Homeఆంధ్రప్రదేశ్బుర్రిపాలెంలో 3డీ ప్రింటింగ్‌ ఇళ్లు.. ప్రయోగాత్మకంగా 100 ఇళ్ల నిర్మాణం

బుర్రిపాలెంలో 3డీ ప్రింటింగ్‌ ఇళ్లు.. ప్రయోగాత్మకంగా 100 ఇళ్ల నిర్మాణం

- Advertisement -

ప్రభుత్వపరంగా ఇళ్ల నిర్మాణంలో 3డీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ (3డీసీపీ) సాంకేతికతను తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టనున్నారు.
ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-గ్రామీణ్‌ 2.0 (పీఎంఏవై-జీ 2.0) పథకంలో భాగంగా తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంలో ప్రయోగాత్మకంగా 100 ఇళ్లను ఈ సాంకేతికతతో నిర్మించనున్నారు. సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీబీఆర్‌ఐ) ఈ నిర్మాణాలను చేపట్టనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర గృహనిర్మాణశాఖ, కేంద్ర ప్రభుత్వం, సీబీఆర్‌ఐ మధ్య అక్టోబర్‌ 4న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పందం కుదరనుంది.

325 చదరపు అడుగుల్లో ఇల్లు
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఒక్కో ఇంటిని 325 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. విదేశాలతో పాటు దేశంలోని ప్రైవేటు రంగంలోనూ 3డీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ విధానాన్ని ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. అయితే భారతదేశ పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టుగా ఇళ్ల నిర్మాణంలో నాణ్యతను మరింత మెరుగుపరిచేలా సీబీఆర్‌ఐ కొన్ని మార్పులు చేసింది. దీనికి అనుగుణంగా ప్రత్యేక నిర్మాణ డిజైన్‌ను కూడా రూపొందించింది. 3డీ ప్రింటింగ్‌ విధానంలో నిర్మించే ఇళ్లకు సాధారణంగా పీఎంఏవై-గ్రామీణ్‌ 2.0 కింద అందించే ఆర్థిక సాయం కంటే అదనంగా నిధులు అవసరం కానున్నాయి. ఈ కొత్త సాంకేతికతను ప్రోత్సహించేందుకు అవసరమైన అదనపు మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి భరించనున్నాయి.

రోబోటిక్‌ టెక్నాలజీతో నిర్మాణం
3డీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ అనేది ఆధునిక రోబోటిక్‌ సాంకేతికతపై ఆధారపడిన నిర్మాణ విధానం. ముందుగా ఆర్కిటెక్ట్‌ కంప్యూటర్‌లో 3డీ క్యాడ్‌ సాఫ్ట్‌వేర్‌ సహాయంతో భవనం పూర్తి డిజైన్‌ను రూపొందిస్తారు. అనంతరం 3డీ ప్రింటింగ్‌ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కాంక్రీట్‌ మిశ్రమాన్ని పంప్‌ ద్వారా ప్రింటర్‌కు చేరవేస్తారు. కంప్యూటర్‌ ఆదేశాలకు అనుగుణంగా పనిచేసే రోబోటిక్‌ హ్యాండ్‌ లేదా గ్యాంట్రీ ప్రింటర్‌లోని నాజిల్‌ ద్వారా కాంక్రీట్‌ను నిర్దేశించిన మార్గంలో పొరలుగా వేస్తుంది. ఒక పొర పూర్తయిన వెంటనే అది వేగంగా గట్టిపడేలా కాంక్రీట్‌ మిశ్రమాన్ని రూపొందిస్తారు. దీంతో దానిపై వేసే తదుపరి పొర బరువును కూడా ఆ నిర్మాణం తట్టుకోగలుగుతుంది.

నిర్మాణ వేగం 50-70 శాతం పెరుగుదల
సాధారణ నిర్మాణ పద్ధతులతో పోలిస్తే 3డీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ ద్వారా ఇళ్ల నిర్మాణాన్ని 50 నుంచి 70 శాతం వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ విధానంలో సెంటరింగ్‌ సామగ్రిని ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. దీంతో నిర్మాణ ప్రక్రియ మరింత సులభమవుతుంది. మెటీరియల్‌ వృథా కూడా గణనీయంగా తగ్గుతుంది. సాధారణ నిర్మాణంతో పోలిస్తే 30 నుంచి 60 శాతం వరకు నిర్మాణ సామగ్రి వృథాను తగ్గించే అవకాశం ఉంది. అంతేకాకుండా వంపులు, క్లిష్టమైన ఆకృతులు, ప్రత్యేకమైన ఆర్కిటెక్చర్‌ డిజైన్లను కూడా ఈ సాంకేతికతతో సులభంగా రూపొందించవచ్చు.

తక్కువ ఖర్చుతో నిర్మాణానికి అవకాశం
వేగంగా నిర్మాణం పూర్తి చేయడం, సెంటరింగ్‌ అవసరం లేకపోవడం, మెటీరియల్‌ వృథా తగ్గడం వంటి అంశాల కారణంగా 3డీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ విధానంలో ఇళ్లను తక్కువ ఖర్చుతో నిర్మించే అవకాశం ఉంది. బుర్రిపాలెంలో చేపట్టనున్న 100 ఇళ్ల ప్రయోగాత్మక ప్రాజెక్టు ద్వారా ఈ ఆధునిక సాంకేతికతను ప్రభుత్వ గృహ నిర్మాణంలో వినియోగించే విధానాన్ని పరిశీలించనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు