Homeజాతీయంనిందితుడికి ఛార్జిషీటు పత్రాలు అందించాలి: సుప్రీం

నిందితుడికి ఛార్జిషీటు పత్రాలు అందించాలి: సుప్రీం

- Advertisement -


న్యూదిల్లీ: ఛార్జిషీటుకు సంబంధించిన పత్రాలను నిందితుడికి నిరాకరించడం నిష్పాక్షిక విచారణ ప్రక్రియకు విఘాతం కలిగిస్తుందని, అందుకే ఆ పత్రాలను అతడికి అందించాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. మేజర్ జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్‌పై అధికార రహస్యాల చట్టం-1923 కింద 2007లో నమోదైన ఒక కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కేసులో నిందితుడైన సింగ్‌కు ఛార్జిషీటులో భాగమైన కొన్ని అత్యంత రహస్యమైన పత్రాల కాపీలను అందించాలని జస్టిస్ జేకే మహేశ్వరీ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్‌ల ధర్మాసనం పేర్కొంది. దేశ భద్రతకు ముప్ప్పుగా పరిణమిస్తుందన్న అనుమానం కారణంగా పత్రాల అందజేతను నిరాకరించరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సింగ్‌కు పత్రాలు అందించకుండా నిరోధిస్తూ దిల్లీ హైకోర్టు వెలువరించిన ఆదేశాలను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ‘ఇండియాస్ ఎక్స్‌టర్నల్ ఇంటెలిజెన్స్- సీక్రెట్స్ ఆఫ్ రిసెర్చ్ అండ్ ఎనలైసిస్ వింగ’ అనే శీర్షికతో వీకే సింగ్ రచించిన పుస్తకం అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించందని పేర్కొంటూ ఆయనపై కేసు దాఖలైంది. సైన్యానికి సంబంధించిన అనేక కీలక రహస్యాలను తన పుస్తకంలో ఆయన బహిర్గతం చేశారని ఆరోపణ. నిందితుడికి రహస్య పత్రాలు అందించడం దేశ భద్రతా ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందంటూ సీబీఐ చేసిన వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు