కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (CBSE) 10వ తరగతి బోర్డు పరీక్షల పాస్ మార్కుల విషయంలో గతంలో ఉన్న విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించింది.
ప్రతి సబ్జెక్టులో తప్పనిసరిగా 33శాతం మార్కులు సాధించాలన్న కొత్త నిబంధనను వెనక్కి తీసుకుంది.ఇకపై గత విద్యా సంవత్సరం మాదిరిగానే అన్ని సబ్జెక్టుల్లో కలిపి మొత్తం 33శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రశ్నపత్రాల రూపకల్పన,మూల్యాంకన విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని CBSE స్పష్టం చేసింది.ఈ మేరకు తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లో పాస్ ప్రమాణాల్లో మార్పు లేదని పేర్కొంది.
అంటే విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో విడిగా 33 శాతం మార్కులు సాధించాల్సిన అవసరం ఉండదు.
తొలుత ప్రతి సబ్జెక్టులో 33 శాతం మార్కులు తప్పనిసరి
అన్ని సబ్జెక్టుల్లో కలిపి 33 శాతం మార్కులు సాధిస్తే పాస్ అయ్యే అవకాశం ఉంటుంది.CBSE 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన సెకండరీ స్కూల్ కరిక్యులమ్‌ను ఏప్రిల్‌లో ప్రకటించింది.ఇందులో కొత్త మూల్యాంకన విధానాన్ని కూడా తీసుకొచ్చింది.దాని ప్రకారం 10వ తరగతి విద్యార్థులు బోర్డు పరీక్షలతో పాటు అంతర్గత మూల్యాంకనంలోనూ ప్రతి సబ్జెక్టుకు కనీసం 33 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుందని తెలిపింది.అయితే అప్పటివరకు ఉన్న విధానంలో విద్యార్థులు ఒక్కో సబ్జెక్టులో 33 శాతం మార్కులు సాధించకపోయినా, అన్ని సబ్జెక్టుల్లో కలిపి 33 శాతం మార్కులు వస్తే పాస్ అయ్యేవారు.
ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానంపై వచ్చిన విమర్శలు కూడా తాజా నిర్ణయానికి కారణంగా మారినట్లు తెలుస్తోంది.మూల్యాంకనంలో కొన్ని అసమానతలు కనిపించడంతో ఈ విధానంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి.ఒక పాఠశాల ఉపాధ్యాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థులు సాధారణంగా అంతర్గత మూల్యాంకనంలో 20 మార్కులకు 15 మార్కుల వరకు పొందుతుంటారు.బోర్డు పరీక్షలో 80 మార్కులకు 18 మార్కులు సాధించినా మొత్తం 33 శాతం మార్కుల నిబంధనతో పాస్ అయ్యే అవకాశం ఉంటుంది.కొత్త నిబంధనను అమలు చేస్తే ఉత్తీర్ణత శాతం తగ్గే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
12వ తరగతి ఫలితాలపై విమర్శల తర్వాత వెనక్కి తగ్గిన CBSE?
ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత 12వ తరగతి ఉత్తీర్ణత శాతం తగ్గిందన్న విమర్శలు వచ్చాయి.దీనిపై CBSEతో పాటు కేంద్ర ప్రభుత్వంపైనా విమర్శలు వ్యక్తమైనట్లు Telegraph India పేర్కొంది.మరోసారి ఇలాంటి వివాదం తలెత్తకుండా ఉండేందుకే 10వ తరగతి పాస్ మార్కుల నిబంధనలో మార్పును CBSE వెనక్కి తీసుకుని ఉండొచ్చని ఓ ఉపాధ్యాయుడు అభిప్రాయపడ్డారు.అయితే CBSE అధికారికంగా ఈ కారణాన్ని నిర్ణయానికి ప్రధాన కారణంగా పేర్కొనలేదు.
80:20 విధానంలోనే మార్కుల కేటాయింపు
చాలా సబ్జెక్టులకు CBSE ప్రస్తుతం 80:20 వెయిటేజీ విధానాన్ని అనుసరిస్తోంది.ఇందులో 80 మార్కులు బోర్డు పరీక్షలకు, మిగిలిన 20 మార్కులు పాఠశాలలో నిర్వహించే అంతర్గత మూల్యాంకనానికి కేటాయిస్తారు.2026-27 విద్యా సంవత్సరంలోనూ ప్రశ్నపత్రాల విధానం, మూల్యాంకన నమూనాలో ఎలాంటి మార్పులు ఉండవని బోర్డు తాజా ప్రకటనలో స్పష్టం చేసింది.


