Homeఆంధ్రప్రదేశ్రూ. కోటి విలువచేసే సెల్ ఫోన్లు రికవరీ

రూ. కోటి విలువచేసే సెల్ ఫోన్లు రికవరీ

- Advertisement -

విశాలాంధ్ర-చిత్తూరు: మొబైల్ ఫోన్ నేటి కాలంలో మనిషి జీవనశైలిలో అంతర్భాగమైందని, అటువంటి విలువైన ఫోన్లను పోగొట్టుకున్న బాధితుల క్షేమం దృష్ట్యా సాంకేతికత సహాయంతో వాటిని రికవరీ చేసి అప్పగిస్తున్నామని ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. బుధవారం చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన ‘మొబైల్ రికవరీ మేళా’లో ఆయన పాల్గొన్నారు. 14వ దశలో భాగంగా రికవరీ చేసిన రూ. కోటి ఇరవై వేలు విలువైన 501 మొబైల్ ఫోన్లను ఆయన బాధితులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… “గత 13 దశల్లో రికవరీ చేసిన ఫోన్లతో కలిపి, ఇప్పటివరకు మొత్తం 14 దశల్లో 4,607 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. వీటి మొత్తం విలువ సుమారు రూ. 9.55 కోట్లు. కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుండి కూడా ఫోన్లను ట్రేస్ చేశాం. దూర ప్రాంతాల్లో ఉండి రాలేని బాధితులకు కొరియర్ ద్వారా వారి ఫోన్లను నేరుగా ఇంటికే పంపిస్తున్నాం.” “ఫోన్ పోగొట్టుకున్న వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేస్తే సులభంగా మొబైల్ రికవరీ చేయవచ్చు. బాధితులకు అవసరమైన సలహాల కోసం 9440900004 నంబర్‌ను సంప్రదించవచ్చు. ఐఎంఈఐ నంబర్‌ను బ్లాక్ చేయడం ద్వారా ఫోన్ దుర్వినియోగం కాకుండా చూడటమే కాకుండా, ట్రేసింగ్ ప్రక్రియను వేగవంతం చేయవచ్చు.” అన్నారు. రికవరీ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన జిల్లా క్రైమ్ ఇన్స్‌పెక్టర్ ఉమా మహేశ్వర రావు, సాంకేతిక బృందం సభ్యులు బాపూజీ, రఘురామన్‌ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. పెండింగ్‌లో ఉన్న మరిన్ని ఫోన్లను కూడా త్వరలోనే రికవరీ చేసి బాధితులకు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తమ పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి పొందిన బాధితులు జిల్లా పోలీసు యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు