ఏరువాక పున్నమిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర రైతాంగానికి శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలని చంద్రబాబు పేర్కొన్నారు. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు రైతులు భూమిని, పశుసంపదను పూజించి ప్రకృతితో అనుసంధానమయ్యే విశిష్టమైన పండుగ ఏరువాక అని ఆయన వివరించారు. పాడిపంటలతో రైతుల ఇళ్లలో వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
రైతు సంక్షేమమే ధ్యేయంగా ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్్ణ నిధులు జమ చేసి రైతులకు అండగా నిలిచామని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎల్ నినో, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా తలెత్తే సవాళ్లను రైతులు ధైర్యంగా అధిగమించాలని సూచించారు. ప్రకృతి సాగుతో పంటలు పండించి, మన భూమిని మరియు ఆరోగ్యాన్ని విషతుల్యం కాకుండా కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సూచనలు, సలహాలు పాటిస్తూ రైతన్నలు సాగులో సిరులు పండించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
అన్నదాతలకు అండగా ఉంటాం: ఏరువాక వేళ పవన్ కల్యాణ్ భరోసా
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని రైతు సోదరులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలియజేశారు. జ్యేష్ఠ పౌర్ణమి పర్వదినాన జరుపుకునే ఈ పండుగ.. భూమాతకు, పశుసంపదకు గౌరవం ఇస్తూ, ప్రకృతికి – మనిషికి మధ్య ఉన్న విడదీయలేని అనుబంధాన్ని చాటుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని రైతులు భూమికి పూజలు నిర్వహించి, నూతనోత్సాహంతో సాగు పనులకు శ్రీకారం చుడతారని పవన్ కల్యాణ్ తన సందేశంలో తెలిపారు. సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని, తద్వారా అన్నదాతలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన తన సందేశాన్ని పంచుకున్నారు.


