Homeఅంతర్జాతీయంఇరాన్‌కు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని భారతీయులకు కేంద్రం సూచన

ఇరాన్‌కు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని భారతీయులకు కేంద్రం సూచన

- Advertisement -

ఇరాన్‌లో ఉన్నవారు వెంటనే దేశం విడిచి రావాలని విజ్ఞప్తి
ఇరాన్‌పై ఇజ్రాయెల్, ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల నేపథ్యంలో నిర్ణయం
పశ్చిమాసియాలో తాజా పరిణామాలతో భారత ప్రభుత్వం అప్రమత్తం

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు ప్రయాణాలు మానుకోవాలని, ఇప్పటికే అక్కడ ఉన్నవారు వెంటనే దేశం విడిచి వచ్చేయాలని తన పౌరులకు నేడు మరోసారి సూచించింది. ఈ మేరకు టెహరాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రాంతంలోని తాజా పరిణామాల దృష్ట్యా ఇరాన్‌కు ఎలాంటి ప్రయాణాలు చేయవద్దని మా పాత సలహాను పునరుద్ఘాటిస్తున్నాం. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారత పౌరులు కూడా అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా దేశం విడిచి వెళ్లాలని సూచిస్తున్నాంఁ అని ఎంబసీ తన ప్రకటనలో స్పష్టం చేసింది.

ఇటీవల ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు పెరిగాయి. ఇరాన్‌లోని మహ్‌షహర్ ప్రాంతంలో ఉన్న పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌పై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ప్రకటించింది. మరోవైపు, సోమవారం ఉదయం ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రయోగించిన క్షిపణులన్నింటినీ విజయవంతంగా అడ్డుకున్నామని ఐడీఎఫ్ తెలిపింది. ఈ దాడుల నేపథ్యంలోనే భారత్ ఈ ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది.

ఇజ్రాయెల్ గనక దక్షిణ లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఇజ్రాయెల్, దాని మద్దతుదారులపై వినాశకరమైన దాడులు తప్పవని ఇరాన్ కమాండర్ అలీ అబ్దుల్లాహీ హెచ్చరించారు. అమెరికా పచ్చజెండా ఊపడంతోనే ఇజ్రాయెల్ ఫాస్పరస్ బాంబుల వంటి నిషేధిత ఆయుధాలను వాడుతూ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖొమైనీ, ఇతర సైనిక ఉన్నతాధికారులు మరణించడంతో ఈ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ పలుచోట్ల డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. ఏప్రిల్ 8న కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ, ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, శాంతి స్థాపన కోసం ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నట్లు కూడా నివేదికలు వస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు