. ఆక్వా రైతులకు రుణాలు, రాయితీలకు ఏపి సడా చట్టం కింద నమోదు తప్పనిసరి….
. అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సమీక్ష…
విశాలాంధ్ర – ఏలూరు: జిల్లాలో ఆక్వా సాగు చేసే చెరువులన్నీ ‘ఏపి సడా’ చట్టం కింద నమోదు కావాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో శుక్రవారం రెవిన్యూ, మత్స్య శాఖాధికారులతో ఏపి సడా చట్టం అమలుపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఏపి సడా చట్టం కింద 64 వేల 193 ఎకరాలు నమోదు చేయవలసి ఉండగా, ఇంతవరకు కేవలం 4693 ఎకరాలు మాత్రమే నమోదు కావడంపై అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిగిలిన చెరువుల వివరాలను ఏపి సడా చట్టం కింద వెంటనే నమోదుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్వా చెరువుల యజమానులు వివరాలను, ఆధార్ అనుసంధానం చేసి ‘ఏపి సడా’ చట్టం కింద నమోదు చేయాలనీ, ఇందుకోసం అదనపు సిబ్బందిని కూడా డెప్యూటేషన్ పై అందిస్తామని కలెక్టర్ చెప్పారు. సన్న, చిన్నకారు ఆక్వా రైతులకు రుణాలు, రాయితీలు అందించేందుకు ఏపి సడా చట్టం కింద నమోదు తప్పనిసరన్నారు. మండలాల వారీగా ఆక్వా సాగు విస్తీర్ణంను గుర్తించి మత్య శాఖాధికారులు సర్వే రెవిన్యూ శాఖాధికారులతో సమన్వయము చేసుకుని నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయాలని కలెక్టర్ మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, మత్స్య శాఖ రాష్ట్ర అధికారి లాల్ మొహమ్మద్, డిప్యూటీ డైరెక్టర్ రాజ్ కుమార్, ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ లు, మత్స్య అభివృద్ధి అధికారులు, తహసీల్దార్లు, ప్రభృతులు పాల్గొన్నారు.


