిన మార్కుల జాబితా, నేటివిటీ పత్రము,కుల, ఆదాయ ధృవీకరణ పత్రము, ఆధార్ కార్డుతో పాటు రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు జతపరచి వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాదికారిత అధికారి కార్యాలయంలో ఈ నెల 15లోపు దరఖాస్తులు a అందజేయాలని తెలిపారు.ఈ అవకాశాన్ని శ్రీసత్యసాయి జిల్లా వాసులు ఉపయోగించు
కోవాలన్నారు.మరిన్ని వివరాలకు కార్యాలయములో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ,సాధికారిత అధికారిని ఎస్. నిర్మలా జ్యోతి, లేదా ఫోన్ నెంబరు 9392141545 ద్వారా సమాచారన్ని తెలుసుకోవచ్చన్నారు.

సజావుగా ఛార్ ధామ్ యాత్ర…. పూర్తిస్థాయిలో హెలికాప్టర్ సేవలు… పుకార్లకు తెరదించిన సీఎం

భక్తులకు తమ ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందని స్పష్టీకరణ
ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రకు సంబంధించి భక్తులకు కీలక అప్‌డేట్ అందింది. సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలకు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్వయంగా తెరదించారు. ఛార్ ధామ్ యాత్ర సజావుగా సాగుతోందని చార్‌ధామ్ యాత్ర ఎటువంటి అంతరాయాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని, యాత్రికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ఆయన స్పష్టం చేశారు. ఈ యాత్రా సీజన్‌లో ఇప్పటివరకు 4 లక్షలకు పైగా భక్తులు చార్‌ధామ్‌లను విజయవంతంగా దర్శించుకున్నారని సీఎం పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. యాత్ర సజావుగా సాగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా, శ్రీ కేదార్‌నాథ్ ధామ్‌కు హెలికాప్టర్ సేవలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయని, ఇవి నిరంతరాయంగా నడుస్తున్నాయని తెలిపారు.

యాత్రకు సంబంధించి ఎలాంటి వదంతులను నమ్మవద్దని ముఖ్యమంత్రి భక్తులకు విజ్ఞప్తి చేశారు. యాత్రికుల ప్రయాణ అనుభవాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన పునరుద్ఘాటించారు. భక్తుల భద్రతకే తమ ప్రథమ ప్రాధాన్యత అని ధామి అన్నారు.

యాత్రకు సంబంధించిన ఏదైనా సమాచారం లేదా సహాయం అవసరమైతే, భక్తులు 1364 లేదా 0135-1364 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సూచించారు. ప్రభుత్వం అందించే అధికారిక సమాచారంపైనే ఆధారపడాలని ఆయన కోరారు.

భారత్ దాడులు ఆపేస్తే.. మేము కూడా… పాకిస్తాన్ సంచలన ప్రకటన..

భారతదేశం, పాకిస్తాన్ ప్రాంతాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఉప ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాంతికి ప్రాధాన్యతనిస్తూ, భారతదేశం దాడులు ఆపేస్తే, తాము కూడా యుద్ధానికి ముందడుగు వేయబోమని ప్రకటించారు.

భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు క్రమంగా యుద్ధం దిశగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇరు ప్రాంతాల్లో దాడులు కొనసాగుతుండగా, సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో యుద్ధ వాతావరణం పెరుగుతోంది. ఇదే సయమంలో పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో మాట్లాడుతూ, భారతదేశం తన దాడుల చర్యను ఆపితే, పాకిస్తాన్ కూడా అదే చేస్తుందన్నారు. ఈ ప్రకటన, పరిస్ధితిని మరింత ఉద్రిక్తంగా మార్చకుండా సంయమనం పాటించాలనే సంకేతాన్ని ఇస్తుందని చెప్పవచ్చు.

10 ప్రదేశాలపై దాడి

అయితే ఈ ప్రకటనపై భారత్ ఎలా స్పందిస్తుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయాలు తెలియాల్సి ఉంది. భారత్ తాజాగా షోర్కోట్‌లోని రఫికి ఎయిర్‌బేస్, చక్వాల్‌లోని మురిద్ ఎయిర్‌బేస్, రావల్పిండిలోని చక్లాలా కాంట్‌పై దాడులు చేసిందని పాకిస్తాన్ సైన్యం ఈరోజు ఉదయం ప్రకటించింది. దీనికి ప్రతిస్పందనగా, వారు భారతదేశంలోని 10 ప్రదేశాలపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో పంజాబ్‌లోని బ్రహ్మోస్ క్షిపణి స్టోరేజ్, ఉరి సరఫరా డిపో, రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్ ఎయిర్‌ఫీల్డ్, ఆదంపూర్‌లోని S-400  వ్యవస్థ, డెహ్రాంగ్యారి, పఠాన్‌కోట్ ఎయిర్‌ఫీల్డ్‌ వంటి ప్రాంతాల్లో ఉన్నాయని చెబుతోంది.

ఎలాంటి నష్టం లేదు

భారత దాడిలో పాకిస్తాన్‌కు ఎటువంటి నష్టం జరగలేదని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. రావల్పిండిలోని నూర్ ఖాన్ బేస్ వద్ద ఒక కారు తప్ప పాకిస్తాన్ వైమానిక స్థావరం దెబ్బతినలేదని ఆయన చెబుతున్నారు. భారతదేశంతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ శనివారం కీలక రాజకీయ నాయకులతో టెలిఫోన్ చర్చలు జరిపి సైనిక చర్య గురించి వారికి వివరించారు. భారతదేశానికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలని ప్రధానమంత్రి కోరారు. భారతదేశంతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని షాబాజ్ షరీఫ్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాలని నిర్ణయించుకున్నారు. నివేదికల ప్రకారం ఆయన ఈరోజు సాయంత్రం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది.

ఆన్‌లైన్‌లో బాధ్యతాయుత ప్రవర్తన, తప్పుడు సమాచారంపై అప్రమత్తంగా ఉండాలి

ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇంటర్నెట్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక

ఆన్‌లైన్‌లో బాధ్యతాయుత ప్రవర్తన, తప్పుడు సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని సూచన
పాకిస్థాన్ మూలాలున్న కంటెంట్‌ను ఓటీటీల నుంచి తొలగించాలని ఐ&బీ శాఖ ఆదేశం
జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రకటన
వదంతులు, అసత్య ప్రచారాలపై ఫిర్యాదుకు ప్రత్యేక వాట్సాప్ నంబర్, ఈమెయిల్
ఆపరేషన్ సిందూర్ అనంతరం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భారతీయ ఇంటర్నెట్ వినియోగదారుల కోసం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేయగా… ఓటీటీ వేదికలకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ దిశానిర్దేశం చేసింది. ఆన్‌లైన్‌లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టాలని ఈ సూచనల ద్వారా ప్రభుత్వం కోరింది.

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రజలు ఆన్‌లైన్‌లో వ్యవహరించాల్సిన తీరుపై స్పష్టమైన చేయాల్సినవి, చేయకూడనివిః జాబితాను విడుదల చేసింది. సోషల్ మీడియా వేదిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) ద్వారా ఈ వివరాలను పంచుకుంది.

ఁక్లిష్టమైన ఆన్‌లైన్ భద్రతా హెచ్చరిక. సైబర్ భద్రతా జాగ్రత్తలను ఎల్లప్పుడూ పాటించండి. ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండండి – వలల్లో లేదా తప్పుడు సమాచారంలో చిక్కుకోవద్దు. దేశభక్తితో, అప్రమత్తంగా, సురక్షితంగా ఉండండి. చడిజిటల్ఇండియా చఆపరేషన్ సిందూర్ అని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తన పోస్టులో పేర్కొంది.

ముఖ్య సూచనలు:

చేయాల్సినవి: – అధికారిక సలహాలు, హెల్ప్‌లైన్ నంబర్లు, ధృవీకరించబడిన సహాయక చర్యల సమాచారాన్ని మాత్రమే పంచుకోవాలి.
– ఏదైనా వార్తను ఇతరులకు పంపే ముందు అధికారిక వనరులతో దాని వాస్తవికతను నిర్ధారించుకోవాలి.
– నకిలీ వార్తలు లేదా తప్పుడు సమాచారం కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు నివేదించాలి.

చేయకూడనివి: – సైనిక దళాల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకోకూడదు.
– ధృవీకరించని సమాచారాన్ని ఇతరులకు ఫార్వార్డ్ చేయకూడదు.
– హింసను ప్రేరేపించే లేదా మత ఘర్షణలకు దారితీసే పోస్టులకు దూరంగా ఉండాలి.

తప్పుడు సమాచారం లేదా వదంతులపై ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ (8799711259) మరియు ఈమెయిల్ చిరునామాను కూడా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అందుబాటులోకి తెచ్చింది.

ఓటీటీలకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు:
మరోవైపు, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఐడబీ) కూడా ఆపరేషన్ సిందూర్ పరిణామాల నేపథ్యంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, మీడియా స్ట్రీమింగ్ సర్వీసులు, ఇతర మధ్యవర్తిత్వ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

జాతీయ భద్రత దృష్ట్యా, భారతదేశంలో పనిచేస్తున్న అన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, మీడియా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు, మధ్యవర్తులు… పాకిస్థాన్‌కు చెందిన వెబ్ సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు, ఇతర స్ట్రీమింగ్ మీడియా కంటెంట్‌ను తక్షణమే నిలిపివేయాలి. ఇది సబ్‌స్క్రిప్షన్ ఆధారితమైనా లేదా ఇతరత్రా అందుబాటులో ఉన్నా వర్తిస్తుందిఁ అని మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

భారత్, పాక్ యుద్ధం అప్‌డేట్స్ మీ ఫోన్లో చూడాలనుకుంటే ఇలా చేయండి..

భారత్, పాకిస్తాన్‌ల మధ్య పోరు భీకరంగానే నడుస్తోంది. రెండు దేశాలు ఒకదానిపై ఒకటి మిస్సైల్స్, డ్రోన్లతో దాడి చేసుకుంటున్నాయి. పాకిస్తాన్ ప్రయోగిస్తున్న ఆయుధాలను భారత్ తన టెక్నాలజీతో ధ్వంసం చేస్తోంది.

భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధంతో సరిహద్దు ప్రాంతాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. స్కూల్లు, కాలేజీలు ఇప్పటికే మూతపడ్డాయి. విమానయాన శాఖ ఏయిర్‌పోర్టులను సైతం మూసేసింది. యుద్ధ ప్రభావం సరిహద్దులతో పోల్చుకుంటే మిగిలిన ప్రాంతాల్లో లేదు. అయినప్పటికి ప్రజల్లో మాత్రం కొంత భయం కనిపిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని కొంత ఆందోళనకు గురవుతున్నారు. యుద్ధం అప్‌డేట్స్ కోసం టీవీలు, ఫోన్లలో న్యూసులు ఫాలో అవుతున్నారు.

అయితే.. వీటిలో రియల్ టైమ్.. అది కూడా అఫిషియల్ అప్‌డేట్స్ రావటానికి కొంత సమయం పడుతుంది. మీరు గనుక మీ ఫోన్‌లో ఓ చిన్న సెట్టింగ్ చేసుకుంటే.. యుద్ధం అప్‌డేట్స్‌ను రియల్ టైమ్‌లో మీ ఫోన్‌కు అలర్ట్స్ పొందొచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుని.. తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్‌లో..

-ముందుగా సెట్టింగ్స్‌ను ఓపెన్ చేయండి.

-సెట్టింగ్స్‌లో సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీని క్లిక్ చేయండి.

-అలా కుదరకపోతే.. ఎమర్జెన్సీ అలర్ట్స్ అని సెర్చ్ చేయండి.

-అక్కడ వైర్‌లెస్ ఎమర్జన్సీ అలర్ట్స్‌పైన క్లిక్ చేయండి.

-అందుబాటులో ఉన్న అన్ని అలర్ట్ ఆప్చన్లను యాక్టివేట్ చేసుకోండి.

( గమనిక.. ఫోన్ మోడల్‌ను కంపెనీని బట్టి పేర్లలో తేడా ఉండే అవకాశం ఉంటుంది. వైర్‌లెస్ ఎమర్జన్సీ అలర్ట్స్ ఫోన్ కంపెనీని బట్టి అడ్వాన్స్‌డ్, మోర్ సెట్టింగ్స్‌లో లేదా సెల్ బ్రాడ్‌క్యాస్టింగ్‌లో ఉండే అవకాశం ఉంది)

ఐఫోన్‌లో ఇలా..

సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేసి, నోటిఫికేషన్‌లోకి వెళ్లండి.

బాగా కిందకు వచ్చి గవర్నమెంట్ అలర్ట్స్ అనే ఆప్చన్‌ను ఎంచుకోండి.

టెస్ట్ అలర్ట్స్‌ను క్లిక్ చేసి అప్‌డేట్స్ పొందొచ్చు.

ఎన్‌సీఏతో పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సమావేశం.. అణ్వాయుధ వినియోగంపై చర్చ

పాకిస్థాన్‌లో శనివారం ఉదయం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశంలోని పలు కీలక వైమానిక స్థావరాలపై భారీ పేలుళ్లు సంభవించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తోడు భారత స్థావరాలపై పాకిస్థాన్ సైనిక చర్య ప్రారంభించిన నేపథ్యంలో ప్రధాని షాబాజ్ షరీఫ్ జాతీయ కమాండ్ అథారిటీ (ఎన్‌సీఏ) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ వ్యాప్తంగా పౌర, వాణిజ్య విమానాల రాకపోకలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ఆ దేశ సైన్యం ప్రకటించింది. శనివారం తెల్లవారుజామున పాకిస్థాన్‌లోని మూడు ముఖ్యమైన వైమానిక స్థావరాలపై వరుస పేలుళ్లు సంభవించాయి. సైనిక ప్రధాన కార్యాలయానికి సమీపంలో, ఇస్లామాబాద్‌కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రావల్పిండిలోని అత్యంత కీలకమైన నూర్‌ఖాన్ వైమానిక స్థావరం ఈ దాడుల్లో లక్ష్యంగా మారింది. గతంలో చాక్లాలా ఎయిర్ బేస్‌గా పిలువబడిన ఈ స్థావరం వైమానిక దళ కార్యకలాపాలకు, వీఐపీ రవాణా యూనిట్లకు కేంద్రంగా ఉంది. నూర్‌న్‌తో పాటు చక్వాల్ నగరంలోని మురిద్ వైమానిక స్థావరం, పంజాబ్ ప్రావిన్స్‌లోని జాంగ్ జిల్లాలో ఉన్న రఫిఖి వైమానిక స్థావరం కూడా దాడులకు గురైనట్లు పాకిస్థాన్ సైనిక వర్గాలు ధ్రువీకరించాయి.

మరోవైపు, భారత స్థావరాలపై పాకిస్థాన్ సైనిక చర్య చేపట్టినట్లు ఆ దేశ సైన్యం ప్రకటించిన కొద్ది గంటల్లోనే ప్రధాని షాబాజ్ షరీఫ్ జాతీయ కమాండ్ అథారిటీ (ఎన్‌సీఏ) అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. దేశ భద్రతకు సంబంధించిన అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన ఎన్‌సీఏలో ఉన్నతస్థాయి పౌర, సైనిక అధికారులు సభ్యులుగా ఉంటారు. పాకిస్థాన్ అణు కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈ సంస్థే తుది నిర్ణయాలు తీసుకుంటుంది.

అణ్వాయుధ సంపత్తి కలిగిన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగిన తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. ఇరు దేశాలు పరస్పరం గగనతల ఉల్లంఘనలకు పాల్పడ్డాయని, డ్రోన్లు, ఇతర ఆయుధాలను ప్రయోగించాయని ఆరోపణలు చేసుకుంటున్నాయి. పాకిస్థాన్ చేపట్టిన సైనిక చర్య, ఆ తర్వాత జరిగిన ఎన్‌సీఏ సమావేశం ప్రస్తుత పరిస్థితి తీవ్రతను, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాన్ని స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ, ఇరు దేశాలు సంయమనం పాటించాలని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పలు దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

మురళి నాయక్ యుద్ధభూమిలో వీరమరణం బాధాకరం

జిల్లా సిపిఐ కార్యదర్శి సి. జాఫర్
విశాలాంధ్ర -అనంతపురం: పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో మురళి నాయక్ వీరమరణం పొందడం బాధాకరమని అనంతపురం జిల్లా సిపిఐ కార్యదర్శి సి. జాఫర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేర్కొన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం పుట్ట గుండ్లపల్లి తాండకు చెందిన మురళి నాయక్ మురళి నాయక్ స్థానిక శ్రీ వాణి పిజి డిగ్రీ కళాశాలలో 2019 నుంచి 22 వరకు బీకాం పూర్తి చేశాడన్నారు. బికాం చదువుతూనే ఎన్ సి సి చురుకుగా పాల్గొనడం జరిగిందన్నారు. డిగ్రీ మూడో సంవత్సరంలోనే అతను ఆర్మీలో స్థానం సంపాదించారన్నారు. దేశం కోసం వీరుని మరణం పొందడం మనసు కనిచివేసింది అన్నారు. మురళి నాయక్ వీరమరణం తెలుగు ప్రజలకే గాక దేశ ప్రజలందరికీ స్ఫూర్తి దాయకమన్నారు. మురళి నాయక్ పవిత్ర ఆత్మకు వారి కుటుంబానికి సిపిఐ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఆపరేషన్ కగార్‌ నిలిపివేత.. కర్రెగుట్టల నుంచి సరిహద్దుకు బలగాలు

దేశ సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం (సీఆర్పీఎఫ్) బలగాల కదలికల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఆపరేషన్ సిందూర్ ప్రభావం ఆపరేషన్ కగార్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నందున కర్రెగుట్టల ప్రాంతంలో మోహరించిన సీఆర్పీఎఫ్ బలగాలను దశలవారీగా వెనక్కి పిలిపిస్తున్నారు. ఈ దళాలను తక్షణమే సరిహద్దుల్లోని హెడ్‌క్వార్టర్స్‌కు తరలించాలని ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆపరేషన్ కగార్‌లో భాగంగా ఇప్పటివరకు పామునూరు, ఆలుబాక, పెద్దగుట్ట వంటి ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లు తమ స్థావరాల నుంచి వెనుదిరుగుతున్నారు. ఈ బలగాలన్నీ ఆదివారం ఉదయం లోపు భారత్-పాక్ సరిహద్దుల్లోని నిర్దేశిత ప్రాంతాలకు చేరుకుని, అక్కడ రిపోర్ట్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు అందాయి. సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసే చర్యల్లో భాగంగా ఈ పునర్‌వ్యవస్థీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అయితే, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల కోసం చేపట్టిన ఆపరేషన్ కగార్‌ మాత్రం యథావిధిగా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుత బలగాల తరలింపు కేవలం ఆపరేషన్ సిందూర్ అవసరాల నిమిత్తం, పాకిస్థాన్ సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేయడం కోసమేనని తెలుస్తోంది. ఈ పరిణామం సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న తీవ్రతను సూచిస్తోందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ బలగాలు సరిహద్దు ప్రాంతాల్లోనే అప్రమత్తంగా ఉండనున్నాయి.

