Saturday, January 4, 2025
Home Blog Page 82

గేమ్‌ ఛేంజర్‌ పోలవరం

0

. ఆర్థిక ఇబ్బందులున్నా 2027 నాటికి పూర్తి
. దీంతో కరువుకు శాశ్వత పరిష్కారం
. జనవరి నుంచి కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణం
. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి, వెన్నెముక లాంటిదని, అది పూర్తయితే రాష్ట్రంలో కరువుకు స్వస్థి చెప్పినట్లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో మంగళవారం స్వల్ప కాలిక చర్చ జరిగింది. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి, పోలవరం ఏపీకి రెండు కళ్లు అని అన్నారు. మన రాష్ట్రానికి గేమ్‌ ఛేంజర్‌ పోలవరం అని పేర్కొన్నారు. నీటి వాడుకలో మార్పులు చేస్తే పర్యావరణంలో కూడా మార్పులు వస్తాయన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఫ్లోరైడ్‌ పరిస్థితులు చూస్తున్నామన్నారు. రూ.129 కోట్ల అంచనాతో శంకుస్థాపన జరిగిన పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు రూ.55వేల కోట్ల వ్యయానికి చేరిందన్నారు.1981లో పోలవరం ప్రాజెక్టుకు అంజయ్య పునాది రాయి వేసినప్పటికీ పనులు ప్రారంభించలేదన్నారు. పోలవరం ద్వారా నదుల అనుసంధానానికి సంకల్పించామన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారన్నారు. అయితే పోలవరంలో ముంపునకు గురయ్యే ఏడు మండలాలను తెలంగాణలో ఉంచారని, ఆ ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయకపోతే పోలవరం ఎప్పటికీ సాధ్యంకాదని భావించి… వాటిని ఏపీలో విలీనం చేస్తేనే తాను సీఎంగా ప్రమాణం చేస్తానని 2014లో కేంద్ర పెద్దలతో చెప్పానని గుర్తుచేశారు. దీంతో అప్పటికప్పుడు కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టిందన్నారు. పోలవరం ప్రాజెక్టు జాప్యం కాకూడదనే నిర్మాణ బాధ్యతలు మనం తీసుకున్నామని వివరించారు. పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతుందని భావించి… పట్టిసీమ ద్వారా రైతులకు నీళ్లు ఇవ్వాలనుకున్నామని, అందుకే పట్టిసీమ ప్రాజెక్టును ఏడాదిలోపు పూర్తిచేసి నదుల అనుసంధానం ద్వారా రాయలసీమకు నీళ్లిచ్చామన్నారు. 2014 నుంచి 2019 వరకూ పోలవరం పనులు పరుగులు పెట్టించామని, ఒకే రోజులో 32 వేల క్యూబిక్‌ మీటర్లకు పైగా కాంక్రీట్‌ పనులు చేసి గిన్నీస్‌ రికార్డులోకి ఎక్కామన్నారు. 414 రోజుల్లోనే పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ పూర్తిచేశామన్నారు. గత ప్రభుత్వంలోని జలవనరులశాఖ మంత్రికి డయాఫ్రమ్‌ వాల్‌ అంటే ఏమిటో తెలియదన్నారు. క్యూసెక్కులు, టీఎంసీలకు తేడా తెలియని వ్యక్తి మంత్రిగా చేశారని ఎద్దేవా చేశారు. 2014-19 మధ్యలో 72 శాతం పోలవరం పనులు పూర్తి చేశామన్నారు. 28 సార్లు పోలవరం ప్రాజెక్టును ప్రత్యక్షంగా సందర్శించాననీ, 80 సార్లకుపైగా వర్చువల్‌గా సమీక్షించానన్నారు. టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఇప్పటికే పోలవరం పూర్తయ్యేదన్నారు. వైసీపీ ప్రభుత్వం వల్ల ప్రాజెక్టు నాశనమైందన్నారు. డయాఫ్రం వాల్‌ పైనుంచే వరదలు వెళ్లాయని, ఐదేళ్ల కష్టం మొత్తం సర్వనాశనం చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి చెప్పకుండా ధృవీకరణలు పంపించారన్నారు. కొత్త డయాఫ్రం వాల్‌ కట్టాలంటే రూ.990 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. పోలవరం పూర్తయితే 194 టీఎంసీల నీరు నిలిపే వాళ్లమన్నారు. 45.72 మీటర్ల ఎత్తులోనే పోలవరం నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో మొదటి దశలో 41.15 మీటర్లు ఎత్తులో నిర్మిస్తామని చెప్పారన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించిన ఘనత గత ప్రభుత్వానిదేనన్నారు. పోలవరం పూర్తయితే 960 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రానికి వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. 2014`2019 మధ్య రూ.16,493 కోట్లు ఖర్చు చేశామని, గత ప్రభుత్వం కేవలం రూ.4,993 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. జనవరి నుంచి కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణం ప్రారంభం కానుందన్నారు. 2026 మార్చి నాటికి కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 2027 చివరి నాటికి పోలవరం పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి సుప్రీం నోటీసులు

0

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డికి సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో అవినాశ్‌కు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలని సునీత సుప్రీంను ఆశ్రయించారు. అప్రూవర్‌ను శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి బెదిరించాడని వివేకా కుమార్తె సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తెలిపారు. ఈ కేసులో శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డికి నోటీసులు ఇచ్చింది. అవినాశ్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ సునీత వేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. మరోవైపు తమపై నమోదు చేసిన కేసులు క్వాష్‌ చేయాలని సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పైనా విచారణ జరిగింది. వివేకా హత్య కేసు పరిణామాలను లూథ్రా కోర్టుకు వివరించారు. ప్రతివాదులకు సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్‌ సునీతా రెడ్డి మంగళవారం సచివాలయానికి వచ్చారు. హోంమంత్రి వంగలపూడి అనితతో సునీత భేటీ అయ్యారు. వివేకా హత్య కేసుపై చర్చించారు. సీఎంవో అధికారులతోనూ ఆమె సమావేశమయ్యారు. తన తండ్రి హత్య కేసులో పురోగతిపై చర్చించారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి, జైలు అధికారులకు రాసిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు. సుప్రీంకోర్టులో వైఎస్‌ అవినాశ్‌రెడ్డి బెయిల్‌ రద్దుకు సంబంధించి కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫిడవిట్‌ వేయడంతో పాటు కేసు దర్యాప్తులో పురోగతి గురించి తెలుసుకున్నారు. తన తండ్రి హత్య కేసులో నిజమైన దోషులను శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సునీత విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.

ఖాళీ శవపేటికలతో నిరసన

0

ఏఎఫ్‌ఎస్‌పీఏ వద్దని నినాదాలు

చురచంద్‌పూర్‌ : మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌ జిల్లా జిరిబామ్‌లో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో మరణించిన వారికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఖాళీ శవపేటికలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. గతవారం భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో పది మంది అనుమానిత ఉగ్రవాదులు హతమయ్యారు. జాయింట్‌ ఫిలాంత్రోపిక్‌ ఆర్గనైజేషన్‌ (జెపీఓ) నిర్వహించిన ర్యాలీ ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. వందలాది మంది ప్రజలు మరణించిన వారికి న్యాయం చేయాలని, కొండ ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలనను కోరుతూ ప్లకార్డులతో పాల్గొన్నారు.గత ఏడాది మే నుంచి రాష్ట్రంలో జరిగిన జాతుల హింసలో మరణించిన కుకీ ప్రజల స్మారక చిహ్నం ‘వాల్‌ ఆఫ్‌ రిమెంబరెన్స్‌’ వద్ద ప్రదర్శన ముగిసింది. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఉద్దేశించి జిల్లా యంత్రాంగానికి వినతి పత్రం సమర్పించారు. జిరిబామ్‌లో మరణించిన వారు గ్రామ వాలంటీర్లు అని కుకీ-జో గ్రూపులు పేర్కొంటున్నాయి. అయితే, రాష్ట్ర పోలీసులు వాదనను ఎదుర్కోవడానికి తుపాకీ కాల్పులు ముగిసిన తర్వాత ఘటనా స్థలంలో భారీ సంఖ్యలో ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రిని గుర్తించారు. గత ఏడాది మే నుండి ఇంఫాల్‌ వ్యాలీకి చెందిన మెయితీలు. పక్కనే ఉన్న కొండల ఆధారిత కుకీ-జో సమూహాల మధ్య జరిగిన జాతి హింసలో 220 మందికి పైగా మరణించగా… వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇక ఈ సంవత్సరం జూన్‌లో ఒక పొలంలో అత్యం దారుణ స్థితి ఒక రైతు మృతదేహం కనుగొనబడిన తర్వాత హింసను చూడటం ప్రారంభించింది. ఈ సంవత్సరం జూన్‌లో ఒక పొలంలో దారుణమైన స్థితిలో ఒక రైతు మృతదేహం కనుగొనబడిన తర్వాత హింసను చూడటం ప్రారంభించింది.
ఇంఫాల్‌లో…
మణిపూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఏఎఫ్‌ఎస్‌పీఏని తిరిగి అమలు చేయడాన్ని నిరసిస్తూ… కర్ఫ్యూను కూడా లెక్కచేయకుండా ఇంఫాల్‌ పశ్చిమ జిల్లాలో వివిధ పౌర సంఘాల సభ్యులు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అయితే కర్ఫ్యూ ఆదేశాలను ధిక్కరించినందున ర్యాలీని పోలీసులు కీసంపత్‌ జంక్షన్‌లో నిలిపివేశారు. ఆల్‌ మణిపూర్‌ యునైటెడ్‌ క్లబ్స్‌ ఆర్గనైజేషన్‌ (ఏఎంయుసిఓ), పోయిరీ లీమరోల్‌ మీరా పైబి అపున్బా మణిపూర్‌, ఇతర స్థానిక సంస్థల సభ్యులు జిల్లాలోని క్వాకీథెల్‌ ప్రాంతం నుండి ర్యాలీని చేపట్టారు.
సుమారు 3.5 కిలోమీటర్లు ప్రదర్శన సాగిన అనంతరం పోలీసులు అడ్డుకున్నట్లు ఓ నిరసనకారుడు తెలిపారు. ‘‘ఆరు పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో ఎఎఫ్‌ఎస్‌పీఏని మళ్లీ అమలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జిరిబామ్‌లో ఎఎఫ్‌ఎస్‌పీఏ తిరిగి అమలు చేయబడిన కొద్ది రోజులకే కాల్పుల సంఘటన జరిగింది’’ అని ఆయన చెప్పారు. ఆదివారం రాత్రి జరిగిన జిరిబామ్‌ కాల్పుల ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడిన ఘటనను ఆయన ప్రస్తావించారు.

‘రుషికొండ’ మంటలు

0

. శారదా పీఠం భూములు, మదనపల్లె ఫైళ్ల దగ్ధంపై రగడ
. మంత్రులు`వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం
. గురుదక్షిణ కోసమే భూముల కేటాయింపు: అచ్చెన్నాయుడు
. టీడీపీ హయాంలో భూములెలా ఇచ్చారు: బొత్స

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : శాసన మండలిలో మంగళవారం కూడా అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ సభ్యుల మధ్య వాడీవేడిగా మాటల దాడి కొనసాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో రుషికొండ పర్యాటక కేంద్రం, మదనపల్లిలో భూ రికార్డుల దగ్ధం, శారదా పీఠానికి భూముల కేటాయింపు అంశాలపై మంత్రులు, వైసీపీ సభ్యులు తీవ్రస్థాయిలో పరస్పర విమర్శలకు దిగారు. దీంతో మండలిలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఎప్పటికప్పుడు చైర్మన్‌ కొయ్యే మోషెన్‌రాజు సర్దిచెప్పినప్పటికీ…ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు. మదనపల్లెలో భూ రికార్డుల దగ్ధం అంశంపై సభ్యులు దువ్వారపు రామారావు, భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ బదులిస్తూ… ఈ కేసు విచారణ పురోగతిలో ఉందని, ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకున్నామని, రెవెన్యూ కార్యాలయాలకు భద్రత కల్పించాల్సిందిగా రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీజేశామన్నారు. సభ్యుడు రామారావు మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలో మదనపల్లెలో ఫ్రీ హోల్డ్‌ కింద ఎన్ని అసైన్డ్‌ భూములను గుర్తించారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..గత వైసీపీ ప్రభుత్వ అవినీతి బయటకు వస్తుందన్న నెపంతో మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో రికార్డులను ధ్వంసం చేశారని మంత్రి అనగాని పేర్కొన్నారు. భూ దందాలు ఎక్కడ బయటపడతాయోననే ఈ తరహా చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరును ప్రస్తావించడంతో వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, మంత్రి ప్రసంగానికి అడ్డుతగిలారు. దీంతో చైర్మన్‌ జోక్యం చేసుకుని పేర్లు లేకుండా మాట్లాడాలని మంత్రికి సూచించారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ…రెవెన్యూ మంత్రి ఇచ్చే వివరణను వినకుండా వైసీపీ సభ్యులు నిరసనకు దిగి, గందరగోళం సృష్టించడం తగదన్నారు. మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… విచారించాకే..ఎవరైనా పేర్లు ఉంటే వెల్లడిరచాలని సూచించారు. అదే జరిగితే చంద్రబాబు పేరూ వస్తుందన్నారు. మంత్రి అనగాని మాట్లాడుతూ, 2,443 ఫైళ్ల దగ్ధం అయ్యాయని, ఈ కేసులో ఎంతటివారున్నా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భీమిలిలోని శారదా పీఠానికి భూముల కేటాయింపుపైనా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. సభ్యులు దువ్వారపు రామారావు, భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి ప్రశ్నలపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ బదులిచ్చారు. శారదా పీఠానికి కేటాయించిన భూములను రద్దు చేసినట్లు తెలిపారు. సభ్యుడు రామారావు మాట్లాడుతూ… అడ్డగోలుగా అనేక అవకతవకలతో శారదా పీఠానికి భూములు కేటాయించగా, కూటమి ప్రభుత్వం వచ్చాక దీనిని రద్దు చేసిందన్నారు. మంత్రి అనగాని మాట్లాడుతూ, గత ముఖ్యమంత్రి జగన్‌ గురు దక్షిణగా శారదా పీఠానికి భూములు ఇచ్చారని వ్యాఖ్యానించడంతో వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 300 కోట్లు విలువ చేసే భూమిని అతి తక్కువ ధరకే ఇవ్వడం చాలా దారుణమని మంత్రి అనగాని అన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, నిబంధనలను అతిక్రమించి ఇచ్చారనే తాము గురుదక్షిణ అని అంటున్నామని ఎద్దేవా చేశారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… ధార్మిక సంస్థలకు భూములు కేటాయించడం ఆనవాయితీగా ఉందన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనూ కొన్ని సంస్థలకు భూములు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. గురుదక్షిణ అనే పదం సమంజసం కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం మేం ఇవ్వకుంటే మీరు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రజా సొమ్ము దుర్వినియోగం: పర్యాటక మంత్రి దుర్గేశ్‌
విశాఖపట్నంలోని రుషికొండ అంశంపైనా మండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పర విమర్శలకు దిగారు. పర్యాటక అంశంపై సభ్యుడు దువ్వారపు రామారావు అడిగిన ప్రశ్నకు మంత్రి కందుల దుర్గేశ్‌ ఘాటుగా సమాధానం ఇవ్వగా…వైసీపీ సభ్యులు అడుగడుగునా అడ్డుకున్నారు. నిర్మాణంతో రుషికొండ బీచ్‌కు ఆటంకం కలిగించారని, రిసార్ట్స్‌ నిర్మిస్తామని చెప్పి, ప్యాలెస్‌ను నిర్మించారని విమర్శించారు. వారు గదులు కడతామని చెప్పి, ఏడు బ్లాక్‌లుగా నిర్మించారని, అందులో ఉపయోగపడేదీ కేవలం మూడు బ్లాక్‌లేనని తెలిపారు. చివరగా దీనిని ముఖ్యమంత్రి నివాసం, క్యాంప్‌ ఆఫీస్‌ అని, మంత్రుల కోసం అని ఉత్తర్వులు జారీజేశారని, వాటిని మండలిలో చైర్మన్‌ దృష్టికి తీసుకొచ్చారు. 58 గదులతో ఉన్న హరితా రిసార్ట్స్‌ను కూలగొట్టి, ఇంతకంటే మంచి రిసార్ట్స్‌ తీసుకొస్తామని అప్రూవుల్‌ తీసుకుని, ఆ తర్వాత రుషికొండలో ఖరీదైన ఏడు గదులతో నిర్మించారని వివరించారు. ఇక్కడ ప్రజల డబ్బు దుర్వినియోగమైందని మంత్రి దుర్గేశ్‌ వ్యాఖ్యానించారు. ఇంతలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రుషికొండను వైసీపీ సభ్యులు చూస్తే ఇలా వారు కూడా మాట్లాడరని చెప్పారు. ఎస్‌ఎఫ్‌టీ రూ.6వేల తో కట్టిన శాసనసభ గురించి నాడు ఐదు రోజులపాటు వైసీపీ సభ్యులు గగ్గోలు పెట్టారని… అదే రుషికొండ నిర్మాణానికి ఎస్‌ఎఫ్‌టీకి రూ.28వేలు ఖర్చు చేశారన్నారు. కళ్లముందు ఇంత డబ్బు దోపిడీ జరిగితే..వైసీపీ సభ్యులు సిగ్గుపడాలన్నారు. దీనిపై బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ 2017లో నిర్మించినప్పుడు అసెంబ్లీ ప్రాంగణంలో ఎస్‌ఎఫ్‌టీ రూ.14వేలు(ఫర్నీచర్‌తో కలిపి) అని గుర్తు చేశారు. అచ్చెన్నాయుడు తప్పుడు అంకెలు చెబుతున్నారన్నారన్నారు. రుషికొండలోని నిర్మాణాలు ప్రభుత్వం పరంగా జరిగాయని, వాటిని ప్రభుత్వం వేటికైనా వినియోగించుకోవచ్చని చెప్పారు. అక్కడ అవినీతి జరిగితే దానిపై విచారించాలని కోరారు. మండలిలో ‘దమ్ముందా, సిగ్గుపడాలి, రండి చూసుకుందాం’ అనే మాటలను మంత్రి దుర్గేశ్‌ మాట్లాడటం తగదన్నారు. దీనిపై మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ, దీనిపై చర్చకు రావాలని సూచించారు.

మోదీ రైతు వ్యతిరేక అజెండా

0

రాజన్‌ క్షీరసాగర్‌

బీజేపీ ప్రభుత్వం ‘వినాశకర వ్యవసాయ చట్టాలు’ తిరిగి ప్రవేశపెట్టేందుకు వివిధ మార్గాల ద్వారా ప్రయత్నిస్తోంది. రైతుల వ్యతిరేకత, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పార్టీ అధిష్ఠానం తోసిపుచ్చినప్పటికీ బీజేపీ ఎంపీలు అనేక మంది ఈ వినాశకర నల్లచట్టాలను బహిరంగంగా సమర్థిస్తూ ప్రకటనలు గుప్పిస్తున్నారు.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో మెజారిటీ తగ్గిపోయినప్పటికీ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల, రైతు వ్యతిరేక విధానాలను అవిచ్ఛిన్నంగా కొనసాగిస్తోంది. మోదీ ప్రభుత్వంపై రైతులకు విశ్వాసం సన్నగిల్లడమే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ మెజారిటీ తగ్గిపోవడానికి ప్రధాన కారణం. మెజారిటీ తగ్గినప్పటికీ జేడీయూ, టీడీపీ మద్దతుతో బీజేపీ కేంద్రంలో అధికారంలో కొనసాగు తోంది. ఎన్నికలలో వచ్చిన ఫలితాలను గుర్తించడానికి బదులుగా 2017 మందసౌర్‌ రైతుల నిరసనను అమానుషంగా అణచివేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిగా నియమించడంతో సహా రైతులకు హానిచేసే విధానాలను బీజేపీ కొనసాగిస్తోంది.
కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావడంతో బీజేపీ ప్రభుత్వం ‘వినాశకర వ్యవసాయ చట్టాలు’ తిరిగి ప్రవేశపెట్టేందుకు వివిధ మార్గాల ద్వారా ప్రయత్నిస్తోంది. రైతుల వ్యతిరేకత, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పార్టీ అధిష్ఠానం తోసిపుచ్చినప్పటికీ బీజేపీ ఎంపీలు అనేక మంది ఈ వినాశకర నల్లచట్టాలను బహిరంగంగా సమర్థిస్తూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. మరో పక్క ఈ వివాదాస్పద చట్టాలను తిరిగి తీసుకువచ్చేందుకు మార్గం సుగమం చేస్తూ బహుళజాతి వ్యవసాయ కార్పొరేషన్లతో ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకుంటోంది. ‘‘డిజిటల్‌ మౌలిక సదుపాయాల’ ప్రచారం ద్వారా వ్యవసాయ డేటాపై నియంత్రణను ప్రభుత్వం కోరుకుంటోంది. ఐసీఏఆర్‌, అమజాన్‌, సింజెంటా వంటి కంపెనీల మధ్య ఈ విధమైన ఒప్పందాల ద్వారా ప్రపంచ సంస్థలకు అందుబాటులో ఉంటోంది. ఇది వ్యవసాయ విశ్వవిద్యాలయాలు పరిశోధన డేటా, విస్తరణ డేటా చివరకు భూమిని కూడా ఈ సంస్థలకు ధారాదత్తం చేయడానికి దోహదపడుతోంది. అంతేకాకుండా భారతీయ వ్యవసాయం కార్పొరేట్ల నియంత్రణలోకి వెళ్లిపోతోంది.
వరదలు, కరువు ప్రభావిత ప్రాంతాల నిర్లక్ష్యం
ఖరీఫ్‌ సీజన్‌లో దేశంలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసి వరదలు సంభవించి లక్షలాది ఎకరాలలో పంట నాశనమైనది. మరి కొన్ని ప్రాంతాలలో దుర్భిక్ష పరిస్థితులు పంట నష్టానికి దారితీశాయి. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజాగా విడుదల చేసిన ‘రుతుపవనాల ముగింపు నివేదిక’ ప్రకారం 2024లో 2,632 ప్రాంతాలలో భారీ వర్షాలు, 473 ప్రాంతాలలో అతి భారీవర్షాలు కురిశాయి. కేరళలోని వయనాడ్‌ జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి గురై కొండచెరియలు విరిగిపడి భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్‌, అసోం, ఉత్తర ప్రదేశ్‌, త్రిపుర, గుజరాత్‌, మేఘాలయల్లో భారీ వరదలు సంభవించాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది ఎకరాలలో పంట నాశనమైనది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అయినప్పటికీ బీజేపీ ప్రభుత్వ స్పందన అత్యంత నామమాత్రం మాత్రమే. జాతీయ విపత్తుగా ప్రకటించడానికి తిరస్కరించి పరిమితమైన సహాయం మాత్రమే అందించి చేతులు దులుపుకుంది. ఇదిలావుండగా, పీఎంఎఫ్‌బీవై ఫసల్‌ బీమా పథకం కింద చెప్పుకోతగ్గ మొత్తంలో ఆర్థిక, బీమా సంస్థలకు నిధులు అందినప్పటికీ బాధిత రైతులలో అతి కొద్ది మందికి మాత్రమే అవి చేరాయి. వరద బాధిత కుటుంబాలు, రైతులకు అతి స్వల్ప మొత్తం పరిహారం అందింది. వ్యవసాయ ఉపకరణాలకు సంభవించిన నష్టం, పంట, ఇళ్లు నష్టం, జీవనోపాధి కోల్పోవడంపై నష్టం అంచనా వేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది. బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌, ఇతర రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నా సాయం అందించడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విఫలమైంది. దుర్బిక్ష ప్రకటన విధానాన్ని ఇప్పటికీ సవరించలేదు. దానితో రైతులు, అవసరతలో ఉన్న ఇతర వర్గాల వారికి ఇంతవరకూ ఎటువంటి ఉపశమనం లభించలేదు.
పెరిగిన సాగు వ్యయం
పెరుగుతున్న సాగు వ్యయం భారతీయ రైతులను మరింత ఒత్తిడికి గురిచేస్తోంది. ఎరువుల సబ్సిడీలపై గణనీయంగా కోత విధిస్తున్నారు. 202223 కేంద్ర బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీలకు రూ. 2,51,339 కోట్లు కేటాయించగా 202324 సంవత్సరం సవరించిన బడ్జెట్‌లో రూ. 1,88,894 కోట్లకు తగ్గిపోయింది. 202425 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రూ. 62,445 కోట్లను తగ్గించి 1,64,000 కోట్లతో బడ్జెట్‌ను ఖరారు చేశారు. ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌)తో నిమిత్తం లేకుండా, రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) భావనకు విఘాతం కలిగిస్తూ, రేషన్‌ కార్డుదారులకు పీడీఎస్‌ ద్వారా ఆహార ధాన్యాల సరఫరాను నిలిపివేసి నేరుగా నగదు బదిలీని ప్రారంభించింది. వ్యవసాయ దిగుమతులు కూడా పెరిగాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో భారత వ్యవసాయ, వ్యవసాయ సంబంధిత ఉత్పాదనల దిగుమతి 37 బిలియన్‌ డాలర్లకు చేరింది. 2019 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 2023లో దిగుమతులు 12.5 బిలియన్‌ డాలర్లు (51 శాతం)పైగా పెరిగాయి. ఈ ఉత్పాదనల దిగుమతిలో భారత్‌ ప్రపంచంలోనే ఎనిమిదవ అతిపెద్ద దేశంగా అవతరించింది. పత్తి, సోయా ఉత్పాదనలు, తాజా పండ్లు, పాలపొడి తదితరాలను భారత్‌ అధికంగా దిగుమతి చేసుకుంటోంది. దానితో దేశీయంగా సోయాబిన్‌, పత్తి ధరలు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కన్నా తక్కువకు పడిపోయాయి. చౌక దిగుమతులను సులభతరం చేసేందుకు మోదీ ప్రభుత్వం సుముఖత చూపడం దేశీయ రైతులను నాశనం చేసింది, భారతదేశాన్ని ప్రపంచ వ్యవసాయ వస్తువులకు డంపింగ్‌ గ్రౌండ్‌గా మార్చివేసింది. రైతుల పేరుతో కార్పొరేట్‌ దోపిడీ మోదీ ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎంఎఫ్‌బీవై పంట బీమా పథకం ప్రధానంగా ఆర్థిక, బీమా కంపెనీలకు మాత్రమే లబ్ధి చేకూరుస్తోంది. 2018లో ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇవి 1,95,207 కోట్ల రూపాయలు అందుకున్నాయి. మహారాష్ట్ర వంటి చోట ‘‘రూపాయి పంట బీమా పథకం’ రైతుల అనుకూలమైనదిగా కనపడినప్పటికీ ప్రభుత్వం అంతిమంగా పూర్తి బీమా ప్రీమియం చెల్లించినప్పటికీ, అశాస్త్రీయంగా, రైతు వ్యతిరేక ప్రమాణికం కారణంగా కార్పొరేట్‌ కంపెనీలకు అనుకూలంగా మారి వాటికి లాభాలను తెచ్చిపెట్టింది. 95 శాతం సబ్సిడీపై సోలార్‌ విద్యుత్‌ పంపులను ఇచ్చే పునర్‌ ఇంధన మంత్రిత్వ శాఖ పథకం పీఎంకుసుమ్‌ను కూడా ఇదే విధంగా నిర్వహించడం వల్ల అదాని వంటి కొన్ని కంపెనీలకు మాత్రమే ప్రయోజనం కలిగించింది తప్ప రైతులకు ఏమాత్రం ప్రయోజనం లేదు. ప్రభుత్వ నిధులు కార్పొరేట్‌ సంస్థల అనుబంధ సంస్థల ఖాతాల్లోకి వెళ్లాయి.

అఖిల భారత కిసాన్‌ సభ అధ్యక్షులు

మూడో ప్రపంచ యుద్ధం వైపు బైడెన్‌ యత్నం

0

రష్యా డ్యూమా ప్రతినిధి బూటినా

మాస్కో: అమెరికా తయారీ దీర్ఘశ్రేణి ఆయుధాలు రష్యాపై వాడేందుకు కీవ్‌కు అనుమతిచ్చి బైడెన్‌ ప్రభుత్వం ప్రమాదకర నిర్ణయం తీసుకొందని రష్యా డ్యూమా సభ్యురాలు మారియా బూటినా విమర్శిం చారు. మూడో ప్రపంచ యుద్ధం వైపు నెట్టే చర్యగా దీనిని ఆమె అభివర్ణించారు. ‘పదవిలో ఉన్నంత కాలం బైడెన్‌ కార్యవర్గం ఉద్రిక్తతలను గరిష్ఠస్థాయిలో రాజేస్తుంది. ట్రంప్‌ వచ్చాక ఈ నిర్ణయాలను ఉపసంహరించుకొంటారని ఆశిస్తున్నా. మూడో ప్రపంచ యుద్ధాన్ని ఎవరూ కోరుకోవడం లేదు. అమెరికాలో కొందరు తాము పోగొట్టుకోవడానికి ఏమీ లేదుగా అని భావిస్తుంటారు’ అని ఓ ఆంగ్ల వార్తా సంస్థ వద్ద ఆమె వ్యాఖ్యానించారు. అమెరికాలో రష్యా ఏజెంటుగా పనిచేస్తోందనే ఆరోపణలపై బూటినా దాదాపు 15 నెలలపాటు జైల్లో గడిపారు. ప్రస్తుతం ఆమె యునైటెడ్‌ రష్యా పార్టీ తరపున డ్యూమా సభ్యురాలు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధగతిని మార్చేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదివారం ఓ నిర్ణయం తీసుకున్నారు. కీవ్‌కు తాము అందిస్తున్న దీర్ఘ శ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపై దాడికి వినియోగించుకునేం దుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రష్యాపైకి దీర్ఘ శ్రేణి క్షిపణులను ఉపయోగించుకోవడానికి ఉక్రెయిన్‌కు అవకాశం దక్కుతుంది. ఈ విషయాన్ని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. మరో వైపు ఈ నిర్ణయంపై రష్యా అధ్యక్ష కార్యాల యమైన క్రెమ్లిన్‌ ఇప్పటి వరకు స్పందించ లేదు. సెప్టెంబర్‌ 12వ తేదీన పుతిన్‌ మాట్లాడుతూ రష్యాపై దీర్ఘశ్రేణి ఆయుధాల వినియోగాన్ని పశ్చిమ దేశాలు అంగీ కరిస్తే… నాటో, అమెరికా, ఐరోపా దేశాలు నేరుగా యుద్ధంలో పాల్గొన్నట్లే భావిస్తామని తెలిపారు. దీంతో నాటో సైనిక, సాయుధ సంపత్తి లక్ష్యంగా దాడులు చేస్తామన్నారు. తాము నాటో, అమెరికా కోసం విభిన్నమైన ప్రతిస్పందనను సిద్ధం చేసుకొన్నట్లు తెలిపారు.

సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండండి

— జిల్లా ఎస్పీ పి.జగదీష్
విశాలాంధ్ర -అనంతపురం : ప్రస్తుత పరిస్థితుల్లో పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో సెల్ ఫోన్ వినియోగించే ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ పి.జగదీష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరాల పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, ఉద్యోగులు, ఉన్నత హోదాలలో ఉన్న వారు సైతం సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారన్నారు. కొరియర్ పేరుతో మోసాలు, చైల్డ్ ఫోర్నో గ్రఫీ, డిజిటల్ అరెస్టు, ఓటీపీ మోసాలు, లోన్ యాప్, హ‌నీ ట్రాప్‌, లాటరీల పేరుతో మోసాలు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్టు మోసాలు, లక్షలు పెట్టుబడి పెడితే కోట్లు ఇస్తామని నమ్మబలకడం, వీడియోకాల్స్ చేసి స్క్రీన్ రికార్డు చేసి బ్లాక్ మెయిలింగ్… ఇలా ఎన్నో రకాల మోసాలకు సైబర్ నేరగాళ్లు ఒడిగడతారని అలాంటి వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరాల గురించి యువత కుటుంబంలోని వారికి, ఇతరులకు అవగాహాన కల్పించాలన్నారు. బ్యాంకు ఖాతాలకు స్ట్రాంగ్ పాస్‌ వర్డ్ లను సెట్ చేసుకోని సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే సంఘటన జరిగిన వెంటనే బాధితులు 1930 నెంబర్ కి డయల్ చేసి సమాచారం అందించడం లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ లో డబ్ల్యూ డబ్ల్యూ .సైబరక్రైమ్ .గోవ్ .ఇన్ ఫిర్యాదు చేయాలన్నారు.

అనంతపురం జిల్లాను ఓడిఎఫ్ రహిత జిల్లాగా రూపొందించాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
విశాలాంధ్ర -అనంతపురం : అనంతపురం జిల్లాను ఓడిఎఫ్ రహిత జిల్లాగా రూపొందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. వి సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం అనంతపురం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో గ్రామీణ నీటిపారుదల శాఖ మరియు పంచాయతి శాఖల ఆధ్వర్యంలో… ఁప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవంఁ కార్యక్రమం సందర్భంగా జిల్లా నీరు మరియు పారిశుద్ధ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పారిశుధ్యం మరియు పరిశుభ్రత అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇందులో భాగంగా నేటి (19) నుండి డిసెంబర్ 10 వరకు..ఁమన మరుగుదొడ్డి- మన గౌరవం నినాదంతో… ఁమరుగుదొడ్డి వాడుదాం ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాంఁ అని జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు.  జిల్లా, డివిజన్, మండల, గ్రామ, పంచాయతీ వారీగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మరుగుదొడ్ల మరమ్మత్తుల కార్యాచరణను నిర్వహించడం, వ్యక్తిగత మరియు కమ్యూనిటీ మరుగుదొడ్లను సుందరీకరించడం అలాగే పారిశుద్ధ్య వీరులను గుర్తించి సన్మానించడం తదితర కార్యక్రమాలను అమలు చేయాలని అధికారులకు సూచించారు.   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రోత్సహిస్తూ నిధులు విడుదల చేయడంతోపాటు ప్రజలందరూ మరుగుదొడ్లను ఉపయోగించుకునేలా అందరినీ భాగస్వాములు చేయడమైనది.    మరుగుదొడ్ల వాడకంలో నీటి లభ్యత ముఖ్యం. ప్రతి మరుగుదొడ్డికి నీటి సరఫరా ఉండేలా అధికారులు కృషి చేయాలి. వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వారిని గుర్తించి వారందరికీ వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయాలి. జిల్లాలో ఇంకను వ్యక్తిగత లేదా సామూహిక మరుగుదొడ్లు వాడని వర్గాలు మరియు ప్రాంతాలపై దృష్టి పెట్టి.. మరుగుదొడ్ల ప్రాముఖ్యతపై అవగాహన పెంచి ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు ఉపయోగించేలా కృషి చేయాలన్నారు.మన మరుగుదొడ్డి- మన గౌరవం(హమారా శౌచాలయ్ – హమారా సన్మాన్) కార్యక్రమం ద్వారా గ్రామాల్లో బహిరంగ మల విసర్జన లేకుండా చేయాలని, విద్యార్థులకు ఈ అంశంపై అవగాహన కల్పిస్తే తద్వారా వారి తల్లిదండ్రులు కూడా మరుగుదొడ్ల వాడకం పై అవగాహన పెంచుకుంటారని, అలాగే ఐసిడిఎస్, వైద్యశాఖ, డిఆర్డిఏ, డ్వామా, డిఇఓ  అధికారులు వారి పరిధిలో మరుగుదొడ్ల వాడకంపై విస్తృత అవగాహన కల్పించాలని, అలాగే అధికారులకు గ్రామ, మండల, జిల్లా స్థాయి  కార్యాలయాలలోని   మరుగుదొడ్ల రిపేరు చేసుకొని, నీటి సరఫరా ఉండేటట్లు చూసి,  శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని,  మరుగుదొడ్లకు సంబంధించి మండల పరిధిలోని గుర్తించిన ప్రదేశాల నివేదికలు  తయారు చేసుకోవాలని, జల్ జీవన్ మిషన్ కు సంబంధించి  బడ్జెట్  కేటాయించడం వెంటనే పనులను ప్రారంభించాలని, అంగన్వాడి కేంద్రాలలో  అనుమతి పొందిన   పనులను త్వరితగతిన   పూర్తి చేయాలని   జిల్లాకలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ సురేష్,
డీపీఓ నాగరాజు,డియంహెచ్ఓ ఈ బి దేవి, ఐసిడిఎస్ పిడి  శ్రీదేవి, డీఈవో ప్రసాద్ బాబు, డిఐపిఆర్ఓ గురు స్వామి శెట్టి, డిఆర్డిఏ,వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో ధర్మవరం బాల బాలికలు ఎంపిక

విశాలాంధ్ర ధర్మవరం : రాష్ట్ర స్థాయిలో ఈ నెల నవంబర్ రెండవ తేదీ నుండి నాలుగో తేదీ వరకు పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో జరిగే 68 వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్( ఎస్ జి ఎఫ్)రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో లో పాల్గొనే అండర్ 14 విభాగంలో పాల్గొనే ఉమ్మడి అనంతపురం బాస్కెట్బాల్ బాల బాలికల జట్ల నందు బాలికల విభాగంలో.. బి. యశస్విత,అలాగే బాలుర విభాగంలో బి. శశిధర్ కుమార్… బాస్కెట్బాల్ క్రీడాకారులు ఎంపికయ్యారని ధర్మాంభ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శెట్టిపి జయ చంద్రా రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అక్టోబర్ 21వ తేదీన తేదీన అనంతపురం నగరంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన సెలక్షన్స్ నందు వీరు ప్రతిభా చూపి ఉమ్మడి అనంతపురం జిల్లా జట్లకు ఎంపికయ్యారు అని తెలిపారు. వీరి ఎంపిక పట్ల అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామి రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ శెట్టిపి జయచంద్రారెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయ తుల్లా, కోచ్ సంజయ్, హర్షం వ్యక్తం చేశారు . రాష్ట్రస్థాయిలో స్థాయిలో వీరు రానించి, ధర్మవరం పట్టణమునకు పేరు ప్రతిష్టలు తేవాలని వారు ఆకాంక్షించారు.

ఆ ఐదు గ్రామాలకు సాగునీరివ్వండి

అనంతపురం జిల్లా కలెక్టర్ కు పరిటాల శ్రీరామ్ విజ్ఞప్తి

పులివెందుల బ్రాంచి కెనాల్ కు నీరు రావడం లేదు

ఐదు గ్రామాల్లో తీవ్ర తాగు, సాగునీటి ఎద్దడి ఉందన్న శ్రీరామ్

సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం : పులివెందుల బ్రాంచి కెనాల్ కు నీరు విడుదల చేయకపోవడం వలన ఐదు గ్రామాల ప్రజలు, రైతులు తీవ్రమైన తాగు, సాగు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ ఈ సందర్భంగా ఇదే అంశం పై అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ దృష్టికి వినతి పత్రాన్ని అందజేశారు. పరిటాల శ్రీరామ్ తాడిమర్రి మండలం కునుకుంట్ల గ్రామస్థులతో కలసి కలెక్టరేట్ కు వెళ్లారు. అక్కడ కలెక్టర్ ని కలిసి నీటి సమస్య గురించి వివరించారు. అనంతరం పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ హెచ్చెల్సీ కాలువకు అనుబంధంగా ఉన్న పులివెందుల బ్రాంచి కెనాల్ కు గత కొన్ని సంవత్సరాలుగా నీరు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎంపీఆర్ డ్యాం సౌత్ కెనాల్ మీదుగా ఉన్న తుంపెర డీప్‌కట్ సమీపంలో పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు ఆఫ్‌టేక్ పాయింట్ ఉందన్నారు. డీప్‌కట్‌లో 6కి.మీ నడిచిన తర్వాత కాలువ నదిలో కలుస్తుందన్నారు. చివరకు పులివెందుల బ్రాంచ్ కెనాల్ కింద ఆయకట్టు వలన ప్రయోజనం ఉంటుందని పీబీసీకి నీరు అందినప్పుడల్లా డీప్‌కట్‌ ప్రాంత రైతులు బోరుబావుల సాయంతో ఆయకట్టును సాగు చేస్థున్నారన్నారు. కానీ గండికోట – చిత్రావతి లిఫ్ట్ స్కీమ్ ప్రారంభించిన తర్వాత 2018 నుండి హెచ్‌ఎల్‌సి సిస్టమ్ నుండి పిబిసికి నీటిని పూర్తి సామర్థ్యంతో విడుదల చేయడం లేదన్నారు. ఐడిసి స్కీమ్‌లకు మాత్రమే మైనర్ డిశ్చార్జెస్‌తో నీటిని విడుదల చేస్తున్నారని.. దీని వలన రైతులకు సరిపడా నీరు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాడిమర్రి మండలం రామాపురం, కునుకుంట్ల, చిలకొండయ్య పల్లి, నార్పల మండలం గుగూడు ముచ్చుకుంటపల్లి గ్రామస్తులు నీటి ఎద్దడిని తీవ్రంగా ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతుల అవసరానికి తీర్చడానికి ఎర్ట్స్ వైల్ పిబిసి కెనాల్ నుండి తగినంత ఎక్కువ నీటిని కేటాయించాలని వారు కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ సానుకూలంగా స్పందించడం జరిగిందని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం అక్కడున్న పరిస్థితులపై ఇరిగేషన్ అధికారుల ద్వారా సమాచారం తీసుకొని ఉన్నత స్థాయిలో చర్చించిన తర్వాత ఐదు గ్రామాలకు నీరు అందేలా కృషి చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.