నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. బాపట్ల జిల్లా రేపల్లెలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి, అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లను స్వయంగా అందజేయనున్నారు. ఃపేదల సేవః పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం నేడు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు.
సీఎం పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే..!
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ఉదయం 10:45 గంటలకు ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి, 11:00 గంటలకు రేపల్లె చేరుకుంటారు. ఉదయం 11:25 గంటలకు రేపల్లె పట్టణంలోని 4వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం 12:15 గంటలకు ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
ఈ కార్యక్రమాల తర్వాత మధ్యాహ్నం 3:25 గంటలకు రేపల్లె నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. పర్యటన ముగించుకుని సాయంత్రం 5:20 గంటలకు సీఎం తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.