పాకిస్థాన్ కు ఆర్థిక ప్యాకేజీపై ఐఎంఎఫ్ ఓటింగ్… దూరంగా ఉన్న భారత్

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) బోర్డు అందించే బెయిలౌట్ ప్యాకేజీని పాకిస్థాన్ కు అందించవద్దన్న భారత్
ఐఎంఎఫ్ సహాయానికి సంబంధించి షరతులను పాటించడంలో పాకిస్థాన్ విఫలమైందని వెల్లడి
ఆర్ధిక సహాయాన్ని పాకిస్థాన్ పరోక్షంగా సైనిక నిఘా కార్యకలాపాలకు వినియోగిస్తుందన్న భారత్
పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) బోర్డు అందించే బెయిలౌట్ ప్యాకేజీని భారతదేశం తీవ్రంగా వ్యతిరేకించింది. గతంలో పాకిస్థాన్‌కు ఇచ్చిన రుణాలను దుర్వినియోగం చేసిందంటూ భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పాకిస్థాన్‌కు ప్రతిపాదించిన 1.3 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీపై భారత్ ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఏప్రిల్ 22న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గామ్‌లో దాడి చేసి 26 మందిని హతమార్చడం, ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకోవడం తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

నిన్న వాషింగ్టన్‌లో ఐఎంఎఫ్ బోర్డు సమావేశం జరిగింది. ఐఎంఎఫ్ సహాయానికి సంబంధించి షరతులను పాటించడంలో పాకిస్థాన్ విఫలమైందని భారత్ స్పష్టం చేసింది. ఆర్థిక సహాయాన్ని పాకిస్థాన్ పరోక్షంగా సైనిక నిఘా కార్యకలాపాలకు వినియోగిస్తుందని తెలిపింది.

భారత గడ్డపై దాడులకు, కుట్ర పన్నడానికి లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తుందని భారత్ వెల్లడించింది. సరిహద్దు ఉగ్రవాదం అంతం చేయడానికి ఖచ్చితమైన చర్యలు తీసుకోని పాకిస్థాన్‌కు ఆర్థిక సాయం అందించడంలో జాగ్రత్త వహించాలని ఐఎంఎఫ్ బోర్డును భారత్ కోరింది.

తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడపండి.. రైల్వే మంత్రికి లావు శ్రీకృష్ణదేవరాయలు వినతి

జలంధర్, జమ్మూ, కురుక్షేత్ర, చండీగఢ్‌ల నుంచి తెలుగు రాష్ట్రాలకు రైళ్లు కోరిన ఎంపీ
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, ఉత్తరాది రాష్ట్రాలలో విద్యనభ్యసిస్తున్న తెలుగు విద్యార్థుల భద్రతపై టీడీపీ పార్లమెంటుసభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయులు ఆందోళన వ్యక్తం చేశారు. వారిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడానికి వీలుగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రైల్వే మంత్రికి ఒక లేఖ రాశారు. హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు విద్యాసంస్థల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో చదువుకుంటున్నారని ఎంపీ తన లేఖలో ప్రస్తావించారు. ముఖ్యంగా జలంధర్‌, జమ్మూ, కురుక్షేత్రల్లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) క్యాంపస్‌లతో పాటు, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో తెలుగు విద్యార్థులు అధికంగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని శ్రీకృష్ణదేవరాయులు తెలిపారు. ఈ విద్యార్థులు తమ సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లేందుకు వీలుగా ఢిల్లీ, చండీగఢ్‌ల నుంచి తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక రైలు సర్వీసులను నడపాలని ఆయన రైల్వే మంత్రిని కోరారు. తక్షణమే స్పందించి, విద్యార్థుల ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.