. ఎక్కడైనా మాస్ కాపీయింగ్ జరిగితే సంబంధిత ఇన్విజిలేటర్, కేంద్రం పర్యవేక్షకులపై చర్యలు
. ఏలూరులోని పిడిబిటి కళాశాలలో ఇంటర్ పరీక్షల నిర్వహణను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
విశాలాంధ్ర – ఏలూరు : ఇంటర్ పరీక్షలలో మాస్ కాపీయింగ్ జరగకుండా సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక అశోక్ నగర్ లోని పిడిబిటి కళాశాలలో శుక్రవారం ఇంటర్ పరీక్షల నిర్వహణను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీ రూమ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో ఇంటర్ పరీక్షలను 130 కేంద్రాలలో ఈనెల 24వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. 34,615 మంది విద్యార్థినీ, విద్యార్ధులు హాజరుకానున్నట్లు చెప్పారు. ప్రతీ పరీక్షా కేంద్రాల హాల్స్ లో సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటుచేయడం జరిగిందని, ఎక్కడైనా మాస్ కాపీయింగ్ జరిగితే సంబంధిత ఇన్విజిలేటర్ పై చర్యలు తీసుకుంటామని, ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగకుండా ఇన్విజిలేటర్లు పర్యవేక్షించాలన్నారు. పరీక్షా కేంద్రాలలో సెల్ ఫోన్ లను ఎట్టిపరిస్థితులలోనూ అనుమతించవద్దన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్, ఇంటర్ నెట్ సెంటర్ల ను ఉదయం 8.30 గంటల నుంచి పరీక్ష ముగిసేవరకు ఆయా షాపులను మూసివుంచాలన్నారు.పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు, పారిశుద్యం ఏర్పాట్లను ప్రతిరోజు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ 08812-230197 ఫోన్ నెంబరుతో ఏర్పాటు చేయడం జరిగిందని, ఏదైనా సమస్య ఉంటె కంట్రోల్ ఫోన్ చేయవచ్చని కలెక్టర్ చెప్పారు. అనంతరం కళాశాలలోని సిసి కెమెరాల పర్యవేక్షణ విభాగాన్ని కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్ఐఓ పి. యోహాను, ఏలూరు తహసీల్దార్ గాయత్రి, ప్రభృతులు పాల్గొన్నారు.


